ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

UNIVERSAL FORM OF GOD - AN ARTICLE ABOUT GODS AVATHARS


భగవంతుని అవతారాలు అనేకం

పరమాత్మ ఆయా జీవులని సుఖింపజేయడం కోసం ఆయన సమస్త ప్రాణుల్లో చేరి ఉంటాడు. శరీరాన్ని ఇచ్చి లోపల తానుంటే అందరూ ఆయన చేసే ఉపకారం గుర్తించలేరు కాబట్టి అలాంటి వారి కోసం అంతటా వ్యాపించిన తన రూపంలోంచి శుద్ధ సత్త్వమైన రూపాన్ని ధరించి తను అవతరిస్తూ ఉంటాడు.

భావయత్యేష సత్త్వేన లోకాన్వై లోక భావనః |
లీలావతారానురతః దేవ తిర్యన్ నరాదిషు ||

ఈ లోకాలన్నింటికీ ఆయన సర్వేశ్వరుడు, నియంత అయినప్పటికీ కూడా వీళ్ళను ఉజ్జీవింపజేయాలని తను అనుకొని తన సంకల్పంతో కేవలం ఏలాంటి శ్రమ లేకుండా ఒక లీల చేస్తున్నట్లుగా ఒకసారి మానవ ఆకృతి ధరించి, ఒక సారి దేవ ఆకృతి, ఒక సారి తిర్యక్ ఆకృతి, ఒక్కో సారి స్థావరాల ఆకృతి కూడా ధరిస్తూ కేవలం సత్త్వ గుణాన్ని కలిగి ఈ లోకంలోకి వస్తూ ఉంటాడు. వాటిని అవతారాలు అంటారు. ఎందుకోసం ఇన్ని అవతారాలు ధరిస్తాడు ? కేవలం జీవుల్ల బాగుకోసం చేస్తాడు.

ఎన్ని సార్లు అవతరిస్తాడు అంటే ఆయనకీ తెలియదు. లెక్క లేనన్ని సార్లు అవతరించాడు. అర్జునుడు అడిగాడు ఎన్ని జన్మలు ఎత్తావని, ఏమో తనకే లెక్క లేదన్నాడు. తను సర్వజ్ఞుడైనప్పుడు తెలిసి ఉండాలి కదా అంటే లోకంలో తెలుసుకోదగనివి తెలుసుకోతగినవి అని ఉంటాయి. తెలుసుకోతగినవి తెలుసుకోవడం తెలుసుకోదగని వాటిని తెలుసుకోక పోవడమే తెలివైన పని. అట్లానే తన అవతారాలు ఇన్ని అని లెక్క పెట్టక పోవడమే తెలివైన పని. అన్నింటినీ తెలుసుకోలేం కానీ కొన్నింటినైనా తెలుసుకుంటే మనకు ఏమి ఉపకారం చేసాడో తెలుసుకుంటే మంచిది. భగవంతునిపై ప్రేమ ఏర్పడటానికి అది అవసరం.

భగవంతునిపై ప్రేమ ఏర్పడి, ఆ భగవంతుణ్ణి మన హృదయంలో చేర్చి ఆ భగవంతుని అనుగ్రహం వల్ల రజస్ తమస్సులు ప్రక్కకు జరిగితే, దాని వల్ల కామక్రోదాలు తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడితే చేసే ప్రతి పని భగవంతుని సేవగా చేస్తుంటే కలిగేది నిజమైన ప్రేమ. జ్ఞానం ఉన్నందుకు కలగాల్సింది అది. ఆయన గురించి తెలుసుకోవడం అంటే ఆయన అవతారాలని, ఆయన చేసిన పనులని తెలుసుకోవడమే. ఆయన ఎప్పుడు పుట్టాడు ఏమేమి చేసాడు ఎట్లా పెరిగాడు ఇవన్నీ తెలుసుకోవడం. అవన్నీ తెలుసుకుంటే సహజంగా ఆయనపై ప్రేమ ఏర్పడుతుంది. అట్లా శౌనకాది ఋషులకి సుమారుగా ఒక ఇరవైరెండు అవతారాలని సూతులవారు చెబుతున్నారు నైమిశారణ్యంలో.