ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

IMPORTANT INFORMATION ABOUT POOJA OF LORD HANUMAN - LORD ANJANEYASWAMY TEMPLES INFORMATION IN INDIA - LIST OF LORD HANUMAN AVATHARS - HOW TO PERFORM POOJA TO LORD HANUMAN ETC


ఆంజనేయస్వామి గురించి కొన్ని విశేషాలు

ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయస్వామి ప్రత్యక్షమవుతారని మన విశ్వాసం. ఎక్కడ హనుమ ఉంటారో అక్కడ శ్రీరామచంద్రులవారు తప్పక ఉంటారు. శ్రీరాముని పేరు వినగానే మనకు ఆంజనేయస్వామి తప్పక గుర్తువస్తారు. హిందువులంతా హనుమంతుని ఆంజనేయుడనీ, మారుతి అనీ ఇంకా అనేక నామాలతో కొలిచి కీర్తిస్తుంటారు. రామాయణంలో రామునికున్నంత ప్రాముఖ్యం హనుమకూ ఉంది. హనుమాన్ అంజనాదేవి, కేసరిల సుతుడు. చైత్ర శుధ్ధపౌర్ణమినాడు, మూలానక్షత్రాన, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలోజన్మించినట్లు ఒక కథనం. వేదాల కథ ఆధారంగా, అంజనాదేవి ఒక అప్సరస అనీ, శాపవశాన భూలోకంలో వానర వంశంలో జన్మించిందనీ, రుద్రదేవుడైన శివుని వరం వల్ల ఆమెకు పుత్రుడు జన్మించాక ఆమె శాప విముక్తురాలు అవుతుందని చెప్పబడింది. అందువల్ల ఆమె భర్తతో కూడి శంకరుని అతిభక్తితో ధ్యానించి, ఆ రుద్రుని వరంతో, ఆయన అంశతో ఆంజనేయుని పుత్రునిగా పొందింది. హనుమకు 28 మహిమలు లభించాయి, ఆకాశగమనం, శరీరాన్ని పెంచడం, కుంచించడం వంటివి.


మరొక చారిత్రక కధనం ప్రకారం - కర్ణాటకలోని, హంపీవద్ద గల 'గుంలవ్య తోట' అనే గ్రామానికి18 కిలోమీటర్ల దూరంలో ఆంజనేయ పర్వతంలోని 'అంజని గుహ'లో, పంపానదీ తీరం వద్ద ఆంజనేయ స్వామి జన్మించినట్లు ఉంది. వాల్మీకి రామాయణంలోని యుధ్ధకాండలో కేసరి బృహస్పతి కుమారుడనీ, రామరావణ యుధ్ధసమయంలో ఆయన రాముని సేనలో చేరి యుధ్ధంచేసినట్లు ఉంది. అయోధ్యలో దశరధ మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు, యజ్ఞపురుషుడు ప్రసాదించిన పాయసాన్ని, మహారాజు ముగ్గురు రాణులకూ పంచగా, సుమిత్రభాగమున్నపాత్రను ఒక గ్రద్ద తన్నుకుని ఆకాశంలో వెళుతూ విడచి వేయడంతో అదివెళ్ళి శివుణ్ణి భక్తితో ప్రార్ధిస్తున్న అంజనాదేవి దోసిట్లోపడినట్లూ, ఆమె దాన్ని దైవప్రసాదంగా భావించి భక్తితో స్వీకరించగా, ఆమెకు ఆంజనేయస్వామి జన్మించినట్లు రామాయణంలో ఉంది. అందుకే శ్రీరాముడు హనుమంతుణ్ణి తన నాల్గవ సోదరునిగా ఆదరించారు.


