ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

LIST OF NAMES AND INFORMATION OF THE WARRIORS WHOT FOUGHT BATTLE IN THE SIDE OF KAURAVAS


కౌరవుల పక్షాన నిలచిన మహా వీరులు

01. ద్రోణుడు: భరద్వాజ ముని కొడుకు. భరద్వాజ ముని తన గంగా దేవికి ఆర్ఘ్యం ఇవ్వటానికి రోజూ లాగే వెళ్లినప్పుడు ఒక అందమైన స్త్రీ ఘ్రితాచి ని నీటిలో చూసి, ఆకర్షింపబడి నప్పుడు వీర్యాన్ని ఒక గిన్నె లో భద్రపరుస్తాడు. అందులోంచి పుట్టిన వాడే ద్రోణుడు. ఇతను తన తండ్రి వద్దే విద్యాభ్యాసం చేస్తాడు. ద్రుపదుడు కూడా భరద్వాజ ముని వద్దే విద్యాభ్యాసానికి రావడం తో ద్రోణునికి, ద్రుపదుని తో స్నేహం కుదురుతుంది. ద్రోణుడు శారద్వతుని కుమార్తె కృపి ని పెండ్లాడతాడు.వీరి కుమారుడే అశ్వత్థామ. ఎన్నో అస్త్ర శాస్త్రాల జ్ఞాని అయిన జమదగ్ని మహర్షి తనకున్నదంతా దానం చేసి అడవులకి వెళ్తున్నాడని విని ద్రోణుడు తన శిష్యులతో కూడి మహేంద్ర పర్వతాల దగ్గరకి వెళ్లి తన గురించి చెప్తాడు. అప్పటికే ఆస్తి పాస్తులన్నింటినీ దానం చేసిన మహర్షి తన అస్త్ర శస్త్రాలన్నిటినీ ద్రోణునికి ఇచ్చి వేస్తాడు. (మిగిలిన కథ : రెండవ శ్లోకం వివరణ లో..)

