ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SECRETS OF INDIAN ANCIENT VEDAS


“ వేదములు – సైన్స్ –రహస్యాలు “

ఒక పరమాణువు విశ్వాన్నంతటినీ సృష్టిస్తే, ఆ సృష్టిలోని చరాచరములన్నీ పరమాణువులతోనే తయారుగాబడివుంటాయి. ఆ మొట్టమొదటి పరమాణువుయొక్క మూల ధర్మాలే అన్ని చరాచరముల అణువులలోనూ నిభిఢీకృతమై వుంటాయి. భౌతిక, పదార్ధ, రసాయన శాస్త్రాలు ఈ విషయాన్ని ఒప్పుకుంటాయి. ఈ శాస్త్రాలు చెప్పిన నిజాలనే నేటి సమాజం నమ్ముతున్నది. మంచిదే. ఒక జపాన్ శాస్త్రవేత్త ఆవిష్కరించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను ముందుగా తెలుసుకుందాం.

డాక్టర్ మసరూ ఎమోటో మానవులు మాట్లాడే మాటలు, పాడే పాటలు, నృత్య శబ్దాలు నీరు, ఆహారంపైన ఏ విధంగా ప్రభావాన్ని చూపుతాయో తన పరిశోధన ద్వారా తెలుసుకున్నారు. కొన్ని నీటి చుక్కలను తీసుకొని, వాటిముందు, వేరువేరుగా, కొని మంచిమాటలను, మంచి ప్రార్ధనలను, మంచి సంగీతాన్ని, మంచి సరళమైన నృత్య శబ్దాలను వినిపించారు. అలాగే, మరికొన్ని నీటి చుక్కలను తీసుకొని, వేరువేరుగా, కొన్ని చెడు/తీవ్రమైన మాటలను, తీవ్రమైన ( metallic music ) సంగీత శబ్దాన్ని, తీవ్రమైన నృత్య శబ్దాలను వినిపించారు. ఆ తరువాత, ఆ నీటి చుక్కలను మంచు ముక్కల్లాగా గడ్డకట్టించి వాటిని సూక్ష్మదర్శినిలో పరిశీలించి, వాటి ఛాయా చిత్రాలు తీసారు. అనేక అణువుల సమాహారమే నీటి రూపం. మంచి మాటలలు, మంచి ప్రార్ధనలు, మంచి సంగీతాన్ని …. వినిపించిన నీటి చుక్కల స్పటికాల్లో అణువుల సమాహారం ఆకృతి అతి అందంగా, ముత్యాలు పేర్చినట్లుగా కనిపిస్తే, తీవ్రమైన మాటలను, తీవ్ర సంగీత శబ్దాలను …. వినిపించిన నటి చుక్కల స్పటికాల్లో అణువుల సమాహార ఆకృతి అందవిహీనంగా, చిందరవందరగా కనిపించిందట. వీటికి సంబంధించిన *చిత్రాలను కింద చూడండి. ఆ శాస్త్రవేత్త చెప్పిందేమిటంటే, మనిషి శరీరంలో 72 శాతం నీరు వుంటుంది. కొన్ని నీటి చుక్కలకు మంచి మాటలు, ప్రార్ధనలు, సంగీతాన్ని