ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

IMPORTANCE OF SANKRANTHI FESTIVAL IN TELUGU - SPECIAL SANKRANTHI FESTIVAL ARTICLES COLLECTION




సంక్రాంతి... పేరులోనే ఉంది కాంతి. నిజంగా ఇది కాంతులొలికే పండుగ. సంబరాల పండుగ. వాకిట్లో రంగురంగుల రంగవల్లికలు, ఆకాశంలో అంతకంటే అందమైన గాలిపటాలతో మహా శోభాయమానమైన పండుగిది. ఇది ఒకరోజు పండుగ కాదు. నెలరోజులపాటు సంబరాలు చేసుకునే వైభవం. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఒకసారి Colorful Festival Sankranti విశేషాలు తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రంలో మేషం, వృషభం - ఇలా పన్నెండు రాశులున్నాయి. సూర్యుడు ఒక్కో నెలలొ ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు మేషరాశిలో సూర్యుడు ప్రవేశిస్తే అది మేష సంక్రమణం. అలా ఏ రాశిలో సంచరిస్తే ఆ రాశి సంక్రమణంగా వ్యవహరిస్తారు. సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించింది మొదలు మకరరాశిలో ప్రవేశించడంవరకూ సంక్రాంతి పండుగ దినాలు. మకర రాశిలో ప్రవేశించిన రోజు మకర సంక్రాంతి. అప్పటివరకూ దక్షిణాయనంలో సంచరిస్తోన్న సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన పుణ్యదినం కూడా ఇది.

మకర సంక్రాంతికి ముందురోజు ''భోగి''. భోగి అంటే గోదాదేవి, శ్రీరంగనాథుని సేవించి కల్యాణ భోగం అనుభవించిన రోజు. మకర సంక్రాంతిలాగే భోగి కూడా పెద్ద పండుగే. ఆవేళ ఉదయాన్నే లేచి ''భోగిమంటలు'' వేస్తారు. భోగిమంటల్లో సూక్ష్మక్రిములను నశింపచేసే పిడకలు, విరిగిపోయి ఇళ్ళలో అడ్డంగా అనిపించే చెక్క సామాను, ఔషధప్రాయమైన వేప తదితర కలపతో వేస్తారు. ఇవి కేవలం చలి కాచుకోడానికే గాక ఆరోగ్యరీత్యా మంచిది. క్రిమికీటకాలు నశిస్తాయి. వాతావరణ కాలుష్యం పోతుంది.

అభ్యంగన స్నానం, కొత్తబట్టలు, పూజలు, పిండి వంటలు, బంధుమిత్రుల సమాగమం లాంటి కార్యక్రమాలతో ఇల్లిల్లూ సందడిగా, సంతోషంగా కనిపిస్తుంది. చిన్నారులున్న ఇళ్ళలో రేగిపళ్ళలో పప్పుబెల్లాలు, పూవులు, డబ్బులు జోడించి ''భోగిపళ్లు'' పోస్తారు. రేగిపళ్ళు సూర్యునికి ప్రీతికరమైనవి. పిల్లల తలపై భోగిపళ్లు పోయడంవల్ల సూర్యుని ఆశీస్సు లభిస్తుంది.

భోగిపళ్లు అంటే రేగిపళ్ళే. బదరీఫలం అనే పదం నుండి భోగిపండు వచ్చింది. బదరికావనంలో నరనారాయణులు తపస్సు ఆచరించే సమయంలో బదరీ ఫలాలను తిన్నారట. అందుకే భోగిపళ్లు పోయడమంటే నరనారాయణుల ఆశీస్సులు పండడం. రేగిపళ్ళు ఆరోగ్యరీత్యా కూడా చాలా మేలు చేస్తాయి. వాటిని శరీరం మీద పోయడంవల్ల అనారోగ్యాలు నయమౌతాయి. ఇవి తింటే దృష్టి దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. ఉదర సంబంధ జబ్బులు కుదురుతాయి. ఆహారం చక్కగా జీర్ణమౌతుంది. భోగిపళ్ల వేడుక ముగిసిన తర్వాత ఈ పళ్ళను కూడా పంచిపెడతారు. అవి తిని ఆరోగ్యంగా ఉండాలనేది పరమార్థం.

