తమిళనాడులోని సాగరతీరం వెంబడి వెలసిన కళాసంపదల ప్రదేశం మహాబలిపురం. చెన్నై నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో, కంచి పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. యునెస్కో వారి ప్రాచీన సంస్కృతి గల ప్రదేశాల్లో ఒకటిగా పరిరక్షింపబడుతోంది.
సాగరతీరంతో పాటు అద్భుతమైన కళాఖండాలకు నిలయమైన ఈ ప్రదేశానికి విశిష్టమైన చరిత్ర ఉంది. ఏడవ శతాబ్దంలో దక్షిణ భారతదేశాన్ని పాలించిన పల్లవ రాజుల రాజ్యంలోని ఓ ప్రముఖ తీర నగరం బహాబలిపురం. అప్పటి పల్లవ రాజ్యాన్ని పాలించిన మామ్మల్లరాజు పేరుతో ఈ నగరం కట్టినట్లు చరిత్ర చెబుతోంది.
పల్లవులు తమ పాలనలో ఈ ప్రాంతానికి అనేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వారికాలంలో ఈ నగరం రేవు పట్టణంగా ఉండేది. వారే ఇక్కడి కొండల మీద లైట్ హౌస్‌ను నిర్మించారు.
పర్యాటకులను ఆకర్షించే కళాఖండాలు
ఆనాటి పల్లవుల వైభవానికి సాక్ష్యంగా ఉన్న మహాబలిపురంలో చూడదగిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. సముద్రతీరం వెంబడి వెలసిన ఈ ప్రదేశంలోని గోపురాలు, మండపాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఈ నిర్మాణాలన్నీ ఆనాటి రాజుల శిల్పకళా వైభవాన్ని చాటిచెప్పే సాక్షులు.
వీటితో పాటు ఈ ప్రాంతంలో పాండవ రథాలు పేరుతో ఉన్న ఏకశిలా నిర్మాణాలు, వారు నివశించినవని చెప్పబడే గదులు సైతం పర్యాటకులను కదలనివ్వకుండా కట్టిపడేసేవే. ఈ ప్రాంతంలోని అందమైన గార్డెన్ ఆహ్లాదపరుస్తూ చూపరులను కదలనివ్వదు. దూరంగా కనబడే సముద్రం... దానికి ముందు అద్భుతమైన శిల్పసంపద ఈ మహాబలిపురం ప్రత్యేకం. ఇలా కనిపించే ప్రకృతి మరెక్కడా చూడలేం. వీటితోపాటు సముద్రం ఒడ్డున ఉన్న సీ షోర్ దేవాలయం కూడా పర్యాటకులను ఆకర్షిస్తుంది.
ఈ ప్రదేశాలన్నీ ఒకదానికొకటి దగ్గరగానే ఉంటాయి. ఒక రోజు కేటాయించగలిగితే ఈ ప్రదేశాలను అణువణువుగా వీక్షించవచ్చు. ఈ నిర్మాణాలతోపాటు మహాబలిపురం బీచ్ చక్కని కాలక్షేపం. సాయంత్రం వేళ పర్యాటకులతో కళకళలాడుతుంది. గవ్వలతో చేసిన వస్తువులతో పాటు సముద్ర చేపలతో చేసిన రకరకాల వంటకాలు పర్యాటకుల జిహ్వ చాపల్యాన్ని తట్టిలేపుతాయి.
సులభంగా చేరుకోవచ్చు
మహాబలిపురం చేరుకోవడం చాలా సులభం. చెన్నై నుండి మహాబలిపురానికి అన్ని వేళలా బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. దాదాపు రెండుగంటల ప్రయాణం.
మహాబలిపురం టూరిజం ప్రాంతమైనా ఇక్కడ ఉన్న వసతి సౌకర్యాలు కాస్త తక్కువే. హోటళ్లు, స్టాళ్లు అందుబాటులో ఉన్నా వసతి సౌకర్యాలు మాత్రం తక్కువ. అందుకే ఈ ప్రాంతంలో బస చేయడానికి పర్యాటకులు అంతగా ఆసక్తి చూపరు.