ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

GEETHACHARYUDU - LORD SRI KRISHNA - ARTICLE ON BHAGAWADHGITA AND ITS ROLE IN TELUGU


గీతాచార్యుడు.. శ్రీకృష్ణుడు

ద్వాపర యుగములో కంస, నరక, ముర, దంతవక్త్ర, శిశుపాల మున్నగు దుష్టుల వధ, అర్జున, విదుర, భీష్మ, కుచేల మొదలగు శిష్టుల సంరక్షణ నిమిత్తము వేదవేద్యుడైన శ్రీమన్నారాయణుడు అవతరించాడు. భక్తసులభుడుగా భుక్తి, ముక్తి ప్రదాయకుడుగా శ్రీకృష్ణ భగవానుడు వినుతికెక్కాడు.
కౌరవ, పాండవుల కురుక్షేత్ర సంగ్రామమున సహాయమందించ కోరుతూ దుర్యోధన, అర్జునులిరువురు ద్వారకా నిలయుడగు శ్రీకృష్ణుని సందర్శించవచ్చిరి. మున్ముందుగా వచ్చుచున్న దుర్యోధనుని చూడనొల్లక, శ్రీకృష్ణుడు ఊయల యందు నిద్రను అభినయించు చుండె. దుర్యోధనుడు వచ్చి శ్రీకృష్ణుడు నిదురించుట చూచి ఆ మహాపురుషుని శీర్షమున ఉన్న ఆసనమున కూర్చొనె. తదుపరి వచ్చిన అర్జునుడు పరమభక్తుల కోర్కెలను తీర్చు పనిలో నిద్రను లక్ష్యము చేయని శ్రీకృష్ణ భగవానుడు పగటి సమయమున నిద్రించుటను చూచి ఆశ్చర్యము నొంది, ఆ పరమాత్మ మేల్కొను వరకు బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది సమస్త దేవతలు, ప్రణమిల్ల, వారి కిరీటములందలి రత్నరాసుల కాంతులకు ఏ దివ్య పురుషుని పాద పద్మముల కాంతి విశేష తేజస్సును చేకూర్చునో అట్టి పాదాబ్జపీఠి సన్నిధి స్థలి కూర్చున్నాడు.

కొలది సమయమునకు మేల్కొనిన శ్రీకృష్ణుడు తన పాదయుగళి వద్దనున్న అర్జునుని చూచి పిమ్మట, దుర్యోధనుని చూచి వారల రాకకు కారణము తెలిసికొనెను. శ్రీకృష్ణుడు వారలతో తనకిరువురు బంధువులు కనుక తనతో కూడ 10వేల సైన్యమును రెండు భాగములుగా చేసి, యుద్ధము చేయువారు సైనికులనియు, తాను యుద్ధము చేయక బుద్ధికి తోచిన సహాయమును చేసెడివాడనని తెలిపి, అర్జునునికి కోరుకొనుటలో ముందుగా అవకాశము కల్పించెను. సైన్య విభాగము వివరము పునఃపునః వితర్కించి, అర్జునుడు సర్వశ్రేయఃకాముడైన శ్రీకృష్ణుడు శత సహస్ర సైనికులకంటె నధికుడని భావించి శ్రీకృష్ణునినే కోరుకొనియె. అన్ని యెడల శ్రీకృష్ణునితో సమాన బల సంపత్తి కలిగి యుద్ధమొనర్వకలిగిన ‘‘నారాయణాఖ్య’’తో ప్రకాశించు గోపకులను పాలుగా తీసుకొని దుర్యోధనుడు వెడలిపోయెను. శ్రీకృష్ణుడు అర్జునునితో బాలుని రీతి ప్రవర్తించితివని, యుద్ధమొనర్పింపని తనను’’ కోరుకొనెటయెందులకు అనగా - అర్జునుడు భక్తితో శ్రీకృష్ణునితో భగవానుడు తన రథముపై ఉండి ఊరక చూచుచుండి, మధ్యాహ్న సూర్యుని రీతి తాను పరాక్రమముతో రిపు సైన్యమును ఆ దేవదేవుని అనుగ్రహబలముతో నశింపజేయగలనని వివరించెను. అనేక రీతుల అర్జునుని భక్తి పరీక్షించి అర్జునునికి ఓ వరమిచ్చెను. శ్రీకృష్ణుడు అర్జునునికి తాను రథముపై ఊఱక చూచు చుండిన, ఆతని శత్రువులు చూచి ఫక్కున నవ్వి అనాదరింతురు. కావున అటు శత్రు సమూహమును నాశనము చేయుటకు పూనుకొనిన అర్జునునికి సారథిగా ఉండి, ‘‘విజయ సారథి’’ నామముతో ప్రసిద్ధి చెందెదను’’ అని వివరించెను.

శ్రీకృష్ణుడు అర్జునునకు సారథిగా ఉండి పాండవులకు కురుక్షేత్ర యుద్ధములో విజయము చేకూర్చి పెట్టుటేగాక, తొలుత అర్జునుని కోరిక మేరకు యిరుపక్షముల నడుమ రథమును నిలుప, తన బంధువుల చూచి నిర్వేదము కలిగి తాను యుద్ధము చేయలేనని అర్జునుడు పలుక, ఆతనికి నిర్వేదము పోగొట్టి, ఉత్సాహమును కలిగించి రణమును కొనసాగించుటకునూ, అతని నెపముగా సకల ఉపనిషత్సారము కర్మయోగ, జ్ఞానయోగ, భక్తియోగముల కలయిక అగు ‘‘శ్రీమద్భగవద్గీత’’ను సర్వనక్తుల ఉపయుక్తముగా తెలిపి, గీతాచార్యుడిగా ప్రసిద్ధినొంది ‘‘జగద్గురువు’’ అయ్యెను.
కురుక్షేత్ర యుద్ధము ద్వాపర యుగములో జరిగి శ్రీమద్భగవద్గీత వెలువడినను, యిన్ని వేల సంవత్సరముల తర్వాత నేటికిని నిత్యము భగవద్గీతను పారాయణ మొనర్చు భక్తులు అసంఖ్యాకముగా ఉన్నారు.

ప్రస్థానత్రయములో ఒకటి యగు ‘‘శ్రీమద్భగవద్గీత’’కు త్రిమతాచార్యులైన శ్రీ శంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యుల వారలు మత సాంప్రదాయక వ్యాఖ్యానములేగాక శ్రీ్ధరీయ వ్యాఖ్యానము మొదలగు అనేక వ్యాఖ్యానములు కలవు.

సర్వభక్త సముద్ధరణార్థము భగవద్గీతను అందించిన జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని శ్రీకరముగా... ... శ్లో॥ వసుదేవ సుతం దేవం, కంస చాణూర మర్దనమ్‌ .......జగద్గురుమ్’’॥ అని స్తుతించి, అందరము శ్రీకృష్ణ పరమాత్మ కృపకు పాత్రులమగుదాము.