ఆంజనేయులు బాల్యంలో సూర్యుని పండుగా భావించి నోట కరుచుకోగా, దేవేంద్రుని వజ్రాయుధ ఘాతానికి చెంప ఉబ్బడంతో 'హనుమ' అనే నామం వచ్చినట్లు కూడా చెప్తారు. సూర్యుణ్ణి హనుమంతుడు తన గురువుగా భావించి సేవించి, ఆ సూర్యదేవుని నుండి సకల శాస్త్రజ్ఞానం పొంది, గురుదక్షిణగా సూర్య కుమారుడైన, సుగ్రీవుని సేవించడానికి అంగీకరిస్తాడు. ఇది ఆయన సత్య వాక్ దీక్షకూ, గురుభక్తికీ తార్కాణం. మహిరావణుడు యుధ్ధసమయంలో రామలక్ష్మణులను పాతాళంలో దాచినపుడు, ఆoజనేయస్వామి వెళ్ళి, మహిరావణుడు వెలిగించిన ఐదు అఖండ దీపాలను ఆర్పవలసివచ్చి పంచముఖాలతో - అనగా వరాహ ముఖంతో ఉత్తర దిశన, నరసింహ ముఖంతో దక్షిణ దిశన, గరుడముఖంతో పడమర దిశన, హయగ్రీవముఖంతో ఆకాశంవైపు, తన హనుమ ముఖంతో తూర్పు దిశన ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పేందుకు 'పంచముఖ ఆంజనేయుని'గా రూపుదాల్చారు. ఇది ఆయన స్వామి కార్య దీక్షకు నిదర్శనం.
యుధ్ధానంతరం హనుమంతుడు హిమాలయ పర్వతం మీద నివసిస్తూ 'హనుమద్రామాయణాన్ని’ తన గోళ్ళతో వ్రాసినప్పుడు వాల్మీకి మహర్షి వచ్చి, ఆ రామాయణాన్నిచదివి, అసంతృప్తిని వ్యక్తపరచగా, హనుమంతుడు కారణం అడుగుతాడట! అప్పుడు వాల్మీకి మహర్షి 'ఈ రామాయణంలో హనుమ పాత్రను చిత్రించక పోవడం వల్ల అది అసంపూర్తిగా వుంది కాబట్టి తనకు అసంతృప్తికలిగించినదని' చెప్పారు. అప్పుడు హనుమంతుడు తన రామాయణాన్ని ఉపసంహరించుకున్నారు ! ఎంత నిరాడంబరత !! అందుకే హనుమంతుడిని ధ్యానిస్తే మంచి గుణాలు కలుగుతాయని, గర్వాహంకారాలు పోతాయనీ అంటారు. అందుకే అందరూ హనుమంతుణ్ణి పూజిస్తారు రామునితో సమానంగా ! అందుచేత భారతదేశంలోనే గాక ప్రపంచ దేశాలలో కూడా హనుమాన్ ఆలయాలు విరాజిల్లుతున్నాయి .
హిమాచల్ ప్రదేశ్ రాజధాని ఐన 'శిమ్లా' లోని 'జాఖూ' హనుమాన్ ఆలయం ప్రసిధ్ధి చెందినది. ఈ కొండపై యక్ష, కిన్నర గంధర్వ కింపురుషులు నివశించేవారనీ, హనుమ ఆకాశం పైకి ఎగరడానికి అనుకూలంగా ఆ కొండసగానికి భూమిలోకి దిగిపోయిందని, హనుమంతుడు కాలుపెట్టిన చోట ఆలయం వెలిసిందనీ చెప్తారు.
క్రీ.శ. 883 నాడు ఖుజరహోలో ఆజనేయ ఆలయం ఉన్నట్లు శిలాశాసనాల వలన తెలుస్తోంది. ’సంకటమోచన హనుమాన్ మందిరం’ పంజాబ్ లోని ’ఫిల్లూర్’లో ఉంది. తమిళనాడులోని ’నమ్మక్కళ్ 'లో ఉన్నఆంజనేయ విగ్రహంఎత్తు 18 అడుగులు. తూర్పుముఖంగా ఉన్న ఈ ఆంజనేయ విగ్రహం ఎదురుగా ఉన్నలక్ష్మీ నారాయణ స్వామికి నమస్కరిస్తున్న భంగిమలో ఉంటుంది. ఈవిగ్రహం స్వయంభువు అయినందున పెరుగుతూనే ఉన్నారనీ, అందువల్ల పైన కప్పువేయడానికి వీలుకాలేదని ఆలయ కథనం వలన తెలిస్తోంది.
