అందానికి అలంకరణ నగలు!
1
ఆభరణాలు-అలంకరణ అనేది ప్రాచీన కాలం నుంచి వస్తూన్న సాంప్రదాయం. అన్ని దేశాల్లోనూ,అన్ని జాత్తుల్లోనూ,అన్ని కాలాల్లో నూ అలంకరణ మీద మోజు కనిపిస్తూనే ఉంది. కాని కాలనుగుణంగా ఎంతో మార్పులు వచ్చాయి.
మనదేశ సాంప్రదాయాన్ని తీసుకున్నట్లైతే వేద,ఇతిహాన కాలాల్లో కూడా స్త్రీ, పురుషులు వారి వారి హోదాను, అభిరుచిని బట్టి ఆభరణాలు ధరించేవారు. చారిత్రాత్మకంగా సింధునాగ రికత కాలంలో స్త్రీలు అలంకరణకు ప్రాముఖ్యం ఇచ్చేవారని చెప్పకనే చెప్తున్నది.
మన ప్రాచీన శిల్పాలు, అజంతా ఎల్లోరా కుడ్య చిత్రాలూ నాటి అలంకరణకు సాక్ష్యంగా నిలచి ఉన్నాయి.మన దేవాలయాల్లోని విగ్రహాలను రకరకాల ఆభరణాలతో అలం కరిస్తారు.
మధ్యయుగంలో కూడా మహారాజులు మొదలు సామాన్య ప్రజల వరకూ అనేక ఆభరణాలు ధరించినట్లుగా వాజ్మయం,సాంస్కృతిక చరిత్రలు,కైఫీయత్తుల వల్ల తెలుసుకోవచ్చు.
దేశ కాల పరిస్థితులేవైనా మానవుడు తన అభిరుచినీ,అవసరాల్నీ బట్టి అందం కోసం, విలాసం కోసం, రక్షణ కోసం ఆభరణాలను, విలువైన రాళ్లను ధరిస్తాడన్నది నిర్వివాద విషయం. అంతే కాకుండా రానురాను అలంకరణపైన అభిలాష పెరిగి, ఆభరణాలు ఉన్న సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి అన్న నమ్మకం కూడా ఏర్పడింది. ఏది ఏమైనా ఓ వ్యక్తి కట్టు చూడగానే ఆ వ్యక్తి హోదా, ఆర్థిక స్తోమత వ్యక్తిత్వాలతో బాటు మనస్తత్వం కూడా తెలుసుకోవచ్చు.
రుద్రాక్షమాలలు, తులసి పూసలూ ధరిస్తే అది వారికి ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని, ఆధ్యాత్మిక చింతనను ఇస్తాయని కొందరి నమ్మకం.నేటికీ మహాకవులనూ, వేదపండితులనూ వారి వారి పాండిత్యానికి చిహ్నంగా కాలిగి గండపెండేరం,చేతికి కంకణాలు తొడిగి సన్మా నిస్తుంటారు. కర్ణుడు కవచకుండలాలు ధరించి నంతకాలం అపజయమంటూ ఎరుగడట. శకుంతల మొదలైన మునికన్యకలు ధరించిన పూలమాలలు వారి నిరాడంబరమైన ఆశ్రమ వాతావరణానికి తగినట్లుగా ఉంటాయి. మన హైందవ సాంప్రదాయం ప్రకారం పెళ్లికూతురికి నల్లపూసలు, మట్టెలు,మంగళసూత్రం ధరింపజేస్తారు.ఇవి ఒక పవిత్రమైన బంధానికి ఒక్కొక్కరకం అంకరణ చేస్తుంటారు. గర్భిణీ స్త్రీలకు రంగు రంగుల గాజులు, వేయిస్తారు. హైందవ సంప్రదాయసిద్ధంగా పెళ్లికూతురికి పచ్చని, ఎర్రని గాజుల,బాలింతలకు ఆకుపచ్చని గాజులు వేయిస్తారు. సరోజినీనాయుడు తన ‘బ్యాంగిల్ సెల్లర్సు’ అనే పద్యంలో ఏయే రంగుల గాజులను ధరిస్తే శుభ ప్రదమనుకుంటారో చెప్పి హైందవ సంస్కృతిని చక్కగా వర్ణించేవారు.
