ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

AN ARTICLE ABOUT LORD SRI RAMA AND SITA


రాముడికి సీత ఏమౌతుంది??



రాముడికి సీత ఏమవుతుంది??

అందరికీ తెలిసిన వాడుక మాట ఇది. ఎవరికైనా విషయమంతా చెప్పిన తర్వాత కూడా ఏదో సందేహం వస్తే రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్టు ఉంది అని వేళాకోళం చేస్తారు. నిజానికి ఈ ప్రశ్న చాలా అర్ధవంతమైనది. అసలు సీతారాములలో ఎవరు గొప్ప అనేకంటే వారి మధ్య ఉన్న బంధం ఎటువంటిది అని తెలుసుకోవడం మంచిది.




రాముడికి సీత ఏమవుతుందో అనుకుంటూ వివరాలు చూద్దాం..

రావణాసురుడిని ఎలా సంహరించాలి అని శ్రీహరి మధనపడుతున్నవేళ ఆ హృదయం మీద నిరంతరం కొలువై ఉన్న లక్ష్మీదేవి (అలా ఎప్పటికి కూర్చుని ఉండడం వల్ల శ్రీవారి హృదయానికి ఓ మచ్చ ఏర్పడింది దాన్నే శ్రీవత్సం అంటారు.) శ్రీహరికి ధైర్యం చెప్తూ తాను భూలోకాన అవతరిస్తాను అని చెప్పి మరుక్షణంలో వేదవతి రూపంలో భూలోకాన అవతరించింది. దీన్ని బట్టి చూస్తే సీత రాముడికి మార్గదర్శకురాలు అయ్యింది.

దశరధుడు చేసిన పుత్రకామేష్టీ అశ్వమేధ యాగాల కారణంగా వచ్చిన పాయసం ద్వారా రాముడు కౌసల్య గర్భాన పదకొండు నెలల తర్వాత యోనిజుడై పుట్టాడు. సీతమ్మ మాత్రం అయోనిజయై జన్మించి జనకుడికి నాగటి చాలులో లభిస్తుంది. దీని బట్టి చూస్తే సీత రాముడికంటే అధికస్థాయిలో పుట్టినదౌతుంది.




అధిక బలశాలిని
తన ఆరవ ఏట ఒకనాడు చెలులతో బంతి ఆట ఆడుతున్న సీత ఎడమచేతితో మహిమాన్వితమైన శివధనుస్సు ఉన్న పెద్ద భోషాణాన్ని అలవోకగా పక్కకు జరిపేస్తుంది. రాముడు తన పదమూడవ ఏట స్వయంవర సభలో అదే వింటిని ధనుర్భంగం చేశాడు. దీన్ని బట్టి రాముడు తన పదమూడవ ఏట చేయగల పనిని ఆరవఏటనే సీతమ్మ చేయగలిగిన బలశాలి అని తెలుస్తోంది.
లోకంలో ఎక్కడైనా పరీక్షించేవాడు గొప్పవాడూ, పరీక్షకి సిద్ధమైన అభ్యర్ధి తక్కువవాడూ అవుతాడు. సీతమ్మ రామునికి శివధనుస్సుని పరీక్షగా పెట్టింది. అడిగిన దానికంటే ఎక్కువ సమాధానమిస్తూ (ఎక్కు పెట్టమంటే ఏకంగా విల్లునే విరిచేసాడు) రాముడు ఎక్కువ అంకాలతో ఉత్తీర్ణుడయ్యాడు. అంటే రాముడిని పరీక్షించగల శక్తి సీతమ్మకు ఉంది అని అర్ధమవుతుంది.

తల్లి కోరిక మేరకు పట్టాభిషేకాన్ని రద్దు చేసుకుని అరణ్యవాసానికి పయనమైన రాముడు "అరణ్యాల్లో పులులూ , సింహాలూ, కొండచిలువలూ , కల్లోల వాతావరణముంటుంది కాని ఏ సౌఖ్యాలూ ఉండవు" కావున సీతమ్మను తనతో రావొద్దని అంటాడు. కాని సీత తాను సౌఖ్యాలకోసం కాదు అరణ్యాలను చూడాలని ఉవ్విళ్ళూరుతున్నాను, అందునా భర్త తోడుండగా భయమేల అని రాముడికే ధైర్యం చెప్పి వెంట నడుస్తుంది.