వెల్లూరు జిల్లాలోని ఆర్కోణానికి 30 కిలోమీటర్ల దూరంలో ’యోగ నరసింహ' ఆలయానికి సమీపంలో 'యోగాంజనేయ' ఆలయం చిన్నకొండ మీద ఉంది. ఆలయాన్ని చేరుకోడానికి 480 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ఆంజనేయమూర్తి చతుర్భుజాలతో, రెండు చేతులతో శంఖచక్రాలు, మరో రెండు హస్తాలతో జపమాల ధరించి ’యోగ నరసింహస్వామి’ ని వీక్షిస్తున్నట్లు ఉంటుంది . ’యోగ నరసింహస్వామి‘, యోగామృతవల్లి ఉండే ఆలయంలోనికి పెరియవై కొండ మీదకు1305 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. భక్తులు ఎంత శ్రధ్ధగా శ్రమపడి ప్రార్థిస్తారో దేవుని అనుగ్రహం అంత అధికంగా లభిస్తుందనేది భక్తులనమ్మకం.
కర్ణాటక రాష్ట్రం రాజధాని బెంగుళూరులోని జె.పి.నగర్లో వెలసి ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం ఒక గుట్టపై ఉంది. దీనిని మహామహిమాన్వితమైన ఆలయంగా భక్తులు సేవిస్తారు. మహారాష్ట్ర రాజధాని ముంబాయ్ లోని ఎస్..ఐ ఇ.ఎస్ కాంప్లెక్స్ లోని హనుమాన్ విగ్రహం ఎత్తు 33అడుగులు [ 10.మీటర్లు] 12.అ.ఎత్తైన ప్లాట్ ఫాం మీద ప్రతిష్టించబడి ఉంది. మొత్తం విగ్రహం ఎత్తు భూమినుండి 456.అ.[14.మీ] . వెండి కవచంతో ఈ మారుతీ విగ్రహం కప్పబడి ఉంది.


1989 లో చెన్నయ్ లోని నంగనల్లూర్ లో ఒకే రాతితో చెక్కబడిన 32.అ.[10.మీ] ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహం చెప్పుకోదగినది. ఒరిస్సాలోని రూర్కెలాలో హనుమాన్ వాటిక ఆలయ కాంప్లెక్స్ లో 72 .అ. హనుమాన్ విగ్రహం ఉంది.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పొన్నూరులో 30.అ. అంజనేయస్వామి విగ్రహం భక్తులకు కొంగు బంగారంగా వెలసి ఉంది. అవధూతదత్త పీఠాధిపతి ’గణపతి సచ్చిదానందస్వామి‘ వారిచే 85.అ. [26.మీ] ఎత్తైన ఆంజనేయస్వామివారి విగ్రహం ప్రతిష్ఠ చేయబడి ఉంది.
135.అ.ఎత్తైనఆంజనేయవిగ్రహం హైదరాబాద్ వద్ద గల పరిటాలలో 2003 లో ప్రతిష్టింపబడింది. సాగరపురంలో ప్రతిష్టింపబడిన ఆంజనేయ విగ్రహం దుష్టగ్రహాలను దూరం చేసేదిగా ప్రసిధ్ధి పొందినది. ప్రతిష్ఠాసమయంలో సజీవంగా కదిలిందని చెప్తారు.
తమిళనాడులోని కన్యాకుమారికి సమిపంలో 8 అ. ఎత్తైన మారుతీ విగ్రహం ఉంది. కేరళ తిరువళ్ళుర్ కు 5, 6 కి.మీ.దూరంలోఉన్న' చిన్నకవియూర్ 'లోని శివాలయంలో వంద సంవత్సరాల క్రితం పంచ లోహాలతో నిర్మించబడిన హనుమాన్ విగ్రహం ఉంది. కుంభకోణంలో 40.అ.ఎత్తైన [12.మీ] పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం గ్రానైట్ రాతితో మలచబడింది. తిరువళ్ళూర్లో పంచముఖ ఆంజనేయ విగ్రహం భక్తుల భయాలు దూరంచేసే అభయమూర్తిగా నిలచిఉంది.
హనుమాన్ ఒక్కడే శని ప్రభావం సోకని వానిగా చెప్తారు. రావణుని నుండి విముక్తి పొందిన శనిదేవుడు, హనుమాన్ పట్ల కృతజ్ఞతగా మారుతిని పూజించే వారికి తన దృష్టి సోకదని వాగ్దానం చేశాడట!
