ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

THE IMPORTANCE OF WOMEN IN INDIA


మన సంప్రదాయంలో స్త్రీ విశిష్టత

స్త్రీని గౌరవించి, పూజించడమే మన సంప్రదాయం

ప్రపంచంలోని ప్రతి సంస్కృతిలోను మహిళల్ని అణచివేయడం గమనించవచ్చు. వారు సంఘ పరంగా అనేక వివక్షల్ని ఎదుర్కొంటారు. ఇక ఆధ్యాత్మికంగా స్త్రీలకు ఎన్నో విధి నిషేధాలు ఉన్నాయి. కాని, భారతదేశంలో, అందునా ఆర్య సంస్కృతిలో మాత్రం స్త్రీకి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. నిజమైన సంప్రదాయాన్ని పాటించే వారెవరూ స్త్రీని కించపరిచే విధంగా ప్రవర్తించలేరు. అదే భారతీయ సంస్కృతి విశిష్టత. ఆధ్యాత్మిక పరంగా చూసినా కూడా స్త్రీది విశిష్ట స్థానమే. మిగతా దేవుళ్ళు, దేవతలు ఎందరు ఉన్నా ఆదిపరాశక్తిదే అగ్రస్థానం. మొదటి పూజ కూడా ఆ జగన్మాతకే. కుటుంబంలో మరలా తల్లిదే అగ్రస్థానం. ముందుగా ఉన్నాడో లేడో తెలియని దేవుణ్ణి తలుచుకుని, మిగతా వారిని నిర్లక్ష్యం చేయమని ఆర్య జీవన విధానం నేర్పదు. కంటికి ఎదురుగా కనిపించే తల్లిదండ్రుల్నే ప్రత్యక్ష దైవాలుగా భావించమని చెబుతుంది వేదం. వారిలో తల్లికే మొదటి పూజ. 'మాతృ దేవోభవ' - ముందు తల్లికి నమస్కరించిన తరువాత తండ్రికి 'పితృ దేవోభవ'. యజ్ఞ యాగాదులలో, పూజలు, క్రతువులలో పాల్గొనడానికి వివాహితుడు కాని వారికి, భార్యా వియోగం అయిన వారికి అర్హత లేదు. భార్యతో కలిసి ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తేనే పూర్తి ఫలం దక్కుతుంది. అదీ స్త్రీకి ఉన్న ప్రాధాన్యత. 

ఇవన్నీ ఒక ఎత్తయితే, మనకు ఏ సంబంధం లేని పరాయి స్త్రీని కూడా మాతృ సమానురాలిగా, సోదర సమానురాలిగా చూడమని చెబుతుంది వేదం. పృధ్వీరాజ్‌ ఛౌహాన్‌, శివాజీ వంటి వీరులు కూడా తాము జయించిన రాజ్యంలోని పాలకుల భార్యలను సోదరి సమానంగా భావించి, సకల లాంఛనాలతో వారి రాజ్యాలకు సాగనంపారు. అదీ ఆర్య సంస్కృతి ఆచరణ అంటే..

