ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

A BRIEF ARTICLE ON SAREE


చీరను నిర్వచించాలంటే నాలుగు నుంచి తొమ్మిది గజాల పొడవుగల దీర్ఘ చతురస్రాకారపు వస్త్రం. భారత ఉపఖండం దీని స్వస్థలం. ఈ చీరను పలుచోట్ల ఆయా వాతావరణాలకు అనుకూలంగా పలు రకాలుగా కట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. భారతదేశం, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, భూటాన్‌, బర్మా, మలేషియా, సింగపూర్‌లలో చీరకట్టు ప్రసిద్ధి చెందింది.

న్నేసి చీరకట్లు...
నాలుగు నుంచి తొమ్మిది గజాల పొడవున్న ఒక సాధారణ వస్త్రంతో వంద వేర్వేరు పద్ధతుల్లో చీరకట్టవచ్చు అంటే నమ్ముతారా? నమ్మకపోతే మీరు చీరను తక్కువ అంచనా వేసినట్లే. ఫ్యాషన్‌ డిజైనర్‌ షాయినా చీరను 54 వేర్వేరు పద్ధతుల్లో కట్టగలరట. ఆ సంగతి పక్కన పెడితే మనకు వివిధ రాష్ట్రాలో అనేకరకాల చీరకట్టు పద్ధతున్నాయి. నివి, బెంగాలీ (లేదా) ఒరియా పద్ధతి, గుజరాతీ/రాజస్థానీ, మహారాష్ట్రియన్‌ (కొంకణీ/కష్టా), ద్రవిడియన్‌, మదిసర్‌, కొడగు, గొబ్బిసీరి, గోండ్‌, మళయాళీ పద్ధతి, ట్రైబల్‌ (గిరిజన పద్ధతి), కుంబి (దెంతిలి ).
మన రాష్ట్రంలోని చీరకట్టును 'నివి' అంటారు. ఇక గుజరాతీ, మహారాష్ట్రియన్‌, తమిళియన్‌, బెంగాలీ చీరకట్టు ఎలా ఉంటుందో కూడా చూద్దాం.
పల్లూ (పవిట) మామూలుగా ఉంటే సీదాపల్లు అంటారు. ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌, బీహార్‌లలో ... కుచ్చిళ్లు కుడివైపు ఉండేలా అమర్చి, పవిటను వెనుక నుంచి కుడిభుజం మీదుగా, ఎద భాగం కవర్‌ అయ్యేలా పిన్‌ చేస్తారు. చివరిగా అంచును వెనుక దోపితే అదే గుజరాతీ స్టైల్‌.
మామూలు చీరకట్టులో లాగా ఐదున్నర మీటర్ల పొడవు చీర మహారాష్ట్ర స్టైల్‌ చీర కట్టుకు చాలదు. ఎనిమిది మీటర్ల పొడవాటి చీర కావాలి. చీరలో ఒక భాగాన్ని కాళ్ల మధ్య నుంచి తెచ్చి, వెనుక భాగంలో దోపాలి. రెండవ భాగం అంటే పవిట మామూలుగానే ఉంటుంది. ఈ కట్టు మన గోచీ కట్టును పోలి ఉంటుంది. ఈ పద్ధతి అన్ని రకాల కదలికలకు అనుకూలంగా, సౌకర్యంగా ఉంటుంది.
ఇక తమిళ చీరకట్టు చూద్దాం. మహారాష్ట్ర పద్ధతిలో మాదిరిగానే చీర ఎనిమిది మీటర్ల పొడవు ఉండాలి. నడుము చుట్టూ చీరను చుట్టి కుచ్చిళ్లు ఎడమ కాలి దిక్కుగా వచ్చేలా చూసుకోవాలి. మిగిలిన భాగాన్ని ఎడమ భుజం మీదుగా తీసుకుని, నడుము భాగం చుట్టూ మరొక చుట్టు చుట్టి అంచును ఎడమవైపుగా దోపాలి.
బెంగాలీ తరహా చీరకట్టులో కుచ్చిళ్లు వుండవు. చీరను కుడివైపుకు వచ్చేలా నడుము చుట్టూ చుట్టి పవిటను ఎడమ భుజం మీద నుంచి వేయాలి. ఇప్పుడు ఆ పవిటను కుడిచేతి కిందుగా తోసి మరోసారి ఎడమ భుజంమీద వేయాలి. బెంగాలీ చీరకట్టు రెడీ.

