ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARTICLE ABOUT LORD SIVA TEMPLES IN TELUGU - PANCHABHUTHALINGA KSHETRALU INFORMATION IN TELUGU - ARUNACHALAM KSHETRAM DETAILS AND INFORMATION IN TELUGU


అరుణాచలం పంచభూతలింగక్షేత్రము
పంచభూతలింగక్షేత్రములు
1. అన్నామలైశ్వరుడు - అరుణాచలము(Arunachalam): అగ్ని లింగం
2. జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం(Jambukeswaram): జల లింగం
3. చిదంబరేశ్వరుడు(నటరాజ)- చిదంబరం(Chidambaram): ఆకాశ లింగం
4. ఏకాంబరేశ్వరుడు - కంచి(Kanchipuram): పృధ్వీ లింగం
5. కాళహస్తేశ్వరుడు - శ్రీకాళహస్తి(Sri kalahasti): వాయు లింగం
అరుణాచలంలో అగ్నిలింగం ఉంటుంది. పేరు బట్టి ఆలోచిస్తే- అగ్నిలింగం దగ్గర అగ్నిహోత్రం ఉండాలి. కానీ అరుణాచలంలో శివలింగ దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్నిహోత్రం కనిపించదు. అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలగవచ్చు. అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది. అందుకే మన పెద్దలు జీవ కోటి యాత్రలో ఒక చోట అడ్డంగా గీత ఉంటుంది అని చెబుతారు. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశానికి ముందు గడిపిన జీవిత యాత్ర. ఆ గీతకు తరువాతది అరుణాచల ప్రవేశం జరిగిన తరువాతి జీవయాత్ర. అరుణాచలంలో అంతరాలయంలోని శివ లింగానికి కొంచెం దగ్గరగా కూర్చుంటే ఉక్కపోసేసి చెమటలు పట్టేసి వేడితో సతమతమయిపోతున్నట్టుగా అనిపిస్తుంది.
ఒకానొకప్పుడు శంకరుడు మానవులకు నాలుగు వరాలిచ్చాడు. వీటిలో మొదటిది- “దర్శనాత్ అభ్రశదసి”. చిదంబరంలో పరమేశ్వరుడి జ్ఞానంతో దర్శించటం. ఇది కుదరకపోతే “జననాత్ కమలాలయే”. కమలాలయే అంటే తిరువారూర్. అక్కడ పుడితే మోక్షం లభిస్తుంది. కానీ పుట్టడం మన చేతిలో లేదు కదా! అందువల్ల ” కాశ్యాంతు మరణాన్ ముక్తిహి”. వారణాసిలో ప్రాణం వదిలి పెట్టేస్తే మోక్షం ఇచ్చేస్తానన్నాడు. మరణం కూడా మన చేతుల్లో ఉండదు. అందువల్ల “స్మరణాత్ అరుణాచలే” అన్నాడు. అరుణాచల శివుడిని తలుచుకుంటే పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు. అరుణాచల క్షేత్రం అంత గొప్పది.
అరుణాచలము(Arunachalam) అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము.
అ-రుణ = పాపములను పరిహరించునది అని అర్ధము.
తమిళం లో "తిరువణ్ణామలై" (Tiruvannamalai) అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ.
ఇది చాల గొప్ప పుణ్యక్షేత్రము . స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము . కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని చెప్పుకుంటారు. ఆ కొండకు ప్రదక్షిణం చెయ్యాలంటే పధ్నాలుగు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆ కొండ కింద ఉన్నభాగాన్ని అరుణాచల పాదాలని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణం చేస్తారు. అక్కడ ఈ కొండకి ప్రదక్షిణం చేస్తే- కోట్ల జన్మలలో చేసిన పాపాలన్నీ దగ్ధమవుతాయి.
