ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TIPS FOR REMOVING BACK PAIN - HEALTH TIPS IN TELUGU FOR PUTTING CHECK TO BACK PAIN


నడుం నొప్పికి శాశ్వత చికిత్స
మీకు తెలిసిన నలుగురిని అడిగి చూడండి. అందులో ఇద్దరు నడుం నొప్పి ఉందని చెబుతారు. మారిన జీవనశైలి కారణంగా నడుం నొప్పి సర్వసాధారణమైపోయింది. చాలా మంది నడుం నొప్పికి డిస్క్ సమస్యలు కారణమని అనుకుంటారు. కానీ అది నిజం కాకపోవచ్చు. కారణాలు అనేకం ఉండవచ్చు. అందుకే నడుం నొప్పి బాధిస్తుంటే కనుక వైద్యులను కలిసి అవసరమైన పరీక్షలు చేయించుకుని, చికిత్స తీసుకోవడం ఉత్తమం అంటున్నారు సీనియర్ స్పైన్ సర్జన్ డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల.

బ్యాక్ పెయిన్ లేదా నడుం నొప్పి చాలా సాధారణంగా కనిపించే సమస్య. ఎక్కువగా ప్రయాణం చేసే వారిలో, శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారిలోనూ, ఎక్కువ గంటలు కూర్చుని పని చేసే వారిలోనూ ఇది కనిపిస్తుంటుంది. కూర్చునే విధానం సరిగ్గా లేకపోవడం, ఎముకల్లో కాల్షియం తగ్గడం, కీళ్ల వాతం, వె న్నులో టీబీ వంటి ఇన్‌ఫెక్షన్లు నడుం నొప్పికి కారణమవుతుంటాయి. వయసు పైబడటం వల్ల కీళ్లలో అరుగుదల చోటు చేసుకోవడం, చేసే పని, పోషకాహార లోపం, విటమిన్ బి12 లోపం వంటివి కూడా నడుం నొప్పిని తెచ్చిపెడతాయి. కూర్చున్నప్పుడు శరీరం బరువంతా వెన్నుపై పడుతుంది. అందుకే ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల నొప్పి వస్తుంటుంది. కాబట్టి ప్రతి 45 నిమిషాలకొకసారి లేచి నడవడం చేయాలి. స్మోకింగ్ చేయడం మూలంగా ఎముకల్లో బలహీనత మొదలవుతుంది. ఫలితంగా నడుం నొప్పి ప్రారంభమవుతుంది.

నిర్లక్ష్యం చేస్తే....

డిస్క్‌లు శరీర బరువును మోస్తుంటాయి. ఇవి దెబ్బతిన్నప్పుడు బరువంతా జాయింట్లపై పడుతుంది. ఫలితంగా జాయింట్లు దెబ్బతింటాయి. డిస్క్‌లు అరిగిపోయినప్పుడు మధ్యలో ఉన్న జెల్‌లాంటి పదార్థం బయటకు వచ్చేస్తుంది. ఇది కొందరిలో నరంపై ఒత్తిడి కలగజేస్తుంది. దీన్ని సయాటికా అంటారు.

ఏం చేయాలి?

నడుం నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు రెండు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. మాత్రలు వేసుకుంటూ వీపు కండరాలు బలపడే వ్యాయామాలు చేయాలి. రోజూ వారీ పనిచేసుకోవడం ఇబ్బందిగా మారినప్పుడు, నొప్పి కాలుకు(సయాటికా) విస్తరించినప్పుడు, మందులతో నొప్పి తగ్గనప్పుడు సర్జరీ అవసరమవుతుంది. ఈ సర్జరీని మైక్రోడిస్కెక్టమీ అంటారు. సర్జరీలో భాగంగా బయటకు వచ్చిన డిస్క్‌ను తొలగించడం, నరం మీద పడుతున్న ఒత్తిడిని తీసివేయడం జరుగుతుంది. దీనివల్ల నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఫిజియోథెరపీతో కూడా మంచి ఫలితం లభిస్తుంది. కొన్ని రకాల ఇంజెక్షన్లు వాడటం వల్ల కూడా న డుం నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది.
ఆస్టియోపోరసిస్ సాధారణంగా వయసు పైబడుతున్న కొద్దీ ఎముకలు బలహీనపడుతుంటాయి. 45 ఏళ్లు పైబడిన స్త్రీలలో, 55 ఏళ్లు పైబడిన పురుషుల్లో ఎముకలు బలహీనపడే సమస్య సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్యను ఆస్టియోపోరసిస్ అంటారు.

కారణం ఏమిటి?

వయసు పైబడటం అనే సమస్య పురుషులతో పోల్చితే స్త్రీలలోనే ఎక్కువ. మెనోపాజ్ తరువాత స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. శారీరక శ్రమ లేని పురుషుల్లో కూడా కనిపిస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆల్కహాల్, స్మోకింగ్, సూర్యరశ్మి తగినంత అందకపోవడం, వ్యాయామం చేయకపోవడం, కాల్షియం లోపం వంటివి ఆస్టియోపోరసిస్‌కు కారణమవుతాయి.

లక్షణాలు ఇలా ఉంటాయి

శరీరమంతా నొప్పులు, త్వరగా అలసిపోవడం, కండరాలు బలహీనంగా అనిపించడం, ఎముకల్లో నొప్పి, కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువగా వెన్ను, తుంటి, మణికట్టు భాగాల్లో ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలుంటాయి. చికిత్స తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే క్రమంగా నడుం వంగిపోతుంది. శరీరాకృతిలో తేడా వస్తుంది. ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.

చికిత్స

ఎక్స్‌రే, బీఎమ్‌డి(బోన్ మినరల్ డెన్సిటీ) వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆస్టియోపోరసిస్ వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు. ఆస్టియోపోరసిస్‌కు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఎముకలు దృఢంగా మారడానికి ఈ మందులు బాగా ఉపయోగపడతాయి. ఆస్టియోపోరసిస్ ఉన్న వారిలో ఎముకలు విరిగినప్పుడు సిమెంట్ నింపడం ద్వారా చికిత్స అందించవచ్చు. ఇది మంచి ఫలితాన్నిస్తుంది. ఒకవేళ సిమెంట్ నింపడం కుదరనప్పుడు రాడ్ వేసి స్క్రూలు బిగించాల్సి వస్తుంది. ఫిజియోథెరపీతో కూడా ఫలితం ఉంటుంది. చికిత్స తీసుకోవడంతోపాటు జీవన విధానం కూడా మార్చుకోవాలి. అప్పుడే వ్యాధిని సులువుగా ఎదుర్కోవడం సాధ్యమవుతుంది.

డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల
సీనియర్ స్పైన్ సర్జన్
యశోద హాస్పిటల్స్
సికింద్రాబాద్, హైదరాబాద్
ఫోన్ : 98660 17538