ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

EAT GARELU NO DRINK


గారెలు తాగరు తింటారు



అనగనగా ఒకానొక వూరిలో ఒక అమ్మ , ఒక నాన్న . వారికో గారాల కూతురు సుందరి . కందిపప్పుకు శెనగపప్పు కు తేడా తెలీకుండా మురిపెంగా , ముచ్చటగా పెరిగింది సుందరి . దానితో పాపం చదువూ అంతగా అబ్బలేదు . పోనీలే చదువుకొని , వూళ్ళేలా ????? వుద్యోగాలు చేయాలా ????? మనకేమీ లేదా పోదా అనుకొని సుందరి నాన్న , సుందరికి పెళ్ళిచేద్దామని ఆంధ్రదేశమంతా జల్లెడ పట్టి , అందగాడు . . . బాగా చదువుకున్నవాడు . . . వుద్యోగస్తుడు . . . నెమ్మదస్తుడు . . . బరువు బాద్యతలు లేనివాడు . . . ఇంకా బోలెడు డు లు వున్నవాడైన , అచ్చతెలుగు అబ్బాయి సుబ్బారావు కు ఇచ్చి అంగరంగ వైభోగం గా పెళ్ళి చేసి , అమ్మాయి, అల్లుడితో కొత్తకాపురం పెట్టించి . . . ఊహ్ . . . ఊపిరి పీల్చుకున్నాడు .

కొత్తకాపురం * * * మొదటిరోజు * * * పెళ్ళిలో అమ్మలక్కలందరూ , మగవాడి హృదయానికి దారి కడుపునుంచేనే అమ్మాయి . చక్కగా వంటచేసి పెట్టి మొగుడిని కొంగున ముడేసుకో అని సుందరి చెవులు కోరికేసారు . అది గుర్తొచ్చి సుందరి , ఆ ప్రయత్నమేదో మొదటి రోజు నుంచే చేద్దామని నిశ్చయించుకొని , " సుబ్బూ . . . సుబ్బూ నీకోసం తినటానికి ఏమిచేసిపెట్టను ?" అని గారంగా అడిగింది . ముద్దుల భార్య , గారాల మోము చూసి ముద్దైపోయి , " సుందూ , నాకు గారెలంటే ఇష్టం . చేసిపెట్టరా " అని అని ముద్దు ముద్దుగా అడిగి ఆఫీసుకెళ్ళిపోయాడు . గారెలా అవేమిటి ఎలా వుంటాయో , ఎలా చేయాలో తెలీదే అని కాసేపు సోచాయింపులో పడి , పోనీ పక్కింటి పిన్నిగారిని అడుగుదాము అనుకొని ,గోడ దగ్గరికి వెళ్ళి పిన్నిగారు , పిన్నిగారూ అని పిలిచింది సుందరి .

ఏమిటమ్మాయ్ అంటూ వచ్చారు పిన్నిగారు .

" పిన్నిగారు , మావారు గారెలు తినాలని వుంది అన్నారు . గారెలా చేస్తారో చెప్పరూ ప్లీజ్ " అని అడిగింది సుందరి .

" ఓస్ గారెలే కదమ్మా . చేయటం చాలా సులభం . ముందుగా మినపప్పు తీసుకోవాలి ."

" మినపప్పు తీసుకోవాలా ? నాక్తెలుసు , నాక్తెలుసు " అంటూ ఇంట్లోకి పరిగెత్తింది సుందరి .
వంటింట్లోకి వెళ్ళి చూస్తే మినపప్పు ఏదో తెలీలేదు . మళ్ళీ గోడ దగ్గరకు వచ్చి " పిన్నిగారూ . . . పిన్నిగారూ " అని కేకేసింది .ఏమిటమ్మాయ్ అంటూ పిన్నిగారు వచ్చారు .

" మినపప్పు ఎలా వుంటుంది పిన్నిగారు ."

ఇదో అమ్మా ఇలా వుంటుంది అని మినపప్పు తెచ్చి చూపించి , ఈ పప్పు గిన్నెలోకి తీసుకొని అని చెప్పబోతుండగా " నాక్తెలుసు . . . నాక్తెలుసు " అని ఇంట్లోకి పరిగెత్తింది సుందరి .

ఓ గ్లాసెడు మినపప్పు గిన్నెలోకి తీసుకుంది . ఆ తరువాత ఏం చేయాలి చెప్మా ! అనుకొని మళ్ళీ గోడ దగ్గరికి వచ్చి , పిన్నిగారి ని పిలిచి , ఆ పప్పును ఏమిచేయాలండి ? అనీడిగింది . కడిగి నాన బోసి , , , అని చెపుతుండగానే "నాక్తెలుసు . . . నాక్తెలుసు " అని ఇంట్లోకి పరిగెత్తింది .

సరె పప్పు నానబోసింది . ఆ తరువాత ????? మళ్ళీ పిన్నిగారూ . . . పిన్నిగారూ అని కేకేసింది . ఏమిటమ్మాయ్ అంటూ మళ్ళీ వచ్చారు పిన్నిగారు . నానబోసిన పప్పును ఏమిచేయాలండి అని అడిగింది . దానిని రుబ్బుకోవాలి . ఆ పైన , అబ్బే వినే దాకా ఎక్కడ " నాక్తెలుసు . . . నాక్తెలుసు " అని ఇంట్లోకి వెళ్ళిపోయింది . " బాగానే వుంది సంబడం " అనుకుంటూ పిన్నిగారూ లోపలికి వెళ్ళిపోయారు .

మినపప్పు రుబ్బటం ఐపోయింది . ఆ తరువాత ఏమి చేయాలి ? పిన్నిగారినే అడగాలి . . .

" పిన్నిగారూ . . . పిన్నిగారూ . . . "

" ఏమిటమ్మాయ్ ?"

" పప్పు రుబ్బేసానండి . ఇప్పుడేమి చేయాలి? "

" గ్లాస్ లో వేసుకొని నీళ్ళు కలుపుకొని , సుబ్బరంగా తాగెయ్యాలి ." విసిగిపోయిన పిన్నిగారి జవాబు .

" ఓస్ ఇంతేనా ! నాక్తెలుసు . . . నాక్తెలుసు."

సుబ్బారావు గారెలు తిందామని లొట్టలేసుకుంటూ వచ్చాడు . సుందరి అంతకన్నా ప్రేమగా గ్లాసెడు గారెలు ఇచ్చి , " సుబ్బూ . . . ఎంచక్కా గారెలు తాగేసేయ్ . నీకోసం పక్కింటి పిన్నిగారిని అడిగి చేసాను తెలుసా " అని వూరిస్తూ ఇచ్చింది .

" గారెలు తాగటమేమిటే సుందూ " అంటూ బిత్తరపోయాడు సుబ్బు .

" పక్కింటి పిన్నిగారు ఇలాగే చెప్పారు . నీకేమీ తెలీదు .తొందరగా తాగేయ్ సినిమా టైం ఐపోతోంది " అని తొందర చేసింది సుందు .

" గారెలు తాగరే * * * తింటారు " .ఏడుపు మొహం పెట్టాడు సుబ్బు :(((((
నీతి ; అతితెలివి అనర్ధదాయకం .

సామెత ; తోచీ తోచనమ్మ ఇలాంటి తొక్క కథలే చెప్పును :)
STORY COLLECTED FROM THE BLOG :
http://sahiti-mala.blogspot.in/search/label/%E0%B0%95%E0%B0%A5
సాహితి