ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SMALL SPARROW - PICHUKA - NON AVAILABLE SPECIES NOW A DAYS - THANKS TO ORIGINAL WRITER


బుల్లి పిచ్చుక

అవి చుట్టు పక్కల ఎక్కడైనా గుంపులు గుంపులుగా కిచ కిచ మని అరిస్తే, వాటిని చూసినప్పుడల్లా కనీసం ఒక్కటైనా నాకు మచ్చికయితే ఎంత బావుణ్ణో అని మనసులో అనుకోని సంధర్బం బహుశా నాకు తెలిసి లేదేమో! అంతిష్టం అవంటే...అంత కలర్ ఫుల్ గా లేక పోయినా వాటి అమాయక చూపులు, కరెంట్ తీగల మీదో లేకపోతే బట్టలు ఆరేసుకునే తాళ్ళ మీదో వాటి గొడవలు, చిట్టి రొమాన్స్...వాటిల్లో అవి చేసుకునే స్నేహాలు...ఇవన్నీ నాకు భలే నచ్చేవి. ఎప్పుడైనా వాటిల్లో కనీసం ఒక్కదాన్ని నా చేతిల్లోకి తీసుకుని ప్రేమగా ఓ సారి దాని రెక్కలు నిమిరి, ఓ గుప్పెడు వడ్ల గింజలు దాని నోటికి అందించకపోతానా అన్న ఆశతో కాలం వెళ్ళదీస్తున్న రోజులవి. అవే చిట్టి పొట్టి పిచ్చుకలు...

ఓ సారి మేము ఇళ్ళు మారే క్రమంలో కొత్త ఇంటిలోకి వచ్చాము. ఆ ఇళ్ళు ఇది వరకటి ఇంటితో పోల్చితే ఏరుకు దగ్గరగా ఉండేది. చుట్టూ కొంత దూరం వరకు ఇంకే ఇళ్ళూ ఉండేవి కాదు. అక్కడ మా బెడ్ రూంలో వెంటిలేటర్లు మూడు వైపులా ఉండేవి. వెలుతురు, ఎండ ఎక్కువగా ప్రసరిస్తున్నందున, మా ఇంటి ఓనరు గారు ఏరువైపు తెరుచుకునున్న వెంటిలేటర్ను ఓ రేకు ముక్కతో గోడకు అవతలవైపు మూయించేశారు. బెడ్ రూం లోపల నుండి చూసినప్పుడు ఆ వెంటిలేటర్ ఒక గూటిలాగ తయారైంది.

ఓ వేసవి మధ్యాహ్నం, ఎండలో తిరిగి ఆడుతామని, తలుపుకు పైన గడియ పెట్టేసి, పెద్దక్క బలవంతంగా నన్ను పడుకోబెట్టడానికి ప్రయత్నించింది. ఆ గడియ నాకు అందదు కనుక ఇక పడుకోక తప్పేట్టు లేదని అలా అటూ ఇటూ మంచంపై దొర్లుతున్నాను. ఇంతలో ఓ తెరిచిన కిటికీ తలుపుపై ఓ పిచ్చుక, నోటితో చిన్న గడ్డి పరక పట్టుకుని, అటూ ఇటూ చూస్తూ, మద్య మద్యలో కిచ్ కిచ్ మంటూ, ఎవ్వరూ చూడట్లేదని నిర్ధారించుకున్నాక సరాసరి మా వెంటిలేటర్లోకి దూరింది. వెంటనే కళ్ళని పావు వంతు మాత్రమే తెరచి, పడుకున్నట్టు నటిస్తూ అటువైపే చూస్తున్నాను. పిచ్చుక గడ్డిపరకని లోపల పేర్చేసి బయటకు వచ్చింది.. మళ్ళీ కిటికీ మీద కూర్చొంది..ఇంతలో ఇంకో పిచ్చుక కిచ్ కిచ్ మంటూ సన్నటి గుడ్డపీలికలను నోటితో పట్టుకుని సరాసరి వెంటిలేటర్లోకి దూరింది. పిచ్చుక అక్కడ గూడు పెడుతుందని నాకు తెలియడానికి అట్టే సమయం పట్టలేదు.

పక్కింట్లో ఉండే ప్రసాద్ గాడికి ఈ విషయం చెప్పాను. వాడు "ఒరేయ్...ఆ పిచ్చుక పిల్లల్లో నా కొకటి...నీ కొకటి...ఇద్దరం పెంచుకుందామే.." అన్నాడు. రోజు రోజుకు ఆ గూడు సైజు పెరుగుతూనే ఉంది. ఇంకా ఇంకా ఏవో పుల్లలు, కొబ్బరి పీచు, దూది పింజలు ఆ రెండు పిచ్చుకలు నోటకరచుకుని గూటిలోకి దూరి వదిలేసి వస్తూనే ఉన్నాయి. నాకేమో అవి ఎప్పుడు పిల్లలు పెడతాయో, ఆ పిల్లలు ఎప్పుడు పెద్దవవుతాయో, వాటిని నేను ఎప్పుడు చేత్తో పట్టుకుంటానో అని ఒకటే ఆశగా ఉండేది.

