ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BRIEF INFORMATION ABOUT MANGALAGIRI PANAKALA SWAMY TEMPLE - GUNTUR DISTRICT - ANDHRA PRADESH - INDIA



మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం

మంగళగిరి గుంటూరు జిల్లాలోని ప్రముఖ పట్టణం. గుంటూరు - విజయవాడ జాతీయ రహదారి పై గుంటూరుకు 20 కి.మీ దూరంలో ఉన్న ఈ చారిత్రక పట్టణములో ప్రసిద్ధి చెందిన, పురాతనమైన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉన్నది. మంగళగిరి అనగానే పానకాల స్వామి స్ఫురణకు వస్తాడు.

* లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం

ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వాస్తవంగా రెండు దేవాలయాల కింద లెక్క. కొండ కింద ఉన్న దేవుడి పేరు లక్ష్మీనరసింహ స్వామి. కొండ పైన ఉన్న దేవుడిని పానకాల స్వామి అని అంటారు. కొండ పైని దేవాలయంలో విగ్రహమేమీ ఉండదు; కేవలం తెరుచుకుని ఉన్న నోరు ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది. ఆ తెరచుకొని ఉన్న రంధ్రమే పానకాల స్వామిగా ప్రజల నమ్మకం.మంగళగిరి పానకాలస్వామి కి ఒక ప్రత్యేకత ఉంది. పానకాలస్వామికి పానకం (బెల్లం, పంచదార, చెరకు) అభిషేకం చేస్తే, అభిషేకం చేసిన పానకంలో సగం పానకాన్ని స్వామి త్రాగి, మిగిలిన సగాన్ని మనకు ప్రసాదం గా వదిలిపెడతాడుట. ఎంత పానకం అభిషేకించినా, అందులో సగమే త్రాగి, మిగిలిన సగాన్ని భక్తులకు వదలడం ఇక్కడ విశేషం. అందుకనే స్వామిని పానకాలస్వామి అని పిలుస్తారు.

* గాలిగోపురం

మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తయినది.రెండు శతాబ్దాలను పూర్తిచేసుకుంది.మంగళగిరి గాలిగోపురాన్ని తొలగించి దానిస్థానే మళ్లీ అదేరీతిలోనూతనంగా కొత్త గోపురం నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తును కలిగి...కేవలం 49 అడుగుల పీఠభాగంతో గాలిలో ఠీవిగా నిలబడినట్టు కనిపిస్తూ సందర్శకులను అబ్బురపరిచే అద్వితీయ నిర్మాణమిది.దీనిని 1807-09 కాలంలో నాటి ధరణికోట జమిందారు శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు నిర్మించారు. ఈ గోపుర పీఠభాగం పూర్తిగా రాతిచే నిర్మితమైంది. ఈ రాతి కట్టడానికి అన్నీ వైపులా పగుళ్లు వచ్చాయి.గోపుర పీఠభాగం త్రీడీ లేజర్ స్కానర్‌ తో పునాదుల అంతర్భాగాన్ని స్కానింగ్ చేయించాలని భక్తులు కోరుతున్నారు.మంగళగిరి గోపురాన్ని ఈ ప్రాంత ప్రజలు వారసత్వ సంపదగా భావిస్తుంటారు.