ఇక మకర సంక్రాంతి మరుసటిరోజు కనుమ. ఇది రైతులకు ముఖ్యమైన పండుగ. వ్యవసాయ కుటుంబాల్లో తెల్లవారుజామున లేచి పనులు మొదలుపెడతారు. పాడి పశువులను కడిగి, కుంకుమ, పూసల గొలుసులు, మువ్వలు, పట్టెడలతో అలంకరిస్తారు. నెల పొడుగునా వాకిళ్ళలో పెట్టిన గొబ్బెమ్మలను పొయ్యికింద పెట్టి పాయసం చేసి మొదట సూర్యునికి, ఆపైన దేవుడి మందిరంలో, తర్వాత పశువుల కొట్టంలో నైవేద్యం పెడతారు. పొలంలో, పశువులశాలలో గుమ్మడికాయ పగలగొట్టి దిష్టి తీస్తారు. గంగానమ్మ, పోలేరమ్మ లాంటి గ్రామదేవతలకు గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు.

సంక్రాంతి నెల మహా సందడిగా ఉంటుంది. ఒణికించే చలిలో కూడా అర్ధరాత్రివరకూ మెలకువగా ఉండి వాకిళ్ళలో కళ్ళాపి జల్లి, రంగవల్లులు తీర్చిదిద్దుతుంటారు. లేదా తెల్లవారుజామునే లేచి ముగ్గులు వేస్తారు. అవకాశం ఉన్నవారు నదీ స్నానం చేస్తారు. పుణ్య నదుల్లో స్నానం చేస్తే అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి, జ్ఞాననేత్రం తెరచుకుంటుంది. నదిలో మునిగి, సూర్యునికి అర్ఘ్యం వదులుతారు. మకర రాశిలో ప్రవేశించిన సూర్యునికి నమస్కరిస్తారు. పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు.

ఇళ్ళముందు సంక్రాంతి ముగ్గుల మధ్య గొబ్బెమ్మలు, పూలు, పసుపుకుంకుమలు జల్లి వాకిళ్ళను కళాత్మకంగా రూపొందిస్తారు. గుమ్మాలు మావిడాకులు, బంతిపూల తోరణాలతో అలరారుతూ అందాలు చిందిస్తాయి. గ్రామాల్లో అప్పుడే కోతలు ముగిసి ధాన్యం ఇంటికి రాగా, ఏడాది అంతా చేసిన శ్రమ మాయమై కొత్త ఉత్సాహం ముఖాల్లో వెల్లివిరుస్తుంది.

సంక్రాంతి సందర్భంగా విష్ణు సహస్రనామం పారాయణ చేస్తారు. తిరుప్పావై పాశురాలను చదువుతారు లేదా వింటారు. వేద మంత్రాలను పఠిస్తారు. యాగాలు నిర్వహిస్తారు. ఇక హరిదాసులు, పులి వేషగాళ్ళు, గంగిరెద్దుల సందడి, గాలిపటాల ఆటల గురించి చెప్పనవసరమే లేదు. చూస్తుండగానే పండుగ వచ్చేస్తుంది. కొత్త బియ్యంతో అరిసెలు, పాలతాలలికలు చేసి దేవునికి నివేదిస్తారు. పేదసాదలకు దానధర్మాలు చేస్తారు. సాయంత్రంపూట బొమ్మలకొలువు ఏర్పాటు చేస్తారు.

సంబరాల సంక్రాంతి వచ్చేసింది. అసలు మన పండుగలన్నిటిలో గొప్ప కళ, అద్భుత శోభ ఉంటాయి. ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిఫలిస్తూ ఉంటాయి. ఈ సంక్రాంతినే తీసుకుంటే ఇళ్లముందు తీర్చిదిద్దిన పెద్ద పెద్ద రంగవల్లికలు, వాటి మధ్యల్లో గొబ్బెమ్మలు, పసుపుకుంకుమలు, రంగురంగుల పూలు.. అబ్బో చూట్టానికి రెండు కళ్ళూ చాలవు. ఈ పండగ రమణీయత పల్లెల్లో చాలినంత. పట్నాల్లోనూ తక్కువేం కాదు.. ఇరుకిరుకు వాకిళ్ళు సైతం రంగు ముగ్గులతో అడిరిపోతుంటాయి. ఇక హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల సందడీ సరేసరి. అప్పుడే పండిన వారి ధాన్యంతో చేసిన అటుకులు మొదలు అరిసెలు, బూరెలు, గారెలు, పాయసం, పులిహోర.. ఆహా ఏమి రుచి?! రోజూవారీ రొటీనుకు భిన్నంగా వచ్చే ఈ పండగలు నిజంగా మనని రీచార్జి చేయడానికే!