కేరళ రాష్ట్రంలోని తిరువళ్ళూర్ వద్దగల, మల్లాపురం జిల్లాలో వశిష్ఠులవారిచే 3 వేల సం.క్రితం. [1,000.బి.సి} ప్రతిష్టింపబడిన హనుమాన్ మూర్తి అతిప్రాచీనమైనదిగా గుర్తింపబడి ఉంది. అలధియూర్ లోని హనుమాన్ ఆలయంలోఒక పెద్ద వేదికపైనున్నఒక గ్రానైట్ రాతిపై సముద్రచిత్రం చిత్రించి ఉండగా భక్తులు దూరం నుండీ పరుగుతీస్తూ వచ్చి హనుమాన్ సముద్రాన్ని లంఘించినదానికి చిహ్నంగా ఈ రాతిపైనుండి దూకుతారు. దీని వల్ల ఆ భక్తుల బాధలు, కష్టాలు తీరిపోయి, ఆరోగ్యం, భాగ్యం, దీర్ఘాయువు కల్గి, అదృష్టం కలసి వస్తుందని విశ్వాసం. ఈ 'అలధియూ హనుమాన్' ఆలయదర్శనం భక్తుల మానసిక శారీరక రుగ్మతలు బాపడమేగాక వారి సర్వకోరికలూ ఈడేరుతాయనే సంపూర్ణ నమ్మకం ఉంది. అందువల్లే భక్తులు తప్పక జీవితంలో ఒక్క సారైనా ఈ 'అలధియూర్ హనుమంతుడి'ని దర్శించి తరిస్తారు.
అహమ్మదాబాద్ లోని కంటోన్మెంట్ ప్రాంతంలో ’షహీబాగ్' సమీపంలోని క్యాంప్ హనుమాన్ ఆలయం పండిట్ గజాననప్రసాద్ వందసంవత్సరాల క్రితం కట్టించారు. భారత ప్రధానులైన, అటల్ బిహారీ వాజ్ పేయ్, ఇందిరాగాంధీ వంటి ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శించినట్లు చెప్తారు.
రామ చరిత మానస్, హనుమాన్ చాలీసా వ్రాసిన తులసీదాస్ [1532-1623] ఢిల్లీలోని హనుమాన్ ఆలయాన్ని దర్శించిన దాఖలాలు ఉన్నాయి. ఈ ఆలయంలో 24 గంటలూ 'శ్రీరామ జయ రామ జయజయ రామ' అనే మంత్రాన్ని1964 ఆగస్టు ఒకటవ తేదీ నుండి నిరాటంకంగా జరుగుతూ వుండటం విశేషం.
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడైన 'బరాక్ ఒబామా' అధ్యక్షునిగా పోటీ చేస్తున్న సమయంలో, ఈ ఆలయమూర్తి అయిన హనుమంతుడి విగ్రహాన్ని, ఆయన శ్రేయోభిలాషులు ఆయన విజయాన్ని కాంక్షించి ఆయనకు బహుమతిగా ఇచ్చినట్లు మనం వార్తాపత్రికల్లో చదివాం.15 కె.జిల బరువైన, బంగారు పూతతో ఉన్న హనుమాన్ విగ్రహాన్ని పవిత్రంగా పూజించి ఆయనకు అందజేశారు. ఆయన దాన్ని భక్తితో స్వీకరించడం, విజయం సిధ్ధించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని 'గొడుగుపేట' లోని ప్రసన్నాంజనేయ ఆలయం ప్రసిధ్ధి చెందిన మరో ఆంజనేయుని ఆలయం. ఆగమశాస్త్ర ప్రకారం దక్షిణముఖంగా ఉన్న ఆంజనేయస్వామి వారిని దర్శించిన వారి కోర్కెలు తీరుతాయని నమ్మిక. ఈ ఆలయ సంప్రోక్షణ సమయంలో 19వ శతాభ్ధిలో కుర్తాళం మఠాధిపతి పూజ చేస్తున్న సమయంలో వర్షం అతిగా కురిసి, అలయం చుట్టూ ఉన్న వీధులు వరద తాకిడికి గురైనా, ఆలయం లోపల మాత్రం ఒక్కనీటి చుక్కైనా పడలేదట! 
