ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BRAHMASRI CHAGANTI KOTESWARA RAO GARU'S MORAL MESSAGE ARTICLE


వశం చేసుకోవడం కాదు... వశవర్తులు కావడం నేర్చుకోవాలి..!

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు.

డబ్బు ఎలా సంపాదిస్తున్నాడు-అన్నదానితో సంబంధం లేకుండా, సంపాదిస్తున్నాడా లేదా అదొక్కటే ప్రమాణంగా... అతి తక్కువకాలంలో ఎంత ఎక్కువ సంపాదించవచ్చన్న లక్ష్యంగా వెడుతున్నాడనుకోండి. వాడంత ప్రమాదకరమైన మనిషి మరొకడుండడు. అందుకే... మీరేం చేస్తున్నారన్నది కాదు, ఎలా చేస్తున్నారన్నది ప్రధానం. మన ఆర్షవాఙ్మయం అంతా ధర్మం గురించే మాట్లాడుతుంది. ధర్మం అంటే... నీవల్ల ఎంతమందికి ఉపయోగముంటున్నది, నీ బతుకు ఎంతమందిని బతికిస్తున్నదన్నది ఇందులో ముఖ్యం. ఇది సాధించాలంటే గురువు దగ్గర ఎప్పుడూ బుద్ధి శిక్షింపబడడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే శిష్యుడు’ అని అంటారు. బుద్ధి శిక్షింపబడడమంటే... గురువుకి వశవర్తి కావాలి. నేనుగా గురువుగారికి లొంగిపోతున్నాను - అని సంకల్పం చేసుకుని గురువుగా ఏ మాట చెబితే ఆ మాట శిరసా వహిస్తాను’ అన్నాడనుకోండి. అప్పుడతడు సమాజానికి పనికివచ్చేవాడవుతాడు.

‘నేను ఎవ్వరికీ లొంగను. నేననుకుంటే నా మాట నేనే వినను’ అన్నాడనుకోండి. వాడంత పనికిమాలినవాడు ఇంకొకడు ఉండడు. వాడిమాట వాడే వినకపోతే ఎవడికి పనికొస్తాడు? అంతకన్నా దౌర్భాగ్యమైన మాట మరొకంటుంటుందా? ఉండదు.
ఒక గుర్రం ఉంది. గొప్పగా దౌడు తీయగలదు. కొండలు, గుట్టలు కూడా ఎక్కగలదు. అది తనమీద ఎక్కి స్వారీ చేస్తున్న వ్యక్తిని క్షేమంగా తీసుకెడుతుంది. అలా తీసుకెళ్లగలిగిన దానినే ఉత్తమాశ్వం అంటారు. అది తన యజమానికి వశమైపోతుంది. ఏనుగు చాలా బలంగా ఉంటే, మావటివాడేమో బలహీనంగా ఉంటాడు. అది కట్టుకొయ్య దగ్గరకెళ్లి అక్కడ ఉన్న ఇనుప గొలుసులను తొండంతో తీసి మావటికి ఇచ్చి కట్టవలసిందని కాలు చాపుతుంది. నిజానికి ఏనుగు కదలకుండా ఉండలేదు. అది కదలకపోయినా కనీసం తొండమన్నా కదిలిస్తూనే ఉంటుంది. అరుణాచలం, వేంకటాచలం వంటి క్షేత్రాలకు వెళ్లి చూడండి. మావటి తన చేతిలో ఉన్న అంకుశాన్ని దాని రెండు ముంగాళ్ల వద్ద పెడతాడు. అంతే. అది దాటదు. కాలు ఎత్తుతుంది, కానీ వెనక్కి తీసుకుంటుంది తప్పితే అడుగు ముందుకు వేయదు. ‘నేను దాటను’ అని దానికది పెట్టుకుందా నియమం. నిజానికి అంకుశం సంగతి సరే, తొండంతో మావటిని తిప్పి విసిరివేయగల శక్తి ఉన్నా మావటికి తనకు తానుగా లొంగిపోయింది. కాబట్టే వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవమూర్తిని ఉరేగింపుగా తీసుకెడుతుంది. పండితులకు పెద్ద సత్కారం - గజారోహణం. దాని అంబారీ మీద కూర్చోబెడతారు.

