ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Sri Potuluri Virabrahmendra Swami Kalagnanam Part-5


శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి - కాలజ్ఞానం - 5

(Sri Potuluri Virabrahmendra Swami Kalagnanam)



బ్రహ్మంగారు చేసే కొన్ని పనులు వినేందుకు చాలా విచిత్రంగా ఉండేవి. ఆయన ఒకవైపు కొండగుహలో కూర్చుని కాలజ్ఞానం రాస్తూ ఉండేవారు. మరోవైపు పశువుల కాపరిగా తన బాధ్యతను నిర్వర్తించేవారు.

తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చుట్టి వచ్చేందుకు బయల్దేరిన వీరబ్రహ్మేంద్రస్వామి బనగానపల్లెకు చేరారు. ఆరోజు పగలంతా ప్రయాణం చేయడంతో బాగా అలసిపోయారు. రాత్రికి ఆ ఊరిలోని ఒక ఇంటి వద్దకు చేరారు. నిద్రా సమయం ఆసన్నం కావడంతో అక్కడున్న అచ్చమ్మ అనే స్త్రీ ఇంటిముందు ఉన్న అరుగుపైన నిద్రకు ఉపక్రమించారు.

మరుసటిరోజు పొద్దున్నే అచ్చమ్మగారు, తన ఇంటి అరుగుమీద పడుకున్న వీరబ్రహ్మేంద్రస్వామిని చూశారు. ఈ సన్యాసి ఎవరో అని కుతూహలం కలిగి, ఆయనను వివరాలు అడిగారు. తాను బతుకుతెరువు కోసం వచ్చానని, ఏదో ఒక పని చేయదలచానని చెప్పగా, తన దగ్గర ఉన్న గోవులను తోలుకెళ్ళమని చెప్పింది అచ్చమ్మ. అలా గోవుల కాపరిగా మారిన వీరబ్రహ్మేంద్రస్వామి ఆవులను తీసుకుని దగ్గరలో ఉన్న రవ్వలకొండ దగ్గరకు వెళ్ళాడు.

ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణం ఆయనను ఎంతో ఆకర్షించింది. ఆ ప్రదేశాన్ని కాలజ్ఞానం రాసి, అందరికీ తెలియజెప్పేందుకు తగిన ప్రదేశంగా నిర్ణయించుకున్నారు. ఒక గుహను తనకు ఆవాసయోగ్యంగా చేసుకున్నారు.

ప్రతిరోజూ గోవులను తీసుకుని వచ్చి, వాటిని పొలంలో వదిలిపెట్టి మనసును కేంద్రీకరించి ధ్యానంలో మునిగిపోయేవారు. ఆ ధ్యానం వల్ల ఆయనకు రకరకాల అనుభవాలు కలిగేవి. వాటన్నిటికీ అక్షరరూపం కల్పించేవారు.

కాలజ్ఞానాన్ని మొదలుపెట్టేందుకు నిర్ణయించుకున్న వీరబ్రహ్మేంద్రస్వామి అక్కడ ఉన్న ఒక తాటిచెట్టు ఆకులను కోసుకుని, కొండ గుహలో రాయడం మొదలుపెట్టాడు.

గోవులకోసం రేఖ

అయితే తాను కాలజ్ఞాన గ్రంధం రాయడంలో నిమగ్నమయ్యే సమయంలో గోవులు అచ్చమ్మగారి పొలం దాటి వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళిపోతూ ఉండేవి. ఇలా జరగకుండా వుండేందుకు ఒక పుల్లతో ఆ గోవుల చుట్టూ పెద్ద వలయం గీశాడు. ''ఈ వలయం దాటి మీరు ఎక్కడికీ వెళ్ళవద్దు'' అని గోవులను ఆదేశించాడు. తర్వాత ప్రశాంతంగా తన కాలజ్ఞానాన్ని కొనసాగించారు.

పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. రకరకాల సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతిపెట్టారు.ఆ తర్వాత దానిపైన చింతచెట్టు మొలిచింది.

ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు? ఇలా ఎందుకు చేశారు? అనే దానికి మాత్రం ఇప్పటివరకు జవాబు దొరకలేదు. ఒకరోజు మామూలుగా తన విధి నెరవేర్చేందుకు పశువులను తోలుకుని కొండకు బయల్దేరారు వీరబ్రహ్మేంద్రస్వామి.