భగవాన్ రమణులను చూడ్డానికి ఎవరయినా అరుణాచలం వెళ్తే ఆయన మొదటగా ‘గిరి ప్రదక్షిణం చేశారా?’ అని అడిగేవారు. ప్రదక్షిణానికి ఆయన ఒక నిర్వచనం చెప్పేవారు. ప్రదక్షిణంలో మొదటి అక్షరం ‘ప్ర’ అంటే సమస్త పాపరాశిని ధ్వంసం చేయటం. ‘నేను అరుణగిరికి ప్రదక్షిణ చేయడానికి బయలుదేరుతున్నాను..’ అని ఈశ్వరునికి నమస్కరించి మొదటి అడుగు తీసి ఇలా వెయ్యగానే, పాపరాశి ధ్వంసమవుతుంది. రెండో అక్షరం ‘ద’ అంటే కోరికలు తీర్చటం. శివుడిని నమ్మి ప్రదక్షిణం మొదలుపెట్టారో వారికి జీవితంలో కావాల్సినవి ఇస్తాడు. మూడో అక్షరం ‘క్షి’ అంటే – ఈజన్మలో అనుభవించవలసినటువంటి పాపాలను ధ్వంసం చేయటం. ఇక నాలుగో అక్షరం ‘ణం’. అరుణగిరికి ప్రదక్షిణం చేసిన వాడికి పాపం పుణ్యం ఉండదు కనుక వాడు మోక్షానికి అధికారి అవుతాడు.
గిరి ప్రదక్షిణం అనేటటువంటిది మనం అక్కడ ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి. అరుణ పర్వతానికి మీరు ఎన్నిమార్లు ప్రదక్షిణము చేసినా, ఒక్క పర్వతానికే చేయకూడదు. పర్వతానికి చుట్టూ ఉన్న అన్ని ఆలయాలను దర్శనం చేస్తూనే ప్రదక్షిణం చేయాలి.
శ్రీరమణాశ్రమం నుంచి ప్రారంభించి, పాలితీర్థం, గళశగుడి, అగస్త్యతీర్థం,
ద్రౌపదిగుడి, స్కందాలయం, యమలింగం, సిద్ధాశ్రమం, శోణతీర్థం,
నైరుతిలింగం, హనుమాన్‌గుడి, ఉణ్ణామలై అమ్మగుడి, ఉణ్ణామలై తీర్థం,
రామలింగేశ్వరాలయం, రాఘవేంద్రమఠం, ప్రతిధ్వని మంటపం, గోశాల,
రాజరాజేశ్వరి ఆలయం, గౌతమాశ్రమం, సూర్యలింగం, వరుణాలింగం,
ఆది అణ్ణామలై ఆలయం, రేణుకాలయం, వాయులింగం, అక్షర మంటపం,
ఈశాన్యలింగం, ప్రవాళ పర్వతం, అరుణాచలేశ్వరాలయం, ఇంద్రలింగం,
గురుమూర్తం, మామిడితోట, అగ్నిలింగం, శేషాద్రిస్వామి ఆశ్రమం,
దక్షిణామూర్తి దేవాలయంలో ముగిస్తే, అది ప్రదక్షిణం.
గిరిప్రదక్షణం చేస్తున్నప్పుడు మనకి అష్ట లింగములు కనిపిస్తాయి.
* గిరిప్రదక్షిణం చెప్పులు లేకుండా చేయాలి.
*బరువు ఎక్కువగాఉన్నావాటిని మీ కూడ తీసుకువెళ్ళకండి (సంచులు అలాంటివి)
*గిరిప్రదక్షిణం 14కి.మి దూరం ఉంటుంది.
*ఉదయం పూట గిరిప్రదక్షణం చేయడం చాలా కష్టం. 9 లోపు ముగించడం మంచిది .
*గిరిప్రదక్షిణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు .పౌర్ణమి రోజు / ప్రసిద్దమైన రోజున మాత్రం రాత్రిపూట కూడా అందరకి దర్శనం అయ్యేలా చూస్తారు.
* మీరు చిల్లర తిసుకువెళ్ళడం మరిచిపొవద్దు.
* గిరిప్రదక్షిణం లో "నేర శివాలయం" అని ఉంటుంది. అంటే శిఖరానికి ఎదురుగా ఉన్న శివాలయం.
*నిత్యనంద స్వామి అశ్రమం కూడ కనిపిస్తుంది గిరిప్రదక్షణం చేసేటప్పుడు. ఆశ్రమానికి పక్కనే భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది.
* గిరిప్రదక్షిణం ప్రతిరోజూ చేస్తారు.