ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TELUGU MAHABHARATHA STORIES - STORY OF LORD SRIKRISHNA AND SATYABHAMA - SATYABHAMA PURVA JANMA VISESHALU


సత్యభామ పూర్వజన్మ విశేషాలు

సూతుడు ప్రవచించిన స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యాన్ని విని సంతుష్ట మానసులైన శౌనకాది కులపతులు ''సూతమునీ! లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణం స్కందమునందే కాక పద్మపురాణాంతర వర్తితమై ఉంది. దాన్ని కూడా విశదపరచమని ప్రార్ధించగా మందస్మిత వదనుడైన సూతుడు ''మునులారా! వైకుంఠుని లీలా వినోదాలు, మహిమలు వినేవారికి, వినిపించేవారికి విశేష పుణ్యాన్ని ఇస్తాయేగానీ విసుగు కలిగించవు. భక్తిప్రపత్తులతో మీరు కోరాలేగానీ గురు ప్రసాదిత శక్త్యానుసారం వక్కాణిస్తాను, వినండి..

స్కాంద పురాణంలో జనక మహారాజుకు వశిష్టులవారు ఎలా ఈ మహత్యాన్ని బోధించారో, అలాగే పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణపరమాత్మ ముఖతః ఈ కార్తీకమాస విశేషాలన్నీ వివరించబడ్డాయి.
పారిజాతాపహరణం
ఒకానొకప్పుడు నారదమహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి, కృష్ణునికిచ్చి ''శ్రీహరీ! నీ పదహారువేల ఎనిమిదిమంది భార్యల్లో, నీకు అత్యంత చాలా ఇష్టమైన ఆమెకి ఈ పువ్వు ఇవ్వు'' అన్నాడు. ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది. నందనందనుడు నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుకగా ఇచ్చాడు.
ఈ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది. 'ప్రియమైన భార్యకు ఇవ్వమంటే తనకు ఇవ్వాలే గానీ, ఆ రుక్మిణికి ఇవ్వడం ఏమిటి అని కోపించింది.
కృష్ణుడు ఆమెకు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరట్లో పాదుకొలిపేదాకా ఊరుకోనని బెదిరించింది. సత్యభామ అలుక తీర్చడమే తక్షణ కర్తవ్యంగా భావించిన శ్రీకృష్ణుడు సత్యభామా సమేతంగా గరుత్మంతుని అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు. కృష్ణుడు పారిజాత వృక్షాన్ని కోరగా, స్వర్గసంపద అయిన ఈ వృక్షాన్ని భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు ఒప్పుకోలేదు. దాంతో ఇంద్ర, ఉపేంద్రుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఎట్టకేలకు దేవేంద్రుడు తగ్గి, పారిజాత వృక్షాన్ని యాదవేంద్రునికి సమర్పించాడు. దానవాన్తకుడు దానిని తెచ్చి ముద్దుల భార్యామణి అయిన సాత్రాజితీ నివాసంలో ప్రతిష్టించాడు. అందుకు ఎంతో సంతోషించిన సత్యభామ పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ ''ప్రాణప్రియా! నేను ఎంతయినా ధన్యురాలీని. నీ పదహారు వేళ ఎనిమిదిమంది సఖుల్లో నేనే నీకు ఎక్కువ ప్రియతమను కావడంవల్ల నేను ధన్యురాలిని అయ్యాను.అసలీ జన్మలో నీ అంతటివాడికి భార్యను కావడానికి నీతోబాటు గరుడారూఢవై బొందెతో స్వర్గసందర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవరూ ఎప్పుడూ కళ్ళారా చూసి ఎరుగని కల్పవృక్షం (పారిజాతం) నా పెరటిమొక్కగా ఉండటానికి ఏమిటి కారణం? నేను నిన్ను తులాభార రూపంగా నారదునికి ధారపోసినా అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదంతో తాడించినా నువ్వు మాత్రం నామీద నువ్వుగింజ అంత కోపం కూడా చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే అందుకు నేను గతజన్మలో చేసిన పుణ్యమే కారణం. నిన్ను ఇకముందు జన్మల్లో కూడా ఎడబాయకుండా ఉండాలంటే ఇప్పుడు నేనింకా ఏం చేయాలి?'' అంది.
అందుకు ముకుందుడు మందహాసం చేసి ''ఓ భామా! నువ్వు నన్ను కోరరానిది కోరినా, ఇవ్వలేనిదాన్ని ఆశించినా కూడాల్ ఆ వాంఛలను నెరవేర్చి నిన్ను సంతృప్తురాలీని చేయడమే నా విధి. అందుకు కారణం నీ పూర్వజన్మమే'' అంటూ ఇలా చెప్పసాగాడు.
సత్యభామ పూర్వజన్మం
కృతయుగాంతంలో ''మాయా'' అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు. అతనికి లేకలేక పుట్టిన ఆడపిల్ల గుణవతి. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని, తన శిష్య పరంపరలోని వాడే అయిన ''చంద్రుడు'' అనేవానితో పెళ్ళి జరిపించాడు దేవశర్మ.
ఒకరోజు మామ, జామాతలిద్దరూ కలిసి సమిధలను, దర్భలను తెచ్చుకునేందుకు అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు. బ్రాహ్మణులు, ధర్మాత్ములు అయిన వారిని మెచ్చిన విష్ణుమూర్తి శైవులు గానీ, గాణాపత్యులుగానీ, సౌరవ్రతులు గానీ, శాక్తేయులు గానీ - వీరందరూ కూడా వానచినుకులు వాగులై, వంకలై తుదకు సముద్రాన్ని చేరినట్లుగా నన్ను చేరుతున్నారు. పుత్రభాత్రాది నామాలతో దేవదత్తుని లాగా నేనే వివిధ నామ రూప క్రియాదులతో అయిదుగా విభజించబడి ఉన్నాను. అందువల్ల మరణించిన మామా అల్లుళ్ళను మన వైకుంఠానికే తీసుకురమ్మని తన పార్షదులకు ఆజ్ఞాపించాడు. పార్షదులు ప్రభువాజ్ఞను పాటించారు. సూర్య తేజస్సమకాంతులతో ఆ ఇరువురి జీవాలూ వైకుంఠం చేరి, విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగాయి.
