ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARTICLE ABOUT LORD SIVA - SIVATATVAM - SUMMARY OF SIVA PURANAM - SIVA PURANAM VEDANTHA SARA SARASWAM




శివుడు - శివతత్వం

శివపురాణం వేదాంత సార సర్వస్వము


శివపురాణం వేదాంత సార సర్వస్వము. దీనిని వినిపించమని మహర్షులందరూ అడిగారు. ఇలా ఎందుకు చెప్పాడు సూతుల వారు అంటే ఒక వస్తువు గొప్పతనం చెప్పడం వలన దానియందు ఆదరణ, గౌరవము, శ్రద్ధ పెరుగుతాయి. అవి పెరిగితే విషయాన్ని సరిగ్గా గ్రహించగలవు. అందుకు పురాణంయొక్క మహిమని పేర్కొన్నాడు సూతుల వారు. "శంకరమ్ సంస్మరణ్ సూతః" - శంకరుని స్మరించి మొదలు పెట్టారు. అనామయుడైన శివుణ్ణి స్మరించి నేను చెప్తాను. ఆ శివుని స్మరించి మీరు వినండి. ఆమయము అంటే ఆధి, వ్యాధి, లోపములు, అజ్ఞానములు. ఆమయములు లేని వాడు శివుడొక్కడే. అందుకే ఆయన రోగంలేని పెద్ద డాక్టర్. అందుకే సంసార వైద్యః ఆయన. "భిషక్తమం త్వా భిషజాం శృణోమి" - అని ఉపనిషత్తు చెప్తున్నది. "ప్రథమో దేవ్యో భిషక్" అటువంటి ఆ వైద్య శిఖామణిని మనం స్మరించుకుంటున్నాం. నా ప్రయత్నం నేను చేస్తాను తరువాత మీఇష్టం అనే డాక్టర్ కాదు ఆయన. ఆయన చెయ్యి వేశాడా జబ్బు సమూలంగా నశిస్తుంది. అనామయం. అన్ని జబ్బులూ పోగొట్టేవాడు. అన్నింటికంటె పెద్ద జబ్బు సంసారం. దానికి వైద్యుడాయన. అందుకే భవరోగ హరుడు అని పేరు ఆయనకి.
అనేక కల్పములు గడిచి ప్రస్తుత కల్పం ప్రారంభమైనది. ఆ సమయంలో ఆరు సముదాయములుగా(six schools) ఋషులు బ్రహ్మ దేవుని వద్దకు వెళ్ళి నమస్కరించి ఇలా అడిగారు. మా మధ్య ఒక తేల్చరాని వివాదం వచ్చింది ఏది గొప్పది? అని. సృష్టికర్తవైన గురువువు కనుక నాశరహితమైన బ్రహ్మమేది? అన్నింటికీ కారణమైనదేది? చెప్పమని అడిగారు.

అన్ని తత్త్వములకంటె పూర్వమందున్నవాడు. సృష్టి అంతా తత్త్వములతో కూడియున్నది. అవి సాంఖ్యం ప్రకారం 24/25, ఆగమాల ప్రకారం 36 తత్త్వములు. సృష్టి ప్రారాంభం అయ్యాక ఈ తత్త్వములతో నడుస్తున్నది. సృష్టికి, మూలకములకుముందు ఉన్నది ఎవరు? తత్త్వములు అనగా సృష్టికి మూలకములు(Raw Materials). సర్వతత్వములకంటే ప్రాచీనమైనవాడు.,సర్వోత్కృష్టుడు, అతీతమైన వాడు ఎవరు? అని అడిగారు. "యతోవాచా నివర్తంతే" ఉపనిషద్వాక్యం అది. ఉపనిషద్వాక్యాలు కొల్లలు కొల్లలుగా పరిగెడతాయి శివపురాణంలో. ఉపనిషత్తులను ఆవుగా భావిస్తే ఆ ఆవు పొదుగు నుంచి వచ్చిన క్షీరమే శివతత్త్వం. మనసుకీ, మాటలకీ అందనిదీ, బ్రహ్మవిష్ణురుద్రాదులకు మూలమైనది. శివుడు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులలో ఒక్కడు అని కాదు శివపురాణ ప్రతిపాదన. వారికి మూలమై బ్రహ్మవిష్ణురుద్రాదులుగా ప్రవర్తిసున్నది. అచ్చమైన హైందవ ధర్మంలో పరతత్త్వ ప్రతిపాదన ఉన్నది. ఆ పరతత్త్వం బ్రహ్మవిష్ణు రుద్రాదులకంటే అతీతమైన వాడు. సృష్టి స్థితి లయ ఉన్నప్పుడే ఈ ముగ్గురూ ఉంటారు. సృష్టికి అతీతంగా ఉన్నది ఈ మూడూ కానిది. అయిన దైవము మహాదేవుడు, శివుడు అని చెప్పబడుతున్నాడు.