ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

LORD SRI KRISHNA - SRIMAHABHAGAVATHAM - STORIES OF SAKATASURA AND TRUNAVARTHA


శ్రీ మహాభాగవతము

శకటాసుర వధ మరియు తృణావర్తుని కథ


పిల్లవాడు తప్పటడుగులువేయడం ఆరంభించేడని మశోద సంతోషంగా అమ్మలక్కలందరినీ పిలిచి అదొక పండుగలా ముచ్చటలు పడింది. కొంతసేపు పిల్లాడినాడించి వాడికి నిద్ర వస్తోందని వాకిలిలో మంచం మీద పరుండ పెట్టి, లోన అమ్మలక్కలతో కబుర్లలో పడింది.
కొంతసేపయాక పిల్లాడు లేచి ఏడ్వనారంభించాడు. కాని వాళ్ల కబుర్ల సందడిలో మశోద వినిపించుకోలేదు. ఎంతకీ అమ్మ రాకపోతే తనకి తనే చిన్నికృష్ణుడు మంచం మీద నుంచి దిగి తప్పటడుగులు వేయసాగాడు.
అప్పుడు అమాంతంగా ఒక బండి ఆకాశం నుండి పిల్లాడిమీదకి వచ్చింది. చిన్నికృష్ణుడు తన చిన్నారి పాదంతో దానినొక్క తన్ను తన్నాడు. ఆ దెబ్బకి దాని చక్రాలు ఊడి అది బోర్లా పడింది. దానిలో ఉన్న కంచు, యిత్తడి పాత్రలు పిప్పిపిప్పి అయిపోయాయి.
లోనుండి కొంతమంది ఆవింత చూసి నమ్మలేకపోయారు. పిల్లాడికి ఏమీ అవలేదుకదా అని యశోద వారందరితో బయటకు వచ్చి , చెక్కు చెదరని బిడ్డని చూసి, ఎత్తుకుని ముద్దులవర్షం కురిపింది. ఆ బండి ఎక్కడనుంచెలా పడిందో అని గుసగుసలు పోయారు.
కొంతమంది పిల్లలు, " మేం చూసాం, ఆ బండిని చిన్నికృష్ణుడు కాలుతో తన్నేడు కనుకనే అది అలా ముక్కముక్కలయింది" అన్నారు. నందుడు వారి మాటలను నమ్మలేదు.
అందరూ రాగానే ఏమీ ఎరుగనట్లు చూస్తూ, చిన్నికృష్ణుడు ఏడ్పు మొదలుపెట్టాడు. "పిల్లాడికి ఏదో గ్రహం పట్టింది" అని భయపడి మంత్రాలు వేయించి యశోద బాలుని లోనికి తీసుకుపోయి, పాలు పెట్టి నిద్ర పుచ్చింది. బండిరూపంలో కృష్ణుని చంప వచ్చిన శకటాసురుడు ముక్కముక్కలయి చడీ చప్పుడూ లేకుండా ఆకాశంలోకి ఎగిరేక కృష్ణుని దెబ్బలకి చనిపోయాడు.

తృణావర్తుని కథ

ఒకనాడు యశోద చిన్నికృష్ణుని తన తొడపై కూర్చుండ పెట్టుకుని ఉండగా ఉన్నట్లుండి బిడ్డ బరువుగా అనిపించాడామెకు. ఆశ్చర్య పడుతూ బిడ్డని అతికష్టం మీద కిందికి దింపి, "ఇదేం మాయ భగవంతుడా" అని దేవుడిని మనసులో ధ్యానం చేసుకుంది. ఆ వెంటనే ఇంటిపనులు మిగిలిపోయాయని లోపలికి వెళ్లి ఉండిపోయింది. కంసుని సేవకులలో తృణావర్తుడనే రాక్షసుడొకడు ఉండేవాడు. కంసుడు పంపగా ఆ రాక్షసుడు సుడిగాలి రూపంలో గోకులమంతా ఆవరించి ఉరుములలా గట్టి చప్పుడులు చేసుకుంటూ వచ్చి, బయట ఆడుకుంటూన్న చిన్నికృష్ణుని యెత్తుకుని ఆకాశం వైపు ఎగిరిపోయాడు.
వాడి మాయ వలన వ్రేపల్లె అంతా ఒక్కక్షణం అంధకారమయింది. ఆ తరువాత గాభరాగా యశోద పిల్లాడిని ఉంచిన జాగాకి పరుగెత్తి , బిడ్డ ఎక్కడా కానరాక ఏడ్వనారంభించింది.
గాలి దుమారం ఆగింది.
యశోద అరుపులు విని ఇరుగుపొరుగు వారంతా కలవర పడుతూ వచ్చి, వారు కూడా చిన్నికృష్ణుడు కనపడటం లేదని గోల ఆరంభించారు.
బిడ్డను పట్టుకుని తృణావర్తుడు మీదకు ఎగిరాడు. కాని బిడ్డ క్షణక్షణానికీ బరువెక్కిపోసాగింది. చెమటలు కక్కుకుంటూ అతి కష్టం మీద ఆకాశంలోకి వెళ్ల గలిగాడు. "వీడు పాపా,పాషాణమా" అని ఆశ్చర్యపడుతూ, మెడపట్టుకున్న బిడ్డ పట్టువదిలించుకోబోయాడు. తన శక్తి కంటే ఆ పట్టు హెచ్చయింది కనుక ఎంత గింజుకున్నా ఆ పట్టుని విడిపించుకోలేకపోయాడు. క్రమేణా తన గొంతుక పిసుకుతూన్న బిడ్డదే పై చేయి అయి, రక్తాలు కక్కుకుంటూ, నాలుక పైకి వచ్చి వేలాడుతూన్న భయంకర రాక్షస రూపంలో ఆకాశం నుంచి వ్రేపల్లెలో నేల కూలబడ్డాడు. జనం గుంపులు గుంపులుగా ఆ రాక్షసుడి గుండెకి ఆనుకుని ఉన్న చిన్ని కృష్ణుని చూసి ఆశ్చర్యపడుతూండగా, భామలు వచ్చి రాక్షసుడి శవం నుంచి బిడ్డను తీసుకుని, ఏమీ అవలేదని సంతోషిస్తూ ముద్దులతో లోనికి తీసుకుపోయారు.
గోపకులు, "ఆశ్చర్యం! బిడ్డ చెక్కుచెదరలేదు సరికదా, ఒక్కపిసరైనా భయం లేకుండా యెలా ఉన్నాడో! అంతా ఆ పరమేశ్వరుని దయ. దుష్టుడైన రాక్షసుడిని చంపి మంచివాడైన చిన్నికృష్ణుడిని కాపాడేడు" అని దేవుడికి దండాలు పెట్టారు.