* ధర్మగుణం ఇంకా ఉంది

పానకాలస్వామికి ఇక్కడ డ్రమ్ముల కొద్దీ పానకాన్ని తయారు చేస్తుంటారు. పానకం తయారీ సందర్భంగా కింద ఎంతగా ఒలికిపోయినా ఈగలు చీమలు చేరవట. సృష్టిలో ధర్మం పూర్తిగా నశించి యుగ సమాప్తి దగ్గరపడినపుడు మాత్రమే పానకం ఒలికినపుడు ఈగలు, చీమలు చేరడం ఆరంభమవుతుందని అంటారు. మద్రాసులోని సెయింట్‌ జార్జి ఫోర్ట్‌ గవర్నర్‌ రస్టెయిన్‌షామ్‌ మాస్టర్‌ మచిలీట్నం నుంచి మద్రాసు వెడుతూ 1679 మార్చి 22వ తేదిన మంగళగిరి చేరుకున్నాడు. ఆ రాత్రి ఆయన ఇక్కడే బసచేసి, ఈ మహత్తును గురించి విని, స్వయంగా కొండపైకి వెళ్లి పానకాలరాయుని సన్నిధిని పరిశీలనగా చూశారు. ఇదేదో గమ్మత్తుగా ఉందని, తనకైతే నమ్మశక్యంగా లేదన్నారు. మంగళగిరిలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. హేతువాదులు మంగళగిరి కొండ ఓ అగ్ని పర్వతమని, దీనిలో గంధకం ఉందని, ఎప్పటికైనా పేలిపోయే ప్రమాదముందని, ఆ విపత్తు నుంచి మంగళగిరిని రక్షించేందుకే, గంధకాన్ని ఉపశమింపజేసేందుకే, నిత్యం పానకాన్ని నివేదించాలని, పూర్వీకులు దేవుని పేరిట ఈ ఏర్పాటు చేశారని వాదిస్తుంటారు.

* శాసన స్తంభం

ప్రధాన వీధిలో, రామాలయం వద్ద శాసన స్తంభం వీధి అనే వీధి ఉంది. ఈ వీధిలో ఎనిమిది ముఖాలు కలిగిన ఒక శాసనం ఉంది. ఈ కారణం చేత ఈ వీధికి ఆ పేరు వచ్చింది. ఈ శాసనంలో 46 పంక్తులు తెలుగులోను, 4 పర్షియన్ ‍లోను వ్రాసి ఉన్నాయి. 1565 నుండి మంగళగిరి గోల్కొండ కుతుబ్‌ షాహిల పాలనలో ఉండేది. 1593లో కుతుబ్‌ షాహి వృత్తి పన్ను బాగా పెంచేసాడు. అది కట్టలేని చేనేత కార్మికులు మచిలీపట్నం వంటి ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసిన సుల్తాను వాళ్ళను వెనక్కి రప్పించమని తన సేనాధిపతి ఖోజా ఆలీని ఆదేశించాడు. ఖోజా ఆలీ పుల్లరి తీసివేస్తున్నట్లు, ఇతర పన్నులను నాలుగు వాయిదాలలో కట్టవచ్చని ప్రకటించి అదే విషయాన్ని ఈ శాసనంపై వ్రాయించాడు.

* పెద్ద కోనేరు

మంగళగిరి మధ్యలో, అర ఎకరం వైశాల్యంలో కోనేరొకటుంది. దీని పేరు కల్యాణ పుష్కరిణి. 1558 లో విజయనగర రాజుల అధీనంలో ఉండగా దీనిని తవ్వించారు. చాలా లోతైన ఈ కోనేటికి నాలుగు వైపుల మెట్లు ఉన్నాయి. లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి చెందిన ఈ కోనేటిలో రెండు బావులు ఉన్నట్లుగా చెబుతారు. గుడికి తూర్పున శివలింగం కలదు. 1832 నాటి కరువులో కోనేరు ఎండిపోయి, 9,840 తుపాకులు, 44 గుళ్ళు బయట పడ్డాయి. ఇవి పిండారీలకు చెందినవి. కోనేటి అడుగున బంగారు గుడి ఉందని ప్రజలు అనుకుంటారని 1883లో గార్డన్‌ మెకెంజీ కృష్ణా జిల్లా మాన్యువల్‌న్‌ లో రాసాడు. 19వ శతాబ్దిలో మారెళ్ళ శీనయ్యదాసు కోనేటిలో ఆంజనేయ స్వామి గుడిని నిర్మించి రెండెకరాల స్థలాన్ని దానమిచ్చాడు. శతాబ్దాలపాటు ప్రజలీ కోనేటి నీటితో దేవునికి అభిషేకం జరిపించారు. 2004లో కృష్ణా పుష్కరాల సందర్భంగా కోనేటికి ప్రహరీగోడ నిర్మించారు.