గుణవతి కథ
పితృభర్తృ మరణవార్తను విన్న గుణవతి ఎంతగానో కుంగిపోయింది. కానీ, పోయిన వారితో తను కూడా పోలేదు గనుకా, మరణం ఆసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు గనుక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయాన్ని అంతటినీ విక్రయించి తండ్రికి, భర్తకు ఉత్తమగతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించింది. శేషజీవితాన్ని శేషశాయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలిపని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని, సత్యాన్ని, శాంతాన్ని, జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది. పరమ సదాచారులైన వారింట పుట్టి పెరిగిన కారణంగా బాల్యం నుండి అలవడిన కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది.
''సత్యా! పుణ్యగణ్యాలు, భుక్తిముక్తిదాయకాలు, పుట్రపౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలు అయిన ఆ రెండు వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవి అనే సంగతి నీకు తులుసుకదా! కార్తీకమాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా రోజూ ప్రాతఃస్నానం ఆచరించే వారి సమస్త పాపాలనూ నశింపచేస్తాను. ఈ కార్తీకంలో స్నానాలు, దీపారాధన, జాగరణ, తులసిపూజ చేసేవాళ్ళు వైకుంఠ వాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులై భాసిస్తారు. విష్ణు ఆలయంలో శంఖం, పద్మం మొదలైన ముగ్గులు పెట్టి పూజించేవారు జీవన్ముక్తులౌతారు.
కార్తీకమాసం నెలరోజులూ లేదా కనీసం మూడు రోజులైనా పూజలు ఆచరించేవారు సర్వ దేవతలను ఆరాధించినవారౌతారు. ఇక పుట్టింది మొదలు జీవితాంతం పూజించేవారి పుణ్య వైభవాన్ని చెప్పడానికి సాధ్యం కాదు. అలాగే, ఆనాటి గుణవతి, విష్ణు ప్రియంకరులై ఏకాదశీ కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడు నిష్ఠతో ఆచరిస్తూ కాలం వెళ్ళదీసి, కొన్నాళ్ళ తర్వాత వయోభారం వల్ల శుష్కించి, జ్వరపడింది. అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదు అనే పట్టుదలతో నదికి వెళ్ళి, ఆ చలిలో కూడా నడుంలోతు నీళ్ళలో ఉండి స్నానంచేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అంతలోనే ఆకాశం నుండి శంఖ చక్ర గదా పద్మాదులు చేతబూని, విష్ణుదూతలు పుష్పకవిమానంలో వచ్చి గుణవతిని అందులో చేర్చి దివ్య స్త్రీలచేత సేవలు చేయిస్తూ తమతో బాటుగా వైకుంఠానికి చేర్చారు. కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది.
తర్వాత శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్థన మేరకు దేవకీ గర్భాన ఇలా కృష్ణునిగా అవతరించాను. నాతొబాటే అనేకమంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు. పూర్వజన్మల్లో ''చంద్రుడు'' ఈ జన్మలో అక్రూరుడు అయ్యాడు. అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు. బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద, నామీద మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా.. అంతే సత్రాజిత్తు కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు. ఈ జన్మ వైభోగానికి కారణం పూర్వజన్మలో నువ్వు చేసిన కార్తీక వ్రత మహిమే తప్ప వేరు కాదు. ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలసింది. ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా, ఈనాడు నీ ఇంటావంటా కూడా లక్ష్మీకళ స్థిరపడింది. అలనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను ''నారాయణేతి సమర్పయామి'' అంటూ జగత్పతినైన నాకే ధారపోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవు అయ్యావు. పూర్వజన్మలో జీవితాంతం వరకూ కార్తీక వ్రతాన్ని విడువని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంతవరకూ నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు. సాత్రాజితీ! నువ్వే కాదు, నీలాగా ఎవరయితే కార్తీక వ్రతానుష్టాన నిష్టులూ నా భక్తగరిష్టులూ అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టులై సర్వకాల సర్వావస్థల్లో తత్కారణంగా, నా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటారు.
రాగవతీ! ఒక్క రహస్యం చెప్తాను, విను. తపోదాన యజ్ఞాదికాలను ఎన్నిటిని నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణాపరులకు లభించే పుణ్యంలో పదహారోవంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో.
పైన చెప్పినట్లుగా శ్రీకృష్ణప్రోక్తమైన తన పూర్వజన్మ గాధను, కార్తీక వ్రత పుణ్యఫలాలను విని పులకితురాలిన ఆ పూబోణి తన ప్రియమైన విశ్వంభరుడికి వినయవిధేయతలతో ప్రణమిల్లింది.