వెజిటేరియన్ మాంసం
మాంసకృత్తులు మన శరీర నిర్మాణంలో ముఖ్యమైన పదార్థాలు. కండరాల బలానికి ఇవి చాలా అవసరం. అలాగే కణజాలల పనితీరు, అంతర్గత అవయవాల ఆరోగ్యానికి ప్రొటీన్లు ఎంతగానో అవసరం అవుతాయి. మాంసకృత్తులని ప్రాణ్యములు అనీ, ప్రొటీన్లు అని వీటిని పిలుస్తారు. గ్రీకు భాషలో ‘ప్రోటోస్’ అంటే ముఖ్యమైనది అని అర్థం. అమినో యాసిడ్స్...
ఇరవెరైండు రకాల అమినో యాసిడ్స్ వేరు వేరు తరహాల్లో ఒక దానికి ఒకటి అనుసంధానితమై మన శరీరంలో ఎన్నో రకాల ప్రొటీన్లుగా తయారవుతాయి. ఉదాహరణకు... శిరోజాలకు, గోళ్లకు, ఎముకలకు, హార్మోన్లకు, కండరాలకు... ఇలా ప్రతీ దానికీ వేరు వేరు మోతాదుల్లో ప్రొటీన్ అవసరం అవుతుంది. ఈ ప్రోటీన్ సమకూర్చడం అన్నది ఇరవై రెండు రకాల అమినో యాసిడ్స్ ద్వారా సాధ్యమౌతుంది. ఈ ప్రక్రియ మొత్తం ఆర్.ఎన్.ఎ, డి.ఎన్.ఎ పర్యవేక్షణలో జరుగుతుంది. (ఆర్.ఎన్.ఎ, డి.ఎన్.ఎ ప్రత్యేకమైన ప్రొటీన్లు. వీటిలో మన జీవన విధానాన్ని నిర్దేశించే జన్యువులు ఉంటాయి). అయితే వీటిలో ఎనిమిది రకాల అమినో యాసిడ్స్‌ని శరీరం స్వయంగా తయారుచేసుకోలేదు. అందుకని వీటిని తప్పనిసరిగా ఆహారం ద్వారానే తీసుకోవాలి. వీటినే ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటారు.
శరీరంలో ప్రొటీన్లు అమినో యాసిడ్స్‌తో తయారవుతాయి. అన్ని రకాల ప్రొటీన్లు జీర్ణం అయ్యాక అమినో యాసిడ్స్‌గా మారి రక్తంలోకి వెళ్తాయి. అక్కడ నుంచి ఈ అమినో యాసిడ్స్ మళ్లీ మన శరీరానికి అవసరమైన కొత్త ప్రొటీన్‌గా రూపొందుతాయి. మాంసం, చేపలు, గుడ్లు, పాలు, మొదలైన జంతు సంబంధమైన వనరుల నుండి లభించే ప్రొటీన్లు తీసుకునేవారికి ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. అయితే పప్పులు, కాయగూరలు తీసుకునే శాకాహారులు కూడా ప్రొటీన్లు ఉండే సమతుల ఆహారం తమ భోజనంలో ఉండేలా చూసుకుంటే వారి ఆరోగ్యం బాగుంటుంది.
ప్రొటీన్ల వల్ల ఉపయోగాలు...
శరీర నిర్మాణానికి, ఎదుగుదలకు, ఎముకల బలానికే కాకుండా హార్మోన్ల పనితీరుకు, రోగనిరోధక కణాల కోసం, జీర్ణకోశ రసాయనాల విడుదలకు, ఎర్ర రక్త కణాల పునరుజ్జీవానికి ప్రొటీన్ల అవసరం ఎంతైనా ఉంది. పెరిగే వయసులో సరైన ఎదుగుదలకే కాదు, ఒకసారి ఎదిగిన తర్వాత శరీరాన్ని సరిగ్గా మెయింటనెన్స్ చేయడానికి కూడా ప్రొటీన్ల సహాయం తప్పనిసరి. అంతేకాదు ప్రొటీన్లు శక్తినీ, శరీరానికి తగినంత వేడిని అందిస్తాయి.ప్రొటీన్లు శరీరానికి తగినంతగా అందకపోతే...
