ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Showing posts with label Subramanya Shashti Festival Articles. Show all posts
Showing posts with label Subramanya Shashti Festival Articles. Show all posts

TELUGU STORY ABOUT SRI SUBRAHMANYA SWAMY PUTTUKA - BIRTH STORY OF LORD SRI MURUGAN IN TELUGU


శ్రీ సుబ్రహ్మణ్యస్వామి పుట్టుక…

“పూర్వకాలంలొ హిమవంతుడు అనే పర్వత రాజు, ఆయన భార్య మనోరమ ఉండేవాళ్ళు. వాళ్ళ పెద్ద కుమార్తె గంగ, రెండవ కుమార్తె ఉమ. స్వేచ్ఛగా ప్రవాహించగలిగే గుణమున్న గంగని స్వర్గలోకానికి పంపిస్తే ఆ నదీ జలాలని ఉపయోగించుకొని మేము తరిస్తామని దేవతలు హిమవంతుడిని అడుగగా, దేవకార్యము కనుక హిమవంతుడు సరే అన్నాడు. అలా దేవనదిగా గంగ స్వర్గంలొ ప్రవహించేది. ఆయన రెండవ కుమార్తె తన తపస్సు చేత కాముడినిదహించిన శివుడికి అర్ధాంగి అయ్యి, హైమవతిగా తన తండ్రి పేరు నిలబెట్టింది. పరమ పావని అయిన గంగ ఒకనాడు భూలోకానికి తేవబడి పాతాళానికి చేరింది, 3 లోకములలొ ప్రవహించినది కనుక గంగని త్రిపథగ అని పిలుస్తారు" అని విశ్వామిత్రుడు చెప్పాడు.

మీరు విషయాలని మనస్సుకి అతుక్కున్నేటట్టు చెప్పగలరు, కావున నదులన్నిటిలోకి పరమ పవిత్రమైనది, మనుష్యుల పాపములు హరించగలిగినది అయిన గంగని గూర్చి మాకు ఇంకా విస్తారంగా చెప్పవలసిందిగా రాముడు విశ్వామిత్రుడిని ప్రార్ధించాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు...." పార్వతి పరమేశ్వరులు కైలాసంలో 100 దివ్య సంవత్సరాలు క్రీడించారు. ఈ విషయం విన్న దేవతలకి ఆశ్చర్యమేసింది, పార్వతీదేవి - శంకరుడి తేజస్సులు అసామాన్యమైనవి, కాబట్టి వాళ్ళ కలయిక వల్ల జన్మించే భూతాన్ని మనం తట్టుకోలేము అని అనుకున్నారు. ఈ దేవతలంతా బయలుదేరి కైలసానికి వెళ్ళి శంకరుడిని ప్రార్ధించారు. అప్పుడు శంకరుడు బయటకి వచ్చాడు. అప్పుడు వాళ్ళు ఆయనతో, స్వామీ! మీరు పార్వతీదేవితో 100 దివ్యసంవత్సరాల నుంచి క్రీడిస్తున్నారు, మీ తేజస్సు కనుక వేరొక ప్రాణి రూపంలో వస్తే, మేము ఎవరము దానిని తట్టుకోలేము, కావున మీరు మీ తేజస్సుని మీలోనే పెట్టుకొని పార్వతీదేవితో తపస్సు చేసుకోండి అన్నారు.

వాళ్ళు చెప్పినదానికి శంకరుడు సరే అన్నాడు, కాని ఇప్పటికే రేతస్థానము నుంచి నా తేజస్సు కదిలింది, ఇప్పుడు దాన్ని ఎవరు భరిస్తారు, దాన్ని ఎక్కడ వదిలిపెట్టను అని శంకరుడు అడిగాడు. అప్పుడు ఆ దేవతలు.....
యత్ తేజః క్షుభితం హి అద్య తద్ ధరా ధారయిష్యతి |
మీ తేజస్సుని భూమి భరిస్తుంది, కావున భూమి మీద వదిలిపెట్టండి అన్నారు. శంకరుడు అలానే భూమి మీద తన తేజస్సుని వదిలిపెట్టాడు. వదిలిన ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది. ఇంతలో పార్వతీదేవి బయటకి వచ్చి, నాకు బిడ్డ పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమి మీద పతనం చేశారు. కావున.....
అపత్యం స్వేషు దారేషు న ఉత్పదయితుం అర్హథ |
అద్య ప్రభృతి యుష్మాకం అప్రజాః సంతు పత్నయః ||
ఏవం ఉక్త్వా సురాన్ సర్వాన్ శశాప పృథివీం అపి |
అవనే న ఏక రూపా త్వం బహు భార్యా భవిష్యసి ||
న చ పుత్ర కృతాం ప్రీతిం మత్ క్రోధ కలుషీకృతా |
ప్రాప్స్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రం అనిచ్ఛతీ ||
మీ దేవతలు అందరూ వచ్చి నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీకెవరికీ మీ భార్యలందు బిడ్డలు పుట్టరు. నా భర్త అయిన శంకరుడి తేజస్సుని భరించడానికి భూమి ఒప్పుకుంది కాబట్టి, ఇకనుంచి భూమి అనేక రూపాలు పొందుతుంది, ఒకే కాలంలో భూమికి అనేక భర్తలుంటారు, భూమి తన కొడుకుల వలన సిగ్గుతో తల వంచుకుంటుందని శపించింది. ఇది విన్న దేవతలు తలలు వంచుకొని తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు.

