ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HINDU PURANAS - SCIENCE SECRETS


పురాణాల్లో సైన్స్! 
(Sri Satyanarayana Piska గారికి కృతజ్ఞలతో.)

1. విశ్వసృష్టి మీద పురాణాల అవగాహన

"దృష్టిని బట్టి సృష్టి" అన్నారు పెద్దలు. ప్రపంచములో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సృష్టిని అర్థం చేసుకున్నారు. ఐతే ' శాస్త్రీయపరమైన సృష్టి అవగాహన ' మాత్రం ఒక్క హైందవులకే వుంది. వారు ఆ అవగాహనను తమ పురాణాల్లో పొందుపరచుకున్నారు. ఆ విషయాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం.
ఒక అద్భుతమైన శక్తి (Super Power), ఈ బ్రహ్మాండ విశ్వసృష్టికి మూలమని ఋషీశ్వరులు కనుగొన్నారు. దానినే "ఆదిశక్తి" అని పిలిచారు.

విశ్వం (Universe) నడవడి మొత్తం "సృష్టి, స్థితి, లయ" అనే మూడు దశలలో కొనసాగుతున్నట్లుగా గమనించారు. ఆ మూడు దశలను "త్రిమూర్తులు" గా గుర్తించారు. సృష్టికారకుడుగా బ్రహ్మనూ, స్థితికారకునిగా మహావిష్ణువునూ, లయకారకునిగా మహేశ్వరుణ్ణీ నిలుపుకున్నారు.

బ్రహ్మదేవుడు :

జీవరాశికి మూలమై నాలుగుదిశలా వ్యాపించివున్న ప్రకృతిని, నాలుగు ముఖాలు గల బ్రహ్మదేవునిగా గుర్తించారు. విశ్వం మొత్తములో యెక్కడెక్కడ ప్రకృతి ఉన్నా, అది బ్రహ్మదేవుని స్వరూపమే!

మహావిష్ణువు :

విశ్వం యావత్తూ శ్రీమహావిష్ణువే! అన్నీ ఆయనలోనే ఇమిడివున్నాయి. అనంత విశ్వరూపుడాయన. జీవుల స్థితికారకుడుగా చెప్పబడుతున్నాడు. అంటే మనుగడకు మూలమైనవాడు, పోషణకర్త అని భావం. భూమిపై జీవరాశి మనుగడకు కారకుడు "సూర్యుడు" . సూర్యుణ్ణి మహావిష్ణువు యొక్క ప్రథమ అంశగా చెప్తున్నాయి పురాణాలు (సూర్యుడు మొదలైన నక్షత్రాల శక్తి అంతా ఆయనలోనిదే కదా మరి!). సూర్యభగవానుని రూపములో ఆ మహావిష్ణువే మనకు మనుగడ కల్పిస్తూ, ఆహారాన్ని అందిస్తున్నాడు. జీవులూ, పంటలూ కూడా మొత్తం సూర్యునిపై ఆధారపడినవే కదా! ఈ కారణంగానే విష్ణువును ' జీవుల పోషణకర్త ' గా చెప్పారు.

మహేశ్వరుడు :

విశ్వములో జీవరాశి గల గ్రహాలన్నీ మహేశ్వర స్వరూపాలే! మన భూగోళం కూడా మహేశ్వర స్వరూపమే! (మహి అంటే భూమి అని అర్థం. మహి + ఈశ్వరుడు = మహేశ్వరుడు). మహేశ్వరుణ్ణి శివుడనీ, శంకరుడనీ ఇంకా అనేక పేర్లతో పిలుస్తారు. భూగోళానికి అధిదేవత ఆయన. మన భూగ్రహాన్ని శివునిగా చెప్పడానికి అనేక నిదర్శనాలున్నాయి. వాటిలో కొన్నింటిని యిప్పుడు తెలుసుకుందాం.

శివుడు ' నిరంతర సంచారి ' అంటారు. మరి భూమి ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది కదా! శివుని తల నుండి గంగమ్మ (గంగానది) జాలువారినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. శరీరములో ఎత్తైనది తల. ఆ విధంగా భూగ్రహానికి ఎత్తైనవి హిమాలయాలు. అనగా హిమాలయాలను ' శివుని తల ' గా పోల్చడం జరిగిందన్నమాట. మరి, హిమాలయాల నుండే కదా గంగానది ప్రవహిస్తోంది! దేవదానవుల సాగరమధన సమయములో పుట్టిన హాలాహలాన్ని మ్రింగి శివుడు ప్రాణికోటిని రక్షించాడంటారు. దీని అంతరార్థం చూడండి. భూమి (అనగా శివుడు) సర్వకాలుష్యాలనూ (అనగా హాలాహలాన్ని) తనలో లీనం చేసుకోవడం వల్లనే ప్రాణికోటి మనుగడ సాగించగలుగుతుంది. శివునిలో సగభాగంగా కలిసిపోయి పార్వతీదేవి (శక్తి) ఉందంటారు. అందుకే ఆయన్ని అర్ధనారీశ్వరుడంటారు. పార్వతీదేవి అంటే "భూమ్యాకర్షణ శక్తే" ! ఈ భూమ్యాకర్షణ శక్తి భూమిలో విలీనమయ్యే వుంటుంది కదా మరి! ఆ ప్రకారంగా శివపార్వతుల సంగమమే "భూగ్రహం" అని చెప్పవచ్చు. శివుని శరీరానికి అలంకారాలుగా పాములను చూస్తూంటాము. శివుని శరీరం భూమే కదా! అందువల్లనే భూమిని అంటిపెట్టుకుని తిరిగే పాములను ఆయనకు అలంకారాలుగా చిత్రీకరించారు. శివుడు లయకారకుడని చెప్పుకున్నాం కదా! మరణించిన జీవులను శివుడు తనలో లయం (లీనం) చేసుకుంటాడు. చనిపోయిన జీవులన్నీ చివరకు మట్టిలోనే కదా కలిసిపోతాయి! ప్రతి జీవీ ఆఖరికి ఈ భూమిలో లయం కావలసిందే! ఈ కారణంగానే శివుణ్ణి లయకారకుడుగా చెప్పారు. మన భూగ్రహం పరమశివుడే అని చెప్పేందుకు ఇవన్నీ నిదర్శనాలే! ఇంకా అనేక నిదర్శనాలున్నాయి. ప్రస్తుతానికి ఇవి చాలు.

విశ్వం లోని శక్తులే దేవుళ్ళయితే - వారికి విచక్షణాశక్తీ, మహిమలూ ఉంటాయా? అని కొందరు అనుమానించవచ్చు. విశ్వసృష్టిలోని అంతర్భాగమైన ప్రకృతి నుండి ఉద్భవించిన "మనకే" ఇన్ని తెలివితేటలుంటే, ఇక దైవశక్తుల విషయం వేరే చెప్పాలా?!