వినిపిస్తేనే ఆ నీటి చుక్కలలో అణువుల సమాహార ఆకృతి ఎంతో అందంగా ఏర్పడితే, 72 శాతం నీటితో నిండిన మనిషి, తనకు తానుగా మంచి మాటలనే మాట్లాడుతూ, ఎప్పుడూ నిజమే చెబుతూ, చక్కటి సున్నితమైన సంగీతాన్ని వింటూ, తనలో తాను చక్కటి మంచి ప్రార్ధనలు చేసుకుంటే, ఉదా:- నేను చాలా దివ్యంగా వున్నాను, ఈ ప్రపంచమంతా అందంగా వున్నది; నేను చాలా సంతోషంగా, ఆనందంగా వున్నాను; నేను భగవంతుని బిడ్డను; ఆయన దయతో ఇవన్నీ నాకు లభించినాయి అని ఎప్పుడూ భావించినట్లైతే, ఆ మనిషి యొక్క మానసిక, భౌతిక శరీర స్థితి ఎంతో ఆరోగ్యంగా వుంటుంది. అట్టి భావనకు వ్యతిరేకంగా, నేను జీవితంలో ఓడిపోయాను,; అన్నీ కోల్పోయాను; నా జీవితం చీకటిమయం, దుర్భరం అని భావిస్తూవుంటే, అతని మానసిక, భౌతిక శరీర స్థితి అనారోగ్యంగా తయారవుతుంది. దీనినే, వైద్య భాషలో, “ అన్నీ రుగ్మతలకు మూలకారణం మనస్సు “ ( Mind is the origin of all diseases ) అని అంటారు. అదేవిధంగా, మరొక ప్రయోగములో గాలి చొరబడని రెండు గాజు సీసాల్లో మంచి తెల్లటి అన్నంతో నింపి, వాటిని వేరువేరు గదులలో ఉంచి, 30 రోజులపాటు, వరుసగా వాటిముందు అంటే మొదటి సీసాముందు “ నీవంటే నాకు చాలా ఇష్టం, నిన్ను ప్రేమిస్తున్నాను అని; రెండవ సీసా ముందు “ నీవంటే నాకు అయిష్టం, అసహ్యం, నిన్ను ద్వేషిస్తున్నాను” అని పదే,పదే, పదిహేను నిముషాలపాటు చెబుతూ వచ్చారట. 30 రోజుల తరువాత మొదటి సీసాలోని అన్నం తెల్లగానేవుండి, చెడిపోకుండా వుంటే, రెండవ సీసాలోని అన్నం నల్లగా అయిపోయి, చెడిపోయిందట. అంటే మన పాటల ప్రభావం ఆహారంపై ఏ విధంగా పనిచేసిందో తెలుసుకున్నారు ఆ శాస్త్రవేత్త. జీవించటంకోసం తినే ఆహారాన్ని మనం తినేటప్పుడు దానిని ఆస్వాదిస్తూ తినినప్పుడే అది మన శరీరానికి చక్కగా వంటబట్టి, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలా చేయనప్పుడు, ఆహారం వంటబట్టకపోగా, అనారోగ్యాన్ని కలుగచేస్తుందని ఆయన తన శాస్త్ర పరిశోధనల ద్వారా మానవాళికి తెలియచేశారు.


