కావలసిన వస్తువులు
బాసుమతి బియ్యం - ఒక కిలో
మష్రూమ్స్ (పుట్టగొడుగులు) - అరకిలో
ఉల్లిపాయలు - 100గ్రా, నెయ్యి - 125 గ్రా, గరంమసాలా - 10 గ్రా, పచ్చిమిర్చి - 40 గ్రా
పసుపు - చిటికెడు, పుదీనా 4 కట్టలు
పెరుగు 1 కప్పు, ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి, నీళ్లలో నానబెట్టాలి. తరువాత పుట్టగొడుగులను (మష్రూమ్స్) శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి. ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయల్ని సన్నగా పొడవుగా విడివిడిగా తరిగి పెట్టుకోవాలి. పుదీనాను సన్నగా తరగాలి. వెడల్పుగా, బరువుగా వున్న ఇత్తడి పాత్రలో నెయ్యి పోసి స్టౌమీద వేడి చేయాలి. ఇందులో ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఎర్రగా వేయించాలి. అల్లం, వెల్లుల్లి మిశ్రమం, గరంమసాలా, కారంపొడి, పసుపు, పచ్చిమిరకాయ ముక్కలు, పుదీనా వేసి వేయించాలి. ఈ మిశ్రమంలో పుట్టగొడుగుల ముక్కలు వేసి, కొద్దిగా వేయించాలి. ఇందులో పెరుగు వేసి బాగా కలపాలి. పుట్టగొడుగు ముక్కలు కొద్దిగా ఉడికిన తరువాత అందులో రెండు లీటర్ల నీళ్లు పోసి ఎసరు పెట్టాలి. ఎసరు మరగడం ప్రారంభించాక అందులో నానబెట్టిన బియ్యాన్ని బాగా వడకట్టి కలపాలి. బియ్యం సగం ఉడికాక స్టౌను సిమ్‌లో పెట్టి, తగినంత ఉప్పు కలిపి, పాత్ర మీద మూతపెట్టాలి. బియ్యం పూర్తిగా ఉడికిన తరువాత పాత్రను స్టౌమీద నుంచి కిందకు దించుకోవాలి. అంతే ఘుమఘుమలాడే మష్రూమ్స్ పలావు రెడీ. దీనిని వేడివేడిగా ఏదైనా గ్రేవీ లేదా పెరుగుపచ్చడితో కలిపి తింటుంటే వుంటుందీ...మ్!