వ్యాపించిన ఆ శంకరుడి తేజస్సుని భూమి కూడా తట్టుకోలేకపోయింది. అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి ఈ రుద్ర తేజస్సుని తనయందు పెట్టుకోమన్నారు. అప్పుడు అగ్ని ఆ తేజస్సుని తనలో పెట్టుకున్నాడు.
శంకరుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోడానికి పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు, తను పార్వతీ పరమేశ్వరుల బిడ్డడి చేతిలోనే చనిపోయేటట్టు వరం పొందాడు. ఇది తెలిసిన దేవతలకి ఏమి చెయ్యాలో తెలీక బ్రహ్మగారి దెగ్గరికి వెళ్లారు. అప్పుడు బ్రహ్మగారు ఆలోచించి, హిమవంతుడు - మనోరమల కుమార్తెలైన గంగా - పార్వతులకి తేడా లేదు, కావున పార్వతీదేవి అక్క అయిన గంగలో ఈ తేజస్సుని విడిచిపెడితే, పార్వతీదేవికి కోపం రాదు. కాబట్టి ఆ శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టమన్నారు. అప్పుడా దేవతలు గంగమ్మ దెగ్గరికి వెళ్ళి, దేవకార్య నిమిత్తము నువ్వు అగ్ని దెగ్గరనుంచి శివ తేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి అన్నారు. దేవతా కార్యము కనుక గంగ సరే అన్నది. అప్పుడు గంగ ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది. శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలేసింది. ఈ తేజస్సుని నేను భరించలేను, నన్ను ఏమి చెయ్యమంటారు అని అడిగింది. అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సుని కైలాస పర్వతం పక్కనున్న భూమి మీద వదిలింది.

అలా భూమి మీద పడ్డ ఆ తేజస్సు యొక్క కాంతివంతమైన స్వరూపం నుంచి బంగారం, వెండి పుట్టాయి, ఆ తేజస్సు యొక్క మలం నుంచి తగరము, సీసము పుట్టాయి, ఆ తేజస్సు యొక్క క్షారం నుంచి రాగి, ఇనుము పుట్టాయి, మిగిలిన పదార్థం నుంచి మిగతా ధాతువులన్ని పుట్టి గనులుగా ఏర్పడ్డాయి. అక్కడ బంగారు పొదలుగా, శరవణ పొదలు పుట్టాయి. అక్కడే ఉన్న తటాకం నుండి ఒక పిల్లవాడి ఏడుపు వినిపించింది. పుట్టిన ఆ పిల్లాడికి పాలు ఎవరు పడతారు అని దేవతలు ఆలోచిస్తుండగా, పార్వతీదేవి అంశ అయిన కృత్తికలు ఆ పిల్లవాడికి మా పుత్రుడిగా కార్తికేయుడు( కృత్తికల పుత్రుడు ) అని పిలవాలి, అలా అయితే పాలు పడతాము అన్నారు. దేవతలు సరే అన్నారు.
తతః తు దేవతాః సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్ |
పుత్రః త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి న సంశయః ||
ఈ మాట విన్న కృత్తికలు ఆనందంగా పాలు పట్టారు. ఆ పుట్టిన పిల్లవాడు 6 ముఖాలతో పుట్టాడు, ఏక కాలంలో 6 కృత్తికల స్తన్యమునందు 6 ముఖాలతో పాలు తాగాడు కనుక ఆయనకి షడాననుడు, షణ్ముఖుడు అనే పేర్లు వచ్చాయి. అలాగే అగ్నిదేవుడి నుండి బయటకి వచ్చిన శివ తేజస్సు కనుక ఆయనకి పావకి, అగ్నిసంభవహా అని నామాలు. అలాగే పరమశివుడి కుమారుడు కనుక ఆయనని కుమారస్వామి అని పిలిచారు. అలాగే శివుడి వీర్యము స్ఖలనమైతే పుట్టినవాడు కనుక, స్కందుడు అని పిలిచారు. పార్వతీదేవిలా అందంగా ఉంటాడు కనుక, అమ్మ అందం వచ్చింది కనుక మురుగన్ అని పిలిచారు. పరమశివుడికి ప్రణవార్ధాన్ని వివరించాడు కనుక స్వామిమలై అన్నారు".

