మనకు గాలి ఎంతో అవసరం. గాలి లేనిదే క్షణం బ్రతకలేము. గాలే మనకు ప్రాణాధారం. ఈ గాలివల్ల మనకు ఎంతో మేలు కూడా ఉన్నది. మనలాగే జంతువులు, పక్షులు, కీటకాలు, చివరకు మొక్కలు అన్నిటికి గాలి అవసరం. గాలిని పీల్చటాన్నే ''శ్వాసక్రియ'' అని అంటారు కదా! ఈ శ్వాస క్రియ అనేది కొన్ని ప్రాణుల్లో వివిధ విధాలుగా ఉంటుంది. చర్మం ద్వారా గాలిని పీల్చే జీవులు కూడా ఉన్నాయి. మనం ముఖ్యంగా ముక్కు ద్వారానే గాలిని పీలుస్తాం. కొన్ని కొన్ని సమయాలలో నోటిద్వారా కూడా పీలుస్తూ ఉంటాం. గాలిలో ప్రాణ వాయువు ఉన్నది. ఈ ప్రాణవాయువు వాయునాళం ద్వారాఊపిరితిత్తులలోకి చేరుతుంది. మన శరీరం లోపల ఛాతీ భాగంలో రెండు ఊపిరితిత్తులు వుంటాయి. ఇవి టిస్యూలతో తయారు చేయబడిన మెత్తని సంచీ లాంటివి. ఒక్కొక్క దానిలో కొన్ని లక్షల అరలుంటాయి. మనం గాలిని లోనికి పీలుస్తామనుకోండి. ఊపిరి తిత్తులు పెరుగుతాయి. గాలిని వదిలామనుకోండి ముడుచుకుపోతాయి. ముక్కు నుండే వాయునాళం ఉండి ఊపిరి తిత్తులకు కలపబడుతుంది. అందుకే మనం ముక్కుతో గాలిని పీలుస్తుండటం. ముక్కులో రెండు రంధ్రాలున్నాయి కదా! వాటినే 'నాసికా రంధ్రాలు' అంటారు. ఈ రంధ్రాలలో రోమాలు, గ్రంధులు ఉన్నాయి. గ్రంథుల నుండి మ్యూకస్ స్రవిస్తుంది. ఇవన్నీ మనం పీల్చే గాలిని వడకడతాయి. అంతే కాక, నాసికా కుహరం ద్వారా లోనికి వెళ్ళేటప్పుడు గాలి వెచ్చబడుతుంది. నోటితో పీల్చినప్పుడు ఇలా జరుగదు. అందుకే గాలిని పీల్చటానికి ముక్కునే వాడుతాం. ఇలా లోనికి పీల్చబడిన గాలి రక్తం ద్వారా శరీరమంతటా వ్యాపిస్తుంది. మనం తిన్న ఆహార పదార్థాలు ప్రాణవాయువు ద్వారా 'ఆక్సీకరణం'
చెందుతాయి.