ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

A STORY OF TWO BROTHER RAMU AND SOMU - TELUGU CHANDAMAMA STORY


సీతాపురం అనే గ్రామంలో రాము, సోము అనే అన్నదమ్ములు ఇద్దరు ఉండేవాళ్లు. వాళ్ళ తండ్రి చనిపోతూ-చనిపోతూ "మీరిద్దరూ పొలాల్ని,ఇండ్లను సమానంగా పంచుకోండి" అని చెప్పి చనిపోయాడు.

రాముకు కొంచెం గడుసుతనం ఎక్కువ. సోము అమాయకుడు. ఎలాగైనా సోమూని మోసం చేయాలనుకున్నాడు రాము. అందుకని పంపకాల సమయంలో సోముకి చౌడు నేల ఇచ్చి, రాము మాత్రం ఎర్రనేలను తీసుకున్నాడు. సోము ఆ చవుడు నేలనే దుక్కి చేద్దామనుకొని పని ప్రారంభించగానే, పొలంలో ఒక చోట నాగలి విరిగిపోయింది. 'ఏమిటా' అని త్రవ్వి చూస్తే , అక్కడ తాతల నాటి లంకె బిందెలు దొరికాయి! రాముకు ఆ విషయం తెలిసి, వాటిలో తనకూ వాటా కావాలని పోరు పెట్టాడు. అమాయకుడైన సోము "దానిదేముంది అన్నా, ఈ సంపద నీది మాత్రం కాదా?" అని, వాటిలో సగం పంచి ఇచ్చాడు.

అయినా రాముకు ఆశ చావలేదు. తమ్ముడు పొలంలో బోరు వేసి, పంట వేయగానే, ఆ బోరు ప్రక్కనే తను ఇంకొక బోరు వేయటం మొదలు పెట్టాడు. 'కొంచెం దూరంగా వేయరాదా అన్నా?' అని తమ్ముడు అడిగితే, "నీ బోరుకేమీ అవ్వదులే" అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. అయితే, ముప్ఫై వేల రూపాయలు ఖర్చు పెట్టినా, ఆ బోరులో‌ నీళ్ళు పడలేదు. తమ్ముడిని చెడపాలనుకున్న రాము తేలు కుట్టిన దొంగ చందాన, కిక్కురు మనలేదు.

ఆపైన ఇద్దరూ పొలంలో పంట వేశారు. రాము పొలంలో పంట చాలా‌ బాగా వచ్చింది. అయినా అతను ఆ దిగుబడిని సోము ఫలసాయంతో‌ పోల్చుకొని కుమిలి పోయాడు. ఇద్దరూ పంటను కోసి వాములు వేశారు. ఆ సమయంలో రాము ఎలాగైనా తమ్ముడి పంటకు నిప్పు పెట్టాలని నిర్ణయించుకున్నాడు.

ఒకనాటి అర్ధరాత్రి సోము లాంతరు చేతిలో పట్టుకొని తమ్ముడి వాము దగ్గరికి పోయాడు. దానికి నిప్పు పెట్టాలనుకునే సరికి, అక్కడ కాపలాగా ఉంచిన కుక్క మొరగటం మొదలు పెట్టింది. "ఎవరదీ?" అని సోము లేచి వచ్చాడు. దాంతో‌ రాము గబుక్కున తన చేతిలోని లాంతరును ఆపేసి, పరుగున అక్కడే ఉన్న ఒక పొద చాటున దాక్కున్నాడు. అయితే అతని ఖర్మేమో అన్నట్లు, అక్కడే ఉన్న పాము అతన్ని కరిచింది. ప్రాణాలు కడబట్టి పడిపోయి, నురగలు కక్కుతున్న అన్నను తమ్ముడే ఎత్తుకొని, వైద్యుని దగ్గరికి పరుగు తీశాడు. అయితేనేమి? బాగయ్యేటప్పటికి రాముకు వెయ్యిరూపాయలు ఖర్చయ్యాయి!

అయినా రాముకు తమ్ముడి మీద అసూయ తగ్గలేదు. తనకు అడ్డుగా నిలిచిన కుక్కను ఎలాగైనా చంపాలనుకున్నాడు వాడు. ఒకరోజు ఉదయం సోము కట్టెలకోసం అడవికి పోయినప్పుడు, రాము అన్నంలోకి పురు గులమందు కలిపి, కుక్క ముందు ఉంచి వెళ్ళిపోయాడు. అయితే ఆ వాసనను గ్రహించిన కుక్క, దాన్ని తినక, దాన్ని తన్ని క్రింద పడేసింది. రాముకి కోళ్ళు చాలా ఉన్నాయి. అవి గింజలు వెతుక్కుంటూ వచ్చి, కుక్క వదిలేసిన అన్నం మెతుకులను తిన్నాయి. దాంతో, సాయంత్రానికి ఆ కోళ్ళన్నీ చనిపోయాయి. "కుక్క చనిపోయి ఉంటుంది" అని సంతోషపడ్డ రాముకు, తన కోళ్లన్నీ చనిపోయాయన్న వార్త తెలిసి, గుండె ఆగినంత పనైంది.

"ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు-ఇతరుల చెడును ఆశించకూడదు"అని ఆలస్యంగానైనా సరే, తెలుకున్నాడు రాము. తమ్ముడి దగ్గరకు వెళ్ళి తన తప్పులన్నీ ఒప్పుకొని క్షమాపణ కోరాడు. "అవేమీ మనసులో పెట్టుకోకు అన్నా! మనం‌ఇద్దరం ఒకటే అనుకో" అని తమ్ముడు తన మంచినే పంచాడు. తమ్ముని వ్యక్తిత్వంలో గొప్పదనాన్ని గుర్తించిన రాము, ఆ నాటినుండి సోము బాటలో నడిచాడు.