భాగవతము - పోతన
కని డాయంజనునంత గృష్ణుడు దళత్కంజాక్షు డప్పేదవి
ప్రుని నశ్రాంతదరిద్రపీడితు గృశీభూతాంగు జీర్ణా౦బరున్
ఘనతృష్టాతురచిత్తు హాస్యనిలయున్ ఖండోత్తరీయున్ గుచే
లుని నల్లంతనే చూచి సంబ్రమవిలోలుండై దిగెన్ దల్పమున్ !
భావము :
అట్టి పరమాత్మను కుచేలుడు చూచి నెమ్మదిగా అతని చెంతకు చేరుచున్నాడు. ఆ కుచేలుడెలా ఉన్నడో కవి చెపుతున్నాడు. ఆ విప్రుడు కడు పేదవాడు. నిరంతర దారిద్రియ పీడితుడు. శరీరము చిక్కి శిధిలావస్థకు చేరుకున్నది. కట్టుకున్న బట్టలు కూడా జీర్ణమైనవి. అతని రూపము నవ్వు కలిగించుచున్నది చిరిగిన ఉత్తరీయము తో నున్న ఆ మిత్రుని, కుచేలుని, కృష్ణుడు అల్లంత దూరమునుండి నుండి చూచి ఆశ్చర్యము కలుగునటుల ఆహ్వానించెను. చేతులు చాచి కౌగలించుకొని అమితానందముతో ఆ కుచేలుని తన ప్రక్కన ఆ తల్పముపై కూర్చుండ బెట్టుకోనెను.