నల్లని చందమామ
చీకటినంతా తనలో దాచేసుకున్నట్టు
వెన్నెలనంతా ఆకాశం నిండా నింపేసినట్టు
తెల్లటి ఆ ఆకాశంలొ నల్లని ఆ చందమామ చల్లగా మెరిసిపోతుంది
ఆ అందాన్ని కనులారా చూద్దామని ప్రయత్నిస్తుంటే,
ప్రకృతి లోని సరిగమలకి,
అటు ఇటు ఊగుతూ చందమామ నాతో దోబూచులాడుతుంది...
నీ మాటకి భావానికి అనుగుణంగా
కదులుతున్న నీ కళ్ళని బంధించాలని నా కళ్ళు నన్ను మరిచిపోతున్నాయి
నీ కనుపాపల నలుపులో నాకు దాగిపోవాలనుంది
ఆ కన్ను గిలుపుల్లో నా ఉనికిని చాటుకోవాలనుంది
రెప్ప పాటైనా నీ కలల్లో నిలవాలనుంది
అందమైన ఆ కళ్ళని ఎంతసేపు చూసినా తనివి తీరడంలేదు
ఆడే ఆ కన్నులని నేననుసరించలేకపోతున్నాను
ఒకసారి నా కళ్ళల్లోకి చూడవా?
అలసిన నేను చల్లని నీ చూపుల నిండు వెన్నెల్లో సేదతీరతాను
ఆ వెన్నెల మొత్తాన్ని నాలోనే నింపుకుంటాను...