ప్రసాద్ వాళ్ళమ్మ మా ఇంట్లో అమ్మతో మాట్లాడుతూ ఉండగా, పిచ్చుకలు పుల్లలతో వెంటిలేటర్ లోకి దూరటం గమనించినట్టుంది. పిచ్చుకలు అలా ఇళ్ళల్లో గూళ్ళు కట్టడం అంత మంచిది కాదని, అందులో పిచ్చుక గుడ్లు పెట్టక ముందే తీసేస్తేసరి అని అమ్మతో అంది. అసలే ఇలాంటి విషయాల్లో రెండో ఆలోచనకు తావివ్వని అమ్మ ఆ గూడును తీసేద్దామని చీపురు పట్టుకుంది. వెంటనే నేను అమ్మతో అందులో పిల్లలు ఉన్నాయని, వాటి అరుపులు కూడా అప్పుడప్పుడు వినిపిస్తున్నాయని అబద్దం చెప్పేసి బేర్ మని ఏడవటం మొదలుపెట్టాను. ఇంక అమ్మకి కూడా గూడు తీయడానికి మనసొప్పినట్టు లేదు. చీపురుని కింద పడేసింది. హమ్మయ్య అని అనుకొన్నాను.

ఓ రోజు నేను టిఫిన్ తింటుండగా ఆడ పిచ్చుక నోటితోని ఓ పురుగుని పట్టుకుని గూటిలోకి దూరింది. అది అలా దూరగానేనిజంగానే కిచకిచమని చిన్న చిన్న అరుపులు వినపడ్డాయి. పిచ్చుక గుడ్లు పొదిగిందని అర్దమై, వెంటనే ఈ విషయం ప్రసాద్ గాడితో చెప్పాలని టిఫిన్ టేబుల్ మీద పడేసి పరిగెత్తాను. "ఒరేయ్..పిచ్చుకను పట్టుకోడానికి పెద్ద కష్టం పడకుండానే మనకు త్వరలో దొరకబోతోందిరా..." అని అన్నాడు వాడు. పిచ్చుకను పట్టుకున్నాక దాన్ని పెట్టడానికి అట్టముక్కలతో చిన్న ఇల్లు కూడా సిద్దం చేసేసాను నేను. ఇంక అది పెద్దదవ్వటమే ఆలస్యం..

ఓ రాత్రి గూడులో పిల్లలు ఎలా ఉన్నాయో చూడాలనిపించింది. ఒకటి రెండు సార్లు కిటికీ దగ్గర నిలబడి 'హుష్..హుష్' అని అన్నాను..ఒకవేళ పెద్ద పిచ్చుక అందులో ఉంటే పిల్లను తీసి చూడటం కుదరదు కదా...అందుకన్నమాట...ఆ పాటికే పెద్ద పిచ్చుక ఉంటే బయటకు వచ్చేసేది...రాలేదంటే లేదని అనుకుని, ఓ పొడుగాటి స్టూల్ కిటికీ దగ్గర వేసుకుని, నెమ్మదిగా గూటిలోకి చెయ్యి పెట్టాను...ఏదో మాంసం ముద్దలాగ చెయ్యికి తగిలింది...కొంచెం అదోలా అనిపించింది...అయినా ఆత్రుత ఆపుకోలేక దాన్ని బయటకు తీసాను...ఈకలు లేకుండా ఒట్టి చర్మంతో, మూతికి ఇరువైపులా పసుపురంగుతో వికృతంగా కనిపించింది. నేను దాని మూతి దగ్గర వేలితో తాకితే తల్లి ఆహారం ఏదో పెడుతుందనుకొని పెద్దగా నోరు తెరిచి, కిచ్..కిచ్..మంది. కొంచెం భయమేసి గూటిలో పెట్టేసాను. అప్పుడే తెలిసింది పుట్టిన వెంటనే పక్షికి ఈకలు ఉండవని....


పిచ్చుక పిల్లలు కొంచెం పెద్దవవుతున్న కొద్దీ అవి ఒకదాన్ని ఇంకోటి తోసుకుని గూటిలోంచి బయటకు చూసేవి. ముద్దు ముద్దుగా భలే కనిపించేవి నాకు.