వయసుకి మించిన విజ్ఞత

సామాజిక దృష్టితో , దూర దృష్టితో రామునికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించేటంతటి ఉత్తమురాలు సీతమ్మ. చిన్న వయసులోనే (వనవాసానికి వెళ్లేటప్పుడు సీత వయసు 18 ఏళ్లు) పెద్దరికం తెచ్చుకుంది. రాముడికీ తోడూ నీడా అయింది. అరణ్యమునకు వెడుతూ సీతారాములు అనసూయాదేవిని దర్శించారు. ఇద్దరినీ ఆశీర్వదించిన అనసూయ సీతతో " అమ్మాయి నీ పెళ్లి కథని వివరించు" అని అడిగింది. సీతమ్మ తమని అరణ్యాలకు పంపి కష్టాల పాలు చేసిన కైకను, దశరధుని, రాముడిని. ఎవరినీ నిందించకుండా ఓపికగా పెళ్లి వివరాలు చెప్పింది. దానికి మురిసిపోయిన అనసూయ సీతకు వాడని పుష్పాలు, నలగని వస్త్రాలని ఇచ్చి ఆశీర్వదించింది.


రాముడికంటే ముందు తాను భూలోకానికి వేదవతిగా రావణాసురుడిని చంపించడానికే పుడతానని చెప్పింది. అలాగే రాముడికంటే ముందే లంకా నగారానికి వెళ్లింది. అదే విధంగా తానే ముందు వైకుంఠానికి వెళ్లింది సీతమ్మ. ఎక్కడెక్కడికి సీతమ్మ తనకంటే ముందు వెళ్లిందో (భూలోకానికి, మిథిలకి, లంకా నగారానికి, వాల్మీకి ఆశ్రమానికి, వైకుంఠానికి) రాముడు అక్కడక్కడికీ వెళ్లాడు. రాముని ప్రయాణం విజయవంతం కావాలని తాను ముందుగా వెళ్లి తన నాధుడికి అనుకూల పరిస్థితులను కల్పించిన సీతమ్మ రాముడికే మార్గదర్శకురాలైంది.

అరణ్యవాసంలో ఉన్న తనని రావణుడు ఎక్కడ అపహరించడో అని తల్లడిల్లిపోయింది సీతమ్మ. రావణుడు తనని అపహరించని పక్షంలో రావణుడిని వధంచడానికి రాముడికి తగిన కారణం దొరకని పక్షంలో రామావతార ప్రయోజనమే దెబ్బతింటుందని భావించిన సీత తన ప్రాణాన్ని, వంశప్రతిష్టతని పణంగా పెట్టి భర్తకోసమే రావణుడు తనని అపహరించేలా చేసుకుంది సీతమ్మ తల్లి. సీతాపహరణ సమయంలొ రావణుడితో జరిగిన పోరులో రెక్కలు విరిగి , చావు బ్రతుకుల్లో ఉన్న జటాయువును దుఖంతో కౌగలించుకుంటుంది. . భూమినుండి ఉద్భవించినందున సకల ఓషధులకు సమానురాలైన సీతమ్మ స్పర్శ కారణంగానే జటాయువు రాముడు వచ్చేవరకు ప్రాణాలతో ఉండగలిగాడు.





మనోబలంలో మిన్న

సీతావియోగానికి తట్టుకోలేక ధైర్యాన్ని కోల్పోయిన రాముడు ఆత్మహత్యకు సంబంధించిన మాటలు మాట్లాడతాడు లక్ష్మణుడితో. అయితే రాముడు తన దగ్గర లేకున్నా. శత్రువు ఇంట ఉన్నా కూడా సీత తన మనోనిబ్బరాన్ని కోల్పోకుండా రావణుడితో ఇలా అంటుంది.


అసందేశాత్తు రామస్య తపస శ్చామపాలనాత్
వ త్వా కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్ధ చేతసా...

రాముని ఆజ్ఞ లేనికారణంగా నిన్ను బూడిద చేయలేకపోతున్నా అని స్పష్టంగా చెప్తుంది. రావణాసురుడితో నేరుగా మాట్లాడకుండా ఒక గడ్డిపోచను పట్టుకుని దానిని రావణాసురుడిగా భావించి ఈ మాటలు చెప్తుంది. రాముడే తన భార్యను కాపాడుకోగలడు అనే నమ్మకం ఆమెకు సంపూర్ణంగా ఉంది. పురుషుడైన రాముడికంటే సీత ఎక్కువ మనోధైర్యాన్ని కలిగి ఉంది.

