అయితంపూడి ఉద్యోగం
ఒక మహానుభావుడు ఉద్యోగం కోసం ఇలా గాలిలో మేడలు కట్టాడూ.ఈ ఉద్యోగం వస్తుందనీ కాదు, వచ్చేదీ కాదు, చెస్తున్నదీ కాదు, చేసిందీ కాదు కాని వస్తుందని ఊహించిన ఉద్యోగం వస్తే మటుకు దరిద్రం తీరుస్తుందన్న కోరికతో విశ్వాసముతో ఇలా ఆలోచించాడు. ఊహించిన ఉద్యోగం వస్తే బోలెడు పాడీపంటా ఏర్పడతాయి. కనీసం ఆరు గేదెల పాడి. అన్ని పాలు పెరుగు దాచడానికి కనీసం నాలుగు కుండలు అవసరం. ఒకటేమో పాలకోసం, ఒకటి పెరుగుకోసం, మూడోది చల్ల కోసం, మరి బంధువులు గట్రా వస్తే ఇవ్వడానికి మజ్జిగ కోసం ఇంకో కుండ.ఇలా ఊహాగానాలు చేసాడు ఆ వ్యక్తి. ఉద్యోగం వచ్చి, ఆరు గేదెల పాడి సమకూరినప్పుడు చేయవలసిన పని గురించి ఇప్పుడే ఆలోచించాడు. కాని ఆ ఊహలలో మజ్జిగ, చల్ల ఒకటే అని అతనికి గుర్తుకురాలేదు. అంటే వస్తుందన్న నమ్మకముతో అలా ఆలోచించాడు అమాయకంగా.ఇలా ఊహలలో జీవించేవాళ్ళు కోకొల్లలు. అసలు అయితంపూడిలో ఉద్యోగం ఉందా లేదా అన్న ప్రశ్నతోగాని, ఉన్నా అది తనకు అందుబాటులో ఉందోలేదొ సరిచూసుకోకుండా ఊహాప్రపంచంలో ఇన్నిన్ని ఆలోచనలు చేశాడు ఆ అభాగ్యుడు. పునాదుల్లేకుండా భవనం కట్టాలని తాపత్రయపడేవాళ్ళనూ, ఆధారం లేకుండా అరిచేతిలో స్వర్గముందని ఊహించేవాళ్ళనూ ప్రస్తావించేటప్పుడు "ఆయన అయితంపూడి ఉద్యోగం చేస్తున్నాడు లెండీ!" అని అంటారు. ఉద్యోగం ఇచ్చినవాళ్ళు, పుచ్చుకున్నవాళ్ళూ లేరూ. కానీ ఉద్యోగం వేరొకటి దొరికిందన్నమాట. ఊహాజీవులు చేసేది అయితంపూడి ఉద్యోగం అన్నమాట.