కొద్దిరోజులు తర్వాత వాటికి కొంచెం ఎగరగలిగే శక్తి రావటం వల్ల గూడు వదిలి బయటకు వచ్చేసాయి. కొన్ని ఏటో వెళ్ళిపోయాయి. ఇదే సరైన సమయం పిచ్చుకను పట్టుకోడానికి అని గూటిలో చెయ్యి పెడదామని అనుకుంటుండగా, మా టీ.వి స్టాండు వెనుక సరిగ్గా ఎగరటం చేతగాని ఓ పిల్ల కనిపించింది. వాళ్ళమ్మ అక్కడికే దానికి ఆహారం తెచ్చి నోట్లో పెడుతుంది. అదేమో వాళ్ళమ్మ ఎగిరిపోతున్నప్పుడు దాని వెనకే ఎగరడానికి ప్రయత్నిస్తుంది. ఇంక దాన్ని అలాగే వదిలేస్తే ఎగిరిపోతుందని పట్టుకోబోయాను. అది కప్పగెంతులు వేసుకుంటూ నడిచి, కొద్ది దూరం ఎగిరింది. ఇలా లాభం లేదని ప్రసాద్ గాడిని పిలిచాను. వాడు పిచ్చుకని అటువైపు కాపు కాస్తే నేను ఇటువైపు నుండి దాని పట్టుకోగలిగాను. ఇంకో పిచ్చుక పిల్ల ప్రసాద్ గాడి కోసమని నేను ఆ రాత్రి గూటిలో చెయ్యి పెడితే ఒక్కటి కూడా లేదు.

నా కల నిజమైన రోజు వచ్చేసిందని గొప్ప ఆనందం వేసింది. నేను దాన్ని ఇదివరకు తయారు చేసిన అట్ట ఇంట్లో ఉంచాను. నాకు పక్షులంటే పిచ్చి అని అక్క వాళ్ళకి తెలీటంతో చూసి చూడనట్టు వదిలేసారు..అమ్మ మాత్రం "పాపం రా..అలా పట్టుకోకూడదు" అనేది. నేను మాత్రం కొద్దిరోజుల తర్వాత దాన్ని వదిలేస్తాను అని చెప్పటంతో అమ్మ ఒప్పుకుంది. కొద్ది రోజులు పెద్ద పిచ్చుక అట్ట ఇంటి బయటనుండే దానికి ఆహారం తినిపించేది. తర్వాత అది పెద్దది అవ్వటం వల్లనేమో తల్లి రావటం మానేసింది. పిచ్చుక పిల్ల బాగా పెద్దది అయ్యింది. రెక్కలు బాగా ఎదిగాయి. దాని మూతికి ఇరువైపులా పసుపు రంగు కొంచెం మిగిలేఉంది. రోజూ దాన్ని చేతిలోకి తీసుకుని, వడ్ల గింజలు నోటికి అందించేవాళ్ళం...నేనూ ప్రసాద్ గాడూనూ...

ఓ సారి సడన్ గా తల్లి పిచ్చుక, తండ్రి పిచ్చుక నా అట్ట ఇంటి చుట్టూ ప్రదక్షణ చేయటం మొదలు పెట్టాయి...అవి కిచ కిచ మని అరిస్తే ఇది కూడా లోపలి నుండి అరిచేది. ఎందుకో జాలేసింది..ప్రసాద్ గాడితో వదిలేద్దాం రా దాన్ని అన్నాను. వెంటనే దాన్ని బయటకు తీసి అరుగుమీద పెట్టాను. ఎగరటం నేర్చుకుంటున్న దశలో మేము పట్టుకోవటం వల్లనేమో అది అటూ ఇటూ చూసింది గానీ ఎగరలేదు. మేమిద్దరం కొంచెం దూరం నుండి దాన్ని చూస్తునే ఉన్నాం. ఇంతలో పెద్ద పిచ్చుకలు రెండూ దాని దగ్గరకు వచ్చాయి. పిల్ల పిచ్చుక దాని రెక్కలు కొంచెం ఉబ్బినట్టుపెట్టి వాటి దగ్గర తెగ గారాలు పోయింది. కొంచెం సేపు మూడు కలిసి కుచ్..కుచ్ అని అరిచాయి. మొదట మగ పిచ్చుక ఎగిరింది..దాని వెనుక తల్లి పిచ్చుక ఎగిరింది...ఆ వెంటనే పిల్ల పిచ్చుక వాటిని అనుసరిస్తూ ఎగిరిపోయింది.



***********

PS: ఈ రోజు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం...పాపం..అమాయకమైన ఈ పక్షులు ఇప్పుడు అంతరిస్తున్న పక్షుల జాబితాలోకి చేరిపోయాయట....ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ కనిపించే ఇవి ఇప్పుడు మాత్రం తమ ఉనికేనే కోల్పోబోతున్నాయట...ఇవన్నీ చదవగానే ఒక్కసారి ఆ బుల్లి పిచ్చుకతో నా అనుభందం గుర్తొచ్చి ఇలా టపా అయింది. ఆ బుల్లి పక్షుల జీవనంలో మళ్ళీ పూర్వ వైభవం రావాలని ఆకాంక్షిద్దాం.

THE ABOVE ARTICLE COLLECTED FROM:

http://eti-gattu.blogspot.in/