మరొక యోగాంజనేయ ఆలయం చెన్నయ్ లోని 'క్రోంపేట' దగ్గర ఉంది.1930లో ఈ ప్రాంతంలో నివసించే 13 సంవత్సరాల బాలికకు కలలో ఆంజనేయస్వామి కనిపించి ఆ ప్రాంతంలో తనకు ఆలయం నిర్మించమని ఆదేశించారట. ఆమె తన తల్లి దండ్రులకు చెప్పింది. తరువాత కంచి మఠపీఠాధిపతులు చంద్రశేఖర సరస్వతీ స్వామీజీవారు ఆ ప్రాంతానికి వచ్చినపుడు ఆ బాలిక స్వామిజీతో తన స్వప్నం విషయం చెప్పింది. స్వామీజీ తన భక్తులతో, ఆలయ ప్రాంతంలో వెదికించగా, ప్రస్తుతం ఆలయం నిర్మించబడి ఉన్న ప్రాంతంలో ఆంజనేయ విగ్రహం లభించినట్లు, ఆ తర్వాత 'తిరుమల తిరుపతి దేవస్థానం’ వారు ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ చరిత్ర ఆధారంగా తెలుస్తోంది .
భక్తులెవరైనా కష్టాలూ, మానసిక రుగ్మతలూ కలిగినా, పసిపిల్లలకు దడుపు, అనారోగ్యం వంటివి కలిగినా, కార్యసిధ్ధికి ముందుగా పూజించేది హనుమంతుడినే. హనుమాన్ చాలీసా పారాయణం, రామరక్షా కవచం, సుందరాకాండ పారాయణ ఇవన్నీ హనుమద్ భక్తుల పాలిటి కల్పవృక్షమనీ, ఆయన కోరిన వెంటనే అండగానిల్చే ఇలవేల్పు అని భావిస్తాం. ఇలాంటి హనుమదాలయాల దర్శనం మనకందరికీ సుఖశాంతుల యివ్వాలని కోరుకుంటూ ...
జయ జయ హనుమా! జయ జయ హనుమా.
వానర దూతా వాయుకుమారా !
అతి బలవంతా ! అంజని పుత్రా!
జయ జయ హనుమా ! జయ జయ హనుమా ! !.
ఆంజనేయస్వామి అవతారాలెన్ని?
ఆంజనేయస్వామి కూడా శ్రీ విష్ణుమూర్తిలా అవతారాలెత్తారు. మహావిష్ణువు దశావతారం ధరిస్తే.. ఆంజనేయస్వామివారు తొమ్మిది అవతారాలు ధరించారు.
అవేంటంటే..
1. ప్రసన్నాంజనేయస్వామి
2. వీరాంజనేయస్వామి
3. వింశతి భుజ ఆంజనేయస్వామి
4. పంచముఖ ఆంజనేయస్వామి
5. అష్టదశ భుజ ఆంజనేయస్వామి
6. సువర్చలాంజనేయస్వామి
7. చతుర్బుజ ఆంజనేయస్వామి
8. ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి
9. వానరాకార ఆంజనేయస్వామి.
ఆంజనేయస్వామి రుద్రాంశ సంభూతుడు. నవ అవతార ఆంజనేయస్వామి ఆలయం ఒంగోలులో ఉంది. ఇక్కడ పంచముఖ ఆంజనేయస్వామి ప్రధాన దైవం. ఆలయాన్ని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం అని పిలుస్తారు.
ఆంజనేయస్వామి గురించి కొన్ని ...
ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక రోజులు - శనివారం, మంగళవారం మరియు గురువారం. పురాణకథ ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే ఏడున్నర యేళ్ళ శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు.
స్వామికి ప్రీతి పాత్రమైన పువ్వులు:
తమలపాకుల దండ:
ఒక కధ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట, దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.
మల్లెలు:
గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం చాల శ్రేష్టం.
పారిజాతాలు:
స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు.
తులసి:
తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది, అందుకే హనుమంతునికికూడా ఇష్టమైనది
కలువలు:
కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి ఎంతో ఇష్టమైన పూలు. కేరళలోని ఇరింజలకుడలో భరతునుకి ఒక దేవాలయం వుంది. అందులో అతనికి కలువ పూల మాల వెయ్యడం సాంప్రదాయం. శ్రీరాములవారికి హనుమంతుడు మరియు భరతుని మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, హనుమత్ స్వామికి కూడా కలువ మాల వేస్తారు.
