2. "సాంప్రదాయం "
చీర.. రవికలో
చూడ చక్కని సుందరి
నుదుట కుంకుమ.. చేతి కంకణాలె
భరత జాతి కన్నెకు పసిడి ఆభరణాలు
కవ్వించే జాబిలి
పుష్పించే పూలసందడి
ఆమెను ఆవిష్కరిస్తున్నాయేగాని
అవధులు దాటించలేదు
చిరుగాలి సరాగమాడి
పరువాల పరువును పలుకరించబోయినా
చాలులె... అంటూ
చేతిలో అడ్డుకుందిగానీ
ప్రకృతికి కూడా
తాను పలుచపడలేదు
కలువ కన్నులో కనిపించె ముగ్ధత్వం
మోములో అగుపించె అమాయకత్వం
వరించి వచ్చే విభునికోసం
ఎదురుచూస్తున్న వధువులా లేదూ...
అదీ మన సంస్కారం
అదే మన మాన ప్రాణం
అందుకె అందుతోంది మనకు
దేశ విదేశాల నమస్కారం.
* * * * * * * * * * * * * *
3. "మధ్యమం"
ఓ అందాల అతివా
నీ కన్నుల కలువలలో ఆ గుబులెందుకో
అందుకేనా .... ఆదమరపులో అరజారెను
పరువాల పసిడి పైటంచు
చల్లగ వీచే చిరుగాలి,
అల్లన సాగె అలల అల్లరి,
తొంగి చూచె కొంటె జాబిల్లి
వెన్నెల విరిసే హాయయిన వేళలో
ఎవరికోసమో ఈ ఎదురుచూపు ?
ఓ.. తెలిసిందిలే
ఈ లాహిరి లాలనలో
నిను లాలించే..
విభుని కోసమేకదా ఈ నీ నిరీక్షణ.
నీ చెలుని చేతిలోని
మల్లెల మత్తువాసనలు
ఏ కబురంపినాయో
కురుల కుబుసాల మిసమిసలు
వడివడిగ ముడివీడినాయి
అలివేణీ... యిక నీ ఆశ
నెరవేరే సమయం
నీ చెంతకు చేరనుంది
నీకు మధురమయిన
విందునందిచనుంది
సఖియా శెలవా మరియిక.
రచయిత్రి : దేవి