యత్ర నార్యస్తు పూజ్యంతే
రమంతే తత్ర దేవతా||

''స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు ఆనందంతో నాట్యం చేస్తూ ఉంటారనేది'' ఆర్యోక్తి. మహిళకి భారతదేశంలో ఇచ్చిన ప్రాధాన్యత అలాంటిది. కలకంఠి కంట కన్నీరొలికిన ఇంట సిరి ఉండనొల్లదు అనే భావన కూడా మహిళకు ఆర్య సాంప్రదాయంలో ఉన్న విశిష్టతను తెలియజేస్తుంది. ప్రస్తుతం మనం జరుపుకుంటున్న దేవీ నవరాత్రులు కూడా మహిళా శక్తి గొప్పదనాన్ని, మహిమను చాటిచెబుతాయి. స్త్రీని శక్తి స్వరూపిణిగా, పరాశక్తిగా, సృష్టి స్థితి లయలకు కారకులైనవారికి కూడా తల్లిగా పురాణాలు కీర్తిస్తున్నాయి. విశ్వానికి అంతటికీ ఆధారభూతమైన, కారణమైన ఆ మహాశక్తి పురుష రూపంలో ఉండే అవకాశం లేదని రుషుల భావన. ఇంతటి మహావిశ్వాన్ని సృజించి, పెంచి, పోషించి, మరలా తనలోనే లయింపజేసుకొనే అన్ని శక్తుల మూల కారణం స్త్రీ స్వరూపమే. జగమంతటిలో ఉన్న ఇన్ని ప్రాణులకు అవసరమైనవన్నీ ఇచ్చి, చిన్న చీమ నుండి పెద్ద ఏనుగు వరకు ప్రతి పూటా అన్నిటికీ ఆశ్రయమిచ్చి, ప్రాణం నిలవడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసి, తన చల్లని ఒడిలో లాలించి, పాలించి, తల్లి ప్రేమను పంచే ఆ మహాశక్తి ముమ్మాటికీ అమ్మ మాత్రమే అయి ఉంటుంది. ఎందుకంటే అంతటి ప్రేమను పంచి, అనురాగాన్ని కురిపించగలగడం తల్లికి మాత్రమే సాధ్యం. తండ్రి కేవలం బాధ్యత వహిస్తాడు. కాని, తల్లి తన జీవితాన్ని అర్పిస్తుంది. అందుకే విజయదశమికి అమ్మవారిని భావన చేస్తాము.

స్త్రీని గౌరవించని, ఆమెకు ప్రాధాన్యమివ్వని ఏ నాగరికత అయినా, సమాజం అయినా మనుగడ సాగించలేదు. ఆమె సహకారం లేకుండా ఏ క్లిష్టమైన పనీ సాధ్యపడదు. ప్రతి ఇంటిలోను ఇంటిని చక్కబెట్టే ఇల్లాలిగా, పిల్లల్ని సంస్కారవంతులుగా, ఉన్నత సమాజ పౌరులుగా మార్చే గురుతరమైన బాధ్యత స్త్రీదే. ఏ ఇంటిలో స్త్రీ మానసిక, శారీరక వ్యధ అనుభవిస్తుందో ఆ కుటుంబం నుండి వచ్చే సంతానం నేరస్తులుగా మారే ప్రమాదం అంత ఎక్కువగా ఉందనేది సామాజిక నిపుణుల పరిశీలనలో తేలిన వాస్తవం. అది ముమ్మాటికీ నిజం కూడా. 

పత్రికల్లోను, తెర మీద కనబడే రంగుల వలయాల్లో బొమ్మల్ని చూసి, గోల చేస్తూ, అసభ్య వ్యాఖ్యలు చేస్తూ, నీచమైన ఆనందం పొందే నేటి తరానికి ఈ విలువల ప్రాధాన్యం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆడపిల్ల అంటే వ్యాపార వస్తువు కాదు, మగవారి కోర్కెలు తీర్చే బానిసా కాదు. బస్సుల్లో, రైళ్ళల్లో, రోడ్లమీద, కాలేజీల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ కంటికి కాస్త నదురుగా కనబడే ప్రతి ఆడపిల్లను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ ఉండేవారికి ఈ దేవీ నవరాత్రులలో స్త్రీశక్తి ప్రాధాన్యతను తెలపాలి. ఆడపిల్ల కనపడిందంటే చాలు, ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి, తామేదో గొప్ప వీరప్రేమికుల స్థాయిలో పోజలు కొట్టే వారికి, నిజమైన ప్రేమ రుచి చూడాలంటే అదే అమ్మాయిని మాతృ సమానంగా, సోదరి సమానంగా చూస్తే చాలు. అప్పుడే ఆమె నిజమైన ప్రేమను కురిపిస్తుంది. ఆడదంటే అబల కాదు, అవసరం వచ్చినపుడు ఆమే పరాశక్తిగా మారి దుష్ట సంహారం చేసి, లోక రక్షణ చేస్తుందనే సందేశాన్ని సకల లోకానికి తెలపడమే ఈ దేవీ నవరాత్రుల ముఖ్య ఉద్దేశం. ఈ సందేశం కేవలం భారతదేశానికే కాక, సకల ప్రపంచానికి కనువిప్పు కావాలని ఆశిద్దాం.