ఇంతకీ సంక్రాంతికి నిర్వచనం ఏమిటి?!

సూర్యుడు ప్రతి నెలా ఒక రాసి నుండి ఇంకో రాశిలోకి మారుతుంటాడు. మేషాది ద్వాదశి రాశుల్లోకి అంటే పూర్వ రాసిలోంచి ఉత్తర రాశిలోకి మారుతుంటాడు.. అలా సూర్యుడు, మకర రాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రాంతి. పుష్యమాసంలో ఉత్తరాయణ పథంలో సూర్యుడు మకర రాశిలో అడుగు పెట్టడమే మకర సంక్రాంతి. ఇతర పండగలు తేదీలు మారతాయి కానీ సంక్రాంతి ప్రతి సంవత్సరం జనవరి పద్నాలుగున వస్తుంది. సంక్రాంతి నెల పవిత్రమైనదని, స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి.
మనం సంక్రాంతి అని పిల్చుకుంటే మహారాష్ట్రీయులు, గుజరాతీలు మకర సంక్రాంతి అంటారు. తమిళులు పొంగల్ అని పిలిస్తే పంజాబీలు లోరీ అంటారు. సంక్రాంతి అందరికీ ఇష్టమే అయినా, రైతులకి మరీ ప్రియమైన, పెద్ద పండుగ. అప్పుడే పంట చేతికి రావడంతో ఎంతో ఇష్టంగా, ఘనంగా జరుపుకుంటారు. మూడు రోజుల ఈ పండగలో మొదటిరోజు భోగి, రెండవ రోజు పండుగ, మూడవరోజు కనుమ.

జయసింహ రాసిన ‘కల్పధ్రుమం’లో సంక్రాంతిని ఇలా వర్ణించారు –
“తత్ర మేశాదిషు ద్వాదశ రాశి
క్రమణేషు సంచరితః
సూర్యస్య పూవస్మాద్రాసే ఉత్తరః రాశౌ
సంక్రమణ ప్రవేశః సంక్రాంతి”
దీని అర్ధం ఏమిటంటే మేషం మొదలైన పన్నెండు రాసులలో సంచరించే సూర్యుడు ముందు ఉన్న రాశి లోంచి తర్వాతి రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి.
తలంటి పోసుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం, వాకిట్లో ముగ్గులు, శోభ.. ఇంతవరకూ మూడు రోజులూ ఒకేవిధంగా ఉంటుంది. మరి భోగి విశేషం ఏమిటంటే తెల్లవారుజామున లేచి భోగి మంటలు వేస్తారు. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు సాయంత్రం భోగిపళ్లు పోస్తారు. రేగిపళ్ళలో డబ్బులను కలిపి దోసిళ్ళతో చిన్నారి తలపై అక్షింతల్లా పోస్తారు. ఇలా చేయడంవల్ల దిష్టి ఏమైనా ఉంటె పోతుందని, మంచి జరుగుతుందని పెద్దలు చెప్తారు.
ఇక పండుగనాడు ప్రత్యేకంగా పూజ చేసుకుని కొత్త బట్టలు వేసుకుంటారు. పిండివంటలు, బంధుమిత్రుల సందడితో శోభాయమానంగా ఉంటుంది. అప్పటివరకూ అలంకరించిన గొబ్బెమ్మలను ఎండబెట్టి, కనుమనాడు వాటిని రాజేసి పాయసం వండి అందరూ ప్రసాదంగా ఆరగిస్తారు. కనుమనాడు కొందరు ‘కలగూర వంటకం’ పేరుతో అనేక రకాల కూరగాయలను కలగలిపి కూరగా చేసి తింటారు.
సంక్రాంతి పండుగ వెనక వున్నా మర్మాలు .....

భోగిపండ్లు
యోగిత్వం.. బదరీఫలం
సంక్రాంతి వస్తే పిల్లలకు భోగిపండ్లు పోసి.. మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. ఇప్పుడైతే ఈ సంప్రదాయం తగ్గింది కానీ ఒకప్పుడు పిల్లలున్న ప్రతి ఇంట్లో భోగిపండ్ల దృశ్యాలు కనువిందు చేసేవి. అనాధి నుంచి వస్తున్న సంప్రదాయం ఇది. భోగిపండ్లు లేదా రేగుపండ్లలో ఎనలేని ఔషధగుణాలు ఉన్నాయి. చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు (పైబర్) పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కాని సమస్య తొలగిపోదు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు కనక.. ఆ లోటును పూడ్చేందుకు రేగుపండ్లను తినమనే వారు. రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. ‘భుక్త్వాచ బదరీఫలం’ అన్నది అందుకే. భోంచేసిన తర్వాత రేగుపండ్లు తింటే మంచిదన్నది దాని అర్థం. రేగుపండ్లు జఠరాగ్నిని ఉరకలెత్తిస్తాయి. శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి.

