ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

GODDESS SRI BHUVANESWARI DEVI - MANIDEEPAM - TELUGU DEVOTIONAL ARTICLE ABOUT GODDESS SRI BHUVANESWARI DEVI


భువనేశ్వరీ దేవి - మణిద్వీపము

వ్యాస భగవానుడు జనమేజయునకు దేవీ భాగవతమును వినిపించుచూ చివరకు శ్రీదేవీ నివాసమైన మణిద్వీపమును గూర్చి ఇట్లు చెప్పసాగెను.

మహారాజా! శ్రీ భువనేశ్వరీ దేవి పాల సముద్రము మధ్యలో నున్న మణిద్వీపములో నివసించును " శ్రీ సుధాబ్ది మణిద్వీప మధ్యగాయై నమోనమః" అని లలితా ష్టోత్తర శతనామములలో ఒకటి. ఆ ద్వీప మిట్లుండునని వర్ణించుటకు ఎవ్వరికిని సాధ్యము కాదు. ఐననూ నీవడిగినావు కనుక నాశక్తి కొలది వర్ణించెదను వినుము.

భువనేశ్వరి యైన ఆ తల్లి నివసించు ద్వీపము బ్రహ్మలోకమునకు పైన ఉన్నది. దానికి సర్వలోకమని పేరు. సృష్టికి ముందు దీనిని దేవి తనఇచ్చా శక్తిచే సృష్టించెను. అది సమస్త బ్రహ్మాండములకును గొడుగువలె నుండును. దాని చుట్టును ఆమృత సముద్రము కందకముగా నుండును. రత్నాల ఇసుక తిన్నెలు గలవు.

అక్కడ ఏడామడల విస్తీర్ణముతో ఇనుపకోట యొకటి కలదు. దాని ద్వారములందును ఋరుజులందును చాలామంది భటులు కావలి యుందురు. దేవీ దర్శనమునకు వెళ్ళిన దేవతలు అక్కడ వేచి యుందురు. రత్న వృక్షములతో నిండిన తోటలు కన్నుల పండువు చేయును.

ఆపైన ఆకాశము నంటు కంచుకోట యున్నది. ఇది ఇనుపకోట కన్నా నూరురెట్లు కాంతి కలది. అక్కడ నున్న తోటలు చూడముచ్చటగా నుండును.

దీనికావల రాగికోట యున్నది. ఈ ప్రాకారములోపల కల్పవృక్షము లున్నవి. పండ్లలోని బీజములు రత్నములే. వాని సువాసనలు చాల దూరముదాకా వ్యాపించును. ఆ వనములో వసంతుడు మధుశ్రీ మాధవశ్రీ యను భార్యలతో నివసించును. గంధర్వుల గానములు చెవుల కింపుగా నుండును.

ఆ పైన సీసపు కోట గలదు. (ప్రాకారమునే కోటలందురు) దీని యందు సంతాన వృక్షము లుండును. శుక్లశ్రీ శుచిశ్రీ అను భార్యలతో ఇక్కడ గ్రీష్మర్తు రాజుండును.

దానిలోపల ఇత్తడి కోట యున్నది. దేనిలో హరిచందన వనమున్నది. నభశ్రీ మున్నగు పండ్రెండుగురు భార్యలతో వర్షర్తు రాజిక్కడ నివసించును. నదీనదము లెక్కువ యుండును. చెట్లు, లతలు పచ్చగా శోభించును. ఆపైన పంచలోహమయమైన కోటగలదు. మందార వృక్షము లిక్కడ నుండును. ఇష్టలక్ష్మి, ఊర్జలక్ష్మి అను భార్యలతో శరదృతురాజిక్కడ విహరించుచుండును.

ఆ మీద వెండి కోట యున్నది. ఇక్కడ పారిజాతవన మున్నది. ఆ పూలవాసన పది యోజనముల వరకు వ్యాపించును. సహశ్రీ, సహస్యశ్రీ అను భార్యలతో హేమంతఋతు రాజిక్కడ నివసించును.

దానికావల బంగారు కోట గలదు. అక్కడ కదంబ (కడిమి) వృక్షములు గలవు. సిద్ధుల కది నివాసము. తపఃశ్రీ పస్యశ్రీ అను భార్యలతో శిశిర ర్తురాజు ఆవనములో నివసించును.

ఆపైన పుష్యరాగ ప్రకార మున్నది. ఆ ప్రాంత మంతయు పుష్య రాగమయమే. కాంతితో మెరయు చుండును. ఇక్కడ అష్టదిక్కులందును దిక్పాలకులు నివసింతురు.

ఆమీద కుంకుమారుణమైన పద్మరాగ ప్రాకారము గలదు. ఇక్కడ అంతయు పద్మరాగ మణిమయమే. పింగాక్షి మున్నగు నమాములు గల చతుష్పష్టి యోగినీ గానము లుందురు. అందు ఒకొక్క శక్తి లక్ష బ్రహ్మాండములను త్రుటిలో నశింపజేయగలదు.

ఆ లోపల గోమేధిక సాల యున్నది. అక్కడ నంతయు గోమేధిక మయమే. విద్యాది శక్తులు ముప్పది యిద్దరు సేనలతో ఉందురు.

దాని కవ్వల వజ్రమయ దుర్గ మున్నది. అక్కడ అనంగరూప మున్నగు దేవి పరిచారిక లుందురు.