పంచముఖ హనుమాన్:
శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరాలు ఇలా చెప్పబడ్డాయి.
1 తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త శుద్దిని కలుగ చేస్తాడు.
2 దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.
3 పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.
4 ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.
5 ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, బిడ్డలను ప్రసాదిస్తాడు.
ఆంజనేయుని పూజకు పర్వదినాలు ?
చైత్రమాసం - పుష్యమీ నక్షత్రం
వైశాఖమాసం - ఆశ్లేషా నక్షత్రం
వైశాఖమాసం - కృష్ణపక్ష దశమీ హనుమజ్జయంతి
జె్యైష్ఠమాసం - మఖా నక్షత్రం
జె్యైష్ఠశుద్ధ విదియ - దశమి దినములు
ఆషాఢ మాసం - రోహిణి నక్షత్రం
శ్రావణ మాసం - పూర్ణిమ
భాద్రపద మాసం - అశ్వనీ నక్షత్రం
ఆశ్వీయుజ మాసం - మృగశీర్షా నక్షత్రం
కార్తీక మాసం - ద్వాదశి
మార్గశీర్ష మాసం - శుద్ధ త్రయోదశి
పుష్య మాసం - ఉత్తరా నక్షత్రం
మాఘ మాసం - ఆర్ధ్రా నక్షత్రం
ఫాల్గుణ మాసం - పునర్వసు నక్షత్రం
హస్త, మృగశీర్షా నక్షత్రములతో కూడిన ఆదివారములు స్వామి వారికి ప్రీతిదాయకములు. పూర్వాభద్ర నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం. అదియును పర్వదినము. ప్రతి శనివారము స్వామివారికి పూజలు చేయుట విధి. అమావాస్యతో కూడిన సోమవారము, ప్రతి మంగ ళవారం స్వామి వారి పూజకు ప్రీతి దినములు. వైధృతియోగయు నందు (అనగా ఉత్తమము, అపూర్వము అగు గ్రహయోగకాలము, విష్కం భాది 27 యోగాలలో చివరిది వైధృతి యోగము) స్వామిని పూజించిన విశిష్ట ఫలసిద్ధి ప్రాప్తించును. ఆంజనేయస్వామి సప్తపదనుడనియు, ఏకాదశ శీర్షుడనియు తెలియుచున్నది.
శ్రీహనుమత్ స్వామికి అరటి తోటలంటే ఎక్కువ యిష్టం. కాబట్టి స్వామిని కదళీవనములలో పూజిస్తే శుభం చేకూరుతుంది. మంగళకరుడగు స్వామికి తమలపాకుల పూజ పరమ ప్రీతికరం. అలాగే పారిజాతాలు, మందారాలు, నందివర్ధనం, మల్లెలు, గన్నేరు మొదలైన పుష్పాలు స్వామికి ఆనందము కలిగిస్తాయి. తులసీ, మారేడు, మామిడి, మాచీపత్రము, ఉత్తరేణి పత్రములు ప్రీతికరములు. అరటి, మామిడి, నిమ్మ, కొబ్బరి, పనస, నేరేడు మొదలైన ఫలాలు స్వామి వారికి అత్యంత ప్రీతికరం.
సింధూరము, సింధూరాక్షతలు, పసుపు అక్షతలు, కుంకుమ, సాంబ్రాణి, గుగ్గిలము, కర్జూరము మొదలైన పూజాద్రవ్యాలు, పాయసం, పొంగలి, అప్పాలు, వడలు, వడపప్పు, పానకం, పాలు మొదలైన నివేదన ద్రవ్యాలు స్వామికి నివేదిస్తే, స్వామి సంతుష్టుడు అవుతారు. ఆవు నేతితో చేసిన దీపారాధన శ్రేష్ఠం.
ప్రభాకరాత్మజాం సుమేరు చారువర్ణ శోబితాం
విరాజమాన పంకజద్వయాత్తహస్తవైభవాం
ధరాత్మజాపతి ప్రసాదప్రాప్త ధన్యజీవితాం
నమామితాంవరప్రదాంరమాకళాం సువర్చలాం


ఇలా స్వామిని నిత్యం ధాన్యం చేయాలి.