ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Showing posts with label Telugu Stories - Puranams. Show all posts
Showing posts with label Telugu Stories - Puranams. Show all posts

BRAHMA RATHA - MORAL TELUGU STORY


బ్రహ్మ తలరాత!
కాశిలో వున్న గంగ దగ్గర ఒక వ్యాపారి ఉండేవాడు. అతను నిత్యం స్నానం చేయడానికి గంగ దగ్గరికి వచ్చి స్నానం చేసి వెళ్ళేవాడు. అతనికి బ్రహ్మ రాసిన రాత చదివే విద్య తెలుసు. ఒకనాడు గంగా నది దగ్గర మర్రిచెట్టు ఉంది. ఆ చెట్టుకి దగ్గరలో నడుస్తుండగా కాలికి పుర్రె ఒకటి తగిలింది. దాన్ని చూచి ఛి యదవ పుర్రె ఇప్పుడే తగలాల! మళ్లి స్నానం చేయాలి అనుకుంటూ పుర్రెని కాలితో తన్నబోయాడు. పుర్రె తళుక్కుమని మెరిసింది. అది చూసి దీని తలరాత ఏంటో చదువుదాం అని చేతిలోకి తీసుకుని చదివాడు.

వీడు జీవితాంతం కష్టపడతాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు చివాట్లు పెడతారు. బడిలో పంతుళ్ళు కొడతారు. పెళ్ళయ్యాక పెళ్ళాం తిడుతుంది. పిల్లలు పెద్దయ్యాక ఇంట్లోనుండి తన్ని గెంటేస్తారు. ప్రతిక్షణం ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే వుంటారు. డబ్బు నిలవదు. ఎవరైనా దయతలచి ఇచ్చినా పోతుంది. బ్రతికినంతకాలం కష్టాలు పడీ పడీ చస్తాడు. వీడు చచ్చిన 500 సంవత్సరాలకి వీడి పుర్రె ఒక స్త్రీ చేతిలో అవమానం పాలై మోక్షం పొందుతుంది. అని ఆ పుర్రె మీద బ్రహ్మ తలరాత రాసివుంది అది చదివి ! బ్రతికి ఉండగా అవమానం అంటే పర్వాలేదు. చచ్చాక పుర్రెకి అవమానం ఏంటి? బ్రహ్మకి అసలు బుర్ర వుందా? అని ఆ పుర్రేని విసిరేయబోయి అసలు అవమానం ఎలా జరుగుతుందో చూడడం అనుకోని దగ్గరలో ఉన్న మర్రిచెట్టు తొర్రలో ఈ పుర్రె ని దాచాడు. నిత్యం స్నానం చేసే ముందు ఈ మర్రిచెట్టు తొర్రలో ఉన్న పుర్రేని చూసి పలకరించి వెళ్ళేవాడు. ఇలా కొన్నాళ్ళు గడచిన తరువాత బంధువుల ఇంట్లో వివాహం ఉంటే ఒక 10 రోజులపాటు ఆ వివాహ మహోత్సవాలలో గడిపి వచ్చాడు. ఎప్పటిలాగానే స్నానానికి వెళ్తూ పుర్రె సంగతి గుర్తొచ్చి మర్రిచెట్టు దగ్గరికి వెళ్లి తొర్రలో ఉన్న పుర్రెకోసం చుస్తే కనపడలేదు. వెతికాడు దొరకలేదు. మర్రిచెట్టు తొర్రలో పుర్రె ఏమైపోయింది అనుకుంటూ స్నానం , సంధ్యా వందనం చేస్తున్నాడు కాని మనసు మాత్రం పుర్రెమీదే వుంది. చేశాం అంటే చేశాం అన్నట్టు నిత్య కృత్యములు చేస్తూ ఉండగా ఇది భార్య గమనించి మీరెందుకు ఇలా వున్నారో నాకు తెలుసులెండి అంది..

ఒసేయ్ పిచ్చి మొహమా! ఎం తెలుసే నీకు?
మీరు ఆలోచించేది మీ రెండో భార్య చనిపోతే మర్చిపోలేక మర్రితోర్రలో దాచిన ఆవిడ పుర్రె గురించేకదా! ఆ సంగతి నాకు ఎలా తెలుసనుకుంటున్నారా? మీరు రోజు ఆ మర్రితోర్రలో పుర్రెని చూస్తున్నారని జనాలు చెప్పారు. ఓహో! ఇంతకీ ఏమి చేశావే దాన్ని. అది నా సవతిది అని తెలిసి కోపం పట్టలేక ఇంటికి తీసుకొచ్చి వేడి వేడి నీళ్ళు మరగబెట్టి దానిమీద పోశాను. సలసలా కాగే నునె గుమ్మరించాను, అప్పటికి కసి తీరక కారం చల్లాను. అయిన కోపం తీరక రోట్లో వేసి రోకలిబండతో పచ్చడి కింద కొట్టి పిండి పిండి చేసి గంగలో కలిపాను అంది.

అప్పుడు జరిగింది చెప్పాడు. ఒసేయ్ వెర్రి మొహమా! అది నాపెళ్ళాం కాదే! దానిమీద చచ్చాక కూడా ఆపుర్రే అవమానం పాలై మోక్షం పొందుతుందని రాసి ఉంది. అది ఎలా నిజమౌతుందో చూద్దామని నేను ఆ మర్రిచెట్టు తోర్రలొ ఉంచాను. ఇదిగో నీవల్ల అవమానం పాలై గంగలో కలిసి మోక్షం పొందింది. గంగలో కలిస్తే మోక్షమే కదా! అన్నాడు. ఆ విధంగా బ్రహ్మ రాసిన రాత నిజమైంది.
బ్రహ్మ రాస్తే నిజమై తీరుతుంది. బ్రహ్మ రాసిన రాత మారాలంటే ఎం చేయాలి?
సద్గురువు కటాక్షం ఉండాలి. అప్పుడే రాతని మార్చుకోవచ్చు. లేదంటే ఇది నేనే చేశాను, నేనే చేయగలను. అనే బ్రమలో బ్రతికేస్తారు.

PURANA TELUGU KATHALU - NARADHANUKI BRAHMA UPADESAM


నారదునికి బ్రహ్మ ఉపదేశం

"పరమ పురుషుడైన ఆ ఆది దేవుని లీలలను వర్ణింప నా తరమా నాయనా! నేనైనా, నారాయణుడైనా పరమ శివుని గురించి పరిపూర్ణ జ్ఞానులమని భావిస్తే అది అహంకారమే. అవాజ్మానస గోచరుడా మహా దేవుడు. ఒక్క మాటలో చెప్పాలంటే - పరమ శివుడొక అద్భుతం అనాలి.

ఆ అద్భుత మూర్తి ఆద్యంతాలు లేని వాడు. అనాది మధ్య లయ రహితుడు. ప్రళయం అనే అపార జల రాశి మయం నుంచి ఆరంభిస్తే, కొంత వివరణ సుసాధ్యం కావచ్చు నేమో గానీ, అదీ మన భ్రాంతి మాత్రమే! అతడు నిత్యుడు. సత్య సత్వుడు. సమస్త సృష్టీ, సూర్య చంద్ర గ్రహ తారకాదులన్నీ తెలియ రాని అగాధం లోకి తరలి పోయిన ఆ తరుణాన...రాత్రీ కాని- పగలూ కాని ఓ విచిత్ర స్థితి ఆవరించిన వేళ... నిబిడాంధ కారమే దిగంత పర్యంతం వ్యాపించిన సమయాన... 'ఇదీ' అని వచింప శక్యం గాని సత్య జ్ఞాన సుందర మైనది ఏదయితే ఉంటుందో అదే 'శివం' అని ప్రకటిత మవుతోంది.

ముందే చెప్పినట్టు, అట్టి 'పరం' ('స్వ' కానిది)నుండి స్వయంభువంగా 'శివం' పరివర్తింప బడుతోంది. అదే సదాశివమని పరిఢ విల్లు తోంది. కనుక సదా శివం ఆవిర్భావానికి దోహద పడే ప్రకృతిని 'అంబ' అని భావించాలి! ఆమెయే సకలేశ్వరి.

ప్రకృతి పురుషుల క్రీడానంద ఫలితం - విష్ణు దేవుని రూప కల్పనకు నాంది. ఆయన ఎట్టి వాడు ? సకలేశ్వరీ సదా శివుల అంశ గనుక అతడు కూడా అమృత మూర్తి. త్రిలోక సుందరాకారుడు. శాంత గంభీరుడు, సత్వ గుణ పరి పూర్ణుడు. శంఖు చక్ర గదా పద్మ ధారి. పీతాంబరుడు. నీల మణి కాంతితో వెలిగే దేహం గల వాడు. జగజ్జెట్టీ, జగత్పూజ్యుడైన వాడూ అయిన పరమ పురుషునికి నమస్కరించి, తన కొక నామధేయాన్ని ప్రసాదించ మనగా- 'నా వలె నీవు కూడా జగత్తునంతట్నీనీకు నిశ్వాస రూపంగా కల్పిస్తున్నాను. ప్రళయాంతం వరకు తపో నిష్ఠా గరిష్ఠుడవు కమ్ము!' అని ఆనతిచ్చి అంబతో సహా అదృశ్యుడై పోయాడు."

* విష్ణువు నారాయణుడన బడుట :

ఆ విధంగా ఆనతి పొందిన విష్ణువు పన్నెండు వేల దివ్య సంవత్సరాలు తపో దీక్షలో ఉన్నాడు. అయినప్పటికీ శివానుగ్రహం కలగక పోగా, అశరీర వాణి సూచనల మేరకు తిరిగి తపస్సులో మునిగి పోయాడు.

"అలా ఎంత కాలం ?.." నారదుని ప్రశ్న.

"ఇంత కాలం అని చెప్ప బడనంత చాలాకాలం! ఆయన శరీరం నుంచి విపరీత మైన జల ధారలు స్రవిస్తూన్నప్పటికీ, శివ మాయా వశాన విష్ణువు అలా ఆ నీట్లోనే పడి నిద్ర పోసాగాడు. అలా ఎన్నాళ్లు పడి వున్నాడన్నదీ ఎవరికీ తెలియదు. నీటి ధారలే ఆయనములుగా పడివున్న కారణంగా విష్ణువు నారాయణుడయ్యాడు. (నరః అంటే రుద్రుడు. అట్టి రుద్ర మాయా జనిత మగుట చే 'నారము' నీరు అనబడినది.)

తిరిగి విష్ణువు తెప్పరిల్లి లేచి చూచేలోగా సృష్టి క్రమం ప్రారంభమై పోయింది. అయితే అప్పటికి ఇంకా జీవజాలం ఉద్భవించ లేదు. రజస్స్త్తత్వ తమో గుణాలూ, అహంకారం, పంచతన్మాత్రలూ, పంచ భూతాలూ, జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం... కలిసి మొత్తం 24 తత్వాలు పుట్టాయి.