TELUGU BHAKTHI ARTICLE ABOUT VALLI DEVASENA SAMETHA SRI SUBRAHMANYA SWAMY SWAROOPAM ANTHARARDHAM


వల్లీ,దేవసేనా,సమేత సుబ్రహ్మణ్యస్వామి స్వరూపంలో అంతరార్ధం.

వల్లీ అనే మాటకి తీగ, లత అని అర్ధం.


తీగ అల్లుకొని అలా పైకి వెడుతుంది క్రిందనే అలా ఉండిపోతే లాభంలేదు.

దానికో కొయ్యకావాలి ఆ కొయ్యని అల్లుకొని తీగ పైకి వెడుతూ ఉంటుంది.

పురాణాన్ని పరిశీలిస్తే సుబ్రహ్మణుడు చెట్టుగా మారిన ఘట్టం కూడా ఉంది.

లతా-వృక్షములు సాధారణంగా భార్యభర్తలుగా చెప్పబడతాయి.

ఒక తీగ చెట్టుకి అల్లుకున్నట్టుగా సుబ్రహ్మణ్యుడిని అల్లుకుంటుంది.

పురాణాలలో సంకేతవాదాలు, ప్రతీకవాదాలు ఉంటాయి..

క్రిందన తీగ(అనగా మనలో కుoడలిని) చుట్టలు చుట్టుకొని ఉంటే లాభం లేదు.

ఆ తీగ పైకి పాకాలి.

మూలాధారం నుంచి సుషుమ్న అనబడే వెన్ను కొయ్యని అల్లుకొని పైకి పాకుతున్న శక్తిలతే వల్లీ.

కుండలినీ శక్తి అనబడే ప్రాణశక్తి చేత అల్లుకోబడిన ఆత్మస్వరూపుడే సుబ్రహ్మణ్యుడు.

వల్లీ అనగా కుండలినీ శక్తి.

ఇంక దేవసేన:
యోగభాషలో, శాస్త్రభాషలో దేవతలంటే మన ఇంద్రియశక్తులు.

ఇంద్రియాధిదేవతలు.

మన పురాకృత సుకృతం బట్టి ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఇంద్రియంలో కూర్చుంటుంది.

దానితో మనం మంచి పని చేస్తే అక్కడి దేవత శభాష్ అంటుంది.

చెడ్డపని చేస్తే ఛీఛీ అని తిడుతుంది.

అవి శభాష్ అంటే పుణ్యాలై, ఛీఛీ అంటే దోషాలై మనకి లభిస్తాయి.

మనం చేసే పనులు ఏ ఇంద్రియంతో చేస్తామో ఆ ఇంద్రియశక్తే పరీక్షిస్తూ ఉంటుంది.

అవి శక్తిని ఇచ్చి సాక్షిగానే చూస్తూ ఉంటాయి.

నేత్రాలకి సూర్యుడు, చేతికి ఇంద్రుడు, ఇలా ఒక్కొక్కదానికి ఇంద్రియాధిదేవతలు ఉంటారు.

ఇన్ని దేవతలు శక్తులు మనలో ఉన్నాయి.

ఒక సేనాపతి సేనలతో వెళ్ళి యుద్ధం ఎలా చేస్తాడో మన శరీరంలో "నేను" అనేవాడు కూడా ఇంత సేన లేకపోతే వాడు పనిచేయలేడు.

కనుక మన ఇంద్రియశక్తులే దేవసేనలు.

వీటినన్నిటికి కలిపి ఒక నాయకుడులా నడిపించేవాడే మనలో "అహంరూపచైతన్యం", ఒకటున్నది.

అదే దీన్ని చూడు, దాన్ని విను అని ఇంద్రియాలకి చెప్తోంది.

మనలో ఉన్న ఆత్మచైతన్యమే ఇంద్రియరూపదేవసేనలని నడుపుతోంది.

కనుక ఇంద్రియరూప
దేవసేనలకి పతియై

కుండలినీరూప వల్లీశక్తితో అల్లుకొని

మనలో ఉన్న పరమాత్మ చైతన్యమే వల్లీదేవసేనాసమేత
సుబ్రహ్మణ్యస్వామి.