ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TELUGU LANGUAGE OLD TELUGU JATIYALU AND ITS EXPLANATION - VERY INTERESTING


జాతీయాలు-వివరణ

అతలాకుతలం - ఇనుపగజ్జెల తల్లి

అతలాకుతలం 

దీనికి అతలకుతలమనే రూపాంతరముంది. మొత్తం మీద ఈ మాటకు తలకిందులు అనే అర్ధముంది. అతలాకుతలం అవటమంటే విసిగి వేసారటం అలసట పడటం, తలకిందులు కావటం వగైరా అర్ధాలున్నాయని కొన్ని నిఘంటువులు పేర్కొన్నాయి. కుతలం అంటే భూమి. భూమికింద ఏడు లోకాలున్నాయని మన పురాణాలు ఘోషిస్తాయి. వాటిని సప్త అదోలోకాలంటారు. అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం అనే ఏడు భూమికింద ఉన్న లోకాలని విశ్వాసం, కొందరు సుతలానికి బదులు కుతలమనే శబ్దాన్నే వాడుతుంటారు. అడుగున ఉన్న అతలం పైనున్న కుతలమయినా, కొందరి భావన ప్రకారం దానికి రెండు మెట్లు కింద ఉన్నకుతలమయినా దెబ్బ తిన్నట్టే, పతనమైనట్లే. "పాపం, ఆయన వ్యవహారం/వ్యాపారం అతలాకుతలంగా ఉంది " అనే మాట వినపడుతుంది. అంటే అతడి వ్యాపారమో , వ్యవహారమో చెడిందని అతడు దెబ్బతిని ఉన్నాడని, తలకిందులై పోతున్నాడని అర్ధం. అదోలోకాలున్నాయన్న విశ్వాసంతో ఇది పుట్టింది.


ఇనప గజ్జెల తల్లి : 

సంపదలిచ్చే లక్ష్మీదేవి బంగారు గజ్జెల తల్లి అయితె, దరిద్రమిచ్చే ఆమె అక్కగారు ఇనుప గజ్జెల తల్లి. పరమ దరిద్రురాలన్న అర్ధంలో ఈ మాట వాడుతుంటారు. సాధారణంగా స్త్రీలను నిందించడానికేఈ సమాసం ప్రయోగిస్తారు గాని దరిద్రులైన పురుషులకు ఈమె తల్లి కానట్లుంది - లింగ భేదం వల్ల ఈ ప్రస్తావన చేయరు. ఇనుము - ఆ మాటకు వస్తె - నల్లని వస్తువులన్నీ - దారిద్ర్యానికి చిహ్నాలు. తెల్ల గోడ్డుకున్న గౌరవం , నల్ల గొడ్డు ఎంత ఎక్కువ చాకిరి చేసిన మెచ్చుకోలేరు. దరిద్రుల ఇంట్లో ఈ పెద్దమ్మ ఇనుప గజ్జెలు ఘల్లుమంటుండగా నాట్యం చేస్తుంటుందని కవులు వర్ణిస్తుంటారు.