రకరకాల చీరలు
ఈ చీరకట్లు గురించి చదువుతుంటే 'అమ్మో...ఇన్ని రకాల చీరకట్లు వున్నాయా?' అనిపిస్తోందికదూ. ఇక మన దేశంలో ఎన్ని రకాల చీరలున్నాయో చెప్తే మరింత ఆశ్చర్యపోవాల్సిందే. ఒక పక్క ఎయిర్‌ హోస్టెస్‌లు ఈ చీరకట్టుకు ఖండాంతర ఖ్యాతి తెచ్చిపెట్టడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంటే ఈ చీర భారత దేశంలో కొత్త పోకడలు పోతూ కొత్త కొత్త అందాలు సంతరించుకుంటోంది. వస్త్రము, నేత, ప్రింట్‌ల ఆధారంగా విభిన్న ప్రాంతాలలో ఆయా సంస్కృతులు ప్రతిబింబించేలా దక్షిణ ఆసియాలో ప్రసిద్ధి గాంచిన పలు రకాల చీరలను పరిశీలిద్దాం.
మధ్య ప్రదేశ్‌ - చందేరీ చీరలు. మధ్య ప్రదేశ్‌ - మహేశ్వరీ. ఛత్తీస్‌ఘడ్‌ - కోసీ సిల్క్‌ (మధ్య భాగం). సంభల్‌పూర్‌, ఒరిస్సా - సంభల్‌ పురి సిల్స్‌ అండ్‌ కాటన్‌ చీరలు. బార్‌ఘడ్‌, ఒరిస్సా - ఇక్కత్‌ సిల్క్‌ అండ్‌ కాటన్‌. బీహార్‌ - టస్సర్‌ సిల్క్‌. అస్సాం - మూగా సిల్క్‌. శాంతిపుర్‌, వెస్ట్‌ బెంగాల్‌ - తంత్‌ ప్రఖ్యాత బెంగాలీ కాటన్‌. వెస్ట్‌ బెంగాల్‌ - ధనియాఖలీ కాటన్‌, ముర్షీదాబాద్‌ సిల్క్‌, బాలు బారీ సిల్క్‌, శాంత సిల్క్‌ అండ్‌ కాటన్‌. కటక్‌, ఒరిస్సా - కండువ సిల్క్‌ అండ్‌ కాటన్‌. సంబల్‌పూర్‌, ఒరిస్సా - బాంకారు/సోనీపుర్‌ సిల్క్‌ అండ్‌ కాటన్‌. బ్రహ్మపుర్‌, ఒరిస్సా - బెర్హమ్‌పురి సిల్క్‌. మయూర్‌ భంజ్‌, ఒరిస్సా - మద్ధా (లేదా) టస్కర్‌ సిల్క్‌. కోరపూట్‌, ఒరిస్సా - బాప్టా సిల్క్‌ అండ్‌ కాటన్‌. బాలసోర్‌, ఒరిస్సా - టంటా కాటన్‌. వెస్ట్‌ బెంగాల్‌ - పులియా కాటన్‌, శాంతిపుర్‌ కాటన్‌. బంగ్లాదేశ్‌ (దేశం) - టాంగెయిల్‌ కాటన్‌, జమ్‌దని, మస్లిన్‌, లాజ్‌షాహి సిల్క్‌ (తూర్పు భాగం). మహారాష్ట్ర - పైథానీ, లుగాడే. గుజారాత్‌, రాజస్థాన్‌ - బాందినీ. రాజస్థాన్‌ - కోట డోరియా. గుజరాత్‌ - పటోలా (పశ్చిమ భాగం). కర్ణాటక : మైసూర్‌ సిల్క్‌ శారీ, మొలకలుమూరు సిల్క్‌. తమిళనాడు - కాంచీపురం శారీ (కాంజీవరం పట్టు), తిరుభవనం, తంజావూరు, మధురై, కోయంబత్తూర్‌ కాటన్‌, అరణి పట్టు, చిన్నలపట్టు, కండంగి సీలై, సుంగుడి సీలై. ఆంధ్రప్రదేశ్‌ - పుట్టపాక శారీ, ధర్మవరం సిల్క్‌, మంగళగిరి, నారాయణపేట, గుంటూరు, గద్వాల్‌, వెంకటగిరి, పోచంపల్లి చీరలు. కేరళ : బలరాంపురం, ముండుమ్‌ నెరియాతుమ్‌ (దక్షిణ భాగం). ఉత్తర ప్రదేశ్‌ - బెనారస్‌, షాలు, తాన్‌ ఖోరు (తూర్పు).