రాముడి అంగుళీయకం యొక్క తపశ్శక్తి కారణంగా హనుమంతుడు సునాయాసంగా విఘ్నాలని దాటుకుంటూ నూరు యోజనాల సముద్రాన్ని దాటి సీతమ్మని కనుగొనగలిగాడు. అంగుళీయకాన్ని సీతమ్మకు తిరిగి ఇచ్చేశాక తిరిగివెళ్లే శక్తి మారుతికి లేదని గ్రహించిన సీత తన చూడామణిని ఇచ్చి తపశ్శక్తి, ఆశీర్వచనాన్ని కూడా ఇచ్చి పంపింది.




రావణవధ అనంతరం సీతమ్మని అలంకరించుకుని రమ్మని కోరాడు రాముడు. లంకలో సంవత్సరం ఉన్న కారణంగా నన్ను మరచిపోయి ఉంటే లంకాధిపతి విభీషణుడిని కాని, సుగ్రీవుని పంచన కాని చేరవచ్చని అంటాడు రాముడు. తన భార్య సౌశీల్యం గురించి పూర్తిగా తెలిసినా కూడా మహారాజు కనుక లోకానికి వెరసి ఆమె పాత్రివ్రత్య నిరూపణకోసం అగ్నిప్రవేశాన్ని కోరతాడు శ్రీరాముడు. ఐనా కూడా రాముని ఒక్కమాట కూడా అనకుండా అగ్నిప్రవేశం చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంటుంది.

అగ్ని రెండు విధాలు. ఇంధనం చేర్చగా వెలిగే అగ్ని ( సేంధనాగ్ని - స+ఇంధన_అగ్ని ) ఒకటి. ఇంధనపు అవసరం ఏ మాత్రమూ లేని అగ్ని ( అనింధనాగ్ని - న+ఇంధన+అగ్ని) మరొకటి. ఈ రెండింటిలోనూ అనింధనాగ్ని గొప్పది. ఈ అగ్ని ముందు సేంధనాగ్ని తలవంచి తీరుతుంది. సీతమ్మ ముందు అగ్నిహోత్రుడు తలవంచడమంటే ఇదే. అయోనిజ అయిన సీతమ్మ రాముని ఆదేశం మేరకు అగ్నిప్రవేశం చేసినా కూడాఎవరినీ నిందించక, తన గొప్పదనాన్ని నిరూపించుకుని అగ్నిపునీత అయ్యింది .. లంకాదహన సమయంలో ఎక్కడో ఉన్న హనుమంతుడి తోకని నిప్పు కాల్చకుండా చల్లగా ఉండేలా చేయగల శక్తిగల సీతమ్మ తల్లికి అగ్నిప్రవేశం ఓ లెక్కా? రాముడి మనసు సీతమ్మకు తెలుసు, సీతమ్మ శక్తి గురించి రాముడికి తెలుసు. లోకరక్షణకొరకు ఇద్దరూ సామాన్య మానవుల్లా ప్రవర్తించారు. ఈ రహస్యం తెలియని మూర్ఖులు వితండవాదం చేసి దుమ్మెత్తి పోస్తారు. ఈ సంఘటన ద్వారా సీతమ్మ తనకు తాను గొప్ప కీర్తిని తెచ్చుకున్నా రాముడు మాత్రం అనంతమైన అపకీర్తిని మూటకట్టుకున్నాడు.




సీతమ్మ ఇలా రామునికి మార్గదర్శకురాలు, సహనశీలి , రామునికంటే గొప్ప వ్యక్తిత్వం, శక్తి కలది కావుననే వాల్మీకి తన శ్రీమద్రామాయణానికి "సీతాయశ్చరితం మహత్"(గొప్పదైన సీతమ్మ చరిత్ర) అనే పేరుని పెట్టదలిచాడు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు మానవులుగా అవతరించిన ఆ శ్రీమన్నారాయణుడు, శ్రీమహాలక్ష్మీ ఇద్దరూ అన్యోన్యమైన, ఆదర్శమైన దాంపత్య జీవనానికి ప్రతిరూపాలు. మంచికి మారుపేరైన శ్రీరామునికి సీతమ్మ ప్రతి అడుగులో తోడూ , నీడా అయింది.

సర్వం రామమయం..సీతారామమయం..

మూలం.. డా.మైలవరపు శ్రీనివాసరావు...

THE ABOVE ARTICLE IS GATHERED 

FROM THE BLOGSPOT:

http://jyothivalaboju.blogspot.in/2010/03/blog-post_23.html