శకుని
గాంధార రాజ్యము మహాభారత కాలములో భారత దేశమునకు పశ్చిమమున వున్నా రాజ్యము. ఇందు పుష్కలావతి ,తక్షశిల,పురుషపురములు ఇందలి ముఖ్య పట్టణములు. శ్రీరామా చంద్రుని తమ్ముడు భరతుడు ఈ భూభాగామునేలినట్లు ఐతిహ్యము.మహాభారత కాలానికి సుబలుడు గాంధార రాజు. ఆయనకు అచల,వృక్షక, వృహద్వల, సౌబల అన్న కొడుకులుంటారు. సౌబలుడే శకుని అని పెద్దలనగా విన్నాను.గాంధారి పెద్దది. శకుని అందరికన్నా చిన్నవాడు.
మహాభారత సమయములో, కురురాజుగా అభిషిక్తుడైన ధృతరాష్ట్రునికి భీష్ముడు పెళ్లి చేయాలనుకున్నాడు. ఈడు వచ్చిన యువకునికి పెళ్లిచేయాలనుకోవడంలో విశేషమేముంది కానీ, ఆ సమయంలో భీష్ముని ఊహల్ని ప్రధానంగా మరొకటి ఆక్రమించుకుంది. అప్పటికి కొన్నేళ్ళ క్రితమే కురువంశం ఆగిపోయే ప్రమాదం భయపెట్టింది. వ్యాసుని జోక్యంతో ఆ గండం గడిచింది. ఆ అనుభవం ఇప్పటికీ భీష్ముని ఆలోచనల్లో పచ్చిగానే ఉంది. కనుక ధృతరాష్ట్రుని పెళ్లిని మించి, ఆ పెళ్లితో కులం నిలిచే అవకాశమే అతనికి కొట్టొచ్చినట్టు కనిపించింది. విదురునితో ఆలోచనలను కలబోసుకున్నాడు. ఇక వధువు ఎవరన్న విషయానికి వస్తే, గాంధారరాజు సుబలుని కూతురు గాంధారి మంచి రూపమూ, లావణ్యమూ, శీలమూ, ఆభిజాత్యమూ కలిగిన కన్య అని బ్రాహ్మణుల ద్వారా విన్నాడు. పైగా వందమంది కొడుకులు కలిగేలా ఆమె వరం పొందిందని తెలిసి మరింత ముచ్చటపడ్డాడు. సుబలునితో మాట్లాడి రమ్మని కొంతమంది వృద్ధులను పంపించాడు.
ధృతరాష్ట్రుడు పుట్టంధుడు. అయినాసరే, సుబలుడు భీష్ముని కోరికను కాదనే అవకాశం లేదు. ఎందుకంటే, రాజు ధృతరాష్ట్రుడే కానీ, రాజ్యరక్షకుడు భీష్ముడే. అతడు పరాక్రమవంతుడే కాక, కాశీ రాజు కూతుళ్లను రాక్షసవివాహ పద్ధతిలో ఎత్తుకు వెళ్ళి, తన తమ్ముడు విచిత్రవీర్యునికి ఇచ్చి పెళ్లి చేసిన చరిత్ర అతనికి ఉంది. కనుక ఆ ప్రతిపాదనకు ఒప్పుకుని మర్యాద నిలుపుకోవడమే మంచిదని సుబలుడు అనుకొని ఉండవచ్చు. దాంతో, ‘గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చితి’నని బంధువుల మధ్య ప్రకటించినాడు. గాంధారి ఆ మాట విని తండ్రి మాటపై గౌరవముతో ధృతరాష్ట్రుని తన భర్తగా భావించింది. ఈ కళ్ళతో ఇక పరపురుషుని చూడరాదనుకుని నేత్రపట్టం కట్టుకుంది. ఓ రోజున సోదరుడైన శకుని గాంధారినీ, గొప్ప సంపదనూ వెంటబెట్టుకుని హస్తినాపురానికి విచ్చేయుటతో గాంధారీ-ధృతరాష్ట్రుల వివాహం వైభవంగా జరిగిపోయింది.చక్రవర్తుల సంబంధమగుటచే శకుని హస్తినలోనే నిలిచి పోయెను. ఇంకొక విషయము ఇక్కడ వున్నది . శకుని గాన్దారికన్నా చాల చిన్నవాడు. తోడుగా ఉండుటకు కూడా వుండిపోయి ఉండవచ్చును.
