నిద్ర కోసం ఈ ఆహారం...!
కొంతమందికి కళ్లు మూసుకోగానే నిద్ర పట్టేస్తుంది. ఇంకొంతమందికి ఎంత ప్రయత్నించినా కళ్లు మూతలు పడవు. ఈ సమస్య లేకుండా కంటి నిండా నిద్ర పట్టాలంటే కొన్ని ఆహార చిట్కాలు పాటించాలి. అవేంటో తెలుసుకుందాం.
- పాలు, పెరుగుల్లో ఉండే ‘ట్రిప్టోఫాన్’ నిద్రను ప్రేరేపిస్తుంది. ఈ అమీనో యాసిడ్ బాడీ క్లాక్ పనితీరును క్రమబద్ధీకరించే సెరటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా కంటి నిండా నిద్ర పడుతుంది.
- అరటి పళ్లలో మెగ్నీషియం, పొటాషియం ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రాత్రి వేళ కండరాల నొప్పులు తలెత్తకుండా చేస్తాయి.
- ఫ్లాక్స్ విత్తనాల్లో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆందోళన, ఒత్తిడి, నిరాశల తీవ్రతను తగ్గించి వాటి వల్ల తలెత్తే ఇన్‌సోమ్నియా (నిద్రలేమి)ని పోగొడతాయి.
- బార్లీ గింజల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్ది మోతాదులో తీసుకున్నా మంచి నిద్ర పడుతుంది.
- బఠాణీ గింజల్లో విటమిన్ బి6 ఉంటుంది. ఇది మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. గదిలో చీకటి పరుచుకుంటే నిద్రలోకి జారుకునేలా చేయటంలో మెలటోనిన్ హర్మోన్ తోడ్పడుతుంది.
-ఓట్స్‌లో ట్రిప్టోఫాన్ ఉంటుంది. నిద్రకు ముందు గోరువెచ్చని ఓట్స్ వంటకం తింటే ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
- నిద్రకు ముందు గోరు వెచ్చని పాలు తాగినా ఫలితం ఉంటుంది.