ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARTICLE ABOUT KUMARARAMAM TEMPLE - SAMALKOT - EAST GODAVARI DISTRICT - ANDHRA PRADESH - INDIA


కుమారారామం, సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా

ఈ క్షేత్రంలో అమృతలింగ శకలాన్ని కుమార స్వామి ప్రతిష్ఠ చేశారు. అందుకే దీనికి కుమారారామం అని పేరు. ఈ ప్రాంతాన్ని షుమారు క్రీ.శ. 624 నుండి క్రీ.శ. 1076 వరకు వేంగీ చాళుక్యుల పరిపాలించారు. వీరి వంశానికి మూల పురుషుడైన కుబ్జ విష్ణువర్ధనుడి నుంచి చివరి రాజైన ఏడవ విజయాదిత్యుని వరకు షుమారు 30 మంది రాజులు ముందు పిష్టపురము (నేటి పిఠావురము), తరువాత రాజమహేంద్రవరము(నేటి రాజమండ్రి) రాజధానిగా చేసుకుని పరిపాలించారు. వారి ఆదరణలో ఈ ఆలయాలు చాలా అభివృధ్ధిచెందాయి.

ఈ ఆలయంలో వున్నశిల్ప సంపద వారి కాలంనాటిదే. ఈ వంశీకుడైన రాజ రాజ నరేంద్రుడే (క్రీ.శ 1060) గోదావరీ తీరాన రాజమహేంద్రవరం నిర్మించింది. అంతేకాదు. కవిత్రయంలో మొదటివాడైన నన్నయ చేత సంస్కృత మహాభారతమును తెలుగులో వ్రాయించి తెలుగు సాహిత్యంలో ఒక నూతనయుగానికి నాంది పలికినవాడుకూడా ఈయనే.

చారిత్రక ఆధారాల ప్రకారం క్రీ..శ. 872 నుండి 921 వరకు మొదటి చాళుక్య భీమ నృపాలుడు కుమారారామమును రాజధానిగా చేసుకుని పాలించాడు. ఈయన దాదాపు 300 యుధ్ధాలలో విజయం సాధించినట్లు శాసనాలవల్ల తెలుస్తోంది. బహుశా యుధ్ధాలలో ఈయన సాధించిన విజయాలకు కృతజ్ఞతతో, భీమేశ్వర స్వామిపట్ల తనకుగల భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా ఈ ఆలయాన్ని నిర్మింప చేసినట్లు తెలుస్తోంది. ఈయన పేరుతోనే ఈ ఆలయాన్ని చాళుక్య భీమారామం అన్నారు (బిర్లా కట్టించిన ఆలయాలను బిర్లామందిర్లన్నట్లు). ఊరుకూడా చాళుక్య భీమవరం అయింది (రోడ్డుకి అవతలవైపు సామర్లకోట ఇవతల భీమవరం) . ఆ కాలంలో ఇక్కడ వ్యాప్తిలో వున్న బౌధ్ధసంప్రదాయ ప్రభావం వల్లనే పంచారామాలలో ఆరామ శబ్దం వచ్చి వుండచ్చని ఒక కధనం.

ఈ ఊరి పేరు వెనుక వున్న వేరే కధలు... పూర్వం ఇక్కడ వైష్ణవ స్వాములు ఎక్కువగా వుండేవారనీ, వాళ్ళకి ఈ గ్రామం చాలా సురక్షితంగా వుండేదనీ, అందుకే స్వాముల కోట అనేవారు, అదే సామర్లకోట అయిందని ఒక కధ. ఇంకో కధ...శ్యామలాంబ గుడి, దాని చుట్టూ కోటవుండేవనీ, అందుకే శ్యామలకోట అని పిలిచేవారనీనూ. ఏ కధలు ఎలా వున్నా శ్రీనాధ కవి రచనల ద్వారానూ, లభ్యమయిన శిలా శాసనాల ద్వారానూ చాళుక్య భీమవరం, కుమారారామం అన్నవే పూర్వకాలంనుంచీ స్ధిరంగా వున్న పేర్లు అని నిరూపితమవుతోంది.

* ఆలయ విశేషాలు

ఈ ఆలయం వాస్తులో ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని పోలి వుంటుంది. ఈ దేవాలయం చుట్టూ ఇసుక రాతితో కట్టబడిన రెండు ప్రాకారాలున్నాయి. బయటి ప్రాకారానికి నాలుగు వైపులా నాలుగు గోపురాలున్నాయి. లోపలి ప్రకారంలో రెండు అంతస్తుల భీమేశ్వరాలయం వుంది. క్రింది అంతస్తులో ప్రతిష్టింపబడిన శివ లింగము చాలా ఎతైనది. పూజలు రెండవ అంతస్తులో జరుగుతాయి.

గుడి ప్రాంగణంలో భీమేశ్వరాలయాన్ని పోలిన ఒక చిన్న నమూనా గుడి వుంది. బహుశా గుడి కట్టటానికి ముందు స్ధపతి గుడి నిర్మాణంలో మార్గదర్శకంగా వుంటుందని ఈ నమూనాను చెక్కి వుండవచ్చు. ఆలయంలో ప్రవేశిస్తూనే కనిపించే నందీశ్వరుని ఏకశిలా విగ్రహం ఒక ఆద్భుత సజీవ శిల్పం. ఇక్కడి శిల్పంలో మరో విశేషమేమిటంటే ప్రతి శిలా స్తంబమూ దేనికదే ప్రత్యేకమయినది. ఏ రెండు స్తంబాలూ ఒక్కలా వుండవు. ప్రతి స్తంబములోనూ ఏదో ఒక శిల్ప వైవిధ్యాన్ని ప్రదర్శించారు.