ఇప్పుడు, మనం, ఒక ముఖ్యమైన విషయానికి వద్దాం. .

ఆహారాన్ని కానీ, నీటిని కానీ, తీసుకునేటప్పుడు, ప్రపంచ వ్యాప్తంగా, అన్నీ మతాలలోనూ ప్రార్ధనలు చేయటం అనే పద్ధతి అందరికీ తెలిసేవుంటుంది. క్రీస్తు శకానికి పూర్వమే, మన భారతదేశంలో, వేదాలలో, ఈ ఆచారం నిర్దేశింపబడింది. వీటిని గురించి, ఇప్పటి తరంవారికి ఓపిగ్గా వివరించి చెప్పేవారు కరువవటంతో, వాటి ప్రాముఖ్యత తెలియకుండా పోతున్నది. మానసిక కాలుష్యం, శారీరిక కాలుష్యం, పరిసర వాతావరణ కాలుష్యం పెరిగిపోవటానికి కారణం, మనం ఈ ధర్మాలను పాటించక పోవటమే. మరి మన హిందూ ధర్మ శాస్త్రాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం. జాగ్రత్తగా పరిశీలించండి.

మొదటగా, మానవునికి—నీటికి గల అనుబంధం గురించి చూద్దాం. ప్రస్తుత సైన్స్ చెప్పిందేమిటంటే, అనేక రకాల బహు-కణ జీవుల ఉత్త్పత్తికి మూల కారణం ఏక-కణ జీవులని; మానవుని ఆవిర్భావానికి ముందు దశలను పరిశీలిస్తూ పోతే, అవి నీటినుంచి పుట్టిన ఏక-కణ జీవుల దగ్గరకు దారితీస్తుంది. అందువలనే, ఇప్పటికీ, మనిషి శరీరంలో 72 శాతం నీటితో నిండివున్నది చెబుతారు. — ఈ విషయాన్ని మన పురాణాలతో, శాస్త్రాల్తో సరిచూస్తే, ఆదిపరాశక్తి, అరమోడ్పు కనులతో వున్నప్పుడు,. ఈ భూమి అంతా నీటిలో మునిగి పోయివుంటుందని, అప్పుడు ఆ పరాశక్తి, జలమధ్యమున , వటపత్రముపై యోగనిద్రలో తేలుతూవున్న విష్ణువును ( అంటే స్థితి కారకుడు ) ప్రేరేపించి, భూమిపై సృష్టి కార్యాన్ని ప్రారంభిచమని ఆదేశిస్తుందని, అప్పుడు విష్ణువు , బ్రహ్మ ద్వారా సృష్టి కార్యాన్ని మొదలుపెడతాడని దేవీ భాగవతం మొదలైన పురాణాలు తెలియచేస్తున్నాయి. నీటిలో మునిగిపోయివున్న భూమిని, వరాహావతారంలో, విష్ణువు నీటిపైకి తీసుకువచ్చిన తరువాత భూమిపై జీవుల సృష్టి ప్రారంభమైనదని భాగవతంలో చెప్పబడింది. దీనిని బట్టి, భూమిపైవున్న జీవులకి నీటితో అవినాభావ సంబంధం వున్నదని చెప్పవచ్చు. శ్రీ పురుష సూక్తంలో “ అధ్భ్యస్శంభూత పృధీవ్యరసాచ్చ …..” అని చెప్పబడింది. అంటే నారాయణుడు నీళ్లనుండి పుట్టెను; నీటినుండి పృధివి పుట్టెను అని అర్ధం. విష్ణు సహస్ర నామములో ఒకటైన నారాయణహః “ అనే నామముకూడా మనిషికి – నీటికి గల సంబంధాన్ని తేలియచేస్తుంది. నారము + అయన = నారాయణ = నారములు అనగా జీవులు; అయనము అంటే, స్థానం. ప్రళయకాలమునందున జీవులు ఆశ్రయించుటకు ఒక స్థానం కావలసివున్నందున, అట్టి స్థానమును, నీటినే తన స్థానముగా చేసుకొని, నీటియందు తేలుచున్న నారాయణుడు కల్పించును అని తేలియచేస్తుంది.

రెండవ అంశం మంత్రబద్ధంగా జలాన్ని వినియోగించుకోవటం:- మన ఋషులు గొప్ప పరిశోధకులు, శాస్త్రవేత్తలు. నీటియొక్క గొప్ప తనంగురించి తెలుకున్నవారుగనుక, దైనందిన జీవనంలో మానవుడు నీటిని వాడేటప్పుడు, నీటిని పవిత్రంగా భావించాలి అని నిర్దేశించారు. “యత్ భావం, తత్ భవతి” అని పెద్దలు చెప్పారు. నీటిని వాడేటప్పుడు, మన భావన పవిత్రంగా వున్నట్లైతే, దాని ఫలితం మనం కోరుకున్నట్లే వుంటుంది. మన దేశంలో (1) స్నానం చేసేటప్పుడు; (2) సంధ్యావందనం, మరియు పూజ చేసేటప్పుడు; (3) భోజనం చేసేటప్పుడు ముఖ్యంగా నీటిని ప్రార్ధనా సహితంగా వాడబడుతుంది.

స్నానం చేయునప్పుడు:- “ గం గేచ యమునేచైవ, గోదావరీ సరస్వతీ | నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిమ్ కురు …..” అనే ఆరు మంత్రములను చదువుచూ, ఓ నదులారా మీకు నమస్కారములు; పవిత్రమైన మీ నీటిని నేను వినియోగిస్తున్నాను; సర్వ పుణ్యములను ప్రసాదించండి అని ప్రార్ధన చేయటం జరుగుతుంది.

