loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARTICLE ABOUT IMPORTANCE OF THOLI EKADASI FESTIVAL 04-07-2017


తొలి ఏకాదశి
.
ఆషాఢ శుద్ధ ఏకాదశి- తొలి ఏకాదశి. హైందవులకు ఇది మహా పర్వదినం. దీన్ని ‘హరివాసరం’ అని, ‘శయనైకాదశి’ అని పిలుస్తారు. ఈ పర్వదినాన హరినామ సంకీర్తనం ప్రశస్తం కనుక, ఇది హరివాసరమైంది. క్షీరాబ్ధిలో శేషపాన్పు పైన శ్రీమహావిష్ణువు శయనించడం వల్ల, దీన్ని ‘శయనైకాదశి’ అంటారు. ఈరోజు నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు.
.
సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో మొదటిది అత్యంత శ్రేష్ఠమైంది. ఈ పర్వదినాన ‘గోపద్మ వ్రతం’ ఆచరిస్తారు. నేటినుంచి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు ‘చాతుర్మాస్య వ్రతం’ అవలంబిస్తారు. అనేక వ్యాధులకు మూలమైన క్రిమికీటకాలు సంచరించే వర్షకాలం ఇది. ఈ కాలంలో శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది, ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి, మర్నాడు పారణ చేసి, ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు.
పురాణగాథ ప్రకారం- యమభటులు తమ దుందుభుల కోసం చర్మం కావాలని కోరారు. చాతుర్మాస్య, గోపద్మ వ్రతాలు ఆచరించనివారి భార్యల నుంచి అది తెమ్మని ఆయన తన దూతల్ని పంపించాడట. నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు, ద్వారక లోని స్త్రీలందరితోనూ ఆ వ్రతం చేయించాడు. గంగ వంటి తీర్థం, తల్లి వంటి గురువు, విష్ణువు వంటి దైవం, నిరాహారం వంటి తపం, కీర్తి వంటి ధనం, జ్ఞానం వంటి లాభం, ధర్మం వంటి తండ్రి, వివేకం వంటి బంధువు, ఏకాదశి వంటి వ్రతం లేవని భవిష్య, స్కంద పురాణాలు తెలియజెబుతున్నాయి.
.
కృతయుగంలో మురాసురుడు తనకు లభించిన బ్రహ్మవరం వల్ల అహంకారపూరితుడయ్యాడు. దేవతలను, మునులను, నరులను హింసించసాగాడు. మహావిష్ణువు అతడితో వెయ్యేళ్లు యుద్ధం చేసి అలసిన స్థితిలో, ‘సింహవతి’ అనే గుహలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు స్వామి దేహం నుంచి ఓ కన్య ఉద్భవించి ఆ అసురుణ్ని సంహరించింది. అందుకు ఎంతగానో సంతసించిన ఆయన వరం కోరుకొమ్మన్నాడు. ఆమె- ఏకాదశి తిథిగా, విష్ణుప్రియగా లోకారాధ్య కావాలని కోరుకుంది. అప్పటి నుంచే ‘తొలి ఏకాదశి’ వ్యవహారంలోకి వచ్చిందని మరో పురాణ కథనం.
దూర్వాస మహర్షి శాపం నుంచి విముక్తి పొందడానికి అంబరీష మహారాజు హరిభక్తి పరాయణుడయ్యాడు. ఏకాదశి వ్రతం ఆచరించి, నియమ నిష్ఠలతో ఉపవసించి, విష్ణు సాయుజ్యం పొందాడంటారు.
.
అలాగే ‘సతీ సక్కుబాయి’ తొలి ఏకాదశి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వర్తించి, మహావిష్ణువులో ఐక్యం చెందిందట.
.
దుర్భర దారిద్య్రంలో మగ్గిన కుచేలుడు ఈ వ్రతం చేసి వాసుదేవుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడని చెబుతారు. అందువల్ల అతడు సిరిసంపదలు, సకల సౌఖ్యాలు అనుభవించగలిగాడంటారు.
.
‘రుక్మాంగదుడు’ స్వయంగా తాను ఏకాదశి వ్రతం ఆచరిస్తూనే, రాజ్యంలోని ప్రజలందరితోనూ చేయించాలని సంకల్పించాడు. దీని వల్ల యమలోకానికి చేరే పాపుల సంఖ్య తగ్గిపోతుందన్న ఆందోళనతో- వ్రతభంగం చేసి రమ్మని యముడు రంభను పంపాడు. ఆమె మోహిని రూపంలో వెళ్లి రుక్మాంగదుణ్ని ఆకర్షించింది. అదే పుణ్యదినాన అతణ్ని కోరిన రంభను, మరేదైనా అడగమన్నాడు రుక్మాంగదుడు. ‘నీ పుత్రుణ్ని వధించు’ అని రంభ పరీక్షపెడితే, అందుకు సిద్ధపడ్డాడట. విష్ణువు ప్రత్యక్షమై, రుక్మాంగదుడి వ్రతదీక్షను ప్రశంసించి, మోక్షం ప్రసాదించాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

ఏకాదశి- పదకొండు సంఖ్యకు సంకేతం. అయిదు కర్మేంద్రియాలు, అయిదు జ్ఞానేంద్రియాలు, మనసు- వెరసి పదకొండింటి పైనా నియంత్రణ కలిగి వ్రతం ఆచరించాలన్నది ఈ పండుగ సందేశం.
.
ఏకాదశి వ్రతంలో- రాముడు, కృష్ణుడు, శివుణ్ని స్మరించటం; ఆదిత్యుడికి అర్ఘ్యప్రదానం, ఉపవాసం, గంగాస్నానం, వ్రతకథా శ్రవణం, జాగరణ, గోదాన భూదానాలు ప్రధానమైన అంశాలు. ఇవి పాటిస్తే- అశ్వమేధ యాగఫలం, అరవై సంవత్సరాల తపోఫలం ప్రాప్తిస్తాయని ‘స్మృతి పురాణం’ చెబుతోంది.
ఈ వర్షరుతువు ఆరంభంలో, సరిపడని ఆహారాన్ని త్యజించి ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాలన్నదీ పండుగ సంకేతమే.
.
ఆషాఢ మాసాన తొలకరి జల్లులతో నేలతల్లి పులకరిస్తుంది. అన్నదాతల లోగిళ్లలో కోటి ఆశల కాంతులు నింపుతుంది.
.
ఈ మాసంలోనే బోనాలు, పశుపూజ, శకట ఆరాధనలు చేస్తారు.
ప్రసన్నత, శాంతి, సాత్విక చింతన, దానధర్మాలు, జ్ఞాన పిపాసలకు తొలి ఏకాదశి చక్కని అవకాశాలు కల్పిస్తుంది. భగవన్నామస్మరణ ద్వారా మోక్షాసక్తిని పెంపొందింపజేస్తుంది.


loading...