గాడిద వెనుక ఎవరైనా నిలబడితే కాళ్లతో తంతుంది. అలాంటిది అది దాని యజమానికి వశమైపోయిన తరువాత ఎంత బరువయినా మోస్తూ ఉపయోగపడుతుంది. కుక్కకు ఒక లక్షణం ఉంటుంది. పట్టెడన్నం పెడితే చాలు ఎంతగా వశమైపోతుందంటే యజమాని ఇంట్లో ఉన్నా లేకపోయినా, ఊరెళ్లినా ఇంటికి దొంగల బారి నుంచి కాపలా కాస్తుంది. కర్ర పెట్టి కొట్టినా, రాళ్లు విసిరినా మొరుగుతూనే ఉంటుంది. దూరంగా తరిమినా మొరగడం ఆపదు. యజమానికి వశవర్తి అయిపోయింది. ఎద్దు-దానికేమీ తెలియదు. బండి తెచ్చి కాడి పెకైత్తి దాని కిందకు రమ్మంటే మొదట మొరాయిస్తుంది. నాలుగు రోజులు బండికి కట్టిన తర్వాత రైతు ఎద్దులను తీసుకురాడు. అవి అటొకటి, ఇటొకటి పడుకుని ఉంటాయి. కాడి ఎత్తి పట్టుకుని వాటివంక చూస్తూ నోటితో చిన్న శబ్దం చేస్తాడు. అంతే! రెండూ లేచి వచ్చి మెడ దానికింద పెట్టేస్తాయి. ఎద్దు వశవర్తి అయింది. కాబట్టే రైతు దానిని కుటుంబసభ్యులలాగా ఆదరిస్తాడు. ఏరువాక పౌర్ణమి వస్తే పసుపు కుంకుమలతో పూజించి ప్రత్యేకంగా దానికి పాయసాన్ని వండి పెడతాడు.

లోకంలో నోరులేని ప్రాణులు కూడా వశవర్తులయ్యాయి కాబట్టే, సమాజానికి ఉపయోగపడుతున్నాయి. అటువంటిది ఒక మనిషి ‘నేను ఎవరి మాటా వినను, నామాట నేనే వినను’ అంటున్నాడంటే వాడు మనుష్య జన్మకు పనికొచ్చేవాడేనా? అందుకే తనంతటతానుగా వశపడాలి. ఎవరికి? ఎవరు తనకు హితైషులో, ఎప్పుడూ తన హితాన్ని కోరుతారో వారికి వశవర్తి కావాలని వేదం చెప్పింది. తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురికీ వశవర్తి కావాలి. అంటే ‘వాళ్లు చెప్పింది నాకు శిలాశాసనం’ అనుకోవాలి. వాళ్లేం చెప్పారో అది చేయాలి. అలా చేయాలంటే ఉండాల్సింది వినయం. అదెలా వస్తుందంటే ‘నాకు వీళ్లు దైవసమానులు. వాళ్లు నా హితం కోరి చెబుతారు. కాబట్టి నేను వాళ్ల మాట వినాలి’ అన్న సంకల్పంతో!

మీకు పాఠాలు చెప్పే గురువు కూడా మీ కుటుంబసభ్యుడే అని గుర్తించండి. నేను, నా తల్లిదండ్రులు, నా తోబుట్టువులతో పాటూ నా గురువుగారు కూడా కలిస్తేనే అది నా కుటుంబం అని భావన చేసుకోండి.
గురువుగారంటే కేవలం నాకు పాఠం చెప్పడం వరకే కాదు. ‘‘దీని తరువాత నా స్థాయిబట్టి నేనేం చేస్తే బాగుంటుంది, నేను ఏం చదవవచ్చు, నా మనస్తత్వం దేనికి సరిపోతుంది, గురువుగారూ, దయచేసి నాకు సలహా చెప్పండి’’ అనో, ‘‘సార్ ! నేను బాగా చదువుకోలేకపోతున్నాను. నాకు పాఠం అర్థం కావడం లేదు. దయచేసి నాకు ఇంకొక్కసారి చెప్పండి’’ అని మనసువిప్పి గురువుగారితోటి మీ కుటుంబసభ్యునిలా గౌరవించి మాట్లాడడం నేర్చుకోండి. ఆ వినయం అలవాటు పడిన నాడు, గురువుకి వశవర్తి అయిన నాడు తప్పకుండా వృద్ధిలోకి వస్తారు.

మహాజ్ఞాని, తత్త్వవేత్త, రాజనీతిజ్ఞుడు, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారి పుట్టినరోజున అంటే సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం కదా.. ఆ రోజున ఎవరో బయటివాళ్లను తీసుకువచ్చి ఉపన్యాసాలు చెప్పించి, పూలదండలు వేయించాలని ఆయన చెప్పలేదు. ఆయన ప్రసంగాలు శ్రద్ధగా చదివితే ఆయన మనస్సేమిటో తెలుస్తుంది. ఆయన కోరుకున్నదేమిటంటే... ‘‘ఆ రోజున నాకు పూలదండ వేయవద్దు. మీకు పాఠాలు చెప్పే గురువుగారు కూడా మీ కుటుంబసభ్యుడే అని గుర్తించండి