రెడీమేడ్‌ చీరలు
చీర అంటే నియమిత కొలతలు గల ఒక వస్త్రం. ఒక మాటలో చెప్పాలంటే కుట్టని డ్రస్‌. మరి ఈ రెడీమేడ్‌ చీరలేంటా అని అనిపించొచ్చు. ఫ్యాషన్‌ రంగంలో క్షణక్షణానికీ వస్తున్న పెనుమార్పుల వల్ల చీరల భవిష్యత్తుకు వచ్చిన ప్రమాదం అయితే లేదు కానీ ఎంతో కొంత ప్రభావం ఉంటుంది అనేదైతే వాస్తవం. అలా ఫ్యాషన్‌ ప్రభావానికి లోనైన చీరలే ఈ రెడీమేడ్‌ చీరలు. ఈ చీరలు మామూలు డ్రస్సుల్లా కుట్టి ఉంటాయి. చిన్నారుల కోసం సరదాగా మొదలైన ఈ రెడీమేడ్‌ చీరలు తర్వాత తర్వాత మొత్తంగా అన్ని వయసుల వారి కోసం అందుబాటులోకి వచ్చాయి. ఎవరు అవునన్నా కాదన్నా చీర కట్టడం కూడా ఒక కళే. అందంగా కుచ్చిళ్లు పోసి, చక్కగా పవిటను సర్ది, చీర అంచు కనబడేలా ఆకర్షణీయంగా చీరను కడితే ఆ కళే వేరు. ఎటువంటి శరీరాకృతికైనా ఇట్టే నప్పుతుంది. ఇదంతా చీరలు కట్టటం వచ్చిన వారికి మాత్రమే. చీర కట్టడం రానివారికైతే ఇదో బ్రహ్మవిద్య. యువత సంగతి సరే సరి. ఇక ఈ ఆధునిక యుగంలో ఉద్యోగం చేసే మహిళలు ఎక్కువమంది సౌకర్యంగా ఉంటుందని చుడీదార్లు, కుర్తీలు, మోడ్రన్‌ డ్రస్సులకు (ఆయా ఉద్యోగాన్ని బట్టి) అలవాటు పడిపోయారు. ఇక ఫంక్షన్‌, పూజలు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రం అంతా చీరనే ఆశ్రయిస్తారు. అసలు ప్రాబ్లమ్‌ ఇక్కడే మొదలౌతుంది. అమ్మ, అమ్మమ్మ, నానమ్మల సాయం తీసుకోవలసిందే. ఇదంతా అర్థం చేసుకున్నారేమో, మన డిజైనర్లు చక్కగా రెడీమేడ్‌ చీరను సృష్టించేశారు. ఈ ప్రీస్టిచ్డ్‌ శారీస్‌ లేదా రెడీ టూ వేర్‌ శారీస్‌ అనే ఆలోచన ఎప్పుడైతే అమలులోకి వచ్చిందో కానీ, ధరించడంలో సౌలభ్యం, గంటల తరబడి అద్దం ముందు టైం వేస్ట్‌ చేసేపని తప్పింది. మామూలు చీరకట్టు కంటే ఈ రెడీమేడ్‌ చీరలు సౌకర్యంగా ఉంటాయి. ముఖ్యంగా ఇవి ధరించడానికి ఎవ్వరి సాయం అవసరం లేదు. అంతే కాకుండా ఈ రెడీమేడ్‌ చీరకు మాచింగ్‌ పెట్టీకోట్‌ కూడా ఎటాచ్‌ చేసి ఉంటుంది. ఇక చేయవలసిందల్లా ఒకటే. ఈ రెడీమేడ్‌ చీరను స్కర్ట్‌లా ధరించి ఓ ముడి వేయడం. ఇవి అన్ని తరహా శరీరాకృతులకు సరిపోయేలా, వివిధ సైజుల్లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా ఈ రెడీమేడ్‌ చీరలకు గిరాకీ పెరిగింది.

