ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BRIEF HISTORY OF TENALI RAMA KRISHNA IN TELUGU - THANKS TO SRI Vinjamuri Venkata Apparao GARU FOR HIS ARTICLE


తెనాలి రామకృష్ణ.!
.
తెనాలి రామకృష్ణుఁడిగా ప్రసిద్ధికెక్క్కిన ఈ మహాకవి యొక్క అసలు పేరు :
గార్లపాటి రామలింగయ్య. జననం క్రీ.శ. 1495. ఊరు తెనాలి. గుంటురు జిల్లా, తెనాలిసమీపంలోని గార్లపాడు వీరి పూర్వీకుల నివాసం. ఎప్పుడో వచ్చితెనాలిలో స్థిరపడ్డారు. ప్రథమశాఖ నియోగి. కౌండిన్యస గోత్రుడు. ఇతన్ని కన్న ధన్యజీవులు: తల్లి లక్కమాంబ, తండ్రి రామయ్య. 

ఈయన తొలిదశలో శైవుడు. గురువు పాలగుమ్మి ఏలేశ్వరుడు. అతిపిన్న వయసులోనే సంస్కృతాంధ్ర కావ్యాలూ, నాటకాలూ చదివి, అలంకారాలూ, వ్యాకరణం, ఛందస్సు, ఆశుకవిత్వంలో నిష్ణాతుడయ్యాడు. అప్పట్లోనే అతనికి "కుమారభారతి" అనే బిరుదు కూడా వుండేది. శివకవిగా “ఉధ్భటారాధ్య చరిత్రము” అనే శైవకావ్యాని వ్రాశాడు.

బ్రతుకుతెరువుకోసం, రాజాదరణ సంపాదించడానికి తెనాలి నుండి ముందుగా కొండవీటి ఆస్థానానికి, అక్కడినుంచి హంపీలోని రాయలవారి భువనవిజయానికీ చేరుకున్న రామలింగకవి, వైఖాసన సాంప్రదాయ వైష్ణవమతావలంబియై, రామకృష్ణుఁడిగా అవతరించాడు. అతనికి వైష్ణవ దీక్షనొసగిన గురువు శ్రీ భట్టరు చిక్కాచార్యులవారు. అక్కడ “కందర్పకేతు విలాసం" , "హరిలీలా విలాసం” మొదలైన కావ్యాలు వ్రాశాడు.

"ప్రౌఢకవి"గా “పాండురంగమాహత్మ్యం” అనే బృహత్కావ్యాన్ని, అవసానదశలో “శ్రీ ఘటికా చలమాహత్మ్యము” అనే మహాకావ్యాన్నీ రచించాడు. ఈ ఆఖరిగ్రంధానికి అవతారిక వ్రాయకుండానే - అంటే దాన్ని ఎవరికీ అంకితమివ్వకుండానే - 95 ఏళ్ళ సుధీర్గ జీవన యానం తరువాత, పరమ పద సోపానాన్నధిరోహించాడు. ఆయన్ని తీసుకెళ్ళడానికి పరమశివుని ప్రమధగణాలూ, శ్రీమహావిష్ణువు యొక్క దూతలూ చెరో దివ్య విమానాన్నీ తీసుకువచ్చి వాదులాడుకొని ఉంటారు !

తెనాలి రామలింగని గురించి బహుళ ప్రచారంలో ఉన్న హాస్యకథల జోలికిగానీ, భువనవిజయానికి వచ్చిన వివిధ పండితుల్ని ఆయన తన తెలివితేటలతోనో, కుతంత్రంతోనో (ఉదాహరణకి: తిలకాష్టమహిషబంధనము, మేక-తోక పద్యం వగైరాలు) తికమకపెట్టేసి భువనవిజయం యొక్క పరువు నిలబెట్టిన ఉదంతాలగురించిగానీ నేను ఇక్కడ ప్రస్తావించదలచుకోలేదు. కేవలం ఈ మహాకవియొక్క సాహితీ ప్రజ్ఞాపాటవం గురించి ముచ్చటించడమే నా ఉద్దేశం.
అల్లసానివారి అల్లికజిగిబిగి
ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకు
పాడురంగవిజయు పద గుంఫనంబును - అన్నారు పండితులు.

ఈ మహాకవి రచనలలో మూడు గ్రంథాలు మాత్రమే ఇప్పుడు లభ్యాలు.
అవి - 1) ఉద్భటారధ్యచరిత్రము,
2) పాండురంగ మాహత్మ్యము,
3) ఘటికాచలమాహత్మ్యము.
తెనాలి రామకృష్ణుని కొన్ని పద్యాలు...