ఈ దేవాలయంలో క్రీ.శ. 1447 నుండి క్రీ.శ. 1494 మధ్య జారీ చేసిన 31 శాసనాలున్నాయి. వీటిలో కొన్నిటి ఆధారంగా తూర్పున వున్న ముఖ మండపం నిర్మాణం క్రీ.శ. 1394 లోనూ, శ్రీ ముఖమండపం నిర్మాణం క్రీ.శ. 1422 లోనూ జరిగినట్లు తెలుస్తోంది.

స్వామి దర్శనం కోసం రెండవ అంతస్తుకి వెళ్ళటానికి గర్భగుడికి రెండు వైపులా రెండు ద్వారాలున్నాయి. దక్షిణ ఆగ్నేయం వైపుది సూర్య ద్వారము, ఉత్తర ఈశాన్యం వైపుది చంద్ర ద్వారము. ఈ రెండు మార్గాలూ గర్భగుడికి రెండు నాసికా రంధ్రాల్లాగా అనిపిస్తాయి. మానవుడి నాసికా రంధ్రాలలో ఎడమది చంద్రనాడి, కుడిది సూర్యనాడి. యోగి ఈ రెండు నాడుల ద్వారా చేసే ప్రాణాయామం ప్రక్రియద్వారా తన ప్రాణమును సహస్రారమున చేర్చి, ఆ ప్రాణముతో తన మనస్సుకూడా అక్కడ చేర్చి భగవదనుభవంచేత ఆనందమయుడై విరాజిల్లుతాడు. ఇది యోగమార్గం. ఇక్కడ స్వామి యోగలింగాకృతి ధరించి వున్నాడు. ఈ స్వామి దర్శనం కూడా ఈ యోగ మార్గాన్నే వెల్లడిస్తూంటుంది.

శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామి దేవేరి శ్రీ బాలా త్రిపుర సుందరి ఈ తల్లిని చూడటానికి రెండు కళ్ళూ చాలవు. ఆలయంచుట్టూ వున్న చిన్న చిన్న గుళ్ళల్లో బ్రహ్మ, సరస్వతి, సూర్యుడు, మహిషాసుర మర్దని మొదలగు అనేక దేవతామూర్తుల విగ్రహాలున్నాయి. ఇక్కడ సరస్వతి సకల విద్యా ప్రదాయిని. మహిషాసురమర్దని విగ్రహం త్రవ్వకాలలో బయటపడింది. దీనిని కొండవీటి రాజైన కాటయ వేమారెడ్డి 15 వ శతాబ్దిలో ప్రతిష్టించినట్లు చెబుతారు. ఈవిడకే శ్యామలా శక్తి అనే పేరు కూడా వున్నది.

ఈ ఆలయ నిర్మాణంలో ఇంకో విశేషం.. చైత్ర, వైశాఖ మాసాలలో సూర్యుని కిరణాలు ఉదయం పూట స్వామివారి పాదాలను, సాయంత్రం పూట అమ్మవారి పాదాలనూ తాకుతాయి. ఆలయం పడమటి గోడలో వజ్ర గణపతి విగ్రహం వుంది. పూర్వం ఈయన నాభిలో ఒక వజ్రం వుండేదిట. దానినుంచి వచ్చే ఆద్భుత కాంతులే రాత్రి పూట భక్తులకు మార్గదర్శకంగా వుండేవిట. భీమేశ్వరుని ఆలయం ఎదురుగా తూర్పు దిక్కులో వున్న పుష్కరిణి పేరు భీమ పుష్కరిణి.

* నిర్వహణ

ఈ మధ్య ఈ ఆలయానికి భక్తుల రాక పెరుగుతోంది. 1964 నుంచీ ఈ ఆలయం కేంద్ర పురావస్తుశాఖ అధీనంలో వున్నది. ఉత్సవ నిర్వహణ, ఆదాయ వ్యయాలు రాష్ట్ర దేవాదాయ శాఖ నిర్వహణలో వున్నాయి. ఆలయాభివృధ్ధికి స్ధానికులతో ఏర్పడిన ధర్మకర్తల మండలి కృషి చేస్తుంది.

* ఉత్సవాలు

కార్తీక, మార్గశిర మాసాలలో నిత్యం అభిషేకాలు జరుగుతూంటాయి. కార్తీక మాసంలో దీపాలంకరణ, సంకీర్తన, అన్నదానాది కార్యక్రమాలు జరుగుతూంటాయి. మాఘ బహుళ ఏకాదశినాడు స్వామి వారికి గ్రామోత్సవం, అనంతరం కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతాయి. ఆ రోజు నుంచి మహా శివరాత్రి వరకూ ఉత్సవములు, అభిషేకములు, పూజలు పాంచాహ్నిక దీక్షతో జరుపబడతాయి.

* దర్శన సమయాలు

ఉదయం 5 గం. ల నుంచి 12 గంటల దాకా, సాయంత్రం 4 గం. ల నుంచి 9 గం. ల వరకు.

* మాండవ్య నారాయణ స్వామి ఆలయం

భీమేశ్వరాలయానికి 200 గజాల దూరంలో మాండవ్య నారాయణ స్వామి ఆలయం వుంది. ఈ స్వామిని త్రేతాయుగంలో మాండవ్యముని ప్రతిష్టించారు. క్రీ.శ. 650 లో విజయాదిత్యచోళుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...