సంధ్యావందనము/గాయత్రీ ఉపాసన చేయునపుడు – “పవిత్రీ కరణము చేస్తూ, ఎడమ చేతులో నీటిని తీసుకొని, కుడి చేతితో మూసి , “ ఓం అపవిత్రహ పవిత్రోవా సర్వావస్తాం గతోపివా | యః స్మరేత్పుండరీకాక్షమ్ స బాహ్యభ్యంతర శ్శుచి హి …..” అని మంత్రోచ్చారణ చేసి, ఆ జలమును కుడి చేత్తో శిరస్సున చల్లుకోవాలి. ఈ మంత్ర మందలి ముఖ్య భావనేమిటంటే, అపవిత్రమైన ఈ నా మనస్సును, శరీరమును సర్వావస్థలందు, బాహ్యమున, అఃతరమున పవిత్రమైన ఈ జలము ద్వారా, పదే,పదే శుద్ధి కాబడుగాక అని. అదేవిధంగా, “ ఆచమనమ్ “ చేస్తూ, “ ఓం అమృతోపస్తరణమసి స్వాహః …..” అనే మంత్రాన్ని చదువుతూ, వాక్కు, మనస్సు, ఆంతఃకరణములు శుద్ధి కాబడుగాక” అని మంత్రపూత జలాన్ని మూడు సార్లు కొద్ది, కొద్దిగా తాగటం జరుగుతుంది. అదేవిధంగా, “ శిఖాబంధనము “ అను ప్రక్రియను చేస్తూ, శిఖపై, కుడి చేతి వ్రేళ్లను తడిచేసుకొని స్పృశిస్తూ, ఈ పవిత్రమైన జలము ద్వారా సునిశితమైన మేధాశక్తి, తేజస్సు నాలో ప్రవేశించుగాక అని ప్రార్ధన చేయటం జరుగుతుంది. అదేవిధంగా, “ అంగన్యాసము “ చేస్తూ, “ ఓం వాజ్మే ఆస్యెస్తూ ….” అనే మంత్రాన్ని చదువుతూ, శరీరములోని కుడి, ఎడమ వైపున్న అన్నీ అంగములను నీటితో స్పృశిస్తూ, ఈ మంత్రపూరిత జలము ద్వారా నా శరీరాంగములకు పవిత్రత కలిగి, చైతన్య శక్తిచే జాగృతం కాబడి, అట్టి శక్తిని పొందిన అన్నీ అవయవములు సంయమం కలిగివుండుగాక అని ప్రార్ధించటం జరుగుతుంది. ఆఖరుగా, “ సూర్యునికి అర్ఘ్యం “ ఇస్తూ, “ ఓం సూర్యదేవ సహస్రామ్సో తేజోరాసే జగత్ ఫతే …..” అనే మంత్రాన్ని పఠిస్తూ, నీటిని చేతితో వదులుతూ , ఏ మంత్రపూరిత, పవిత్రమైన జలము ద్వారా తనకు సంపూర్ణ వ్యక్తిత్త్వం లభించిందో అట్టి దానిని విశ్వ కుటుంబానికి సమర్పణ చేస్తున్నాను అని ప్రార్ధించటం జరుగుతుంది. ఇదేవిధంగా, ఏవైనా పూజలు చేసేటప్పుడుకూడా నీటిని పవిత్ర మాధ్యమంగా వాడుతూ, సత్ సంకల్పాన్ని ప్రేరేపించటం జరుగుతుంది.