నీటిలో ఉండగానే, నారాయణుని నాభి నుండి ఓ పద్మం జనించి, అలా పైకి ఎదగ సాగింది. కనుకనే - విష్ణువుకు పద్మ నాభుడనే నామాంతరం కలిగింది. ఈలోగా విష్ణుని నాభి కమలం లోకి శివ దక్షిణ భాగ జనిత మైన ఒక అంశ బ్రహ్మగా పరివర్తనం చెంది ప్రవేశ పెట్ట బడింది. ఆ శివాంశకు ముఖాలు నాలుగు. చతుర్ముఖుడైన ఆ మహా వేత్త గర్భంలో బంగారం నిక్షిప్తమైనందున, అతడికి హిరణ్య గర్భుడనే మరో పేరు కలిగింది.

అయితే - శివలీలా విలాసం కనుక, కేవలం అలా అంతూ - దరీ లేకుండా పైకెదుగుతున్న తామరపువ్వే తన లోకం తప్ప ఇతర ప్రపంచం ఏమిటో - ఎలా వుంటుందో కూడా చతుర్ముఖునికి అంతు పట్టలేదు."

PURANA TELUGU KATHALU - NARADHA PUNYA THIRDHA YATRA


నారద పుణ్యతీర్థ యాత్ర

మొదట కామాతురుడై, ఆ పిదప కార్యభంగ వికల మానసుడై, ప్రస్తుతం క్రోధోన్మత్త మిళిత వేదనా పరివృతుడై వైకుంఠంలోకి అడుగిడిన నారదుడు శ్రీహరిని నిందించసాగాడు. "ఆశ్రితులను సైతం అల్లరిపెట్టే తుంటరితన మేలనయ్యా శ్రీహరీ? నువ్వు మహామేధావివే కాదు! మాయావివి కూడా! అయితే మాత్రం...?! నీవే శరణన్నవారిని కూడా, నవ్వులపాలు చేస్తే ఇక నీ మహిమకెంత మచ్చ? కనీసం అదయినా నువ్వు ఆలోచించుకున్నావా? నువ్వింతటి అఖండుడవని తెలిసే, ఆ మహాదేవుడు సర్వాధికులుగా బ్రాహ్మణులను నియుక్తుల్ని చేశాడు. నిన్ను ఆ తర్వాతివాడిగానే కొలువమన్నాడు. పరమౌన్నత్యం కట్టబెట్టడానికి శివుడంతటివాడే జంకాడూ అంటే - నీ సంగతి అయనకు బాగా తెలిసినట్టే ఉంది.." అంటూ దెబ్బిపొడవసాగాడు.

"శ్రీ మహావిష్ణువు కంటె బ్రాహ్మణులను ఎట్లు అధికుల్ని చేశాడా భూతేశుడు?" మహర్షులు ప్రశ్నించారు.

సాక్షాత్తు ఆ విరాట్పురుషుని ముఖం నుంచి ఉద్భవించడమేకాక, అపర సరస్వతీ మూర్తులైన వేదాల్ని అభ్యసించే దేవతలుగా వెలుగొందుతారని ఆ పరమశివుని ఆనతి. ఉదాత్త అనుదాత్త సర్వ సహితంగానూ - అప శబ్దోత్పన్నం కాకుండానూ వేదాన్ని చదవగల ప్రజ్ఞ భూసురుల సొంతం చేశాడా భగవంతుడు. సమస్త మునిజనాలకు మూల పురుషులు బ్రాహ్మణులే! అందుకే బ్రాహ్మణ దూషణ బ్రహ్మహత్యాపాతకంతో సమానమని సెలవిచ్చి ఉన్నారు. 

భారతగాధలో దీనికి ఎన్నో నిదర్శనాలున్నాయి. వారిని సాక్షాత్తు విష్ణుస్వరూపులుగా సంభావించాలి. బ్రాహ్మణ ద్వేషులను శ్రీహరి ద్వేషులుగా నెంచును. సరే! అది అట్లుండనిండు! నారదుడు నోరు నొప్పిపుట్టేలా శ్రీహరిని నిందించి - చివరకు ఒక శాపం కూడా దయచేశాడు. ' స్త్రీ విషయమై నన్ను మోసం చేసిన నీవు, భూలోకములోనే రాజుగా పుట్టి , నీ ఇష్టపత్ని వియోగబాధలో కొన్నాళ్ళు పరితపించెదవుగాక! నన్ను కోతిని చేసి ఆడించబోయిన నీ మర్కటబుద్ధికి, ఆ జన్మమందు - కోతి మూకలే నిన్ను కొలుచుగాకా!'...అంటూ నారదుడు అప్పటికి శాంతించాడు.

శివమాయా విలసనం - దాని ప్రభావం చిదానంద స్వరూపుడై పరికిస్తున్న శ్రీహరి ఆ మహాదేవుని తలచి, నారదునికి కమ్మిన మాయ తెరలను పటాపంచలు అయ్యేలాచేశాడు.

ఎప్పుడైతే మాయ నారదుని వీడిందో, జరిగినదంతా స్పష్టంగా దృగ్గోచరం కాసాగింది - ఆ మునివర్యునికి. జరిగిన పోరపాటుకు అసాధారణంగా చింతాక్రాంతుడై, చతుర్భుజుని పాదాల చెంత వ్రాలాడు నారదుడు.

"బ్రహ్మ మనసపుత్రా! ఇందులో నీ దోషం లేదు. అంతా పరమేశ్వరుడి లీల! నేనూ - నువ్వు అందరం ఆయన అడించినట్లు ఆడవలసిందే! కేవలం శివేచ్చానుసారమే ఇదంతా జరిగింది. నీవు నాకు శాపం దయచేయడం కూడా అందులో అంతర్భాగమే. కనుక - నీ శాపాన్ని నేను స్వీకరిస్తున్నాను. జరిగిందేదో జరిగింది. త్రికరణ శుద్ధిగా ఇకనైనా ఆ పరమశివుని ధ్యానించుకో! పురాకృత పుణ్య విశేష వశాన మాత్రమే లభించే శివభక్తి తత్పరుడవై తరించు! నీ తండ్రినే గురువుగా చేసుకుని అద్వైత శివతత్త్వాన్ని అనుసరించు! ఆ పరమ శివానుగ్రహం నీకు కలిగి తీరుతుంది" అంటూ అంతర్హితుడయ్యాడు శ్రీహరి.

* నారద పుణ్యతీర్థ యాత్ర:

నారాయణమూర్తి ఆనతిచ్చిన ప్రకారం - శివభక్తి తత్పరుడయ్యాడు నారదుడు. అందులో భాగంగా శైవక్షేత్రాలన్నీ సందర్శిస్తూన్న తరుణంలో ఒకచోట నారదశాపానికి గురైన రుద్రగణాధినేతలు ఇద్దరూ తారసపడ్డారు.

తమ నిజరూపాలు చూపించి, శాపం సడలింపజేయమని అభ్యర్ధించారు. శాపం వెనక్కు తీసుకోగల అవకాశం లేదనీ - వశ్యవాక్కు అయిన తనశాపం అనుభవించక తప్పదనీ - అయితే కొంత ఉపశమనం ఉండేలా సవరించగలననీ చెప్పి, రాక్షసులై జన్మించినప్పటికీ వారు శివునిభక్తి వీడరనీ - శివుడంతటి దేవుడిచేతనే నిర్జితులవుతారనీ వారిని ఊరడించాడు నారదుడు.

అలా తీర్ధాలన్నీ చరిస్తూవున్న నారద మునీంద్రుడు వారణాశీ పురం చేరుకున్నాడు. విశాలాక్షీ - విశ్వేశ్వరుల దర్శనం చేసుకున్నాడు. అక్కడ్నుంచి సరాసరి బ్రహ్మలోకం చేరుకున్నాడు.

తండ్రి అయిన పరమేష్ఠికి ప్రణామమాచరించి "తండ్రీ! ఎన్నెన్ని తీర్ధాలు సేవించినా శివతత్త్వసారం వంటపట్టలేదు. నాయందు దయతో నీవే గురువుగా ఆ పరిజ్ఞానం కలిగింప వేడుతున్నాను" అన్నాడు.

NARADHA GARVABHANGAM - TELUGU PURANA STORY


నారద గర్వభంగం

తనను సరిగ్గా అర్థం చేసుకోగలవాడు ఆ శ్రీహరి ఒక్కడే అని స్ఫురించడంతో, వైకుంఠం దారిపట్టి - శ్రీ మహా విష్ణువుకు తన మానసాన్ని వివరించాడా బ్రహ్మపట్టి.

'అందమైన రూపంలో నీకు సాటిరాగలవా రెవ్వరూలేరు ' అని జనార్థనుని పొగిడి - 'నీ రూపాన్ని నాకు ప్రసాదించి, పెళ్ళయ్యేవరకు అనుగ్రహించు! అ తర్వాత నా పాట్లేవో నేనుపడతాను ' అని వేడుకున్నాడు. కామమహిమ అంతటిది! కేవలం బాహ్యమైన ఆకర్షణ కలిగించే రూపం కోసం ప్రాధేయపడి యాచించాల్సిన పరిస్థితిని కల్పించింది.

లోలోన గుంభనగా నవ్వుకున్న నారాయణుడు సరేనన్నాడు. ఒక్క ముఖం తప్ప, మిగతా శరీరమంతా పురుషులకే సమ్మోహం కలిగించేటంత అందంగా మార్చి ముఖం మాత్రం వానరరూపంలో కనిపించేలా ఉంచేశాడు. ఎవరి ముఖం సంగతి వారికి తెలియదు కనుక, ఆ వీలును ఇలా ఉపయోగించు కన్నాడు విష్ణువు.

శ్రీహరినే నెరనమ్మిన నారదుడు, మారుని తలపులే మదిలో సందడి చేస్తుంటే మరో ఆలోచన లేకుండా, అత్యుత్సాహంతో స్వయంవరానికి బయల్దేరాడు. నారదుడు స్వయంవర సభామంటపంలో ప్రవేశించగానే, శివమాయా ప్రేరితులై రుద్రగణాధినేత లిరువురు చెరోపక్కా ఆయన్ను అనుసరిస్తూ (బ్రాహ్మణ వేషధారులై వున్నందున) నారదునికి అనుమానం రాకుండా మెలగసాగారు. చివరికి నారదుడు కూర్చున్న చోటికే వచ్చి ఇరువైపులా ఆశీనులయ్యారు.

శ్రీమతి పుష్పమలాధారిణి అయి, స్వయంవర సభావేదికను సమీపించింది. సభలోని అందర్నీ కలయజూసింది. కోతి ముఖంతో వచ్చిన నారదుని చూసే సరికి ఆమెకు అప్రయత్నంగా నవ్వురాగా, కామతప్తుడై వున్న నారదునికి ఆమె నవ్వు సుప్రసన్నంగా - తనపట్ల పరవశంగా వునట్లు తోచింది. తన ముఖారవిందాన్ని మరింత విప్పార్చి, ఆమెనే అలా చూస్తుండిపోయాడు నారదుడు.

ఆమె దగ్గరగా వచ్చి, మరోసారి తన ముఖాన్ని చూసి నవ్వడంతో అదంతా సుముఖంగానే వునట్లు భ్రాంతి చెందిన నారదునికి ఆశాభంగం కలిగిస్తూ తనను దాటి వెళ్లిపోయింది శ్రీమతి.

ఈలోగా మాధవుడు, అపర మన్మథుడిలా అక్కడికి రావడం - శ్రీమతి వరమాల అతడి కంఠసీమ నలంకరించడం వెన్వెంటనే జరిగిపోయాయి. హతాశుడయ్యాడు నారదుడు.

బ్రాహ్మణ వేషధారులై ఉన్న రుద్రగణాధిపు లిద్దరూ నారదుని అవస్థ కనిపెట్టి, "దేనికయ్యా అంత ఆందోళన?! ఆమె ఎవరికి చెందాలో వారికే చెందిందిలే! అయినా.. అందుకోడానికి నీకేం అర్హతవుంది? అందమైన లేదుకదా! అసలు నీముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా?" అంటూ ఎద్దేవా చేశారు.

సందేహిస్తూనే, తన ప్రతిబింబాన్ని అక్కడే వున్న కాచఫలకంలో చూసుకున్నాడు. వానర ముఖాకృతి అచ్చుగుద్దినట్లు కనిపించేసరికి, గ్రద్ద వాహనారూఢుడి మోసం గమనించి నొచ్చుకున్నాడు.

తనకు ఇరువైపులా చేరి వేళాకోళం చేస్తున్న ఇద్దరిని బ్రాహ్మణులుగానే భావించుకున్న నారదుడు, "సాటి బ్రాహ్మణుని సమయా సమయాలు గానక, పరిహసిస్తున్న మీరు బ్రాహ్మణ బీజాన రాక్షసులై జన్మించెదరు గాక!" అని శపించి, క్రోధావేశం చల్లారక వైకుంఠవాసుని కొంటె చేష్టను కడిగి పారేయ్యాలని వైకుంఠం దిక్కుగా పయనమయ్యాడు.

LORD SIVA PURANA STORIES


పరమేశ్వరుని లీలలు

చోళులు రాజ్యమేలుతున్న రోజులవి. తమిళనాడు రాష్ట్రంలో సత్త మంగై అనే ఊళ్లో కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు నివసిస్తుండేవి. ఆ ఊళ్లోని మఠాలలో పండితులు ప్రతి రోజూ వేదగానం చేసేవారు. మైనాజాతి పక్షులు ఆ వేద ఋక్కులను తియ్యని గొంతుతో అనుకరిస్తూ పాడేవి. 

స్త్రీలు లావణ్యాన్ని ఒలకబోస్తూ చెరువులలో దిగి స్నానాలు చేసేవారు. హంసలు ఒకదానితో మరొకటి పోటీపడి చెరువులో దూకి, ఆ సౌందర్యవతులతో ఆటలు ఆడేవి. ఈ ఊళ్లోని పురుషులు ఎంత పవిత్రమూర్తులో, వారి భార్యలు అంత పుణ్యవతులు.

అదే ఊరిలో తిరునీలనక్కర్ అనే శివభక్తుడు ఉండేవాడు. వేదవిహిత కర్మలు తూ.చ తప్పకుండా ఆచరించేవాడు. ప్రతిరోజూ శివాలయానికి వెళ్లి గృహిణిగా తన ధర్మాలు పాటించే ప్రేమైకమూర్తి అయిన భార్యతో పాటు, పూజాదికాలను భక్తిశ్రద్ధలతో నిర్వర్తించేవాడు.

ఒక రోజు నీలనక్కర్ ఆలయంలోని గర్భగుడిలోకి ప్రవేశించాడు. అతనివెంట అతని భార్య కూడా వివిధ రంగులతో శోభించే పుష్పాలతో, బిల్వదళాలతో అనుసరించింది. వినిర్మల భక్తితో పరవశించే హృదయంతో అతను శివుని కీర్తిస్తూ మంత్రాలు పఠించేవాడు. ఆ తర్వాత ప్రగాఢమైన ధ్యానంలో మునిగిపోయాడు.

అతని భార్య ఒక్కొక్కటిగా బిల్వదళాలను శివలింగంపై వేస్తూ అర్చించసాగింది. ఆమె కన్నులు తదేకదృష్టితో శివలింగంవైపే చూస్తున్నాయి. అంతలో విషపూరితమైన ఒక సాలెపురుగు లింగంపై గాలిలో తిరుగాడుతుండటం ఆమె కంటపడింది. ఆమె దానిని తొలగించాలని అనుకుంటుండగానే అది కాస్తా లింగంపై వాలింది

ఒక విషకీటకం లింగంపై పడడం చూడలేక ఆమె తన శక్తినంతా కూడదీసుకుని దానిపైకి ఊదింది. ఆ గాలికి సాలీడు, అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాని అనుకోకుండా ఆమె నోటివెంట లాలాజలపు తుంపరులు ఆ లింగంపై పడ్డాయి. అదే క్షణంలో ఆమె భర్త కన్నులు తెరిచాడు. అతడు సాలీడును గమనించకుండా తన భార్య చేసిన పనికి కోపోద్రిక్తుడైనాడు.

కళ్లవెంట నిప్పులు కురిపిస్తూ.. అతడు శివుపై ఎందుకు ఉమ్మివేశావు? అని నిలదీశాడు. లేదు నేనెందుకు ఉమ్మివేస్తాను? శివలింగంపై వాలిన సాలీడును ఊది తొలగించాను అంతే నాకీ అనుకోకుండా ఉమ్మి తుంపరులు లింగంపై పడ్డాయి. అంది భయంతో వణికిపోతూ..

ఈ శివలింగాన్ని నువ్వు అపవిత్రం చేశావు. మరోవిధంగా సాలీడును అక్కడి నుంచి తొలగించి వుండాల్సింది. శివునికే అపచారం చేసిన పాపాత్మురాలివి. నీకు నా హృదయంలోనూ, నా ఇంటిలోనూ స్థానం లేదు.

ఇక్కడి నుంచి నుంచి వెళ్ళిపో.. అని పెద్దగా అరుస్తూ ఆ ఆలయాన్ని విడిచివెళ్లాడు. ఆమె దుఃఖిస్తూ ప్రాధేయపడింది. కానీ ప్రయోజనం లేకపోయింది. ఎక్కడకు వెళ్లాలో తెలియక, ఆ ఆలయంలోనే ఆ రాత్రి గడపాలని నిశ్చయించుకుంది. తనను కాపాడమని ఆమె శివుణ్ణి వేడుకుంది. ఆ విధంగా విడిపోయిన దంపతులను చూసి శివుని హృదయం కరిగిపోయింది.

తనపట్ల వారికిగల ప్రేమకు, భక్తికి ఆయన ఎంతగానో పులకించి, వారిని తిరిగి ఒక్కటి చేయాలని తలచాడు. అర్థరాత్రి అయ్యింది. తిరునీలనక్కర్‌‌కు ఆ రాత్రి కలలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. నా శరీరాన్ని సరిగ్గా చూడు నీ భార్య సరైన సమయంలో నాకు సహాయమే చేసింది అన్నాడు శివుడు. అతను తన కళ్లను తానే నమ్మలేకపోయాడు.

తన భార్య గాలి ఊదినచోట తప్పించి, శివుని శరీరంలో మిగిలిన భాగం అంతా బొబ్బలతో, గాయాలతో కనిపించింది. ఉలిక్కిపడి అతను నిద్రలేచాడు. ఎంతటి కఠినత్ముణ్ణి నేను.. శివునిపై ప్రేమతో తన భార్య ఈ పని చేసిందని, అటువంటి ప్రేమను తాను గుర్తించలేకపోయానని తనను తాను తిట్టుకుంటూ ఆలయంలోకి పరుగు తీశాడు.

అక్కడ అతని భార్య తన విధిని తలుచుకుని శోకిస్తూ ఉంది. ఇంతటి భక్తురాలి పట్ల ఎంతటి నిర్దయతో ప్రవర్తించాననుకుంటూ పరమశివుడు నాకళ్లు తెరిపించాడు. నాతో పాటు ఇంటికి రా. మనం ఇకనుండి ఎటువంటి కలతలు లేకుండా సుఖంగా జీవిద్దాం అన్నాడు. ఇలా విడిపోయిన దంపతులను ఆ పరమశివుడు కలిపాడు.

LORD SRI ANJANEYA BECOMES THE LORD HANUMAN - PURANA STORY IN TELUGU


ఆంజనేయుడు హనుమ అయిన కధ

ఆంజనేయుడు పెరిగి పెద్ద వాడవుతున్నాడు .ఒక రోజు ఆకలి గా వుందని అమ్మను అడిగాడు ఏమైనా పెట్టమని .ఆమె పండిన పళ్ళు చెట్టుకు వుంటాయి కోసుకొని తినమన్నది .అప్పుడే సూర్యోదయం అవుతోంది అరుణ కాంతితో సుర్యుడు ఉ౦డటం వల్ల పండు గా భావించి ఆకాశానికి యెగిరి సూర్యున్నిపట్టు కొన్నాడు . .ఆరోజు సూర్య గ్రహణం రాహువు సూర్యుని కబళి౦చాలి .తాను చేయాల్సిన పని ఇతను చేయటం చూసి కోపం వచ్చింది . నేరేడు పండు లాగా నల్ల గా వున్న రాహువుని చూసి పండు అనుకోని పట్టుకో బోయాడు .అతను పారిపోయి ఇంద్రుడికి చెప్పాడు .తెల్లని ఐరావతం ఎక్కి ఆయన వచ్చాడు .దాన్ని కబళించాలని మీదకు దూకాడు. ఇంద్రునికి, ఆశ్చర్యము ,కోపమూ వచ్చి వజ్రాయుధాన్ని ముందుగా తర్వాత బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు .నోటిలో సూర్య బింబాన్ని వుంచుకొనే ఆంజనేయుడు ఆ రెండిటినీ రెండు వెంట్రుకలతో ఎదుర్కొని వాటిని పనికి రాకుండా చేశాడు .దేవతలంతా వచ్చి సూర్యుడు లేక పొతే ప్రపంచానికి చాల నష్టమని ,యజ్ఞాది క్రతువులు చేయటం కుదరదని అతనికి నచ్చ చెప్పారు .వాళ్ల మాట విని తాను నోటితో మింగిన సూర్యున్ని వదిలేశాడు .

ఇంద్రునికి కలిగిన పరాభవం మర్చి పోలేక ,ఆన్జనేయుడు ఏమరు పాటులో వుండగా మళ్ళీ వజ్రాయుధం విసిరాడు .అది అతని దవుడ కు తగిలి నెత్తురు గడ్డ కట్టి స్పృహ కోల్పోయాడు .వాయువుకు ఈ విషయం తెలిసి వీచటం మానేశాడు .ప్రపంచం గాలి లేక స్తంభించి పోయింది .మళ్ళీ దేవతలందరూ వచ్చారు బ్రహ్మ తన కమండలం లోని నీళ్ళను బాలుని పై చల్లి మూర్చనుంచి మరల్చాడు .దేవతలందరినీ అన్జనేయునికి వరాలు ఇవ్వమని బ్రహ్మ ఆదేశించాడు .దీర్ఘాయువు ,బలం ,పరాక్రమం ,ఆరోగ్యం తేజస్సు ,గుణం ,బుద్ధి ,విద్య ,విచక్షణ ,ప్రసన్నత ,చతురత ,వైరాగ్యం ,విష్ణు భక్తి ,దయ పర స్త్రీ విముఖత ఏ అస్త్రము ఏమీ చేయలేని శక్తిని దేవతలందరూ ఆన్జనేయునికి వరం గా అనుగ్రహించారు .వజ్రాయుధం చేత మరణం ఉండదని ,బ్రహ్మాస్త్రం కూడా ఏమి చేయలేదని అయితె దానికి కొద్ది సేపు లొంగి పోవాల్సిన పరిస్థితి వస్తుందనిఅన్నారు. వజ్రాయుధం తగిలినా ఊడి పోకుండా అతని దవడ ఆంటే హనుమ వుంది కనుక అప్పటినుంచి ఆన్జనేయునికి హనుమ అనే పేరు సార్ధకం అవుతుందని చెప్పారు .

విష్ణు మూర్తి లాగ దేవతలను వుద్దరిస్తాడని ,రామ కార్యం నేరవేరుస్తాడని ,శివునిలా దుష్ట సంహారం చేస్తాడని ,లంక లోని రాక్షసులను వదిస్తాడని ,త్రిమూర్తుల అవతారం కనుక త్రిమూర్త్యాత్మకుడనే పేరు తో పిలువ బడ తాడని ,,దుష్ట గ్రహాలను పారదోల టానికి ప్రతి గ్రామం లో ఆంజనేయ దేవాలయాలు నెలకొల్పుతారని బ్రహ్మ అనుగ్రహించి అంతర్ధానమయాడు. వాయువు మళ్ళీ వీచి సకల ప్రాణి కోటికి ప్రాణ వాయువును అందించాడు .ఇలా ఆంజనేయుడు హనుమ గా మారాడు .
దేవతలిచ్చిన వరాలతో హనుమ విజ్రుమ్భించి సహజ మైన కోతి చేష్టలు చేస్తూ ,అందర్నీ బాధిస్తుందే వాడు .అతను భవిష్యత్ లో చేయ బోయే గొప్ప కార్యక్రమాల గురించి తెలిసిన మునులు ఏమీ అనకుండా వుండే వారు .వాళ్ల గోచీలు లాగటం, మడి బట్టలు చిమ్పేయటం చూసి ఒక శక్తి సంపన్నుడైన మహర్షి ”నీ సహజ శక్తిని మర్చిపోతావు ”అని శపించాడు తర్వాత జాలిపడి ఎవరైనా గుర్తు చేస్తే మళ్ళీ శక్తి సంపన్నుదవుతాడని అనుగ్రహించాడు .

క్రమంగా అల్లరి తగ్గి మంచి బాలుడనిపించుకున్నాడు .విద్య నేర్చే వయసు వచ్చింది .తల్లి అంజన సూర్యుని అనుగ్రహం పొంది విద్యలు నేర్చుకోమని పంపింది .ఆయన దగ్గరకు వెళ్లి విద్య నేర్పని అడిగాడు .తాను అనుక్షణం తిరుగుతూంటాను కనుక విద్య నేర్పలేను అన్నాడు .తాను కూడా సూర్యుని తో పాటు కదిలి పోతూ ,విద్యలు నేర్చాడుఒక కాలు ఉదయపర్వతం మీద ,రెండోది పశ్చిమ పర్వతం మీద వుంచి శ్రద్ధ తో విద్య నేర్చాడు .అయిదు వ్యాకరణాలు నేర్పాడు .మిగిలిన నాలుగు నేర్పటానికి వివాహం జరగాలి కనుక తన కుమార్తె సువర్చలను వివాహం చేసుకో మన్నాడు .చేసుకుంటాను కాని నేను బ్రహ్మ చారి గానే వుంటాను దా౦పత్య సుఖం వుండదు .దానికి మీ అమ్మాయి అంగీకరిస్తే నేను సిద్ధం అన్నాడు .ఆమె అంగీకారం తో వివాహం జరిపి మిగిలిన నాలుగు వ్యాకరణాలు నేర్పి నవ వ్యాకరణ పండితుణ్ణి చేశాడు .వీరి కన్యాదానం జ్యేష్ట శుద్ధ దశమి నాడు జరిగింది .సువర్చల తపోనిష్ట తో గడుపు తోంది. గంధ మాదన పర్వతం మీద .హనుమ తల్లి దగ్గరకు వెళ్లి విషయం అంతా చెప్పాడు .ఆమె సంతోషించి ”నాయనా !నాకు వాలి ,సుగ్రీవుడు అనే సోదరులున్నారు .నీకు వాళ్ళు మేన మామలు .వారిద్దరికీ బద్ధ వైరం .అందులో సుగ్రీవుడు ధర్మ స్వరూపుడు నువ్వు సుగ్రీవుని చేరి అతనికి రక్షకుడు గా వుండు .నీ పెద్ద మేన మామ వాలితో విరోధం మాత్రం పెట్టుకోకు .నీకు శుభం జరుగుతుంది ”అనిదీవించి పంపింది .

తల్లి మాట విని హనుమ పంపానదీ తీరం లో వున్న చేరి మంత్రి అయాడు .తర్వాత రామ సుగ్రీవులకు సఖ్యత కూర్చిసీతాన్వేషణ కోసం సముద్రం దాటి సీతా , జాడను లంకలో తెలుసు కోని ,రాముని ముద్రికను ఆమెకిచ్చి ,ఆమె ఇచ్చిన శిరోమణి తీసుకున్నాడు అక్షుడు మొదలైన రాక్షసులను చంపి ఇ౦ద్రజిత్ వేసిన బ్రహ్మాస్త్రానికి బంధితుడై రావణుడి దర్బార్ కు వెళ్లి హిత వచనాలు చెపాడు .వినక తోకకు నిప్పంటిస్తే దానితో లంకా దహనం చేసి ,మళ్ళీసీతా దేవిని దర్శించి, సముద్రం దాటి రామసుగ్రీవులను విషయం చెప్పాడు .రాముడిసైన్యం సముద్రుని పై వారధి నిర్మించి లంకను చేరింది. రామ రావణ యుద్ధం లో చాల మంది రాక్షసులను చంపాడు హనుమ .రావణున్ని రాముడు సంహరించాడు .సంజీవి పర్వతం తెచ్చి లక్ష్మణ మూర్చను తొలగించాడు .మైరావణ సంహారం చేసి శ్రీ రామ పట్టాభిషేకం జరిపించి ,సేవా తత్పరుడై ,రామ కార్య దురంధరుడై ,త్రేతా యుగం తర్వాత గంధ మాదన పర్వతం చేరి తారక నామం జపిస్తూ ,దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ,భక్తుల మనో భీస్టాన్ని నెర వేరుస్తూ రామ భక్త హనుమాన్ గా ప్రజల హృదయం లో చిరస్థాయి గా వున్నాడు భక్త వరదుడైన శ్రీ హనుమ .

TELUGU PURANA STORY OF A GREAT KING - RANTHIDEVUDU


దానంతో శాశ్వత కీర్తిని పొందిన – రంతిదేవుడు

“అతిధి దేవోభవ !” అన్నది మన సాంప్రదాయం. ఈ ప్రపంచంలో చిన్న చీమ నుంచి అన్ని ప్రాణుల్లో ఉన్నది దైవమే. ఎవ్వరి కడుపు నింపినా, దేవుడు తిన్నట్లే !జాతి, మత, కుల, భేదాలు లేకుండా, ‘ఆకలి’ అన్నవారికి అన్నం పెట్టాలి. ఆకలిగొన్నవాడు ఎవరైనా సరే, చివరికి దొంగ, హంతకుడు అయినా సరే, అన్నం పెట్టాలి. ఆకలి విషయంలో అపాత్రుడు ఎవరూ ఉండరు. అందరూ పాత్రులే !

‘నాకంటె వేరుగా ఏదియు లేదు’, ‘సమస్త ప్రాణుల హృదయంలో ఈశ్వరుడు వెలయుచున్నాడు.’ అను మాటలను కేవలం బుద్ధితో గ్రహించి, నోటితో వల్లించే వారు కాక స్వీయ అనుభవంతో ఆచరించి, తదనుగుణంగా జీవించే వ్యక్తులు మనక ఆదర్శం కావాలి. ఈ సందర్భంగా భాగవతంలోని రంతిదేవుని కథ గుర్తుకొస్తుంది. ‘జన సేవయే జనార్ధన సేవగా’ భావించిన రంతిదేవుడి కధను చెప్పుకుందాము.

రంతిదేవుడు ఒక మహారాజు. అమిత దానశీలి. రాజ్యాన్ని, సంపదను దానం చేసి, భార్యాపిల్లలతో అడవికి వెళ్ళాడు. దైవికంగా ఏది లభిస్తే దాన్ని తినటమే-అంతకు మించి ఆయన దేన్నీ కోరేవాడు కాడు, భవిష్యత్తవసరాల కొరకు, దేన్నీ దాచుకొనేవాడు కాడు.

ఒకసారి నలభై ఎనిమిది రోజులు తినటానికి గానీ, తాగటానికి గానీ ఏమీ లభించలేదు. నలభై తొమ్మిదవ రోజు ఏదో కొంత ఆహారం లభించింది. దాన్ని తినటానికి తాను, కుటుంబ సభ్యులు కూర్చొన్నారు. అంతలోనే ఒక బ్రాహ్మణ అతిథి వచ్చాడు. ఆహారాన్ని ఆయనకిచ్చాడు రంతి దేవుడు. అతన్ని ఆశీర్వదించి వెళ్లిపోయాడు అతిథి. మరికొంత సేపటికే ఒక శూద్రుడొచ్చాడు. రంతిదేవుడు ఆతని ఆకలి తీర్చాడు. ఆ శూద్రుడు వెళ్లిన వెంటనే ఒకడు కుక్కలను తీసుకొని వచ్చి తన ఆకలిని, ఆ కుక్కల ఆకలిని తీర్చమని కోరాడు. తన వద్ద మిగిలిన ఆహారంలో రంతిదేవుడు అతనికి, అతని కుక్కలకు ఇచ్చాడు. ఇక కేవలం కొంత పాయసం మాత్రమే మిగిలింది. దాన్ని తాగి ఆకలి మంటను ఆర్పటానికి సిద్ధపడింది ఆ కుటుంబం. అంతలోనే ఎంతో దీనావస్థలో నున్న ఒక చండాలుడొచ్చాడు. వాని పరిస్థితి గమనించిన రంతిదేవుడు తన వద్ద ఉన్న పాయసాన్నంతా అతనికిచ్చివేశాడు ”బ్రహ్మార్పణం” అంటూ. నేను ఈ రోజు నలుగురి ఆకలి తీర్చినందుకు సంతృప్తిగా ఉంది అనుకుంటూ, స్పృహ తప్పిపోతాడు రంతిదేవుడు. మరుక్షణమే దేవుడు అక్కడ ప్రత్యక్షమై అతనికి మోక్ష ప్రాప్తిని కలుగ జేస్తాడు.

నీతి : కుల, మత, జంతు వివక్ష లేకుండా, తాను ఆకలితో ఉన్నా , ప్రాణాలు పోతున్నా లెక్కచెయ్యక రంతిదేవుడు చేసిన త్యాగం చరిత్రలో అతని పేరును శాశ్వతంగా నిలిపింది. దానగుణంతో దైవాన్నే నేలకు దించాడు రంతిదేవుడు. మనం కూడా, అన్నం తినేముందు కనీసం ఒక్కరి ఆకలైనా తీర్చే ప్రయత్నం చెయ్యాలి.

TELUGU PURANA KATHALU - PURANA TELUGU STORIES COLLECTION - TELUGU PURANA STORY OF DHADHICHI MAHARISHI - GREAT SAGE DHADHICHI


 దధీచి మహర్షి 

‘కోటి గ్రంథాల సారాంశాన్ని నేను అర్ధశ్లోకంలోనే చెప్పగలను. అదేమిటంటే- పరులకు ఉపకారం చేయడం పుణ్యం, పరులను పీడించడం పాపం‘ అన్నాడు కవి కులగురువు కాళిదాసు. ‘పరోపకారార్థమిదమ్‌ శరీరమ్‌‘ అన్నది ఈ వేదభూమిలో నిత్యం ప్రతిధ్వనించే రుషివాక్కు. మనిషికి అమ్మ ఒడిలాంటి ప్రకృతి కూడా పరోపకారతత్వానికి ప్రతీకే. దాహార్తిని తీర్చే సెలయేరు, వూరటనిచ్చే చిరుగాలి, ఛత్రమై నిలిచే చెట్టునీడ- ప్రకృతి ప్రసాదితాలైన ఇవన్నీ తమ ఉనికి పరుల మేలుకేనని చాటుకుంటున్నవే. ‘శరీరం కరిగిపోయే మంచు… అశాశ్వతం’ అని భావించి, స్వసుఖాలకంటే సామూహిక శ్రేయానికే పాటుపడటం సత్పురుషులకు సహజాలంకారం. పరోపకారమే పరమావధిగా తమ జీవిత ప్రస్థానం సాగించిన మహనీయులు ప్రజల గుండెల్లో భగవత్‌ స్వరూపులుగా కొలువై ఉంటారు. అటువంటి గొప్ప మహర్షి అయిన దధీచి కధ ఈ రోజు చెప్పుకుందాము.

దధీచి మహర్షి గొప్ప తపశ్శాలి. అయన భార్య గభస్తిని మహా పతివ్రత. దధీచి బ్రహ్మజ్ఞాని, మహతపస్వి, శక్తి సంపన్నుడు. ఒకసారి దేవదానవుల మధ్య జరిగిన యుద్ధంలో రాక్షసులు దేవతలకు అంతుచిక్కని విద్య నేర్చుకుని దాని సాయంతో దేవతల ఆయుధాలను తస్కరించడం మొదలుపెట్టారు. దధీచి ఆశ్రమం శత్రువులను కూడా సఖ్యపరచు శాంతి వనము. అందువల్ల దేవతలు తమ ఆయుధాలను దధీచి మహాముని వద్ద దాయడం మంచిదనే అభిప్రాయానికి వచ్చారు.

దేవతలకి భయ౦ వేసి దధీచి మహర్షిని కలిసారు. “ మహర్షీ మా అస్త్రాల్ని రాక్షసులు ఎత్తుకుపోకు౦డా మీ దగ్గర దాచి పెట్ట౦డి! అన్నారు. ఆయన అ౦దుకు అ౦గీకరి౦చాడు. చాలా కాల౦ గడిచి పోయి౦ది. దేవతలు తిరిగి వచ్చి తమ అస్త్రాల్ని తీసికెళ్ళలేదు. మహర్షికి వాటిని కాపలాకాసే పనివల్ల, తపస్సు చేసుకునే సమయం దొరకట్లేదు. అందుకే, మహర్షి ఇ౦క వాటిని దాచలేక మి౦గేశాడు.

కొ౦తకాల౦ తర్వాత దేవతలు వచ్చి “ మహర్షీ ! వృత్రాసురుణ్ణి చ౦పడానికి అస్త్రాలు కావాలి. వాటిని మాకిస్తే మే౦ వెళ్ళిపోతా౦ ! అన్నారు. “ అది విని మహర్షి “ దేవతలారా! మీ కోస౦ చాలా కాల౦ ఎదురు చూశాను. మీరు రాలేదు నాకు ఏ కబురూ లేదు. ఇ౦క వాటిని దాచలేక మి౦గేశాను !” అన్నాడు. “ఇప్పుడెలా..? “ అన్నారు దేవతలు.

“ అవన్నీ కరిగిపోయి నా ఎముకలకి పట్టేశాయి. నన్ను చ౦పి నా ఎముకలు తీసుకో౦డి !” అన్నాడు మహర్షి. దధీచి మాటలు విని “ అయ్యబాబోయ్! తపస్స౦పన్నుడయిన ఒక మహర్షిని చ౦పడమా…? అ౦తకు మి౦చిన మహా పాప౦ ఇ౦కేమయినా ఉ౦దా…?” అన్నారు దేవతలు భయ౦గా. “ మహర్షీ ! మీకు ఎప్పుడు కావాల౦టే అప్పుడు మోక్షాన్ని పొ౦దగల వర౦ ఉ౦ది కదా !” అన్నారు మళ్ళీ.

దధీచి ఆలోచి౦చాడు.. దేవతలు చెప్పినట్టు తనకు తానే అగ్నికి ఆహుతి అయితే దేవతలకి బ్రాహ్మణ హత్యా పాతక౦ అ౦టుకోదు అనుకుని దేవతలకి ఆ విషయ౦ చెప్పాడు.

వె౦టనే యోగాగ్ని రగిలి౦చుకుని ఆ అగ్నికి ఆహుతయ్యాడు. దధీచి శరీర౦ ను౦డి వచ్చిన అస్థులు తీసుకుని, వాటితో అస్త్రాలు తయారు చేయి౦చారు దేవతలు. అతని వెన్నెముక నుంచి ఇంద్రుడి వజ్రాయుధం తయారవుతుంది. వెనకా ముందాడకుండా తన ప్రాణాలను, శరీరాన్ని ఇచ్చేసిన త్యాగశీలిగా దధీచి పేరుపొందాడు.

నీతి : ఈ శరీరం పరోపకారం కోసమే ఉన్నది. ఈ విషయాన్ని మనం మరువక, మనకు చేతనైనంతలో ఇతరులకు సహాయపడుతూ ఉండాలి. 

PURANA TELUGU KATHALU - TELUGU PURANA STORY OF THE GREAT SAGE - DHURWASA MAHARISHI


దూర్వాస మహర్షి కధ

దూర్వాస మహర్షి అంటే కోపానికి ప్రతి రూపం అని అందరికి తెలుసు .అయితె ఆయనను గురించిన కధలు చాయా వున్నాయి అవి అందరికి తెలియవు. కొన్ని కధలను తెలుసు కొందాం.

దూర్వాసుడు అతి పురాతన మహర్షి .మహా సిద్ధుడు .మహాయోగి .కనుక తనకు ఇష్టమైనప్పుడు మరణించే సిద్ధి వుందాయనకు. మార్కండేయుని వంటి చిరంజీవి. మహా మంత్ర శాస్త్రాలన్నీ ఆపోసన పట్టిన మహాత్ముడు. పుణ్య వంతుడు, ప్రజ్ఞా శీలి,.. ఆయన జన్మ గురించి రెండు రకాల కధలున్నాయి. పూర్వం త్రిపురాసుర సంహారం చేసి శివుడు చంకలో ఒక బాణం పెట్టు కోని వస్తున్నాడు. దారిలో ఇద్దరు దేవ పురుషులు కని పించారు. వారికి శివుడి చంక లో వున్న బాణం శిశు రూపం లో వున్న శివుని లాగా కన్పించిందట. వారు శివుణ్ణి ఆ శిశువు ఎవరని అడిగారు. అప్పుడు శివుడు ఆతడు తన కుమారుడని, పేరు దూర్వాసుడు అని చెప్పాడు. వెంటనే ఆ బాణం శివానుగ్రహం తో శిశువు గా మారి, క్రమ క్రమం గా పెరిగి మహా మేధావి, జ్ఞాని అయిన దుర్వాస మహర్షి గా వృద్ధి చెందాడు. ఇది దూర్వాసుని గురించిన మొదటి కధ .

రెండవ కధ – అత్రి మహర్షి కి అనసూయా దేవి అనే మహా పతి వ్రత భార్య గా వుంది. అనసూయ దేవ హోతీ, కర్దము ల కుమార్తె. అత్రి అనసూయలు చక్కని ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసు కొంటు వున్నారు. ఒక సారి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు తమ వాహనాల మీద తిరుగుతూ, అత్రి మహర్షి ఆశ్రమం మీదగా ప్రయాణిస్తుంటే ఆ వాహనాలు కదల కుండా ఆగి పోయాయి. కారణం వారికేవారికి తెలియ లేదు. అప్పుడు గరుత్మంతుడు విష్ణు మూర్తి తో ”స్వామీ !కింద అత్రి మహా ముని ఆశ్రమం వుంది. దాని మీద నుంచి, దానిని, అతిక్రస్మించి ఎవరు పొరాదు. పోవటం సాధ్యం కూడా కాదు ”అని విన్న వించాడు. సరే అని వారంతా చుట్టూ తిరిగి వెళ్ళారు. అప్పుడు వారికి ఒక కోరిక కలిగింది. అత్రి మహర్షి ,, అంతటి మహిమావితుడా ? అయితె పరీక్షించాలి అను కొన్నారు. వాహనాలను చాలా దూరం లో ఆపేసి మ్ బ్రాహ్మణ వేషాలు వేసుకొని అత్రి మహర్షి ఆశ్రమం చేరారు త్రిమూర్తులు. ఆకలి గా వుందని, తమకు భోజనం పెట్ట మని మహర్షిని వేడు కొన్నారు .

మహా సాధ్వి అనసూయా దేవి, భ్హర్త అను మతి తో వారికి పీటలు వేసి, విస్తళ్ళు పరిచి వడ్డించ టానికి సిద్ధ పడింది. అప్పుడు ఆ బ్రాహ్మణ వేషం లోని త్రిమూర్తులు ”అమ్మా !మాకు ఒక నియమం వుంది. మాకు వడ్డించే వారు దిస మొల తో వడ్డిస్తేనే మేం భోజనం చేస్తాం ”అన్నారు. వీరి ని గుర్తించిన సాధ్వి, వెంటనే వారిపై మంత్రోదకాన్ని చల్లింది. వారు పసి పాపలు గా మారి పోయారు. అప్పుడు వారికి వారు కోరి నట్లే వడ్డించి, మళ్ళీ నీళ్ళు చల్లింది. మళ్ళీ యధా రూపం పొందారు వారు. వాళ్ళు భోజనం చేసిన తర్వాత మళ్ళీ మంత్రోదకం చల్లి పసి పాపలు గా మార్చి ఉయ్యాల లో ఊపుతూ, పెంచసాగింది. అక్కడ త్రిమూర్తుల భార్యలు భర్తల రాక కోసం ఎదురు చూస్తూ ఎంతకీ రాక పోయే సరికి ఏదో కీడు శంకించి, చివరికి వారు అత్రి ముని ఆశ్రమం లో అనసూయమ్మ ఒడిలో పెరుగు తున్నారని తెలుసు కోని వెంటనే అక్కడికి చేరారు. తమ పాతివ్రత్యం అనసూయా దేవి పాతివ్రత్యం ముందు ఎందుకూ పనికి రాకుండా పోయిందని గ్రహించి, నిజ రూపాలైన లక్ష్మీ సరస్వతి, పార్వతి రూపాలతో అక్కడికి చేరారు. తమ నాదులను తమకు ఇవ్వ వలసినది గా అనసూయా దేవిని ప్రార్ధించారు. జగన్మాతలు తమ ఆశ్రమం కు వచ్చిన కారణం తెలుసు కొన్న అనసూయ దేవి వారి అతిధి మర్యాదలు చేసి సభక్తి గా పూజించించింది .

వారి కోరికను మన్నించి, ఆ పసి బాలురను మళ్ళీ త్రిమూర్తులను గా మార్చి వేసింది మంత్ర జలం ప్రభావం తో. అప్పుడు బ్రహ్మ విష్ణు, మహేశ్వరులు నిజ రూపం పొంది, అనసూయా దేవి పాతి వ్రత్యానికి అబ్బుర పడి, నమస్సు లర్పించి, తాము పరీక్షించా టానికి వచ్చినందుకు సిగ్గు పడు తున్నామని తెలిపి ఆమె కు వరాలు ఇవ్వాలని అనుకొంటున్నామని కోరుకో మని విన్న వించారు. అనసూయ తమకు తల్లి అయి, ఇప్పటి దాకా లాలించి పాలించి నందుకు గర్వ పడు తున్నామని సవినయం గా తెలిపారు. ఆ అమ్మ త్రిమూర్తులు తనకు కుమారులు గా జన్మించి, ఆస లైన పుత్ర ప్రేమ ను కల్గించ మని కోరింది. వారు మువ్వురు తధాస్తు అన్నారు. త్రిమూర్తులు, జగన్మాటలు అత్రి, అనసూయాదేవి ల అనుగ్రహం పొంది వారి ఆశీస్సులు గ్రహించి వారి వారి పట్ట నాలకు వారి వారి వాహనాల పై వెళ్ళారు. కొంత కాలమ్ తర్వాత బ్రహ్మ అంశ తో అనసూయ గర్భం లో చంద్రుడు జన్మించాడు. విష్ణువు అంశ తో దత్తాత్రేయ మహర్షి, శివాంశ తో దూర్వాస మహర్షి ఆమె కు జన్మించారు. ఇలా దూర్వాస మహర్షి మహా తపస్సంపన్ను లైన అత్రి, అనసూయ దంపతుల కు శివాంశ వల్ల జన్మించిన కుమారుడు అని రెండో కధ వివ రిస్తోది. మిగిలిన కధలు తరువాత తెలుసు కొందాం .

శివామ్ష తో జన్మించిన దూర్వాసుడు, అన్ని విద్యలు నేర్చి, గంధమాదన పర్వతం మీద తీవ్ర తపస్సు చేస్తున్నాడు. అప్పుడు దేవ దాసీ తిలోత్తమ, ఆమె ప్రియుడు సాహసి అనే వాడు ఈ మహర్షిని గమనించ కుండా రాతి క్రీడలో పాల్గొన్నారు. వారి మాటలు, చేష్టలు మహర్షి తపస్సు కు భంగం కల్గించాయి. ఆయన కళ్ళు తెరచి, వారి కామోద్రేకానికి కినిసి, వారిద్దరిని రాక్షసు లు గా జన్మించ మని శపించాడు. సాహసి ”గర్దభాసురుడు ”గా జన్మించాడు. ఇతడు మహా విష్ణువు చేతిలో మరణం చెండాడు. ఏమైనా భరద్వాజుని ఏకాగ్రత దెబ్బ తిండి. కామ వికారం కల్గి, పెళ్లి చేసుకోవాలనే కోర్కె పెరిగింది. అదే సమయం లో చ్యవన మహర్షి కుమారుడు ”ఔర్వుడు ”అనే ఆయన, తన కుమార్తె ”కందళి ”తో అక్కడికి వచ్చి, మహర్షి మనసు లోని ఆట తెలుసు కోని, తన కూతురు కందళి నిచ్చి దూర్వాసునికి వివాహం చేశాడు.

కందళి గంప గయ్యాళి. ఆమె ను భరించటం కష్టం గా వుంది. ఆమె కోపాన్ని భరించ లేక, ఆమెను వదిలి, మళ్ళీ తపస్సు కు వెళ్ళాడు. ఆమెకు భర్త ను వదలటం ఇష్టం లేక, ఆతడిని అనుసరించింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ,దివ్య రూపం లో వున్న ఒక పిల్ల వాడు అక్కడికి వచ్చి మహర్షితో కందలిక ను విడిచి పెట్ట వద్దనీ ,ఆమెయే తగిన అర్ధాంగి అవుతుందని చెప్పి వెళ్లి పోయాడు .కందలిక తన పేరు మీద కదళీ వృక్ష జాతిని సృష్టించింది.కందళి కడలి గా ,రంభా గా అరటి గా పేరు మారింది . .
దూర్వాస మహర్షి గురించిన మూడో కధ .పూర్వం ”నాభాగుడు ”అనే రాజు వుండే వాడు .ఆయన కుమారుడే అంబరీషుడు .అంబరీషుడు విష్ణు భక్తుడు .ఏకాదశీ వ్రతాన్ని భ క్తీ శ్రర్ధ లతో చేసే వాడు . ఒక సారి ఏకాదశి ఉపవాసం వుంది ,మర్నాడు ద్వాదశి నాడు పారాయణ చేయటానికి సిద్ధ మైన సమయం లో దూర్వాసుడు ,ఆయనకు అతిధి గా వచ్చి స్నానం చేయటానికి నదికి వెళ్ళాడు .ద్వాదశి ఘడియలు పూర్తి ఆయె సమయం అయినా మహర్షి రాలేదు .అక్కడున్న మార్షుల అనుమతి తో , కొద్దిగా జలాన్ని తీర్ధం గా త్రాగాడు .తర్వాత దూర్వాసుడు వచ్చి ,జరిగిన దానికి కోప పది తన శిరస్సు లోని ఒక జడ ను పీకి దాన్ని పిశాచిగా మార్చి భక్త అంబరీషుని పైకి పంపాడు .అది అతి భయంకరం గా మీదకు రావటం గ్రహించి ,రాజు ,శ్రీ హరిణి మనసు లో ధ్యానించాడు .వెంటనే విష్ణు చక్రం ఉద్భవించి , పిశాచాన్ని చంపి ,,దుర్వాసుని చంప టానికి మీదకు వెళ్ళింది .

భయం తో దుర్వాసుడు పారి పోవటం ప్రారంభించాడు .చక్రం ఆయన్ను వెన్నంటే వెళ్తోంది .మూడు లోకాలూ తిరిగి నా ఎవరూ,దుర్వాసునికి అభయం ఇవ్వ లేదు .చివరికి విష్ణువు ఆజ్ఞా తో మళ్ళీ అమ్బరీశున్నే శరణు వేడాడు .అంబరీషుడు అతన్ని క్షమించాడు .వెంటనే చక్రం అదృశ్య మైంది . భగవంతుని కంటే ,భక్తుడే శక్తి కల వాడు అని ఈ కధ మనకు తెలియ జేస్తుంది .

ద్వాపర యుగం లో కుంతిభోజుడు అనే రాజు దగ్గరకు దుర్వాసుడు వచ్చాడు .ఆయన కుమార్తె కుంటే దేవిని చూసి ,ఆమె భక్తికి మెచ్చి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశిచాడు .ఆ మంత్రాన్ని ఏ దేవుడిని ఉద్దేశించి జపిస్తే ,ఆయన వల్ల మంచి సంతానం కలుగుతుందని చెప్పాడు .కుంటే దేవి బుద్ధి చాపల్యం తో ఆమంత్ర ప్రభావాన్ని పరీక్షించాలను కొంది .సూర్యుని గురించి ప్రార్ధించింది .ఆయన వరం వల్ల ఆమెకు కర్ణుడు జన్మించాడు కుంతికి వివాహం అయిన తర్వాత ధర్మ దేవత ,వాయుదేవుడు ,ఇంద్రుడు ,అశ్వినీ దేవతలను దుర్వాసుని మంత్రం తో స్మరించి ,క్రమంగా ధర్మ రాజు ,భీముడు ,అర్జునుడు ,నకుల సహ దేవులను కన్నది .వీరే పంచ పాండవులు .కర్ణుడిని నదిలో వదిలి పెడితే ఆతడు సూతుది కి దొరికి అక్కడ పెరిగి కుమారాస్త్ర విద్యా ప్రదర్శన లో తన సామర్ధ్యం రుజువు చేసు కోని ,దుర్యోధనుని మనసు గెల్చి ,అంగ రాజ్యానికి అభిషిక్తుడై ,కౌరవ పక్షం లో ముఖ్యుడైన సంగతి మనకు తెలిసిందే.
దూర్వాసుడు వైష్ణవ ,శాక్తేయాది మహా మంత్రాలన్నీ జపించి నప్పటికీ మనశ్శాంతి లేకుండా పోయింది . చివరికి ”శ్రీ హనుమత్సంజీవినీ విద్య ”నేర్చి జపించాడు .అప్పుడు హనుమ ఒకే ముఖం తో 18 భుజాలతో దర్శన మిచ్చాడు .దుర్వాసుడు పరవశించి ఆన్జనేయుడిని భక్తీ తో కీర్తించాడు .చక్కని శ్లోకం తో ఆయన్ను వర్ణించాడు.

”శక్తిం ,పాశం చ కుంతం ,పరశు మపి హలం తోమరం ,ఖేతకం వా
శంఖం చక్రం త్రిశూలం ముసలమపి గడం పట్టాసం ముద్గరం చ
గాండీవం బాణ పద్మం ,ద్వినవ వర భుజైహ్,ఖడ్గ మస్యావదానం
వందేహం వాయుసూనుం ,సురరిపు మధనం ,భక్త రక్షా దురీణం .”

ఈ శ్లోకం విన గానే ,ఆంజనేయుడు మిక్కిలి సంతోషించి దుర్వాసునికి మనశ్శాంతిని ప్రసాదించి , అదృశ్యమైనాడు .అప్పటి నుంచి దుర్వాసుడు ఆంజనేయ మంత్రాన్ని అత్యంత భక్తీ శ్రద్ధ లోతో జపిస్తూ మనశ్శాంతి ని పొందుతూ ,కోపం లేని వాడై ,గంధమాదన పర్వతం ఈదే నివశిస్తూ ,మహా యోగి యై శివుని వలె నిత్య ప్రాతస్మరనుడు అయాడు ..కనుక మానషిక శాంతి లభించాలి అంటే శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధించాలి అనిదుర్వాసుని కధల వల్ల మనకు తెలుస్తోంది .దుర్వాసముని కధ సమాప్తం.

TELUGU PURANA KATHALU - PURANA STORY OF ANJANA DEVI MOTHER OF LORD HANUMAN - FULL BIOGRAPHY OF MATHA ANAJANA DEVI IN TELUGU


అంజనాదేవి జీవిత చరిత్ర

పూర్వం ఒక మహర్షి శివుని కోసం కొన్ని వందల సంవత్సరాలపాటు ఘోర తపస్సును ఆచరిస్తాడు. అప్పుడు అమరావతీ నగరానికి రాజయిన ఇంద్రుడు.. ఆ ముని చేస్తున్న ఘోరతపస్సును చూసి ఎక్కడా తన అమరావతీ నగరాన్ని శివునితో వరంగా కోరుకుంటాడోనన్న భయం అతనిలో కలుగుతుంది. దాంతో ఇంద్రుడు ఎలాగైనా ఆ మహర్షి తపస్సును భంగం కలిగించాలని నిర్ణయించుకుంటాడు.

అప్పుడు ఇంద్రుడు తన రాజ్యంలో వున్న ‘‘పుంజికస్థల’’ అనే అప్సరసను ముని తపమును భంగం కలిగించాల్సిందిగా ఆజ్ఞాపించి, పంపిస్తాడు. మునిని చూసి ఆ అప్సరస లోలోపల భయపడుతున్నప్పటికీ చేసేదేమీలేక అతని తపమును భంగం కలిగించడానికి అహర్నిశలు ప్రయత్నిస్తుంది. తన అందాచందాలతో, నృత్యగీతాలతో ఆ మహర్షి తపస్సును భంగం కలిగిస్తుంది. తన తపస్సును భంగం కలిగించిందన్న కోపంతో మహర్షి ఆమెను.. ‘‘నువ్వు వానర యోనియందు జన్మించుగాక’’ అని శపిస్తాడు.

అప్పుడు ఆ అప్సరస భయంతో ఎలాగైనా తనను ఈ శాపం నుంచి విముక్తి కలిగించాల్సిందిగా కోరుకుంటూ.. వినయభావంతో అనేక రకాలుగా ప్రార్థిస్తుంది. చివరికి ఆ ముని ఆమెను అనుగ్రహించి.. ‘‘నువ్వు ఎప్పుడు ఏ రూపంలో ధరించాలని అనుకుంటావో.. అప్పుడు ఆ రూపాన్ని నువ్వు పొందవచ్చు’’ అని వరాన్ని ప్రసాదిస్తాడు.

కొన్నాళ్ల తరువాత ముని విధించిన శాపం మేరకు ఆ పుంజికస్థల అనే అప్సరస వానరిగా జన్మిస్తుంది. ఆమెకు నచ్చిన విధంగా యదేచ్ఛగా సంచరించేందుకు కూడా అవకాశం లభించింది. ఈమే ‘‘అంజనాదేవి’’. ఈమె వానర రాజు అయిన కేసరిని వివాహం చేసుకుంది. ఎంతో అందగత్తె అయిన అంజనాదేవిని కేసరి చాలా అనురాగంతో చూసుకునేవాడు. ఆమెకు అన్నివిధాలుగా సౌకర్యాలను కల్పించేవాడు.

ఒకానొకరోజు ఈ వానర దంపతులు మానవ రూపాలను ధరించి తమ రాజ్యంలోనే విహరించసాగారు. సంతోషంగా విహరిస్తున్న సమయంలో వాయువు చాలా వేగంగా వీస్తుంది. అప్పుడు ఒక వాయువుతరంగం అంజనాదేవి చీర చెంగును ఎగరగొడుతుంది. దాంతో ఆమెను ఎవరో స్పృజించినట్లుగా అనిపిస్తుంది. దానికి ఆమె కోపంతో.. ‘‘నా పాతవ్రత్యాన్ని భంగం కలిగించడానికి సాహసించింది ఎవరు? నేనిప్పుడే వారిని శపిస్తాను’’ అని చెబుతుంది.

అందుకు సమాధానంగా వాయుదేవుడు.. ‘‘దేవీ! నేను వాయుదేవుడిని. నా స్పర్శవల్ల నీ పాతివ్రత్యము భంగం కాలేదు. అయితే శక్తిలో నాతో సమానమైన ఒక సుపుత్రుడు నీకు కలుగుతాడు. నేను అతనిని అన్నివేళలా రక్షిస్తాను. అంతేకాదు.. బాలల నుంచి పెద్దలవరకు అందరూ అతనిని ఆధ్యాత్మికంగా ఆదరిస్తానరు. ఎవరు అతనిని తిరస్కరించేవారు వుండరు. అతడు భగవంతునికి సేవ చేసుకుంటూ.. ఆదర్శమార్గంలో సత్కీర్తిని పొందుతాడు’’ అని చెబుతాడు. తరువాత కేసరీదంపతులు అక్కడి నుంచి వెళ్లిపోతారు.

వాయుదేవుడు చెప్పిన విధంగా.. శంకరుని అంశతో అంజనాదేవికి శ్రీమత్ వైశాఖ బహుళ దశమినాడు పరాక్రమవంతుడైన హనుమంతుడు అవతరిస్తాడు.

TELUGU PURANA MAHABHARATHA STORY ABOUT THE LEDGENDARY FIGHTER - JAMBHAVANTHUDU - THE WARRIOR FIGHTER - BEAR PRINCE


 జాంబవంతుడు

జాంబవంతుడు బ్రహ్మ ఆవులించగా పుట్టిన భల్లూకరాజు. కృత యుగం నుండి ద్వాపర యుగం వరకు జాంబవంతుని ప్రస్తావన ఉంది. క్షీరసాగర మధనం సమయంలోను, వామనావతారం సమయంలోను జాంబవంతుడు ఉన్నాడు. రామాయణంలో రాముని పక్షాన పోరాడాడు. కృష్ణునికి శ్యమంతకమణిని, జాంబవతిని ఇచ్చాడు.

రామాయణంలో వయోవృద్ధునిగాను, వివేకవంతునిగాను, మహా బలశాలిగాను జాంబవంతుని ప్రస్తావన సుందర కాండ, యుద్ధకాండలలో తరచు వస్తుంది. ముఖ్యంగా హనుమంతుని జవ సత్వాలు ఎరిగిన వివేకిగా జాంబవంతుని వ్యక్తిత్వం గోచరిస్తుంది. సముద్రాన్ని దాటి సీతను అన్వేషించడం ఎలాగో తెలియక అందరూ విషణ్ణులైనపుడు జాంబవంతుడే ఆ పనికి హనుమ సర్వ సమర్ధుడని తెలియజెప్పాడు.

యుద్ధకాండలో సారణుడనే రాక్షస చారుడు రావణునికి జాంబవంతుని, అతని అన్న ధూమ్రుని ఇలా వర్ణించాడు - "భల్లూక వీరుల సేనాపతి అయిన ధూమ్రుడు నర్మదా జలం త్రాగుతూ ఋక్షవంతం అనే గిరి శిఖరం మీద నివశిస్తూ ఉంటాడు. అతని ప్రక్కన ఉన్న పర్వతాకారుడైన మరో భల్లూక వీరుడే జాంబవంతుడు. పరాక్రమంలో ఈ తమ్ముడు అన్నకంటే మిన్న. సేనాధిపతులందరిలోనూ చాలా గొప్పవాడు. మహా పరాక్రమ శాలి. పెద్దలను సేవించడం అతనికి చాలా ఇష్టం. ఎన్నో యుద్ధాలలో ఆరి తేరాడు. అసహాయ శూరుడు. దేవాసుర యుద్ధంలో దేవేంద్రునకు సాయం చేసి చాలా వరాలు పొందాడు."

ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వల్ల రామ లక్ష్మణులు, వానర సేన మూర్ఛిల్లినపుడు - మృత ప్రాయులై ఉన్నవారిలో బ్రతికినవారికోసం విభీషణుడు, హనుమంతుడు వెదుకసాగారు. అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని "అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?" అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు "హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికియున్నా మృతులమే! వేగంలో వాయువుతోనూ, పరాక్రమములో అగ్నితోనూ సరిసమానుడయిన హనుమంతుడుంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది" అని జాంబవంతుడు హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఓషధీ పర్వతము మీది మృత సంజీవని, విశల్యకరణి, సౌవర్ణకరణి, సంధాన కరణి అనే ఔషధాలను తీసుకు రమ్మని హనుమను కోరాడు.

జాంబవంతుడు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో కొన్నింటిని (బహుశా నాలుగు కూర్మ, వామన, రామ, కృష్ణావతారాలు) చూసిన పరమ భక్తుడు. సమస్త భూమండలాన్ని ఎన్నో సార్లు ప్రదక్షిణ చేశాడు. క్షీరసాగర మథనం జరుగుతున్నపుడు దేవతల కోరిక మేరకు భూగోళంపై ఔషధులన్నింటినీ అందులో పోశాడు. బలి చక్రవర్తి యజ్ఞం చేసినప్పుడు మహావిష్ణువు త్రివిక్రమావతారం ఎత్తినపుడు, సురగంగతో బ్రహ్మపాదాలు కడిగే సమయాన జాంబవంతుడు త్రివిక్రముడుకి అనేక ప్రదక్షిణలు చేశాడు. రామావతారంలో హనుమంత, అంగదాది వానర వీరులతో సీతాన్వేషణకై వెళ్ళాడు. శతయోజన విస్తీర్ణమైన సాగరాన్ని దాటే ఉపాయం తెలియక వానరవీరులంతా ప్రాయోపవేశానికి సిద్ధమైనపుడు జాంబవంతుడు హనుమంతుని సమీపించి అతని జన్మ వృత్తాంతం, శాపాల్లాంటి వరాల గూర్చి చెప్పి హనుమంతుడికి ప్రేరణనిచ్చాడు. ఆ తర్వాత యుద్ధంలో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం ప్రయోగించిన వేళ, సర్వ వానరసేన మూర్చిల్లుతారు.

అస్త్ర ప్రభావం సోకని విభీషణుడు వానర యోధులను సమీపించి వారి చెవులలో ధైర్య వచనాలు పలుకుతుంటే, ఆంజనేయుడు కూడా లేచి తనవారికి ఉత్సాహం కల్పించే ప్రయత్నం చేస్తాడు. ఈ సమయంలో విభీషణుడు జాంబవంతుడి దగ్గరకు వెళ్ళి ”తాతా!” అంటే ”బ్రహ్మాస్త్రం ధాటికి కన్నులు కనపడకున్నవి. కంఠస్వరాన్ని బట్టి నిన్ను గుర్తిస్తున్నాను. ఇంతకూ మన వాయునందనుడు క్షేమమేనా?” అని ప్రశ్నిస్తాడు. ఆశ్చర్యచకితుడైన విభీషణుడు ”తాతా! రామలక్ష్మణులు, అంగద సుగ్రీవుల గురించి అడగకుండా, కేవలం హనుమంతుని గురించి మాత్రమే ఎందుకడుగుతున్నావు?” అని ప్రశ్నిస్తాడు. అప్పుడు జాంబవంతుడు ”ఒక్క హనుమంతుడు ఉంటే చాలు. సర్వం శుభప్రథమే అంటాడు. ” హనుమంతునిపై ఆయనకున్న విశ్వాసం అటువంటిది. అప్పుడు మారుతి జాంబవంతుని చెంతకు చేరి సంతోషంతో ఆలింగనం చేసుకుని, బ్రహ్మాస్త్ర ప్రభావం వల్ల మూర్ఛితులైన వారిని కాపడటం కోసం హిమగిరుల్లోని ఔషధులు తెమ్మని చెబుతాడు. ఇంకా జాంబవంతుడి ప్రస్థావన క్రిష్ణావతారంలోనూ కనిపిస్తుంది. స్వయంగా కృష్ణుడితో యుద్ధం చేయడమే కాకుండా, ఆయనకు కన్యాదానమే చేశాడు.

YAMA DWITHIYA - ABOUT BHOGINI FESTIVAL INFORMATION IN TELUGU - LORD YAMA AND HIS SISTER YAMUNA PURANA STORY IN TELUGU


యమద్వితీయ

'భగిని' అంటే తోబుట్టువు అయిన సోదరి అనీ, భాగ్యవంతురాలు అనీ అర్థం. సోదరి చేతివంటను తినడం భగినీహస్త భోజనం. ఈ సంప్రదాయానికి ఎంతో విశిష్టత ఉంది. యమధర్మరాజు సోదరి యమునానది. ఆమె పూర్వం తన అన్న అయిన యమధర్మరాజు దగ్గరకు ప్రతి నిత్యం వెళ్లి, తన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లాల్సిందిగా కోరేదట. నరకలోక పాలనలోనే సతమతమైపోయే యమధర్మరాజుకు సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేయడానికి ఎన్నాళ్లకూ తీరిక దొరకలేదు. ఎలాగైనా ఒక దినాన చెల్లెలి ఇంటికి వెళ్లి భోజనం చేసి రావాలని సంకల్పించుకున్నాడు. చివరికి అతనికి కార్తికమాసం, శుక్లపక్షం, ద్వితీయాతిథినాడు విరామం దొరికింది. ఆ దినాన యమున ఇంటికి వెళ్లాడు. ఎన్నాళ్లో ఎదురుచూడగా అనుకోకుండా వచ్చి, తన ప్రార్థనను మన్నించిన అన్నకు యమున షడ్రసోపేతమైన విందు భోజనాన్ని వడ్డించింది.

యముడు సోదరి భక్తితో చేసిన వంటలన్నీ చక్కగా ఆరగించాడు. అమృతాన్ని తాగినంత ఆనందం కలిగింది. అప్పుడు యముడు తన చెల్లెలి చేతివంటను మెచ్చుకొని, ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు. అప్పుడామె- 'అగ్రజా! నీవు ప్రతి సంవత్సరం ఇదే రోజున నా ఇంటికి వచ్చి నా చేతివంటను తినివెళ్లాలి. అంతేగాక, ప్రతి సంవత్సరం కార్తిక శుక్లద్వితీయనాడు లోకంలో ఏ అన్నలు చెల్లెళ్లు వండిన పదార్థాలను భోజనం చేస్తారో, అలాంటివాళ్లకు నరకబాధ ఉండరాదు. ఇదే నేను కోరే వరం' అని పలికింది. యముడు 'తథాస్తు' అన్నాడంటారు. నాటి నుంచి ఈ వేడుక 'యమద్వితీయ' (యముడు తన సోదరి చేతివంటను తిన్న దినం) అనీ, 'భ్రాతృద్వితీయ' (అన్న చెల్లెలి చేతివంట తిన్న పవిత్ర దినం) అనీ ప్రసిద్ధిలోకి వచ్చింది.

'భగినీహస్త భోజనం' అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం, ఆచారం. ఇందులో మానవజీవన విశేషాలు, పరమార్థాలు ఇమిడి ఉన్నాయి. మనిషి కుటుంబజీవి. కనుక కుటుంబాన్ని విడిచి క్షణంకూడా జీవించలేడు. కుటుంబంలో ముఖ్యులు తల్లిదండ్రులు. వాళ్లు సంతానాన్ని కని, పెంచి, పోషించి, పెద్దచేసి, విద్యాబుద్ధుల్ని ప్రసాదించి, తమ సంతానానికీ కుటుంబాలను సంపాదించిపెడతారు. మనిషికి తల్లిదండ్రుల తరవాత ఆత్మీయులైనవాళ్లు తోబుట్టువులైన అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లే కదా! తల్లిదండ్రులు వయసులో పెద్దవాళ్లు కనుక, తమ సంతానం బతికినంతకాలం బతుకలేరు. తమ సమకాలంలో పుట్టిన తోబుట్టువులు తమ జీవితాంతం వరకు బతికే అవకాశం ఉంది. అందువల్ల అన్నలు, తమ్ముళ్లు, అక్కలు, చెల్లెళ్లు కనీసం ఏడాదికి ఒక్కసారైనా కలిసి భోజనం చేయకపోతే ఆత్మీయతలు ఎలా నిలుస్తాయి? అంతేగాక, ఒకరి కష్టసుఖాలను మరొకరు తెలుసుకొని స్పందించే అవకాశం ఉంటుందా? ఉండనే ఉండదు. కనుక ఈ భోజన సంప్రదాయం కుటుంబ సభ్యుల మధ్యన జీవితాంతం వరకు ప్రేమాభిమానాలను కలిగి ఉండే అదృష్టాన్ని ప్రసాదిస్తుంది.

బతుకు తెరువుకోసం దూరదూరాలకు వెళ్లకుండా ఉండిన ప్రాచీనకాలంలోనే ఈ సంప్రదాయం, ఆచారం కొనసాగింది. ఇక ఆధునికకాలం ఉపాధికోసం రాష్ట్రాల సరిహద్దులనే కాదు, దేశాలను, ఖండాలను దాటిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏడాదికొకసారి కాదుగదా, రెండు మూడేళ్లకూ ఆత్మీయులను, తోబుట్టువులను కలుసుకోలేని దుస్థితిలో ఆత్మీయతలు ఎలా నిలుస్తాయి? కనుక ఎప్పుడో ఒకప్పుడు కలిసినా ఈ ఆచారాన్ని పాటించి అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల ఇళ్లకువెళ్లి, వాళ్ల చేతివంటను భుజించి, వారికి ధనకనక వస్తువాహనాలను యథాశక్తిగా సమర్పించుకొంటే ఆత్మీయబంధాలు వర్ధిల్లుతాయి. ఒకరికొకరం అండగా ఉన్నామనే భావన, విశ్వాసం కలుగుతాయి. ఇవే ఆచారాలు, సంప్రదాయాలు. రాగద్వేషాలకు అతీతంగా విశ్వక్షేమం కోసం ఏర్పాటు చేసినవే ఆచారాలనీ, వాటిని వంశపారంపర్య క్రమంలో పాటించినప్పుడు సంప్రదాయాలవుతాయనీ పెద్దల మాట. ఆచారం ఎప్పుడూ దోషభూయిష్ఠమై ఉండదు. యుక్తాయుక్త విచక్షణగల మానవులు తమ ఆచరణల్లో ఏయే లోపాలున్నాయో తెలుసుకొని, వాటిని సవరించుకొని చక్కగా ఆచరించాలి. అదే విజ్ఞత అంటే.

'ఆత్మా వై పుత్రనామాసి' అన్నది వేదం. అంటే, తల్లిదండ్రుల ఆత్మలే సంతానంలో ఉంటాయని అర్థం. అందువల్ల అక్కాచెల్లెళ్లు అమ్మకు ప్రతిరూపాలే. అమ్మ చేతివంట అమృతసమానం అయితే అక్కాచెల్లెళ్ల చేతివంట కూడా సుధామయమే. కనుక 'భగినీహస్త భోజనం' అన్ని విధాలా అమృతభక్షణంతో సమానం. ఈ పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటే చాలు- ఈ పర్వదినంలోని మహిమ బోధపడుతుంది. ఏ సంప్రదాయమైనా, ఆచారమైనా మానవాళి మధ్య సద్భావనలను పెంపొందింపజేసి, స్నేహాన్ని, ఆత్మీయతను, ఆప్యాయతను శాశ్వతంగా నిలపడంకోసమే. ఇది గ్రహిస్తే భూలోకం అభినవ స్వర్గమే అవుతుంది.