ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARTICLE ABOUT LORD HANUMAN IN TELUGU


ఆంజనేయుడు :

అంజన కుమారుడు. అంజన వానర స్త్రీ. ఈమె కుంజరుడనే వానరుడి కుమార్తె. కేసరి అనే వానర యోధుడి భార్య. ప్రభాస తీర్థంలో మునులను బాధిస్తున్న శంఖశబలాలనే ఏనుగులను సంహరిస్తాడు. భరద్వాజుడు మెచ్చుకుని ఇతడికి కేసరి అని పేరు పెట్టి వరం కోరుకొమ్మంటాడు. కామరూపి, బలాఢ్యుడు ఐన పుత్రుడు కావాలని కోరుకుంటాడు. ఇతడికి అంజనతో వివాహం అయిన తర్వాత వాయుదేవుడి వరబలం వల్ల.. ఈ దంపతులకు ఆంజనేయుడు జన్మించాడు.

సందర్భం : సుందరకాండ యావత్తూ ఆంజనేయుడి వీరోచిత సుందర విజయ గాథే.
విద్యాధరులు : ఉపదేవతలు. పూలమాలలు కట్టడం వీరి పని. సర్పయాగానికి ఇంద్రుడి వెంట వెళతారు.

సందర్భం : ఆంజనేయుడు సముద్రాన్ని లంఘించేందుకు తన శరీరాన్ని పెంచుతున్న సందర్భంలో వీరి ప్రస్తావన వస్తుంది.

మైనాకుడు :

మైనాకము ఓ పర్వతము. మేనకా హిమవంతులు కుమారుడు ( ఈ మేనక అప్సరస కాదు.. వైరాజులనే పితృదేవతల మానస పుత్రిక. హిమవంతుడిని పెళ్లాడుతుంది. వీరికి మైనాకుడితో పాటు క్రౌంచుడు అనే కుమారుడు, అపర్ణ, ఏకపర్ణ, ఏకపాటల అనే కూతుళ్లూ జన్మిస్తారు) కృతయుగంలో పర్వతాలకు రెక్కలుండేవి. దీంతో ఇష్టానుసారంగా ఎగురుతూ.. దేవ, ముని గణాలపై వాలుతుండేవి. వీరు ఇంద్రుణ్ణి ప్రార్థించడంతో.. కోపోద్రిక్తుడైన దేవేంద్రుడు, వజ్రాయుధంతో.. పర్వతాల రెక్కలను తెగనరికాడు. ఆ సమయంలో.. మైనాకుడిని మిత్రుడు వాయుదేవుడు చాకచక్యంతో తప్పించి.. నేర్పుగా సముద్రంలో పడవేశాడు.

రెక్కలు తెగకుండానే మైనాకుడు సముద్రం గర్భంలో దాక్కుంటాడు. మైనాకుడు.. ఇష్టారీతిగా పైకి, కిందకి, పక్కలకు ఇలా ఎటు కావాలంటే అటు పెరిగిపోగల శక్తిమంతుడు.

సందర్భం : తన మీదుగా ఎగురుతున్న ఆంజనేయుడు.. కాసేపు విశ్రమించేందుకు వీలుగా, మైనాకుడిని పెరగమని సముద్రుడు కోరతాడు. తనను గర్భంలో ఉంచుకుని, ఇంద్రుడినుంచి కాపాడుతున్న, సాగరుడి సూచనను మైనాకుడు పాటిస్తాడు. ఆంజనేయుడు మైనాకుడిపై స్వల్వ వ్యవధి విశ్రమిస్తాడు. రాముడి పని మీద వెళుతున్న ఆంజనేయుడికి ఈరీతిగా సేవ చేసిన మైనాకుడికి ఇంద్రుడు అభయాన్నిస్తాడు.

సురస : నాగమాత.

సందర్భం : మైనాకుడి మీదనుంచి తిరిగి లంఘించిన ఆంజనేయుడి బలపరాక్రమాలను మళ్లీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో.... దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు సురసాదేవిని పంపుతారు. ఆమె, అతి భయంకరమైన రూపంతో.. ఆంజనేయుడిని అడ్డగిస్తుంది. ముందుకు సాగాలంటే తన నోట్లోకి దూరి బయటకు వెళ్లాలని షరతు పెడుతుంది. ఆంజనేయుడు ఆమె నోట్లోకి ప్రవేశించి, తన దేహాన్ని అంతకంతకూ పెంచుతూ వెళతాడు. దానికి తగ్గట్లుగానే ఆమె కూడా తన నోటిని పెంచుతూ పోతుంటుంది. ఉన్నట్టుండి ఆంజనేయుడు సూక్ష్మరూపాన్ని ధరించి, ఒక్క ఉదుటన బయటకు వెళ్లిపోతాడు. ఆరకంగా దేవతల పరీక్షను సమర్థంగా ఎదుర్కొంటాడు.

సింహిక :

రాక్షసి. దితి, కశ్యపులకు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనే కుమారులతో పాటు.. సింహిక జన్మిస్తుంది. ఈమె భర్త విప్రచిత్తి. ఈమె కామరూపిణి... ఛాయాగ్రాహిని. (అంటే కోరుకున్న రూపం దాల్చే శక్తి గలది.. దాంతో పాటే.. నీడను లాక్కు పోగలది.) ఈమె కుమారులే రాహుకేతులు. అందుకే వీరికి సైంహికేయులు అని పేరు

సందర్భం : సముద్రంపై నుంచి ఎగురుతున్న ఆంజనేయుడిని చూసి.. సింహిక తనకు మహాజంతువు ఆహారంగా లభించిందని భావించి, ఆంజనేయుడి నీడను లాక్కొని వెళుతుంది. దీంతో ఆంజనేయుడి శక్తి కాస్త తగ్గుతుంది. విషయాన్ని గమనించిన ఆంజనేయుడు తన శరీరాన్ని ఇంతలింతలుగా పెంచుతాడు. దానికి తగ్గట్లే నీడ కూడా పెరుగుతుంది. దాంతో, సింహిక కూడా నోటిని బాగా తెరవాల్సి వస్తుంది. ఆంజనేయుడు హఠాత్తుగా ఆమె నోట్లోకి ప్రవేశించి.. చీల్చి చెండాడుతాడు.