ఇక భోజనం చేసేటప్పుడు:- “ అన్నం పరబ్రహ్మం “ అని వేదవాక్కు. అన్నం వలన జీవులు ఉత్త్పన్న మవుతారు. నీటికి, గాలికి ఎంత ప్రాముఖ్యతగలదో, అన్నానికికూడా అంత ప్రాముఖ్యత వున్నది. మన శరీరాన్ని, వేదాలు, ఐదు కోశములుగా విభజించాయి. అవి “ అన్నమయ కోశం ; ప్రాణమయ కోశం ; మనోమయ కోశం ; విజ్నానమయ కోశం ; మరియు ఆనందమయ కోశం “. అన్న రసం ద్వారా శరీరము ఏర్పడితే, తద్వారా ప్రాణములు ఏర్పడతాయి. అన్నరసం ద్వారా మానసిక శక్తి కలుగుతుంది; తద్వారా అనుభవంతో కూడిన జ్ణానమ్ లభిస్తుంది; అట్టి విజ్ణాము ద్వారా మనిషి ఆనందమయడుగా, సాధన ద్వారా, సమాధి స్థితిని పొందుతాడు. అంతటి మహత్తుగల అన్నాన్ని వేదములలో విస్తారంగా వర్ణించబడింది. అన్నం తయారుకావాలంటే, ధాన్యం పండాలి; ధాన్యం పండటానికి, భూమి, నీరు, గాలి, పరోక్షంగా అనేక సూక్ష్మజీవులు ( bacteria ) తోడ్పడతాయి. వీటన్నిటికి తోడు చైతన్య శక్తి మూలాధారంగా పనిచేస్తుంది. అందుకనే, ఆహారాన్ని భుజించేటప్పుడు, ఏయే జీవులు, శక్తులు ఆహారం తయారు కావటంలో దోహదపడ్డాయో, సహాయపడ్డాయో, అట్టివాటికి ముందుగా మనం కృతజ్నతలను మనసులో తెలుపుకోవాలి. ఆతరువాతనే భుజించాలి. క్రిందపడిన మెతుకులను తీసుకొని తినవద్దని చెబుతారు. కారణం వాటికి ధూళి ఆటవచ్చు. అయితే, అట్టి క్రిందపడిన మెతుకులను ఏరి, చీమలకు వేస్తే, చీమలకు ఆహారాన్ని పెట్టియనవారమ్ అవుతామ్. దీనివలన, మనలో భూత దయ కలుగుతుంది. చిన్న,చిన్న ప్రాణులనుకూడా ప్రేమించటం మనకు అలవడుతుంది.

ఉపసంహారం:- ప్రతి పరిశోధకుడు, శాస్త్రవేత్త తను ఎంచుయికున్న రంగంలో అన్వేషణలను చేస్తున్నప్పుడు, ( ఉకు:- భౌతిక, రసాయినిక, జీవ శాస్త్రాలు మొదలైనవి ) ఆయా శాస్త్ర పరిశోధనలు చాలా లోతుగా చేయబడినప్పుడు, పరిశోధనా విషయానికి అతీతమైన అనేక కొత్త విషయాలు తెలుస్తుంటాయి. ఇవి ఆధ్యాత్మిక విషయానికి, లేదా, విశ్వ చైతన్యశక్తి యొక్క విభూతులకు సంబంధించి అయివుంటాయి. అప్పటి మన ఋషులు చెప్పినవాటికి, ఇప్పటి ఆధునిక శాస్త్రజ్నులు చెబుతున్నవాటికి సమపోలికలు కనిపిస్తుంటాయి. డాక్టర్ ఎమోటో పరిశోధనలు నీరు, ఆహారంపై చేసినవి. శబ్ద తరంగాలు నీటిపై ఎటువంటి ప్రభావం చూపుటాయో అనేది భౌతిక, రసాయినిక శాస్త్రాలకు సంబంధించినవి. కానీ, మంచి/చెడు మాటలు, సరళమైన/మొరటైన సంగీతం, నృత్యం నీరు, ఆహారంపై ఎటువంటి ప్రభావం చూపుతాయి అని చెప్పేది భౌతిక/రసాయినిక శాస్త్రాలకు సంబంధించినది కాదు. ఇది ఆధ్యాత్మిక తత్త్వ శాస్త్రానికి సంబంధించినది. ఈ తత్త్వ రహస్యాలను మన ఋషులు వేదముల ద్వారా ఎన్నడో మన జాతికి అందించారు. ఏది ఏమయినప్పటికీ, ఎవరు చెప్పినప్పటికీ, ఆ విషయాలు అనుసరించదగ్గవే. స్వస్తి.

ఇంత మంచి విషయాన్ని శ్రీ పబ్బరాజు మాధవ రావు. గారు వ్రాసుకున్న " మీతో చెప్పాలనుకున్న" అనే బ్లాగునుండి సేకరించడం జరిగినది. వారికి మా ధన్యవాదములు.