కార్తీకమాసము
మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తిక మాసము. శివ కేశవులకిద్దరికీ ప్రీతికరమైనది .ఏంతో మహత్యము కలది. కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమణములో నుండగా ఆచరించె స్నాన , దాన , జప,పూజాదులు విశేష పలితాలనిస్తాయి. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవ రూపము ధరించి సమస్త నదీ జలాలలోనికి చేరుతుంది. కాబట్టి ఈ నెలలంతా నదీ స్నానము చేస్తే శరీరము , మనసు రెండూ పవిత్రమవుతాయి . నదులు దగ్గరలేక పోతే చెరువులో , వాగులో , ఏవీ దగ్గర లేకపోతే కనీసము ఇంటిలోనైనా సూర్యోదయానికి ముందే " గంగేచ యమునే చైన గోదావరి సరస్వతి ! నర్మదే సింధు , కావేరీ జలెస్మిన్ సన్నిధిన్ కురు " అనే శ్లోకాన్ని పఠిస్తూ తలస్నానము చేసి నిర్మల హృదయము తో భగవదారాధన చేయాలి.
కార్తీకమాసము ముప్పై రోజులు పర్వదినాలుగా భావించి నదీ స్నానాలు , వుపవాసాలు , సాయంత్రము కాగానే ఇంటి ముందు దీపాలు వెలిగించటము , స్త్రీలు దీపాలను నదిలో వదలటము ,వనభోజనము చేయటము , వివిధ దానాలను , ముఖ్యముగా దీప దానము , సాలంకృత కన్యాదానము చేయటము మొదలైనవి నిర్వహిస్తారు. ఈ మాసము లో ఉపనయన దానము ,కన్యాదానము చాలా పలితమిస్తుంది .భక్తి తో సాలంకృత కన్యా దానమిచ్చినట్లు ఐతే అన్ని పాపాలు తొలిగిపోయి పితృదేవతల యొక్క స్తానాన్ని,బ్రహ్మ పదాన్ని పొందుతారంటారు. దశమి ,ఏకాదశి ,ద్వాదశి తిధులలో శ్రీమహావిష్ణువును తులసిదళాలతోనూ , కమలపూల తోనూ పూజిస్తే జీవించినన్నాళ్ళూ ధనానికి లోటులేకుండా వుండి , సమస్త సౌఖ్యాలు కలగటముతో పాటు అంత్యమున జన్మరాహిత్యము కలుగుతుందట. అదేవిధముగ ఆరుద్ర నక్షత్రము రోజున , మాస శివరాత్రినాడు , సోమవారమునాడు , కార్తీక పున్నమి నాడు రుద్రాభిషేకం చేసి , బిల్వదళాలతోనూ , రుద్రాక్షల తోనూ పూజించినవారికి అనంతమైన సౌఖ్యాలతోబాటు అంత్యమున శివసాయుజ్యము పొందుతారని కార్తీకపురాణం చెబుతోంది .
లింగాష్టకం
బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజదుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం
దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకర లింగం
రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం
సర్వసుగంధి సులేపితలింగం బుద్దివివర్ధన కారణలింగం
సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం
కనకమహామణి భూషితలింగం ఫణిపతివేష్టిత శోభిత లింగం
దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం
కుంకుమచందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం
సంచితపాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం
దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభి రేవచలింగం
దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం
అష్టదళో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం
అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం
సురగురు సురవరపూజితం లింగం సురవరపుష్ప సదార్చితలింగం
పరమపదపరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం
లింగాష్టక మిదంపుణ్యం యఃపఠేచివసన్నిధౌ
శివలోక మవాపోత్ని శివేన సహమోదతే .