ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TELUGU TRAVEL INFORMATION GUIDE ABOUT SANKARLODDHI - LORD SIVA RESIDES - 4000 YEAR HISTORICAL IMPORTANCE - MUST VISIT - ADILABAD - INDIA


ఆదివాసీల పుణ్యస్థలం శంకర్‌లొద్ది!

ఆదిలాబాద్‌జిల్లా! ఎటుచూసినా పచ్చదనంతో అలరారుతున్న ప్రాంతం! కొండలు, గుట్టలు, జలపాతాలు, సెలయేళ్లు .. ఆదివాసీ, గిరిజన జీవితం.. ఈ రెండూ కలిసి దీనికో ప్రత్యేకతను అద్దుతున్నాయి! విశిష్ట సంస్కతిని చూపెడుతున్నాయి! అలాంటి ఆదిలాబాద్‌లోని అరుదైన స్థలమే శంకర్‌లొద్ది! ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల పుణ్యస్థలం శంకర్‌లొద్ది! ఆంధ్రప్రదేశ్ - మహారాష్ట్ర సరిహద్దులోనివివాదాస్పద సరిహద్దు గ్రామం!ఈ ఊరి అడవిలోని రాతిగుహలో ఉన్న శివలింగానికి నాలుగువేలయేళ్ల చరిత్ర ఉన్నట్లు ఆదివాసీలు భావిస్తున్నారు. ఒరిస్సా, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బీహార్ ఇలా సుమారు పదిరాష్ట్రాల్లోని ఆదివాసీలు శంకర్‌లొద్ది అడవుల్లోని ఆదిశంకరుడిని తమ ఆదిదైవంగా, మహిమగల దేవుడిగా కొలుస్తారు. తమకు జీవనాధారమైన అటవీ భూముల్లో పంటలు వేసే మొదటి పండుగ మొదలు, తాము చేసే ఏ శుభకార్యానికైనా ఈ గుహల్లోని దైవమే వారి ఇలవేల్పు. ఇంతటి ప్రత్యేకత ఉన్న ఈ గుహలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నా ఆదివాసీలు మాత్రం కంటికి రెప్పలా కాపాడు కొంటున్నారు.

* పాండవుల అరణ్యవాసం

ఈ శంకర్‌లొద్దిగుహలు కెరమెరి మండలంలో ఉన్నాయి. నిట్టనిలువుగా ఉన్న ఈ రాతికొండ మధ్యలో చిన్న గుహ ఉంటుంది. పాండవులు అరణ్యవాసం సమయంలో ఇక్కడి గుహల్లో గడిపినట్లు స్థానికులు చెబుతారు. ఈ రాతి గుహలో సహజసిద్ధంగా ఏర్పడిన ఓ శివలింగం ఉంది. భీమసేనుడు ప్రతినిత్యం ఆ శివలింగాన్ని పూజించేవాడని ప్రతీతి. ఆ శివలింగం అత్యంత మహిమకలదని ఆదివాసీల నమ్మకం. పాండవులు ఇక్కడి గుహల్లో ఉంటున్న సమయంలోనే భీముడికి పెళ్లి జరిగిందని, ఇక్కడే ఉంటూ మహాభారత యుద్ధం కూడా చేశారని.. ఆ శివలింగం మహిమ వల్లే పాండవులు కౌరవులపై విజయం సాధించగలిగారని ఆదివాసీల భావన. అందుకే భీమసేనుడిని కూడా ఆదివాసీలు భీమల్‌పేన్ (భీమన్న దేవుడిగా)కొలుస్తుంటారు. ఈ గుహపరిసరాల్లోనే రాతితోకట్టిన ఆలయం ఉన్నట్లు ఆధారాలు దొరికాయి. ఈ గుహలను ఆనుకునే ఓ సెలయేరు ప్రవహిస్తూంటుంది. ఆ సెలయేటిలో స్నానం చేసేందుకు వీలుగా రాతి మెట్లతోపాటు, రాతి గుహమధ్యలో ఉన్న శివలింగం వద్దకు వెళ్లేందుకు పెద్ద పెద్ద బండరాళ్లతో చేసిన మెట్లూ ఉన్నాయి. అవిప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి.

* కోరికలను నెరవేర్చే సిద్ధికాస...

శివలింగం ఉన్న కొండను ఆనుకొని ప్రవహిస్తున్న సెలయేరు అత్యంత పవిత్రమైనది. మూడుకాలాలపాటు ఈ యేరు నీటిప్రవాహంతో కళకళలాడుతుంటుంది జీవనదిలా! ఇందులో స్నానంచేసి లింగాన్ని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని గిరిజనుల నమ్మకం. అందుకే ఈ వాగుకు సిద్ధికాస అనే పేరు వచ్చిందని చెబుతారు ఆదివాసీలు. ఇక్కడి గిరిజనులు తమ పోడుభూముల్లో విత్తనాలు వేసేముందు ఈ వాగు నీటిలో తాము స్నానంచేయడమే కాక విత్తనాలనూ ఈ నీటితో కడిగి శివుడి ముందుపెట్టి పూజలు చేస్తారు. ఇలా చేస్తే తాము కోరుకున్నంత పంట పండుతుందని వీరి నమ్మకం. ఈ గుహలకు సమీపంలోనే సిద్ధికాసతోపాటు, విద్యకాస, బుస్‌కత్తి, సోప్లకస, కుడికస మొదలైన పదికసలుండేవని అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయని చెప్తారు ఆదివాసీలు! అలాగే ఈ కొండగుహలో శంభుగిరిజలు (శివపార్వతులు)కూడా నివాసం ఉంటూ తమను కనిపెట్టుకుంటారని ఆదివాసీల విశ్వాసం!

* పట్టించుకోని ప్రభుత్వాలు..

నాలుగువేల సంవత్సరాల చరిత్ర కలిగి.. ఆదివాసీలు అత్యంత పవిత్రంగా భావించే ఈ శంకర్‌లొద్దిని ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకున్నదాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతం తమదంటే తమదని వివాదం చేస్తున్నారు తప్ప ఇటువెళ్ళేందుకు కనీసం రోడ్డు అయినా వేయలేదు. మంచినీటి వసతి అస్సల్లేదు. ఇక్కడి అటవీప్రాంతంలో అపారంగా ఉన్న సున్నపురాయి నిల్వలను కొల్లగొట్లేందుకు మాత్రం జిల్లాకు చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు విశ్వప్రయత్నం చేశారు. ఆదివాసీలు తిరుగబడటంతో మిన్నకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి దీని అభివద్ధిపై దష్టినిలపాలి. చుట్టూ పచ్చని ప్రకతిలో సెలయేటిఝరులతో కనువిందు చేసే శంకర్‌లొద్దిని చక్కటి పర్యాటకప్రాంతంగా మలచాలి!