02. భీష్ముడు : మహాభారతం గురించి ఒక పేజీ రాసినా, భీష్ముడి గురించి ఒక వాక్యమైనా రాయకుండా ఉండలేము. అందరికీ తెలిసిన కథే అయినా నాలుగు ముక్కలు.. వశిష్టుడి శాపం మూలంగా, అష్ట వసువులూ భూమి మీద శంతనునికీ, గంగ కీ పుడతారు. వారిలో ఆఖరి వాడు (ద్యౌ అని పేరు గల వసువు)దేవ వ్రతుడు. వశిష్టునివద్ద విద్యాభ్యాసం చేశాడు.శంతనుడు దేవవ్రతుని పెంచి పెద్ద చేయలేదు.పుట్టాకా మళ్లీ విద్యాభ్యాసం అయిన తర్వాతే యాదృచ్ఛికం గా అతనిని చూస్తాడు. గంగ దేవవ్రతున్ని తండ్రికి అప్పచెప్పిన నాలుగు సంవత్సరాలకి శంతనుడు సత్యవతి తో ప్రేమ లో పడి అది సఫలం కాలేదని పుట్టెడు దుఃఖం లో ఉండటం గమనించి సత్యవతి తండ్రి తో మాట్లాడి అతని షరతు ని అంగీకరించి ఆజన్మాంతం బ్రహ్మచారి గా ఉంటాననీ, అలాగే రాజ్యాధికారాన్ని స్వీకరించననీ, శపథం చేసి ‘భీష్ముడు’ అని పిలవబడతాడు.అలాగే ఐచ్చికమరణం పొందే వరాన్ని పొందుతాడు. తండ్రి మరణానంతరం కురు రాజ్య సంరక్షణ భారంతో పాటూ సత్యవతి కుమారులైన చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుల సంరక్షణ భారం కూడా చూసుకుంటాడు. ముందు చిత్రాంగదుని రాజుని చేసి, తర్వాత అతను గంధర్వులతో జరిగిన యుద్ధం లో మరణించగా, అప్పటికి ఇంకా చిన్నవాడే అయిన విచిత్రవీర్యున్ని రాజుని చేసి, అతని తరఫున పాలించాడు. అతనికి వివాహం చేయడానికి కాశీ రాజు కుమార్తెలని (అంబ, అంబాలిక, అంబిక) స్వయంవరం నుంచి ఎత్తుకొచ్చి అడ్డు వచ్చిన రాజులని ఓడిస్తాడు. అంబ స్వయవరం లో శోభ దేశ రాజుని ఎంచుకోవాలని కోరుకున్నానని, అది తండ్రికీ ఇష్టమేననీ, ఈవిధం గా ఎత్తుకు రాకపోయి ఉంటే తాము భార్యా భర్తలయ్యేవారమని చెప్పగా, ఆమెని పంపించివేస్తాడు. ఈ విధం గా తిరిగి పంపించిన స్త్రీ ని పెండ్లాడనని శోభ రాజు చెప్పడం తో, అంబ తిరిగి భీష్ముని దగ్గరకి వస్తుంది విచిత్రవీర్యుడు తిరస్కరించగా ఆమె కనీసం భీష్ముడిని తనను పెళ్లి చేసుకొమ్మని అడుగుతుంది. భీష్ముడు తాను వచన బద్ధుడనని, క్షమించమని అడగగా, వెళ్లి భీష్ముని చంపాలన్న దీక్ష లో ప్రాణాలు విడుస్తుంది. ఈ అంబే భీష్మ వధ ధ్యేయం తో ద్రుపద రాజుకి శిఖండి గా పుడుతుంది. ఏడు సంవత్సరాల తర్వాత విచిత్ర వీర్యుడు క్షయ తో మరణించగా, సత్యవతి తన ప్రతిజ్ఞని వెనక్కి తీసుకుని కురు వంశం ముందుకి వెళ్లేందుకు వీలుగా పెళ్లి చేసుకొమ్మని ప్రార్థించగా, అంగీకరించడు. దానితో వ్యాసుని సహాయం తో అంబాలిక పాండు రాజుని కనగా, అంబిక ధృతరాష్ట్రుని కంటుంది. అలాగే, వ్యాసుని రూపాన్ని, అతని నుంచి వచ్చే వాసనని (రెఫ్: సెక్షన్ 106 :సంభవ పర్వ )తలచుకుని భయపడి దాసీ స్త్రీ ని పంపగా విదురుడు పుడతాడు. భీష్ముడు వీళ్ల పెంపకం భారం కూడా వహించి, హస్తినాపుర సింహాసనానికి సంరక్షకుడిగా నిలబడతాడు. గుడ్డివాడైన ధృతరాష్ట్రునికి గాంధారదేశ రాకుమారిని అడిగి తెచ్చి పెళ్లి చేస్తాడు. పాండు రాజుని కుంతీదేవి స్వయంవరానికి పంపి కుంతీ దేవితో పెళ్లి చేయించి, శల్యునికి కన్యాశుల్కమిచ్చి మాద్రీ దేవిని పాండు రాజుకి రెండవ భార్య గా తెస్తాడు. పాండవులకి, కౌరవులకి ద్రోణుని గురువు గా నియమించి విద్యా బుద్ధులు నేర్పించడమే కాకుండా,.. లక్క గృహ దహనం తర్వాత ద్రౌపది తో పెళ్లి జరిగి పాండవులు బ్రతికే ఉన్నారని బయట పడ్డాకా, పాండవులకి రాజ్యం లో కొంత భాగం ఇవ్వడం లో ప్రముఖ పాత్ర వహిస్తాడు. అయితే, తర్వాత తర్వాత, ఎప్పుడైతే దుర్యోధనుని ప్రాబల్యం పెరిగిందో, కర్ణుడు ,శకుని వంటి వారి తో భీష్ముని విబేధాలు, పలు మార్లు, అంటే జూదం, ద్రౌపది వస్త్రాపహరణం, గోగ్రహణం.. అలాగే సంధి ప్రయత్నాల్లో.. యుద్ధానికి ముందు కనపడుతూనే ఉంటాయి.