సంప్రదాయ సిద్ధంగా కొన్ని ఆభరణాలను ధరించడం చూస్తూంటాం. చేతులకు,గాజులు, దండకడియాలు, చెవులకు దుద్దులు, జూకాలు, చెంపస్వరాలు ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. చెంపస్వరాలు, ముక్కుకి ముక్కు పుడక, అడ్డబాస, తలకు కిరీటం పాపిడి బిళ్లలు, రాగిడి, సూర్యుడు, చంద్రుడు మొదలైనవి మెడలో కంటె కాసుల పేరు, రకరకాల హారాలు, నడుముకు మువ్వల వడ్డాణం కాళ్లకు కడియాలు, గొలుసులు, అందెలు, మువ్వలు, పాంజేబులు, వేళ్లకి ఉంగరాలు మొదలైనవి ముఖ్యంగా ధరించే నగలు శరీరంలో ఆయా అవయవాలకు ఆభరణాల వల్ల ఒక ప్రత్యేకత, రక్షణ కూడా లభిస్తాయనే ప్రజలు భావిస్తున్నారు.
ఆధునిక కాలంలో ఆభరణాలు ధరించడంలో అనేక మార్పులు సాంస్కృతిక పరంగా వచ్చేయి. ఇవి ముఖ్యంగా ఆర్థిక,సాంఘిక,సాంస్కృతిక పరంగా వచ్చేయి. పూర్వకాలం నుంచీ మన దేశం విదేశాలతో వర్తక వ్యాపారాలు చేసి, వెండి బంగారాలను, విలువైన రాళ్లను సంపాదించేది.కృష్ణదేవరాయల కాలంలో వజ్రవైడూర్యాలు ఎక్కువగా అమ్మే వారని చరిత్ర చెబుతోంది. మహమ్మదీయుల దండయాత్రలు, రెండు ప్రపంచ నిల్వలు తరిగి పోయాయి.
బంగారం వరిమాణం క్రమేపీ తగ్గుతూ వస్తోంది. బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో మన వర్తక వ్యాపారాలు దెబ్బతినడంతో మన వెండి బంగారు నిల్వలు తరలి పోయాయి.
బంగారం అంతర్జాతీయ మారకద్రవ్యం. పరిశ్రమాభివృద్ధికి యంత్రాలను కొనటం కోసం, రక్షణకు, ఆయుధ పరికరాలను తెచ్చుకోవటం కోసం బంగారం ఆధారంగా కరెన్సీ ముద్రించి వినియోగిస్తున్నాం. విదేశీమారక ద్రవ్యం కోసం మన దేశం నుంచి అరబ్ దేశాలకు బంగారపు ఆభరణాలు 1997 సంవత్సరం నుంచి ఎగుమతి చేస్తున్నాయి.
ప్రస్తుత కాలంలో బంగారం ధర పెరగటం వల్ల ప్రజల్లో ఆభరణాల పట్ల ఆసక్తి తగ్గుతోంది. బంగారం సామాన్య ప్రజల అందుబాటులో లేదు. ఆనాడు బంగారం బాగా ఉన్న కుటుంబాలు సమాజంలో సంపన్న కుటుంబాలుగా ఉండేవి.కాని,ప్రస్తుతం బంగారం ధర పెరగటం వల్ల ధనవంతులకు అందుబాటులో ఉన్నప్పటికీ వాళ్లు కూడా ఆభరణాల వాడకం తగ్గిస్తున్నారు. ఆనాడు నగలు లేకపోతే స్త్రీలను సంఘంలో నిరాడంబరంగా నగలు ధరిస్తే అంత ఆధునిక నాగరికతగా పరిగణింపబడుతోంది.
అయినప్పటికీ ప్రజల్లో బంగారం మీద వ్యామోహం తగ్గలేదు.కారణం బంగారం ధర మాటిమాటికీ పెరగడమే కాని తగ్గక పోవడం.
ఫ్యాషన్లు మారిపోతున్నాయి. బంగారం ఆభరణాల స్థానంలో వివిధ రకాల అలంకరణ సాధనాలు రావడం వల్ల మరింత ఖర్చు పెరుగుతోంది. ఏవో కొన్ని నగలు ధరించకుండా స్త్రీలు ఉండలేకపోతున్నారు. బంగారం, వెండి నగల స్థానంలో ఇమిటేషన్ గోల్డు నగలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. రకరకాల పూసల దండలు తయారవు తున్నాయి.
సంఘంలో ఆర్థికస్తోమత తగ్గుతున్న కొద్ది ఆభరణాలూ అలంకరణ పట్ల స్త్రీల దృక్పథం సాధారణంగా తగ్గాలి. కాని మరింత పెరుగుతోందని చెప్పవచ్చు. అలంకరణ వల్ల ఆకర్షణ రాదనీ, సహజ సౌందర్యావిష్కరానికి వ్యక్తిత్వపు విలువలు ముఖ్యంగా తోడ్పడతాయనీ ప్రతి స్త్రీ గుర్తించిన నాడే దేశ భవిష్యత్తు చక్కబడుతుంది.