* జయ స్తంభం - కృష్ణదేవరాయల శాసనం

పానకాలస్వామి దేవాలయం (కొండమీది గుడి) మెట్ల మొదట్లో ఈ శాసనం ఉంది. శ్రీ కృష్ణదేవరాయలచే ఈ శాసనం ప్రతిష్ఠింపబడినదని చెబుతారు. వాస్తవానికి ఇది రాయల మహామంత్రి సాళువ తిమ్మరుసుకు చెందినది. 1515 జూన్‌ 23 న శ్రీ కృష్ణదేవరాయలు కొండవీటిని జయించి ఈ శాసనం వ్రాయించాడు. రాయల విజయాన్ని సూచించే ఈ స్తంభాన్ని జయ స్తంభం అన్నారు. అమరావతి పాలకుడైన నాదెండ్ల తిమ్మయ్య ఇచ్చిన 19 దానశాసనాల ప్రసక్తికూడా దీనిపై ఉన్నది. దీనిలోని 198వ వరుస నుండి 208వ వరుస వరకు మూడు ముఖ్యమైన చారిత్రక సమాచారాలు ఉన్నాయి.

198. గతి మిధున క్రోధఖెలా మనోగ్నం ప
199. రా వారాంకాకారం తటపుట ఘటితొత్థ
200. లతాలం థటాకం కృత్వా నాదిండ్లయప్ప
201. భు రక్రుతతరాం విప్రసాధాథుకూరౌ
202. శాకాబ్దే గజరామ వార్ధిమహిగే ధాథ్రా
203. ఖ్యవర్షే ఘనం ప్రాసాదం నవహేమకుం
204. భకలిథం రమ్యం మహామంతపం స్రిమన్మం
205. గళ షైల నఢ హరయే నాదింద్లయప్ప ప్రభు
206. గ్రామం మంగళ శైలవామకమపి ప్రాధాత్‌
207. నృసింహాయచ శాకబ్దే బ్రహ్మవహ్ని శృ
208. తిశశిగణితే చేశ్వరాఖ్యే వర్షే రేటూరి గ్రామ

1516 లో ఒక మండపం తొమ్మిది కుంభాలను నిర్మించారు. ఇప్పటి 11 అంతస్తుల గాలి గోపురానికి అప్పట్లో మూడంతస్థులే ఉండేవి. ఆ మూడింటిని తిమ్మయ్య కట్టించాడని ప్రతీతి. శాసనం ప్రకారం నరసింహస్వామి గుడికి ఈ పట్టణాన్ని దానమిచ్చారు. దేవునికి దానమిచ్చిన ఈ భాగాలను దేవభూమి లేదా దేవస్థాన గ్రామంగా పిలిచేవారు కనుక విజయనగర రాజ్యంలో మంగళగిరి ఒక దేవభూమి.

* చారిత్రక ప్రాధాన్యత

లక్ష్మీనరసింహస్వామి గుడిమీద (కొండ కింది గుడి)గల రాతి చెక్కడాలకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. 1558లో సదాశివ రాయలు విజయనగర రాజ్యాన్ని పాలించేటపుడు, అప్పటి కొండవీటి సామంతుడు తిమ్మరాజయ్యచే ఈ చెక్కడం లిఖించబడింది. అప్పట్లో రాజ్యంలోని వారసుల్లో తిరుమల రాజు ఒకడు. అతడు తిమ్మరాజయ్యకు మేనమామ. ఈ 143 పంక్తుల చెక్కడంలో తిమ్మరాజయ్య ఇచ్చిన దానాల వివరాలు ఉన్నాయి. అందుకే దీనిని ధర్మ శాసనం అని అంటారు.