03. కర్ణుడు; కర్ణుడు లేనిదే భారతం లేదంటారు. (నిజానికి భారతం లో ప్రతి పాత్ర కీ ఔచిత్యం ఉంది). కర్ణుడు కుంతీ పుత్రుడు. కుంతీదేవి దుర్వాస మహామునికి సేవ చేసి సంపాదించుకున్న వరం మేరకు సూర్య భగవానుని అనుగ్రహం తో సహజ కవచ కుండలాలతో కర్ణుని కంటుంది. అయితే పెళ్లి కాకుండానే కన్న బిడ్డ అవడం తో లోక భయానికి త్యజించవలసి వస్తుంది. కర్ణుడిని ఒక సూతుడు,అతని భార్య రాధ పెంచి పెద్ద చేస్తారు. రాధేయుడిగా పిలవపడతాడు. ఇతను అద్భుతమైన విలుకాడు. దాన ధర్మాలలో పేరు మోసిన వాడు. ఎన్నో శాపాల బారీ పడ్డ వాడు, తాను సూట పుత్రుడవడం తో ఎన్నో సార్లు అవమానాల బారీన పడ్డ వాడు.. హస్తినాపురి లో రాకుమారుల విద్యాభ్యాసం తర్వాత వారి విద్యా ప్రదర్శన లో అర్జునుణ్ణి మించిన విలుకాడు లేడని గర్విస్తున్నప్పుడు తానూ తన విద్యని ప్రదర్శించి అర్జునుని కన్నా గొప్ప వీరుణ్ణి అని నిరూపించడానికి ముందుకి వచ్చినప్పుడు సూత పుత్రునికి అర్హత లేదన్న మాట వినిపించినప్పుడు, పాండవుల మీద ఉన్న కచ్చ తో దుర్యోధనుడు వెంటనే కర్ణుని అంగ రాజ్యానికి రాజు ని చేస్తాడు. ఈ స్నేహ ప్రకటనకీ, నిండు సభ లో తనకిచ్చిన గౌరవానికి చలించిన కర్ణుడు దుర్యోధనుని స్నేహానికి జీవితం లో ఆఖరి క్షణం దాకా బద్ధుడై వ్యవహరిస్తాడు. దుర్యోధనుడు చేసిన మంచీ, చెడుల్లో భాగమై దుష్ట చతుష్టయం లో ఒకరు గా చెప్పుకోబడతాడు. తాను కుంతీ పుత్రుడనని తెలిసినప్పుడు కూడా, స్వయం గా తల్లి పాండవులందరికీ అన్నయ్య గా అంగీకరిస్తారని ఆహ్వానించినా, స్నేహానికే ఎక్కువ ప్రాధాన్యత నిచ్చి, దుర్యోధనుని పక్షాన నిలుస్తాడు. భీష్ముడు యుద్ధ భూమి లో నిలిచినంతవరకూ తాను యుద్ధం చేయనని చెప్తాడు.

04. కృపాచార్యుడు: కృపాచార్యుడు హస్తినాపురి రాకుమారులకే కాక అనేకానేక యాదవులకీ.. కూడా యుద్ధాలలో ఉపయోగించే అస్త్ర శస్త్రాల జ్ఞానం నేర్పించాడు. గౌతమ మహర్షి కుమారుడు శారద్వతుడు అస్త్ర, శస్త్ర శాస్త్రాల్లో నిష్ణాతుడు. ఇంద్రుడు ఇతని నుంచి ఆపత్తు రాగలదని యోచించి శారద్వతుని ఆకర్శించమని జనపది అన్న అప్సరస ని పంపుతాడు. అయితే శారద్వతుడు కొద్ది సమయానికి చలించినా తేరుకుని తన జింక చర్మాన్నే, ధనుర్బాణాలనీ వదిలి పారిపోతాడు. ఈలోగా అతని వీర్యం రెండు భాగాలు గా భూమి మీద పడి కవలలు పుడతారు. శంతన మహారాజు అడవుల్లో వేటకి వచ్చినప్పుడు ఒక సైనికుడు ఆడ-మగ కవలల తో బాటు ధనుర్బాణాలనీ చూసి బహుశా ఎవరో ముని పిల్లలని భావించి మహా రాజు దగ్గరకి తీసుకువస్తాడు. శంతనుడు వారిని దయతో చేరదీసి తన బిడ్డలు గా వారిని తనతో బాటు తన రాజ్యానికి తీసుకు వెడతాడు. అందువల్లే వారికి కృప-కృపి అన్న పేర్లు వస్తాయి. అయితే మళ్లీ ముని తిరిగి వచ్చి, తన తపశ్శక్తి ద్వారా తన పిల్లలు శంతన మహారాజు వద్ద ఉన్నట్టు తెలుసుకుని మహారాజుకి అంతా వివరించి కృపుడిని యుద్ద శస్త్ర విద్యా పారంగతుడిని చేస్తాడు. కృపాచార్యుడు శంతనుని తండ్రి గా భావించడం వల్ల, అలాగే కురు రాజ కుమారులకి రెండు తరాలు గా గురువు అవడం వల్ల హస్తినాపుర సింహాసనానికి బద్ధుడై కౌరవుల పక్షాన యుద్ధం లో నిలుస్తాడు. ఆయన సోదరి కృపి ద్రోణుని భార్య.