జుట్టు రాలిపోవడం, గోళ్లు విరిగిపోవడం, చర్మం పొడిబారడం, రక్తహీనత, నీరసంగా ఉండటం, కండరాలు క్షీణత, లైంగికంగా బలహీనంగా అనిపించడం, చురుకుదనం లోపించడం... వంటివి జరుగుతాయి. వీటిలో ప్రొటీన్లు ఎక్కువ...
పాలు, మాంసం, గుడ్లలో ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అధికంగా ఉంటాయి.
తల్లిపాలలో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అందుకే మొదటి ఏడాది ఇవి బిడ్డకు కావల్సిన బలాన్ని ఇస్తాయి. అందుకే తప్పనిసరిగా
తల్లిపాలు శిశువుకి ఇవ్వాలని, అవి శిశువు భవిష్యత్తు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అంటారు.
గింజధాన్యాలను నేరుగా కంటే, కొద్దిగా ఉడికించి తీసుకుంటే, త్వరగా జీర్ణమై ఇందులోని ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. అలా అని గింజ ధాన్యాలను ఎక్కువ ఉడికించడం, ఉడికించిన నీరు పారబోయడం వంటివి చేస్తే ప్రొటీన్లను కోల్పోయే అవకాశం ఉంటుంది.
మిగతా చిక్కుడు జాతి గింజలతో పోల్చితే సోయాలో ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయి.
వెజ్‌లో ప్రొటీన్లు...
బాదం, జీడిపప్పు, శనగలు, వేరుశనగలు, చిక్కుళ్లు, గుమ్మడి, పొద్దుతిరుగుడు, నువ్వులు, వాల్నట్స్, కందిపప్పు, బీన్స్, సోయా బీన్స్, బఠాణీ, బార్లీ, దంపుడు బియ్యం, ఓట్మిల్, గోధుమ...
గుడ్డులో...
తొమ్మిది నుంచి పదకొండు సంవత్సరాల వయసు గల విద్యార్థులలో పౌష్టికాహార నిపుణులు జరిపిన పరిశోధనల్లో తేలిన విషయం ఏంటంటే... ఉదయాన్నే అల్పాహారంలో ప్రోటీన్లు ఎక్కువ శాతం ఉన్న ఆహారం తీసుకున్న వారిలో మెదడు పనితీరు చురుకుగా ఉన్నట్టు వెల్లడైంది. అయితే శరీరానికి కావలసిన ప్రొటీన్లను అందించకుండా టీ, కాఫీల ద్వారా నేరుగా చక్కెరను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందవు. ఫలితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి.
100 గ్రా.ల పదార్థాలలో ప్రొటీన్ల శాతం...
మాంసాహారం, గుడ్డు, సోయా, కాయ గింజలు, పప్పు దినుసులు, నట్స్, పాలలో ఎక్కువ శాతం, కొద్ది మోతాదులో బియ్యం, గోధుమలలోనూ ప్రొటీన్లు ఉంటాయి.
సోయా - 40 %
కోడిగుడ్డు - 13%
మాంసం - 20 %
తృణధాన్యాలు - 10%
బియ్యం - 7%
ఆకుకూరలు, పండ్లు, దుంపలు - 2%
కొవ్వు తీసేసిన నూనె గింజలు - 50- 60%
(తెలగపిండి)వయసుల వారీగా ఒక రోజుకు కావలసిన ప్రొటీన్లు
పురుషులకు - 60 గ్రా.; స్ర్తీలకు - 50 గ్రా.
గర్భవతికి - 50+15 గ్రా.; పాలిచ్చే తల్లులకు - 50+25 గ్రా. (12 నెలల వరకు)