రక్తపోటును తగ్గించే బీట్‌రూట్ రసం
రక్తసోటును సులభంగా తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు బీట్‌రూట్ రసం తాగాలని చెబుతున్నారు పరిశోధకులు. బీట్‌రూట్ రసం తాగిన కొద్ది గంటల్లోనే రక్తపోటు 4 నుండి 5 పాయింట్లు తగ్గిందని ఆస్ట్రేలియాకు చెందిన 'బేకర్ ఐడిఐ హార్ట్ అండ్ డయాబెటీస్ ఇన్‌స్టిట్యూట్' పరిశోధకులు కనుగొన్నారు. ' చాలా కాలం పాటు రోజూ ఒక గ్లాసు బీట్‌రూట్ రసం తాగితే మెరుగైన ఫలితాలు ఉంటాయి' అని డాక్టర్ లె కొల్స్ చెప్పారు. 15 మంది పురుషులు, 15 మంది మహిళలపై అధ్యయనం చేశారు. బీట్‌రూట్ రసం తాగిన ఆరు గంటల తర్వాత వీరిద్దరిలో రక్తపోటు స్థాయి తగ్గింది. పురుషుల్లో రక్తపోటు గణనీయంగా తగ్గింది. బీట్‌రూట్‌లో ఆరోగ్యకరమైన పదార్థాలుంటాయి. ఇందులో విటమిన్-సి, విటమిన్-కె, పీచు, పాలిఫినొల్స్ ఉంటాయి. ఇందులో అధికంగా ఉండే నైట్రేట్ రక్తపోటు తగ్గించడంలో బాధ్యత వహిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.