ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

FESTIVAL ARTICLES IN TELUGU - IMPORTANCE OF VASANTHA PANCHAMI / MAGHA MASAM ARTICLE IN TELUGU



వసంత పంచమి విశిష్టత ఏమిటి?

మాఘ మాసం (జనవరి-ఫిబ్రవరి) శుక్ల పక్షం లో ఐదవరోజును (పంచమి తిథి) వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని జరుపుకుంటారు. ఈ రోజు జ్ఞానానికి, సంగీతానికి, కళలకు దేవత అయిన సరస్వతీ దేవిని పూజిస్తారు. అయితే వీణాధరిని పూజించే మరొక పర్వ దినమైన "సరస్వతీ పూజ" దసరాలలో వస్తుంది. ముఖ్యంగా వసంత పంచమి నాడు ఎక్కువగా పిల్లలకు "అక్షరాభ్యాసం" జరుపుతారు. హిందూ సంస్కారాలలో అక్షరాభ్యాసం ఒకటి. నామకరణం (బారసాల), అన్నప్రాసన, ముండనం (పుట్టు జుట్టు ఇవ్వడం), అక్షరాభ్యాసం (విద్యారంభం),ఉపనయనం, వివాహం మొదలయినవి అన్నీ సంస్కారాలే.

అక్షరాభ్యాసం (అక్షర అభ్యాసం) అంటే అక్షరాలను సాధన చేయడం. దీన్ని ఈ దినం తొలిసారిగా దిద్దటం తో ప్రారంభిస్తారు. సాధారణంగా పిల్లలకు అయిదు సంవత్సరాల ప్రాయం లో అక్షరాభ్యాసం చేస్తారు. అక్షరం అంటే క్షరము లేదా క్షీణత లేనిది లేదా నశింప లేనిది; "అభ్యాసం" అంటే సాధన. ఇంకో విశేషం ఏమిటంటే "అక్షర" లో "అ" మొదలుకుని "క్ష"-"ఱ" తో ముగిసేవి కనుక "అక్షఱ"ములు అని చెప్పుకోవచ్చును.

అక్షరాభ్యాసం చేసేటప్పుడు "ఓం నమః శివాయ సిద్ధం నమః" అని ముందుగా ఒక పళ్ళెంలో బియ్యం పోసి వేలితో వ్రాయించి తరువాత కొత్త పలక పై వ్రాయిస్తారు. అయితే పరిణామ క్రమం లో పలక-పుల్ల నుంచి పుస్తకం-పెన్సిల్/పెన్ను తదుపరి కంప్యూటర్ - మౌస్ కు మారాయనుకోండి. 

అయితే అక్షరాభ్యాస సమయంలో సరస్వతీ దేవిని ఇలా స్తుతిస్తారు.
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్ భవతు మే సదా!

వాగ్దేవి సరస్వతి ని తలచుకొంటే 'బాసర' జ్ఞాన సరస్వతి ఆలయం చెప్పుకోదగినది. ఈ ఆలయం ఆంధ్ర ప్రదేశ్ లో ఆదిలాబాద్ జిల్లాలో పావన గోదావరీ తీరాన వుంది. కురుక్షేత్ర యుద్దానతరం శాంతి కోసం వేదవ్యాసుడు తన శిష్యులతో తపస్సు చేసుకోవడానికి ఒక ప్రశాంతమైన ప్రదేశం కోసం అన్వేషిస్తూ, దండకారణ్యం దర్శించి, ఆ స్థలం చాల అనుకూలంగా ఉంటుందని తలచి, సమీపంలోని గోదావరి నదినుండి దోసిళ్ళతో ప్రతి రోజూ ఇసుకను తెచ్చి మూడు రాశులుగా పోయగా అవి పసుపు పూసిన సరస్వతి, లక్ష్మి మరియు కాళీ మూర్తులుగా, ముగ్గురమ్మలు గా మారాయట. ఈ పసుపును కొద్దిగా తింటే విజ్ఞానము, వివేకము పెంపొందుతాయని భక్తుల నమ్మకం. వ్యాసుని చే సృష్టించ బడిన ఈ ప్రదేశం "వాసర" గా, తదుత్తర కాలంలో "బాసర" గా వాసి కెక్కిందని స్థల పురాణం. ఆ విధంగా వసంత పంచమి నాడు ఎక్కడ చూసినా పసుపు రంగు దర్శనమిస్తుంది. అమ్మవారికి పసుపు చీరలు పెడతారు. పసుపు రంగుల మిఠాయిలు నైవేద్యం పెడతారు. ఎందఱో తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం కోసం బాసరకు వస్తారు. అంతే కాదు చాల మంది యుక్తవయస్కులు సరియైన ఉపాధి లేక, జీవితంలో స్థిరపడని వారు బాసర క్షేత్రం దర్శించి ఇక్కడి పావన గోదావరిలో మూడు మునకలేస్తే వారికి అనువైన బ్రతుకుతెరువు లభిస్తుందని పలువురి నమ్మకం. అందుకే భాషను పెంపొందించి, బ్రతుకు బాట చూపి బాసట గా నిలిచేది బాసర. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు.