ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

COMPUTER AND ITS EFFECTS ON HEALTH - TAKE CARE USING COMPUTER ROUND THE CLOCK - TIPS FOR REMEDY OF HEALTH WIZARD



మీరు కంప్యూటర్‌పై ఎక్కువ సమయం పనిచేస్తున్నారా? ప్రతినిత్యం మనం ఉపయోగించే కంప్యూటర్ల వల్ల విచిత్రమైన వ్యాధులు వస్తాయంటే నమ్ముతారా? కంప్యూటర్ల వాడకం పెరుగుతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్లు వినియోగదారులు కూడా దీనికి మినహాయింపు కాదు. ముఖ్యంగా సెల్‌ఫోన్లపై అదేపనిగా గేమ్స్‌ ఆడటం, ఎస్‌ఎంఎస్‌లు పంపడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయంటే ఆశ్చర్యపోకతప్పదు మరి. 

కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు వంటివాటిని ఎక్కువగా వాడడం వల్ల వాటినుండి వచ్చే రేడియేషన్‌ ప్రభావం తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తుంది. దీనివల్ల కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ (సివిఎస్‌), రిపిటేటివ్‌ స్ట్రెస్‌ ఇంజురీ (ఆర్‌ఎస్‌ఐ), టొయస్ట్‌ స్కిన్‌ సిండ్రోమ్‌, టెక్నోస్ట్రెస్‌ వంటి వ్యాధులకు గురవుతారు. శరీర భాగాలపై నిరంతర ఒత్తిడి అనేది ఆర్‌ఎస్‌ఐకి దారితీసే కారణాల్లో అతి ముఖ్యమైనది. నిరంతరం కంప్యూటర్లతో కలిసి వుండడం వల్ల మనుషుల్లో కూడా యాంత్రిక ధోరణి గూడుకట్టుకుంటోందని, దీనివల్ల అడిగినదానికి వెంటనే జవాబివ్వడం, చాలా అలెర్ట్‌గా వుండడం, భావోద్వేగాలకు లోనుకాకపోవడం, ఎంతో సమయం పట్టేపనిని కొద్ది సెకన్లలోనే పూర్తి చేయాలనుకోవడం వంటి లక్షణాలు కంప్యూటర్‌ ప్రొఫెషనల్స్‌లో కొట్టవచ్చినట్లు కనబడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే...
ఆర్‌ఎస్‌ఐ :ఒకే విధమైన పనిని ఎడతెరిపి లేకుండా చేస్తూ వుండడం వల్ల కండరాలపై ఒత్తిడి పెరిగి నరాలు పట్టు కోల్పోవడం, చచ్చుపడిపోవడం వంటి లక్షణాలు కన్పించడాన్ని ఆర్‌ఎస్‌ఐ (Repetitive Stress Injury) అంటారు. ఉదాహరణకి కంప్యూటర్‌ కీబోర్డ్‌తో అదేపనిగా టైప్‌ చేయడం వల్ల చేతివేళ్ళకి ఈ వ్యాధి వచ్చే అవకాశం వుంది. సిటిఎస్‌ (Carpal Tunnel Syndrome) అనేది ఒక రకమైన ఆర్‌ఎస్‌ఐ. చేతి మధ్య నుండి మణికట్టు ద్వారా వెళ్ళే నరంపై ఒత్తిడి పెరగడం వల్ల చేతిలో సూదులతో గుచ్చుతున్నట్లుగా బాధ కలగడం, స్పర్శజ్ఞానం కోల్పోవడం, వస్తువులను పట్టుకోలేకపోవడం వంటి లక్షణాలను సిటిఎస్‌ అంటారు. దక్షిణాసియా దేశాలతో పోల్చితే కంప్యూటర్ల వాడకం ఎక్కువగా వున్న యురోపియన్‌ దేశాల్లోనే ఎక్కువమంది ఈ వ్యాధి వున్నట్లు అంచనా. కేవలం చేతులకేకాక శరీరంలోని ఏ భాగంలోనైనా ఈ వ్యాధి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా భుజాలు, మెడలోని కండరాలు, అరికాళ్ళు, మోకాళ్ళు, నడుముభాగంలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.
అసలు ఆర్‌ఎస్‌ఐ ఎందుకు వస్తుంది? ఎంతవరకు దీన్ని ప్రమాదకారిగా గుర్తించవచ్చు? వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోగలమా? అనే అంశాలపై జరిగిన ఓ సర్వేలో వెల్లడైన అంశాలు- ఎడతెరిపిలేకుండా టైప్‌ చేయడం, అతి ఎక్కువ సమయం టైప్‌ చేయడం, తల తిప్పకుండా పనిచేయడం, మణికట్టు వంచి పనిచేయడం, అదే పనిగా మౌస్‌ వాడడం, కదలకుండా ఒకేచోట కూర్చొని వుండడం, కాళ్ళ కింద సపోర్ట్‌ (ఫుట్‌ రెస్ట్‌) లేకుండా కూర్చోవడం, అతి తక్కువ లేక అతి ఎక్కువ కాంతిలో పనిచేయడం
సివిఎస్‌ : ఇటీవల ఎక్కువగా వ్యాప్తిచెందుతున్న వ్యాధుల్లో ఇదొకటి. దీన్ని మామూలు భాషలో 'పొడి కళ్ళు' అంటారు. కళ్ళు పొడిబారతాయి. నొప్పిగాను, దురదగాను అనిపిస్తుంది. కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే ఈ 'కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌' వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10మిలియన్ల మంది 'కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌'కు గురవుతున్నట్లు అమెరికాలో జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ప్రతిరోజూ మూడు గంటలకు మించి కంప్యూటర్లపై పనిచేసేవారిలో కంటికి సంబంధించిన సమస్యలు అధికంగా వున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. కళ్ళమంట, కళ్ళు తడి ఆరిపోవడం, తల, మెడ కండరాల నొప్పులు, తలపోటు, కళ్ళు మసకబారడం వంటివి ఈ సివిఎస్‌ లక్షణాలు. ఈ సమస్య ఉత్పన్నం కావడానికి కంప్యూటర్‌ మోనిటర్‌ నుండి జనించే రేడియేషన్‌ ప్రధాన కారణం. దీంతోపాటు కంప్యూటర్‌ వున్న పరిసరాల్లోని వెలుతురులో హెచ్చుతగ్గులు, కంప్యూటర్‌ అమరిక, కూర్చునే విధానం, గంటల తరబడి కదలకుండా కంప్యూటర్‌పై పనిచేయడం వంటివి కారణమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
టెక్నోస్ట్రెస్‌ (Technostress) : దీనివల్ల కంప్యూటర్‌ ప్రొఫెషనల్స్‌లో ఒకరకమైన టెన్షన్‌, అసహనం, ఇతరులపై సానుభూతి లోపించడం, మెషీన్‌లా పనిచేయడం వంటి లక్షణాలు గోచరిస్తాయి.
టొయస్ట్‌ స్కిన్‌ సిండ్రోమ్‌ : ముఖ్యంగా ల్యాప్‌టాప్‌ వాడేవారికి 'టొయస్ట్‌ స్కిన్‌ సిండ్రోమ్‌' అనే చర్మవ్యాధి సోకే ప్రమాదం వుంది. ల్యాప్‌టాప్‌ను గంటలకొద్ది కాళ్ళపై పెట్టుకొని పనిచేయడం వల్ల ఈ వ్యాధి వచ్చి చర్మం అసాధారణంగా కనిపిస్తుందని 'స్విస్‌' అధ్యయనం గుర్తించిందని టెలిగ్రాఫ్‌ తన నివేదికలో వెల్లడించింది. ల్యాప్‌టాప్‌ నుంచి 125 ఫారిన్‌హీట్‌ (52 సెంటీగ్రేడ్‌) వెలువడుతుంది. కొన్ని సందర్భాల్లో చర్మం శాశ్వతంగా నల్లబడిపోతుందని యూనివర్శిటీ హాస్పిటల్‌ బసెల్‌లో దీనిపై అధ్యయనం చేసిన డాక్టర్‌ అన్‌డ్రెస్‌ అర్నాల్డ్‌ పీటర్‌ వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో చర్మ క్యాన్సర్‌ వచ్చే అవకాశం కూడా వుందని ఆయన పేర్కొన్నారు. వీటితోపాటు నిద్ర పట్టకపోవడం, సరైన వ్యాయామం లేక బిపి, సుగర్‌ వంటి జబ్బులతోపాటు ఊబకాయం వంటి సమస్యలకు లోనుకావడం జరుగుతుంది. ఎక్కువ సమయం కంప్యూటర్‌ ఉపయోగించేవారు అందుకు తగినట్లుగానే ఆరోగ్యపరమైన జాగ్రత్తలూ తీసుకోవడం తప్పనిసరి. ఈ వ్యాధులు నిర్ణీతస్థాయిని మించి ముదిరిపోతే శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. ఈ దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
- తక్కువ రేడియేషన్‌నిచ్చే మంచి క్వాలిటీ మోనిటర్స్‌ను ఎంచుకోవాలి, - యాంటీగ్లేర్‌ స్క్రీన్స్‌ వాడాలి. తద్వారా మోనిటర్‌ నుండి వచ్చే రేడియేషన్‌ ప్రభావం కంటిపై కొంతవరకు తగ్గుతుంది, - పనిచేస్తున్నప్పుడు ప్రతి మూడుగంటలకోసారి కనీసం 10నిమిషాలపాటు విశ్రాంతి తీసుకోవడం, చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం చేయాలి, - ఎక్కువసార్లు కనురెప్పలు మూసి తెరుస్తూ వుండాలి, - కంటికీ స్క్రీన్‌కు మధ్య దూరం 55నుంచి 75సెం.మీ. వరకు వుండాలి, - సాధారణంగా మోనిటర్‌ మధ్యభాగం కళ్ళతో పోల్చినప్పుడు 4నుంచి 6అంగుళాలు కిందికి వుండాలి. దీనివల్ల కంటిపాపను కనురెప్పలు కొంతవరకు కప్పివుంచుతాయి, - ఎసి వున్న గదుల్లో ఆ గాలి డైరెక్ట్‌గా కళ్ళకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, - కంప్యూటర్‌పై కూర్చునేవారికి ఎదురుగా లైట్‌ వుండకూడదు. దీనివల్ల కాంతికిరణాలు కళ్ళపై పడతాయి. దీన్ని నివారించాలి, - కీబోర్డ్‌ లేదా మౌస్‌తో పనిచేస్తున్నప్పుడు చేతి మణికట్టు కింద ఒక సపోర్ట్‌ని ఉపయోగించాలి, - కంప్యూటర్‌ మోనిటర్‌ని కళ్ళకి సమానమైన ఎత్తులో వుండేటట్లు చూసుకోవాలి, - కాళ్ళకి కూడా సపోర్ట్‌ (ఫుట్‌రెస్ట్‌) వాడాలి, - ఎడతెరపి లేకుండా పనిచేయకుండా మధ్యమధ్యలో కొన్ని నిమిషాలు రెస్ట్‌ తీసుకోవాలి, - ఎప్పుడూ ఒకే సీటులో కూర్చోకుండా సీటు మారుస్తుండాలి.