05. అశ్వత్థామ: ద్రోణుని కొడుకు. కృపి ఇతని తల్లి. పుట్టినప్పుడు ఒక గుఱ్ఱపు (అశ్వం) అరుపు లా అరుస్తూ పుట్టాడని ఇతని పేరు అశ్వత్థాముడని పెట్టాలని అశరీర వాణి చెప్పడం తో అదే పేరు స్థిరమవుతుంది. తండ్రి, మేనమామలు అన్ని రకాల అస్త్ర,శస్త్ర విద్యల్లో నిష్ణాతులు, తండ్రి తనకి తెలిసిన విద్యలన్నీ అశ్వత్థామ కి బోధిస్తాడు. ద్రోణుడు కొడుకుని చాలా ప్రేమిస్తాడు. అయితే ప్రపంచం లో అత్యంత గొప్ప విలుకాడు గా అర్జునిడిని చేస్తానన్న మాట కోసం, తన కొడుకుకి బ్రహ్మాస్త్రం మాత్రం ప్రయోగించడం మాత్రమే నేర్పిస్తాడు. విరమించడం నేర్పించడు. అర్జునునికి మాత్రం బ్రహ్మాస్త్రం గురించి సంపూర్ణ జ్ఞానం ఇస్తాడు. బ్రహ్మాస్త్రాన్ని ఒక్కసారి సంధించి విరమించక పోతే, అది ప్రయోగించిన చోట పన్నెండేళ్ల క్షామం వస్తుంది. బ్రహ్మాస్త్రాన్ని విరమించడం నేర్పించక పోవడం వెనక చేతిలో అస్త్రం ఉంది కదా అని మళ్లీ ఉపయోగించకుండా, మంచి కార్యానికి మాత్రమే ఒకేసారి ప్రయోగించాలన్నది ద్రోణుని ఉద్ద్యేశం కావచ్చు. ఆ విచక్షణ అర్జునికి మాత్రమే ఉందన్న అభిప్రాయం కూడా కావచ్చు.

06. వికర్ణుడు : వికర్ణుడు కౌరవులలో ఆఖరి వాడు. (దృతరాష్ట్ర/గాంధారుల కొడుకు). ద్రౌపది కి నిండు కురు సభ లో దుర్యోధన, కర్ణ, శకుని ల ఆదేశం/ప్రోత్సాహం తో దుశ్శాసనుడి చేతిలో అవమానం జరుగుతున్నప్పుడు, భీష్మ,ద్రోణ, విదురాది పెద్దవారు ఏమీ అనలేక తలలు వంచుకుని కూర్చున్నపుడు వికర్ణుడు మాత్రమే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తాడు.

07. సోమ దత్త, భూరి శ్రావులు : సోమ దత్తుడు కురు వంశం వాడే. శంతనునికి తమ్ముడు. అతని కొడుకు భూరిశ్రావుడు. వీరిద్దరూ మహా వీరులు. యుద్ధం లో కౌరవుల పక్షాన నిలుస్తారు.

భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిఞ్జయః |
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి స్తథైవ చ || 
అన్యే చ బహవశ్శూరాః మదర్థే త్యక్తజీవితాః |
నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ||

తాత్పర్యం: (గీతా ప్రెస్,గోరఖ్ పూర్ వారి పుస్తకం నుంచి)

మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తి వున్నారు. ఇంకా ఎంతోమంది శూరాగ్రేసరులూ, యుద్ధవిశారదులూ నా కోసం జీవితాల మీద ఆశ వదలి సిద్ధంగా వున్నారు.