చెక్కడాలపై నున్న వివరాలు ఇలా ఉన్నాయి: పన్నులు తొలగించబడ్డాయి. విజయనగర సామంత రాజైన తిరుమలరాజు 28 గ్రామాలలోని 200 కుంచాల భూమిని (10 కుంచాలు = 1 ఎకరం) గుడికి దానమిచ్చాడు. నంబూరు, తాళ్ళూరు, నల్లపాడు, మేడికొండూరు, వీరంభొట్ల పాలెం (రాంభొట్ల వారి పాలెం?), తాడికొండ, పెదకొండూరు, గొడవర్తి, దుగ్గిరాల, ఉప్పలపాడు, వడ్లమాను, కుంచెన పల్లి, కొలనుకొండ, ఆత్మకూరు, లాం, గోరంట్ల, గోళ్ళమూడిపాడు, నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, శాఖమూరు గ్రామాల్లో భూమిని దానం చేసాడు. వాణిజ్య మండలి ముఖ్యుడైన పాపిశెట్టిని మంగళగిరికి అధికారిగా నియమించారు. ఈ చెక్కడంపై ముగ్గురు రాజ వంశీకుల ప్రస్తావన ఉన్నది. వారు: సదాశివ రాయలు, తిరుమల రాజు, తిమ్మరాజు. వారు జరిపిన ఉత్సవాలు, గుడికి చేసిన అభివృద్ధి గురించి కూడా ప్రసక్తి ఉన్నది. గుడి కొరకు 5 విధాల విగ్రహాలను, 10 రకాల ఉత్సవ రథాలను తయారు చేయించారు, కోనేటిని తవ్వించారు, పూల తోటలను పెంచారు.

* పాలకులు

మంగళగిరి క్రీ.పూ.225 నాటికే ఉనికిలో ఉన్నట్లు తెలుస్తోంది. ధాన్యకటకం రాజధానిగా క్రీ.పూ.225 నుండి క్రీ.శ.225 వరకు పాలించిన ఆంధ్ర శాతవాహనుల రాజ్యంలో మంగళగిరి ఒక భాగం. క్రీ.శ.225 నుండి క్రీ.శ.300 వరకు ఇక్ష్వాకులు పరిపాలించారు. ఆ తరువాత మంగళగిరి పల్లవుల ఏలుబడిలోకి వచ్చింది. పిమ్మట కంతేరు రాజధానిగా పాలించిన ఆనందగోత్రిజుల అధీనంలోకి వచ్చింది. క్రీ.శ.420 నుండి క్రీ.శ.620 వరకు విష్ణు కుండినులు మంగళగిరి ని పరిపాలించారు. రెండవ మాధవ వర్మ విజయవాడ రాజధానిగా చేసుకొని మంగళగిరిని పరిపాలించాడు. క్రీ.శ.630 నుండి చాళుక్యుల ఏలుబడి సాగింది.

1182 నాటి పలనాటి యుద్ధం తరువాత మంగళగిరి కాకతీయుల పాలనలోకి వచ్చింది. 1323లో, ఢిల్లీ సుల్తానులు కాకతీయులను ఓడించాక మంగళగిరిపై సుల్తానుల పెత్తనం మొదలయింది. 1353లో, కొండవీడు రాజధానిగా రెడ్డి రాజులు పాలించారు. 1424లో, కొండవీడు పతనం చెందాక, మంగళగిరి గజపతుల ఏలుబడిలోకి వచ్చింది.

1515లో శ్రీ కృష్ణదేవ రాయలు గజపతులను ఓడించిన తరువాత మంగళగిరి విజయనగర రాయల అధీనమయింది. విజయనగర రాజ్యంలోని 200 పట్టణాలలో మంగళగిరి ఒకటి. 1565లో జరిగిన తళ్ళికోట యుద్ధంతో విజయనగర రాజ్య పతనం పరిపూర్ణమైన తరువాత, మంగళగిరికి గోల్కొండ కుతుబ్‌షాహీలు ప్రభువులయ్యారు. కుతుబ్‌షాహీలు కొండవీడు రాజ్యాన్ని 14 భాగాలుగా విభజించగా వాటిలో మంగళగిరి ఒకటి. మంగళగిరి విభాగంలో 33 గ్రామాలు ఉండేవి. 1750 నుండి 1758 వరకు ఫ్రెంచి పాలనలోను, 1758 నుండి 1788 వరకు నిజాము పాలనలోను ఉన్నది.