చీపర బాపర తీగల

చేపల బుట్టల్లినట్లు చెప్పెడి నీ యీ

కాపు కవిత్వపు కూతలు

బాపన కవి వరుని చెవికి ప్రమదంబిడునే !!

శర సంధాన బల క్షమాది వివిధైశ్వర్యంబులన్‌ గల్గి దు

ర్భర షండత్వ బిల ప్రవేశ కలన బ్రహ్మఘ్నతల్‌ మానినన్‌

నర-సింహ-క్షితి మండలేశ్వరుల నెన్నన్‌ వచ్చు నీ సాటిగా

నరసింహక్షితి మండలేశ్వరుని కృష్ణా ! రాజ కంఠీరవా !

( అర్జునుడు, సింహము, క్షితి - ఈ మూడింటిలోని లోపాలు గణించక పోతేనే

వీటిని నీతో పోల్చ వచ్చు అని భావం. ఐతే ఒక పాదం లో సింహం తో

పోల్చ రాదంటూనే పద్యం చివర ‘రాజ సింహమా’ అని పిలవడం ఏం సబబు ?

అని తప్పు చూపించి తెనాలి రామకృష్ణ కవి చెప్పిన పద్యం)

కలనన్‌ తావక ఖడ్గ ఖండిత రిపు క్ష్మా భర్త మార్తాండ మం

డల భేదంబొనరించి యేగునెడ తన్మధ్యంబునన్‌ తార కుం

డల కేయూర కిరీట భూషితుని శ్రీ నారాయుణుం గాంచి లో

గలగంబారుతునేగె నీవయనుశంకన్‌ కృష్ణరాయాధిపా !!

(ఇంకో పద్యం)

నరసింహ కృష్ణ రాయని

కరమరుదగు కీర్తి యొప్పె కరిభిత్‌ గిరిభిత్‌

కరి కరిభిత్‌ గిరి గిరిభిత్‌

కరిభిత్‌ గిరిభి త్తురంగ కమనీయంబై !

(‘కుంజర యూధంబు..’ అనే సమస్యా పూరణ నిచ్చినందుకు కోపం తో)

గంజాయి తాగి తురకల

సంజాతుల గూడి కల్లు చవి గొన్నావా

లంజల కొడకా ఎక్కడ

కుంజర యూధంబు దోమ కుత్తుక సొచ్చెన్‌ !!

(అదే సమస్యను రాయల వారు అడిగినప్పుడు)

రంజన చెడి పాండవులరి

భంజనులై విరటు గొల్వ పాల్పడి రకటా

సంజయ విధి నే మందును

కుంజర యూధంబు దోమ కుత్తుక సొచ్చెన్‌ !!

(‘గొల్వు పాలై రకటా’ అని పాఠాంతరం)

(నంది తిమ్మన ను పొగడుతూ)

మా కొలది జానపదులకు

నీ కవనపు ఠీవి యబ్బునే ! కూపనట

ద్భేకములకు గగనధునీ

శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా !

(మూడో పాదంలో ‘గగన ధునీ’ అనే ప్రయోగాన్ని ‘నాక ధునీ’ అని మార్చి ‘రాజ కవి’

(కృష్ణ రాయలు) ‘కవి రాజు’ (రామకృష్ణుడు) ప్రశంసను పొందాడని ప్రతీతి)

(వాకిటి కాపరి తిమ్మడికి రాయలిచ్చిన పచ్చడాన్ని కాజేయటానికి

ముగ్గురు ఇతర దిగ్గజాలతో పధకం వేసి చివరి పాదంతో

పచ్చడం కొట్టేసాడు రామకృష్ణ కవి )

వాకిటి కావలి తిమ్మా !

ప్రాకటముగ సుకవి వరుల పాలిటి కొమ్మా !

నీకిదె పద్యము కొమ్మా !

నాకీ పచ్చడమె చాలు నయముగ నిమ్మా !!

(ధూర్జటి ని స్తుతిస్తూ రాయలు :

స్తుతమతి యైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల కల్గెనీ

యతులిత మాధురీ మహిమ ?

(దానికి రామకృష్ణుని కూమత్కార సమాధానం)

హా తెలిసెన్‌ భువనైక మోహనో

ద్దత సుకుమార వార వనితా జనతా ఘన తాప హారి సం

తత మధురాధరోదత సుధా రస ధారల గ్రోలుటంజుమీ

ఈ పద్యాలు రామలింగని సమయ స్పూర్తిని, కవితా పటిమను చాటి చెపుతాయి.