దాని పైన వైడూర్యమణుల ప్రాకార మున్నది. అక్కడ మున్నగు మాతృకలు లోక కళ్యాణము చేయుచుందురు. సైన్యములు గూడ నుండును.

దీని తరువాత ఇంద్రనీలమణి ప్రకార మున్నది. అక్కడ పదనారు రేకులు గల పెద్ద పద్మ ముండును. ఆ రేకులలో పదునారు శక్తు లుందురు. వీరు దేవి సేవలు నడుపుదురు.

ఆవల ముత్యాలతో నిండిన కోట యున్నది. అక్కడ దేవితో సమాన రూపముగల అన్మ్గా కుసుమాదులు అష్ట మంత్రిణు లుందురు. వీరెప్పుడును దేవికి జగద్వార్తలు తెలుపు చుందురు.

ఆపైన మరకత సాలము. దానిలో షట్కోణయంత్ర మున్నది. గాయత్రీ, సావిత్రీ, బ్రహ్మ, విష్ణు, రుద్రాదులు ఆ కోణములలో నివసింతురు. వేద, పురాణ, శాస్త్రములు తమ స్వరూపములతో ఇక్కడ నివసించును.

ఆవల ప్రవాళసాలము (పగడాల కోట) ఉన్నది. అక్కడ పంచభూతములకు నాధిపత్యము వహించు హృల్లేఖ, గగన, రక్త, కరాళిక, మహోచ్చష్మ అను శక్తు లుందురు.

దీని తరువాత రత్న మహాప్రాకార మున్నది. అక్కడ సప్తకోటి మహామంత్రములును, ఆది మహావిద్యలును ప్రకాశించుచుండును. ఈకోట తరువాతనే చింతామణి గృహము గలదు. "చింతామణి గృహాంత స్థాయై నమః" అని లలితా సహస్రములో నొక నామము. అక్కడ వేయి స్త్మభాల మండపాలు నాలుగున్నవి. శృంగారము, ముక్తి, జ్ఞానము, ఏకాంతము అని వాని పేరులు. కుంకుమ పూవుతోటల మీది నుండి వచ్చు సువాసన లక్కడ వ్యాపించును. శృంగార మండపములో దేవి కొలువు దీర్చును. ముక్తి మండపములో నుండి జ్ఞానమిచ్చును. ఏకాంత మండపములో మంత్రిణులతో గలిసి కార్యతంత్రములు నడుపును. ఇక్కడ శక్తి తత్త్వాత్మకములైన పది తొట్టెలు గలవు. వానికి బ్రహ్మ, విష్ణు, రుద్రులు డెక్కలు (చిన్న చక్రములు) గా నుందురు. సదాశివుడు వాని పైన బల్లగా నుండును. దీనిపై కోటి మన్మథ సుందరుడైన మహాదేవుడును, అతని ప్రక్క సర్వాలంకార శోభితయై పరమేశ్వరి యు అధి వసించి యుందురు.

లబ్జాది పీట శక్తులును, శంఖాది నిధులును ఆమెను పరివేష్టించి యుండును. శ్రీ మహాదేవి విపాశ్వమున నుండుటచేతనే మహాదేవుడు సర్వేశ్వరు డయ్యెను. ఈ గృహము సహస్ర యోజన విస్తీర్ణము గలిగి అంతరిక్షములో నిరాధారముగా నుండును. దీనికి ప్రళయమున సంకోచముగాని, సృష్టి కాలమున వికాసముగాని లేకుండును. దేవ, మనుష్య, నాగాడులలో సిద్దులైనవారీ గృహమున శాశ్వతముగా నివసింతురు. కోరికలు దీర్చెడి కల్పవృక్షము లక్కడ కలవు. రోగము, శోకము, వార్ధక్యము అక్కడ నండువారికి కలుగవు.

అక్కడ కొందరు సాలోక్యముక్తు లుందురు. కొందరు సామీప్య ముక్తు లుందురు. మరికొందరు సాయుజ్యముక్తు లుందురు. మహొన్నత స్థితి గలిగించు సప్తకోటి మహామంత్రములు మూర్తి మంతములై దేవిని స్తుతించుచుండును.

ఇది మణిద్వీపవర్ణనము. దీనిని స్మరించిన వారికి సర్వపాపములు తొలగును. ప్రాణము పోవునప్పుడీ మణిద్వీపము స్మృతికి దగిలినచో వానికి ఈ ద్వీపమున దేవీ సాన్నిధ్యము దొరకును. దీనిని నిత్య పారాయణము చేయువారికి దేవీ యనుగ్రహము లభించును. విశేషించి నూతన గృహప్రవేశ సమయమున పారాయణ చేసినచో ఆ యింటిలో నుండువారికి భూతాది బాధలుండవు. ఇల్లు నిత్యకళ్యాణము పచ్చతోరణముగా నుండును. శ్రీ మహాలక్ష్మి మహాగౌరీ మహాసరస్వతీ స్వరూప శ్రీ లలితాంబికాను గ్రహము వలన సకల శుభములును గలుగును.

"సర్వేలోకాయ మాశ్రిత్య వర్ధంతే వీత కల్మషాః
పురాణ పురుషం వందే విశ్వ విజ్ఞాన భాస్కరమ్ "