యధాప్రకారం గోవుల చుట్టూ ఒక వలయం గీసి, కాలజ్ఞానం రాసుకునేందుకు తాటియాకులు, చెట్ల ముళ్ళు కోసుకుని కొండ గుహలోకి వెళ్ళిపోయారు వీరబ్రహ్మేంద్రస్వామి. ఆయనను అనుసరిస్తూ వచ్చిన అచ్చమ్మ ఇదంతా చూసి ఒక అద్భుతాన్ని చూసిన విధంగా ఆశ్చర్యంలో మునిగిపోయింది.

తన దగ్గర గోవులకాపరిగా పనిచేస్తున్న వీరబ్రహ్మేంద్రస్వామి ఒక జ్ఞాని అని అప్పుడు తెలుసుకోగలిగింది అచ్చమ్మ.

కానీ, గుహలోకి వెళ్ళి ఆయనతో మాట్లాడటానికి భయపడింది. తపస్సు చేస్తున్న మాదిరిగా కాలజ్ఞానాన్ని రాస్తున్న బ్రహ్మంగారి ఏకాగ్రతను భగ్నం చేసేందుకు ఆవిడ భయపడింది. అప్పటికి ఆయనతో ఏమీ మాట్లాడకుండా ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది.

వీరబ్రహ్మేంద్రస్వామి గోవులను తోలుకుని తిరిగి రాగానే ఆయన పాదాలకు నమస్కరించి, తెలీక తాను చేసిన తప్పులన్నిటినీ మన్నించమని కోరింది.

''నాకు దూషణ అయినా, భూషణ అయినా ఒక్కటే. నీవయినా, తల్లి అయినా ఒక్కటే. ఈ ప్రపంచంలోని జీవులన్నీ నాకు సమానమే'' అని చెప్పిన బ్రహ్మంగారిని తనకు జ్ఞానోపదేశం కలిగించమని కోరింది అచ్చమ్మ.

ఆ పని ప్రస్తుతం చేసేందుకు వీలు లేదని, సమయం వచ్చినప్పుడు యాగంటి అనే పుణ్యక్షేత్రంలో జ్ఞానోపదేశం చేయగలనని, చెప్పారు వీరబ్రహ్మేంద్రస్వామి. ఆరోజు కోసం ఎదురుచూడసాగింది అచ్చమ్మ.

వీరబ్రహ్మేంద్రస్వామి మాత్రం యధాప్రకారం కాలజ్ఞానాన్ని రాసి, అచ్చంమగారి ఇంటిలో ఒకచోట పాతిపెడుతూ ఉండేవారు.

ఒక శుభదినాన అచ్చమ్మగారిని ఈశ్వర క్షేత్రమైన యాగంటి'కి తీసుకుని వెళ్లారు వీరబ్రహ్మేంద్రస్వామి. అక్కడ జ్ఞానోపదేశం మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా అచ్చమ్మ ఎన్నో ప్రశ్నలు వేశారు. వాటన్నిటికీ సామాన్యులకు అర్ధమయ్యే విధంగా సరళమైన భాషలో జవాబులిచ్చారు వీరబ్రహ్మేంద్రస్వామి.

వాటిలో కొన్ని

పరమాత్మ ఎక్కడ ఉన్నాడు?

పరమాత్మ ప్రపంచంలో అణువణువునా ఉన్నాడు. ఈ పశువులలో, నీలో, నాలో, కీటకాలలో.. అన్నిటిలోనూ ఆయన నివాసం ఉంటుంది.

దేవుని తెలుసుకోవడం ఎలా?

దేవుని తెలుసుకోడానికి చాలా మార్గాలు ఉన్నప్పటికీ భక్తి, ధ్యానం శ్రేష్టమైనవి. భక్తి మార్గం అంటే కేవలం భగవంతుని ధ్యానిస్తూ జీవితాన్ని గడపడమే. దీన్నే భక్తి యోగం అని కూడా అంటారు. ధ్యాన యోగం అంటే ప్రాణాయామం ద్వారా ఈ సృష్టిని ప్రారంభించిన బ్రహ్మ ను తెలుసుకోవడమే.

దేవుని ఏ రూపంలో మనం చూడగలం? స్త్రీయా, పురుషుడా?

పరబ్రహ్మ నిరాకారుడు, నిర్గుణుడు. మనం ఏ విధంగానూ నిర్వచించలేము.

ఈ విధంగా అచ్చమ్మగారి సందేహాలను తీర్చిన తర్వాత ఆమెకు కొన్ని మంత్రాలను ఉపదేశించారు వీరబ్రహ్మేంద్రస్వామి. వీటిని ఏకాగ్ర చిత్తంతో జపిస్తూ ఉండమని చెప్పారు.

తర్వాత కాలజ్ఞానం గురించి వివరించడం మొదలుపెట్టారు.