డిజైనర్‌ చీరలు... డిజైనర్ల పాత్ర ...
సాధారణంగా ఏవైనా స్పెషల్‌ ఈవెంట్స్‌, పెళ్లి వంటి ప్రత్యేకమైన అకేషన్స్‌లో డిజైనర్‌ శారీస్‌ వేసుకోవడం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. క్యాజువల్‌ లేదా ఈవినింగ్‌ ఈవెంట్స్‌లో సైతం ఈ చీరలు కామన్‌ అయిపోయాయి. పైగా డిజైనర్లు సింపుల్‌ లుక్‌తో తక్కువ ఖర్చుతో లభించేలా క్యాజువల్‌ డిజైనర్‌ శారీస్‌ను సృష్టించేశారు మరి. ఈ రకంగా మంచి క్వాలిటీతో అందరికీ అందుబాటులో ఉండేలా డిజైనర్‌ శారీస్‌ను అందించడం అనే చెప్పుకోదగ్గ మార్పు. అంతటితో ఆగకుండా చీర ప్రాముఖ్యాన్ని అందరికీ తెలియజెప్పాలని వకాల్తా పుచ్చుకున్నారు మన డిజైనర్లు. 'అందరికీ అందుబాటు రేట్లలో చీరను విశ్వవ్యాపితం చేసేలా కొత్త కొత్త చీరలు సృష్టిస్తాను' అని ప్రముఖ చీరల డిజైనర్‌ సవ్యసాచి ముఖర్జీ ప్రకటించారు. ఇలా ఇండియన్‌ డిజైనర్లు తీసుకున్న నిర్ణయాలు మన 'చీర'ను విశ్వవ్యాప్తం చేస్తాయనటంలో సందేహం లేదు.
ప్రముఖ భారతీయ డిజైనర్లు అబ్రహం, ఠాకూర్‌లు కాన్‌టెంపరరీ స్టైల్‌లో చీరలకు కొత్త సోయగాలు దిద్దారు. ఈ కాన్‌ టెంపరరీ అనేది కేవలం రంగులు, డిజైన్లకు పరిమితం కాలేదు. చీరకట్టులో కూడా కొత్తదనం చూపారు. వీరు సృష్టించిన చీరలకు లండన్‌లో 'ఎ అండ్‌ వి' మ్యూజియంలో స్థానం కల్పించారు. తరుణ్‌ తెహలానీ, అబూజానీ అండ్‌ సందీప్‌ ఖోస్లా, మనీష్‌ మల్హోత్రా, నీతాలుల్లా, రీతూబేరీ వంటి ప్రముఖ డిజైనర్లు తమ సృజనను జోడించి కొత్త కొత్త అందాలలో చీరలను ముంచెత్తుతున్నారు. నిజంగా, చీరల ప్రాముఖ్యాన్ని గుర్తించి, మన డిజైనర్లు చేస్తున్న కృషి ప్రశంసనీయం. ఇక్కడ కేవలం డిజైనర్ల గురించే మాట్లాడితే విషయం పూర్తి కానట్లే. ఎందుకంటే ఎంతోమంది సెలబ్రిటీలు చీరలపై మక్కువతో, ప్రతీ ఫంక్షన్‌కూ చీరకట్టులోనే దర్శనమిస్తున్నారు. ఈ అందమైన చీరల్లో మెరిసిపోతూ, ఒకవైపు తమ ప్రత్యేకతను, మరోవైపు చీరల ప్రదర్శనను ఇస్తున్నారు. నాటి అందాల తార వైజంతిమాల నుంచి నేటి రేఖ, హేమమాలిని, విద్యాబాలన్‌ వరకు, నాటి ఇందిరాగాంధీ నుండి నేటి సోనియాగాంధీ, సుష్మాస్వరాజ్‌, బృందాకరత్‌ వరకు... ఇలా వేర్వేరు రంగాలలో మహిళలు చీరలు కట్టి చీర అందాన్ని చెప్పకనే చెప్తున్నారు. బ్యూటీ పార్లర్‌లలో అయితే చీరకట్టు ఓ భాగం అయిపోయింది. సందర్భానికి తగిన చీరకట్టుకు తగిన రేటు, ఇక పెళ్లిళ్ల సీజన్‌ వచ్చిందంటే వీరికి మంచి గిరాకీ ఉంటుంది. స్పెషల్‌ బ్రైడల్‌ ప్యాకేజీ పేరుతో ఆఫర్లు. క్రమంగా ఇది మంచి బిజినెస్‌ అయిపోయింది. కొన్ని ఇన్‌స్టిట్యూట్లు మరో అడుగు ముందుకేసి చీరకట్టు కోసం ప్రత్యేక కోర్సులు కూడా ఆఫర్‌ చేస్తున్నాయి.