బదరీవనం (రేగుపండ్ల తోట)లో వేదవ్యాసుడు తపస్సు చేసేవాడన్న మరో ఐతిహ్యం కూడా ఉంది. కాబట్టే ఆయనకు బాదరాయణుడు అన్న పేరొచ్చింది. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే – రేగుపండ్లు యోగిత్వానికి ప్రతీక. మరో విశేషమేమంటే రేగుపండ్లను జంతువులు తినవు. మనుషులే తింటారు. హిందూ సంస్కృతిలో రేగుపండ్లకున్న ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. పండగపూట పిల్లలకు చిల్లర నాణేలతో కలిపి భోగిపండ్లు పోస్తారు. ఆ సమయంలో తల మీద చిల్లర నిలబడితే ‘భోగి’ అవుతారని, రేగుపండ్లు మాత్రమే నిలబడితే ‘యోగి’ అవుతారన్నది ఒక విశ్వాసం.

గాలిపటం

దారంలాంటిది జీవితం

ప్రతి మనిషికీ ఆత్మనిగ్రహం అవసరం. అది లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు.. మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెబుతుంది గాలిపటం. ఒడుపుగా లాగితే తెగిపోతుంది. వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైనా, జీవితమైన ముందుకు వెళుతుంది. అయితే చేతిలో దారం ఉంది కదాని ఎంతదూరమైనా గాలిపటాన్ని వదల్లేము. ఏదో ఒక సమయంలో మళ్లీ చుట్టచుట్టి గుప్పెట్లోకి తీసుకోవాల్సిందే. ఆ గుప్పెడు అనేది భగవంతుడులాంటిది. మనం ఎంత ఎత్తుకు ఎగిరినా భగవంతుని చేతిలోనే ఉన్నామన్న సంగతిని మరిచిపోకూడదు. గాలిపటానికి ఎన్ని రంగులున్నా, ఎంత పొడవు తోక పెట్టుకున్నా, ఎవరింటి మీద వాలినా దారం చుట్టక తప్పదు. అదే సూత్రం మనిషికీ వర్తిస్తుంది.

కోడిపందేలు

యుద్ధనీతిని గెలిపించే పందెం

పండగ పరమార్థాన్ని మరిచిపోయి దాన్ని పరహింసగా మార్చాం. నేడు జరుగుతున్న కోడిపందేలే అందుకు నిదర్శనం. కోడిపందేలకు తరాల చరిత్ర ఉంది. కాని ఆ రోజుల్లో కోళ్లకు కత్తులు కట్టి ఆనందించేవారు కాదు. ఇప్పుడు కత్తులు కట్టి, డబ్బు కట్టలు పెట్టి జూదంగా మార్చేశారు. పాతరోజుల్లో ఇద్దరి మధ్య వైరం ఏర్పడితే దాన్ని కోడిపందెం ద్వారా పరిష్కరించేవారు మధ్యవర్తులు. పల్నాటి కాలంలో మాచర్ల, గురజాల మధ్య గొడవ యుద్ధానికి దారితీసింది. అలాంటి సమస్యను కోడిపందెమే పరిష్కరించింది. యుద్ధనీతిని తెలియజేసింది.

పశు పూజలు

శ్రమకు కృతజ్ఞత

సంక్రాంతికి ఇంటి నిండా ధాన్యం వచ్చిందంటే.. అది పశువుల పుణ్యం. ఏడాది పొడవునా పశువులతో చాకిరీ చేయించడమే కాదు. పండగరోజైనా వాటిని పూజించి కృతజ్ఞత చెప్పుకోవాలంటుంది పశువుల పూజ. ఆ రోజు రైతులు నాగలి కట్టరు. ఎద్దుల మీద కాడి మోపరు. బండ్లు తోలరు. అందుకే ‘కనుమ రోజు కాకైనా కదలదు’ అంటారు.

మరొక్క సారి మిత్రులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు 

ఈ సంక్రాంతి కుడా మీకు మీ కుటుంబ సబ్యులందరికీ కలకాలం గుర్తుకుఉండేట్లు బాగా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