1788, సెప్టెంబర్ 18న, హైదరాబాదు నవాబు అయిన నిజాము ఆలీ ఖాను గుంటూరును బ్రిటీషు వారికి ఇచ్చివేసాడు. బ్రిటీషు వారు వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు ను ఈ ప్రాంతానికి జమీందారుగా నియమించారు. ఆయన లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి గోపురం నిర్మింపజేసాడు. 1788 నుండి 1794 వరకు ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారి సర్క్యూట్‌ కమిటీ మంగళగిరిని పాలించింది. 1794లో సర్క్యూట్‌ కమిటీని రద్దుచేసి, 14 మండలాలతో గుంటూరు జిల్లాను ఏర్పాటు చేసారు. 1859లో, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాతో ఏకమై, మళ్ళీ 1904, జనవరి 10న విడివడి ప్రత్యేక జిల్లాగా రూపొందింది. అప్పటినుండి మంగళగిరి గుంటూరు జిల్లాలో భాగంగా ఉంటూ వచ్చింది.

* ప్రముఖుల సందర్శనలు

ప్రాచీన కాలం నుండి, మంగళగిరి చేనేతకు, వైష్ణవ మతానికి ప్రసిద్ధి చెందింది. ఎందరో చారిత్రక ప్రముఖులు మంగళగిరిని సందర్శించారు. వారిలో అద్వైత సిద్ధాంతకర్త ఆది శంకరాచార్యులు, విశిష్టాద్వైతాన్ని ప్రవచించిన రామానుజాచార్యులు, ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మధ్వాచార్యులు ప్రముఖులు. వల్లభాచార్యులు ఇక్కడి నుండే తన ప్రవచనాలను వినిపించాడు. చైతన్య మహాప్రభు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. ఆయన పాద ముద్రలు కొండ వద్ద కనిపిస్తాయి అంటారు. తాళ్ళపాక అన్నమాచార్యుని మనుమడు, తాళ్ళపాక చిన తిరుమలయ్య 1561లో రామానుజ సమాజానికి ఇక్కడ భూమి దానం చేసాడు.

శ్రీ కృష్ణదేవరాయల కాలంలో ఆయన మంత్రి తిమ్మరుసు మంగళగిరిని సందర్శించి, విజయస్థూపం నిర్మింపజేసాడు. కొండవీటి మంత్రి సిద్ధరాజు తిమ్మరాజు గుడిని అభివృద్ధి చేసి, దానికి భూదానం చేసాడు. అబ్బన కవి ఇక్కడి దేవాలయాన్ని అనేక సార్లు సందర్శించాడు. తన అనిరుద్ధ చరిత ను నరసింహస్వామికి అంకితమిచ్చాడు.

1594లో గోల్కొండ సుల్తాను కుతుబ్‌ ఆలీ మంగళగిరిని సందర్శించాడు. వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు జమీందారు హోదాలో అనేక పర్యాయాలు పర్యటించాడు. మహమ్మద్ ఆలీ కుతుబ్‌ షా మంగళగిరికి వచ్చినపుడు పన్ను భారాన్ని తగ్గించి, శాసన స్థంభాన్ని నిర్మించాడు. 1679, మార్చి 22న ఈస్ట్‌ ఇండియా కంపెనీ ముఖ్య అధికారి - స్ట్రైన్‌ షాం మాస్టర్‌ ఇక్కడి దేవాలయాన్ని దర్శించాడు. 1820, నవంబరు 20న తంజావూరు రాజు శరభోజి గుడిని దర్శించి, దక్షిణావర్త శంఖాన్ని బహూకరించాడు.