ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TELUGU MAHABHARATHA STORY ABOUT MAHARADHI KARNA AND HIS DEATH SCENE AT KUREKSHETRA


కర్ణుడు చేసిన నేరములు కృష్ణుడు గుర్తు చేయుట

కర్ణుడు రథం దిగి " అర్జునా ! ప్రస్తుతం నేను విరధుడను. నా రధ చక్రం భూమిలోకి కుంగి పోయింది. నేను దానిని ఎత్తుకొన వలెను. భూమి మీద ఉన్న నా మీద రథం మీద నుండి నీవు బాణప్రయోగం చేయడం ధర్మము కాదు. కనుక రధచక్రం తీసేదాకా నా మీద బాణ ప్రయోగం చేయకుము. ఇది కేవలం నీకు యుద్ధ ధర్మం తెలియ జేయడానికి చెప్తున్నాను కాని నీకు కృష్ణుడికి భయపడి కాదు " అన్నాడు. కృష్ణుడికి సమయం చిక్కింది కర్ణుడిని చూసి నవ్వుతూ " అదేమిటి కర్ణా ! నువ్వు ధర్మాధర్మ విచక్షణ చేయడం ఎప్పటి నుండి ? నీకు ఆపద కలిగింది కనుక ధర్మం గుర్తుకు వచ్చిందా ! అహంకారంతో విర్రవీగు సమయాన ధర్మం గుర్తుకు రాలేదా ! ధర్మమార్గాన పయనించే పాండవులకు జయం తధ్యం. అధర్మమార్గాన చరించే కౌరవులకు అపజయం అనివార్యం. నీవు నీ అనుంగు మిత్రునితో కలిసి చేసిన అకృత్యములు మరచినట్లు ఉంది.

పాండవులను లక్క ఇంట్లో పెట్టి కాల్చిన సమయాన అతడిని ప్రేరేపించింది నీవు కాదా ! అప్పుడది నీకు అధర్మం అనిపించ లేదా ! నీకు ఇప్పుడు మాత్రం ధర్మం గుర్తుకు వచ్చిందా ! కపటజూదం ఆడించి నప్పుడు, ద్రౌపదిని అవమానాల పాలు చేసి అనరాని మాటలు అన్నప్పుడూ,పాండవులను కించపరచినప్పుడూ గుర్తుకు రాని ధర్మం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా ! పాండవులను అడవులలో ప్రంశాంతంగా బ్రతక నీయక ఘోషయాత్రకు సుయోధనుడిని పురికొల్పినప్పుడు గుర్తుకు రాని ధర్మం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా ! అభిమన్యకుమారుని ఒంటరిని చేసి చుట్టుముట్టి పలువురు దాడి చేసి చంపినప్పుడు ధర్మం గుర్తుకు రాలేదా ! ఇవి అన్ని ప్రత్యక్షంగా చేసింది సుయోధనుడే అయినా పరోక్షంగా కారణం నీవు కాదా! " అన్నాడు. కృష్ణుడి ఒక్కొక్క మాట అర్జునుడికి ఆగ్రహం తెప్పించింది. దయాదాక్షిణ్యం లేక కర్ణుడి మీద శరములు గుప్పించాడు.

కర్ణుడు కూడా నేల మీద ఉండే అర్జునుడు వేసే బాణములు ఎదుర్కొంటూ అర్జునుడి మీద బాణములు వేస్తున్నాడు. అర్జునుడు కర్ణుని పతాకం విరుగకొట్టాడు. కర్ణుడు మహా కోపంతో అర్జునుడి మీద కృష్ణుడి మీద పదునైన బాణములు వేస్తూ మధ్యమధ్యలో రధచక్రం తీయ ప్రయత్నించినా అది విఫలం అయింది. కృష్ణుడు అర్జునుడికి కర్ణుడిని సంహరించమని చెప్పాడు. అర్జునుడు అత్యంత శక్తివంతమైన మహాస్త్రాన్ని ఎక్కుపెట్టి మనసులో " నేనే కనుక తపస్సు చేయడంలో దానధర్మాలు చేయడంలో గురువులను సేవించడంలో లోపం లేక చరించిన వాడనై బ్రాహ్మణులను గురువులను తృప్తిపరచిన వాడినై అను నిత్యం పుణ్య కర్మలు ఆచరించే వాడినై ఉంటే ఈ అస్త్రం కర్ణుడిని సంహరించుగాక " అని సంకల్పించి గాండీవాన్ని ఆకర్ణాంతం లాగి అస్త్రప్రయోగం చేసాడు. ఆ దివ్యాస్త్రం నిప్పులు కక్కుతూ వచ్చి కర్ణుడి శిరస్సు ఖండించింది. కర్ణుడి శరీరం నుండి అందరూ చూస్తుండగా ఒక తేజం బయటకు వెడలి సూర్యునిలో కలిసి పోయింది.

కర్ణుడి మరణంతో బ్రాహ్మణ శాపం అంతమై అప్పటి వరకు భూమిలో కూరుకు పోయి ఉన్న రధచక్రము భూమిలో నుండి పైకి లేచి భూమి మీద నిలబడింది. సూర్యుడు అస్తమించాడు.