ఇక్కడ ఒకచిన్న ప్రస్తాపన. గాంధార రాజైన సుబలుడు ఆస్థాన జ్యోతిష్యులతో తన కుమార్తెకు పెళ్ళయిన తక్షణమే వైద్యము వచ్చునని ఎరిగినవాడై ముందామెను ఒక మేకపోతుకు కట్టి దాని చంపినపిమ్మట ధృతరాష్ట్రునికిచ్చి పెళ్ళిచేసెనని ప్రతీతి. కౌరవ పాండవులు బాల్యమందు మాత్సర్యముచే కౌరవులు 'రండా పుత్రు' లని తిడితే పాండవులు వారిని 'ముండాపుత్రు'లన్నారనీ ఆ కోపముతో వయసు వచ్చిన తరువాత దుర్యోధనుడు గాన్దారము పై యుద్ధము ప్రకటించి సుబలుని అతని కుమారులందరినీ చెరసాలలోబంధిస్తే,వారికి వేసే తిండి మెతుకులు అన్నీ కలిపి శకునికి పెట్టి వారు మరణిచినారనీ సుబలుడు చనిపోతూ తన వెన్నెముక లోని ఎముకలతో పాచికలు తయారుచేసుకొని శకునిని వుంచుకొమ్మన్నాడని, దుర్యోధనుని వినాశము కోరినవాడై ఆ పాచికలతో ధర్మరాజును ఓడించి ఆ తరువాత వచ్చే యుద్ధములో దుర్యోధనుని పాండవులు మట్టుపెడతారని ఊహించియే అట్లు చేసినాడని ఒక ప్రచారముంది. దీని మూలములు భారతము నందు కనిపించవు. పైగా సుబలుడు తన పరివారముతో రాజసూయమునకు వచ్చినాడని, యాగము ముగిసిన తరువాత గౌరవంగా అతనిని ధర్మజుడు సాగానంపినాడని భారతమున కలదు. భారత యుద్ధములో సుబలుని వారసులు కౌరవుల పక్షమున పోరాడినారని కూడా యున్నది.
శకుని జన్మనామము సౌబలుడని విన్నాను.ఇది కూడా సుబలుని కుమారుడైనందువల్ల నేమో. శకుని గాంధారికన్నా బాగా చిన్నవాడు అని ముందుగానే చెప్పుకోన్నాము.దుర్యోధనునికన్నా బహు కొద్ది సంవత్సరములు పెద్దవాడు అయివుండవచ్చు. అందువల్లనే అతని సహవాసము దుర్యోధనునితో ఎక్కువ బావయైన ధృతరాష్ట్రునితో తక్కువ.బావను చేరి తన మాట వినిపించిన ఉదంతమేదియు భారతమున కానరాదు. సార్వభౌమత్వము పై కామము,తనను అది చేరనందువల్ల క్రోధము అదే సర్వస్వమన్న మోహము తో నున్న దుర్యోధనునకు, మదించిన దుశ్శాసనుడు,తాను పొందిన రాజ్యము దానినిచ్చిన సార్వభౌమునికి తానే సన్నిహితునిగా ఉండాలన్న లోభము కలిగిన కర్ణుడు,తనకు దక్కినస్థానము వేరెవరికీ దక్క కూడదనుకొన్న శకుని దుర్యోధనుని ఆవహించియుండగా అతనికి బంధ విముక్తి బొందె వదిలితేనే కదా. కావున అన్ని విధములైన కుతంత్రములలో మొదలు శకుని పిదప కర్ణుడు ఆపై తందానా తానాకు దుశ్శాసనుడు, చచ్చేవరకు అంటిపెట్టుకొనే ఉండిపొయినారు.
మయ సభలో జరిగిన అవమానమునకు ప్రతీకారముగా జూదమాడి తాను రాజ్యాన్ని సంపాదించి పెడుతానని శకుని దుర్యోధనునితో అంటాడు. సభా పర్వములోని 20,21,22 శ్లోకాలు ఏమితెలుపునంటే 'దుర్యోధనా! జూడమాడుటలో నాకు ఎవరూ సాటి రారు. మీ తండ్రిని ఒప్పించి ధర్మరాజుతో జూదమునకు ఏర్పాటు చేయి.ధర్మజుని రాజ్యలక్ష్మిని సంపూర్తి గా నీకు స్వాధీనమొనర్తు'నని శకుని ఒప్పించినాడు. ఇక్కడే మనకర్థమౌతుంది. శకునికి ధృతరాష్ట్రునివద్ద కానీ, మిగిలిన కురు వృద్ధ ,గురు వృధ్ధ బాంధవుల వద్ద కానీ ఎటువంటి పరపతీ లేదని. దుర్యోధనుడు అందరినీ ఒప్పించుటలో కృతకృత్యుడైనాడు. ఇక శకుని జూదములొ గెలుచుటయే ఆలస్యము.
ఆచార విధానాలు రెండు విధములు. ఒకటి శిష్ఠాచారము రెండవది వామాచారము. ధర్మరాజుది శిష్టాచారమైతే శకునిది వామాచారము. పాచికల విషయములో 'అక్షహృదయ'మను విద్య శిష్టాచారమునకు సంబంధించినదైతే 'పాశాధిష్ఠాత్రీ' అనునది వామాచారమునకు సంబంధించిన విద్య. జూదమాడే సమయమునకు ధర్మ రాజుకు 'అక్షహృదయము' తెలియదు కానీ శకునికి 'పాశాధిష్ఠాత్రి' సమగ్రంగా తెలుసు. అందుకే అతను, దుర్యోధనుని చేత, మొదటి సారి మాత్రమే పందెము పెట్టించినాడు. తరువాత వరుస విజయములచేత పందెము పెట్టించే అవసరమే కలుగలేదు శకునికి. ( ఈ విషయమును బ్ర.శ్రీ.వే. మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి ద్వారా తెలుసుకొన్నది. ) ఇంతటి ఘాతుకమును తలపెట్టిన శకుని ప్రాణములను యుద్ధములో తీసెదనని ప్రతిన పూనుతాడు సహదేవుడు.