ఇక చివరిగా ప్రస్తావించవలసింది బుటిక్‌ల గురించి పెద్ద పెద్ద డిజైనర్లే కాకుండా ఫ్యాషన్‌ కోర్సులు చేసిన వారు కూడా వీటిని నిర్వహిస్తున్నారు. అసలు బుటిక్‌ అంటే...
బుటిక్‌ అంటే ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన వస్త్రాలు దొరికే ఒక షాప్‌. ఇక్కడ మనకు రెండు ఛాన్సులు ఉన్నాయి. ఒకటి : ముందుగా డిజైనర్లు డిజైన్‌ చేసి ఉంచిన వస్త్రాలు ఎంపిక చేసుకోవడం. రెండోది మనకు ఏదైనా ప్రత్యేక అభిరుచి ఉంటే దానికి అనుగుణంగా మనమే డిజైన్‌ చేసుకుని లేదా వారి సాయంతో డిజైన్‌ చేయించుకుని మరీ కొనుగోలు చేసుకోవడం. ఈ పద్ధతికే కస్టమ్‌ మేడ్‌ అనిపేరు.
ఈ బుటిక్‌లతో మధ్యతరగతి వారికి ఓ చిక్కుంది. వీటిని కొనటం అంటే ఖర్చుతో కూడుకున్న పని. దీనికి కూడా మన వద్ద ఓ ప్రత్యామ్నాయం ఉంది. తక్కువ ఖర్చుతో చీరను కొని కాస్త మనలో సృజనకు పదును పెట్టామంటే డిజైనర్‌ చీరలకు ధీటుగా వీటిని మార్చుకోవచ్చు. ఎలాగంటే ఇవాళ మార్కెట్లో కుందన్లు, లేసులు, ఎంబ్రాయిడరీ చేసిన బోర్డర్‌ రోల్స్‌, పెయింట్స్‌... ఇలా ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి ఎలాంటి లుక్‌ ఉన్న చీరనైనా, చక్కటి డిజైనర్‌ లుక్‌ తేవడం మన చేతుల్లో పని.
మరో ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ సౌత్‌లో నార్త్‌ చీరలు, నార్త్‌లో వెస్ట్‌ చీరలు... ఇలా ఒక ప్రాంతం వారి సంప్రదాయ చీరలు మరో ప్రాంతంలో కట్టటం చూస్తున్నాం. ఇదంతా ఆన్‌లైన్‌ షాపింగ్‌ వల్ల జరుగుతోంది. ఒక్క బటన్‌ నొక్కితే చాలు, మన ఇంటికే చీరలు (దుస్తులు) నడుచుకుంటూ వస్తాయి. పైగా ట్రయల్‌ చేసి, నప్పలేదు అనుకుంటే తిరిగి రిటర్న్‌ చేసే సౌకర్యం కూడా ఉంది. ఈరోజుల్లో చీరను గ్లోబలైజ్‌ చేయటంలో టెక్నాలజీ కూడా తనవంతు పాత్ర పోషిస్తోంది. ఇక చీర పాపులర్‌ అవుతోందంటే అదీ ప్రపంచవ్యాప్తంగా - ఎందుకు కాదు మరి?
ప్రతిదీ వ్యాపారమయమైపోతున్న నేటి రోజుల్లో ఎన్నో రకాల చీరలు మార్కెట్లను ముంచేస్తున్నాయి. లక్షల రూపాయల విలువ చేసే చీరలు, సుగంధాలు వెలువరించే చీరలు ... ఎన్నెన్నో షాపుల్లో దర్శనమిస్తున్నాయి. వ్యాపారం లాభం నష్టం పక్కనపెడితే అవన్నీ మన నేతన్నల పనితనాన్ని చాటిచెప్తూనే వున్నాయి.