ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Showing posts with label Sumathi Satakam Poems. Show all posts
Showing posts with label Sumathi Satakam Poems. Show all posts

SUMATHI SATAKAM POEM ABOUT MOM AND KIDS


అమ్మా’ అని పిలిచి అన్నం పెట్టుమని అడగాలి. 
.
ఇమ్ముగ జదువని నోరును
నమ్మా యని పిలిచి యన్నమడుగని నోరున్
తమ్ముల బిలువని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!

భావం: --

మనిషి జ్ఞానవంతుడు కావాలంటే బాగా చదువుకోవాలి.
కన్నతల్లిని అప్యాయంగా ‘అమ్మా’ అని పిలిచి అన్నం పెట్టుమని అడగాలి.
తనకంటె చిన్నవారైన సోదరులను ప్రేమతో దగ్గరకు రమ్మని పిలవాలి.
ఈ పనులనన్నిటినీ నోటితోనే చేయాలి.
ఈ మూడు పనులనూ సరిగా చేయని నోరు... కుమ్మరి కుండలను తయారుచేయటానికి ఉపయోగించే మట్టి కోసం తవ్వగా ఏర్పడిన గొయ్యి వంటిది.
మానవులకు మాత్రమే నోటితో మాట్లాడే శక్తి ఉంది. ఆ శక్తిని మంచి పద్ధతిలో ఉపయోగించుకోవాలని ఈ పద్యంలో చెబుతున్నాడు కవి.

SUMATHI SATAKAM POEM ABOUT A BAD SON


సుమతీ శతకాన్ని రాసిన బద్దెన తన శతకంలో అనేక విషయాలను అందరికీ అర్థమయ్యే భాషలో తెలియచేశాడు. 
ఈ పద్యంలో అప్రయోజకుడయిన కుమారుడి గురించి వివరించాడు.
.
కొఱగాని కొడుకుపుట్టిన
కొఱగామియె కాదు తండ్రి గుణములు చెరచున్
చెఱకు తుద వెన్ను పుట్టిన
చెఱకున తీపెల్ల చెరచు సిద్ధము సుమతీ!
.
ప్రయోజకుడు కాని కొడుకు పుడితే, అతడు ప్రయోజకుడు కాకపోవటమే కాకుండా, తండ్రిలో ఉన్న సుగుణాలకు చెడ్డపేరు తీసుకువస్తాడు. చెరకుగడ చివర కంకి మొలిస్తే, మొలిచిన చోట తీపి ఉండదు. అక్కడ లేకపోవటమే కాక, గడలో ఉన్న తీపినంతటినీ కూడా ఈ కంకి చెడగొడుతుంది. ఇది ప్రపంచమంతటా ఉన్న సత్యం.
కొఱగాని కొడుకు అంటే ఏపనీ చేతకానివాడు, నేర్చుకోని వాడు, ఏ పనీ చేయనివాడు అని అర్థం. ఇలాంటివారినే అప్రయోజకులు అని కూడా అంటారు. 

కొందరు పిల్లలు ఏ పనీ చేయకుండా, బద్దకంగా, సోమరిగా ఉంటారు. అంతేకాక పనికిమాలిన పనులు అంటే చేయకూడని పనులు చేస్తూ, తండ్రి పేరు చెడగొడతారు. అందరిచేత చివాట్లు తింటారు. అటువంటి కుమారుడిని చెరకులో పుట్టిన వెన్నుతో పోల్చి చెప్పాడు బద్దెన. ప్రపంచంలో ఉండే నిజాలు తెలిస్తేనే కాని ఇటువంటి వాటితో పోలిక చెప్పలేరు.

SUMATHI SATAKAM POEM AND ITS MEANING


సరసము విరసము కొఱకే
పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే
పెరుగుట విరుగుట కొఱకే
ధర తగ్గుట హెచ్చుట కొఱకె తథ్యము సుమతీ!
.
(సుమతీ శతకం)
.
భావం : మనసుకు ఆనందం కలిగించేలా మాట్లాడటం, చేష్టలు చేయటం... ఇవన్నీ దుఃఖం కలగటానికే. పరిపూర్ణ సుఖం కలగటం అంటే ఎక్కువ కష్టాలు అనుభవించటానికే. వృద్ధి చెందటం అంటే క్షీణించటం కోసమే. ఒక వస్తువు ధర తక్కువ కావటం అంటే పెరగటం కోసమే. ఇది వాస్తవం.
ప్రతిపదార్థం : సరసము అంటే ఆనందం కలిగించేలా మాట్లాడటం, పనులు చేయటం; విరసము కొరకే అంటే బాధలు కలగటం కోసమే; పరిపూర్ణ అంటే పూర్తిస్థాయిలో; సుఖంబులు అంటే సౌఖ్యాలు; అధిక అంటే ఎక్కువ కావటం, బాధల కొరకే అంటే కష్టాల కోసమే; పెరుగుట అంటే వృద్ధిచెందటం; విరుగుట కొరకే అంటే నశించిపోవటానికే; ధర అంటే వెల; తగ్గుట అంటే తగ్గటం; హెచ్చుట కొరకే అంటే అధికం కావటం కోసమే; తథ్యము అంటే వాస్తవం.
జీవితంలో కష్టసుఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి. కష్టాలకు కుంగిపోవడం, సుఖాలకు పొంగిపోవడం మంచిది కాదని పెద్దలు చెబుతారు. అధిక ధనం వచ్చింది కదా అని గర్వంతో విర్రవీగకూడదు. అది కొన్నిరోజుల తరవాత మన దగ్గర నుంచి వెళ్లిపోవచ్చు. అలాగే ఇబ్బందులలో ఉన్నామని కుంగిపోకూడదు. ఆ ఇబ్బందులు కూడా ఎన్నో రోజులు ఉండవు. కొన్నాళ్ల తరవాత సుఖాలు వరిస్తాయి. అందుకే ‘పెరుగుట తరుగుట కొరకే’ అనేది నిత్య జీవితంలో వాడుకలోకి వచ్చింది. ఇందుకు చంద్రుడు చక్కని ఉదాహరణ - పదిహేను రోజులకుఒకసారి పౌర్ణమి వస్తే, మరో పదిహేను రోజులకు అమావాస్య వస్తుంది. అదే జీవితం. సుఖదుఃఖాలు రెండింటినీ సమదృష్టితో చూస్తూ స్థితప్రజ్ఞత చూపాలని కవి ఈ పద్యంలో వివరించాడు.