ధర్మజుడు ఈ అక్షహృదయమనే విద్యను అరణ్య వాసములో వున్నప్పుడు బృహదశ్వుడు అను మహర్షి అనుగ్రహముతో నేర్చుకొంటాడు కానీ ఆ తరువాత ఈ ఆట ఆడే అవసరము ధర్మరాజుకు ఏర్పడలేదు.
రాయభారము విఫలమగుటతో ఇరువైపులా యుద్ధమునకు సిద్ధమౌతారు. భీష్ముడు శరతల్పగతుడౌతాడు. ద్రోణుడు విగతుడౌతాడు కర్ణుడు సైన్యాధ్యక్షుడౌతాడు. 17వ రోజున యుద్ధము భీకరంగా జరుగుతూ వుంటుంది. ఆ మహాసంగ్రామములో సహదేవుడు శకునికి ఎదురౌతాడు .
శకుని కుతంత్రుడే కానీ కువీరుడు కాదు. అతడు సహదేవుడితో తలపడి పది బాణములు అతడి శరీరంలో గ్రుచ్చుతాడు. ఆ దెబ్బకు సహదేవుడు మూర్ఛిల్లగా అది చూసి భీముడు శకుని ముందున్న గాంధార సైన్యమును నాశనం చేయసాగుతాడు. అది చూసి కౌరవసేనలు పారి పోగా సుయోధనుడు ధైర్యం చెప్పి వారిని ముందుకు పురికొల్పుతాడు .సహదేవుడు మూర్ఛ నుండి తేరుకుని శకుని మీద పది బాణములు ప్రయోగించి అతడి విల్లు ఖండించుతాడు. శకుని వేరొక విల్లు తీసుకొని సహదేవుడి మీద శరవర్షం కురిపించఉతాడు. శకుని కుమారుడైన ఉలూకుడు సహదేవ, భీమసేనుల మీద బాణవర్షం కురిపించగా సహదేవుడు కోపించి ఒకే ఒక బల్లెము విసిరి ఉలూకుడి తల ఖండించుతాడు. తన కుమారుడు తన కళ్ళ ముందే చనిపోవడం చూసి చలించిన శకుని ఆగ్రహోదగ్రుడై సహదేవుడి మీద మూడు బాణములు వేయగా సహదేవుడు ఆ మూడు బాణములను ఖండించి శకుని విల్లు విరిచి వేస్తాడు. శకుని మహా కోపంతో సహదేవునిపై కత్తిని, గధను, బల్లెమును ప్రయోగించాడు.సహదేవుడు వాటిని మధ్యలోనే ఖండించగా అది చూసి శకుని తన రధ రక్షకులతో సహా అక్కడి నుండి పారి పోతాడు. సహదేవుడు అతడిని నిలువరించి " ఓ గాంధార రాజా ! రాజ ధర్మం విడిచి ఇలా పారి పోవడం నీవంటి సుక్షత్రియునకు తగదు.
నాడు జూదం ఆడిననాడు చూపిన చాతుర్యం ఇప్పుడు చూపు. నీవు ఆడించిన మాయా జూదంకు ఫలితం చూసావు కదా సర్వనాశనం అయింది. నాడు జూదంలో ఓడి పోయి తలలు వంచుకున్న మా కోపాగ్ని జ్వాలలల ఫలితం చూచితివి కదా! మమ్ము అవమానించినందుకు సుయోధనుడు తన వారందరిని పోగొట్టుకుని అనుభవిస్తున్నాడు. ఆ సుయోధనుడు చూస్తుండగా నీ తల తెగి నేలను ముద్దాడేలా కొడతాను " అని అంటూ సహదేవుడు శకుని రధాశ్వములను, కేతనమును, విల్లును ఖండించగా అది చూసి శకుని అత్యంత భయంకరమైన శక్తి ఆయుధమును సహదేవుడి మీద విసిరుతాడు. సహదేవుడు ఆ శక్తి ఆయుధమును ఖండించి రెండు చేతులలో రెండు బల్లెములను తీసుకొని అత్యంత వేగంగా శకుని మీద వేసి అతడి తల ఖండించి వేస్తాడు. శకుని తల నేల పడగానే శరీరం కూడా నేల మీదకు వాలిపోతుంది.
మహాభారత యుద్ధానికి కారణ భూతుడైన గాంధార రాజు శకుని సహదేవుడి చేతిలో మరణించాడు.ఆ విధంగా సహదేవుడు తన ప్రతిజ్ఞ నేరవేర్చుకొంటాడు.