వాల్మీకి చెప్పిన అద్భుతమైన విజయసూత్రం.
1. ధృతి, 2. దృష్టి, 3. మతి, 4. దాక్ష్యం - ఈ నాలుగు ఉన్నవారు తమ పనిలో విజయాన్ని సాధించి తీరతారు.
1. ధృతి - పట్టుదల. ఎట్టి పరిస్థితులలోనూ సడలని ప్రయత్నమే ధృతి.
2. దృష్టి - ఏకాగ్రత, పనియొక్క పరిపూర్ణతను ముందుగా దర్శించగలగడం. దీనినే దార్శనికత అనవచ్చు.
3. మతి - బుద్ధిబలం - ప్రణాళిక రచన (ప్లానింగ్) చక్కగా ఆలోచించడం.
4. దాక్ష్యం - (దక్షత) సమర్థత. పనికి తగిన శరీర, బుద్ధుల పనితీరు.
- ఈ నాలుగూ ఎవరికి ఉంటాయో విజయం వారినే వరిస్తుంది.
లంకలో రాక్షసుల కంటపడకుండా తనని తాను తగ్గించుకొని తిరిగి అన్వేషణ కార్యంలో లీనమయ్యాడు హనుమ. 'అనువుగాని చోట అధికులమనరాదు' అన్న వేమన సూక్తికి ఇది ఉదాహరణ. తనని తాను ఎక్కడ పూర్తిగా బైటపెట్టుకోవాలో, ఎక్కడ ఎంత మరుగుపరచుకోవాలో తెలియాలి. అహంకారంతో అన్నిటా తన పూర్తి బలాన్ని ప్రకటించుకుని గుర్తింపు పొందాలనే తాపత్రయం పనికిరాదని ఇందులో పాఠం.
అన్వేషణలో భాగంగా అంతఃపురంలో స్త్రీలలో సీతకోసం చూస్తూ సాగుతున్న మారుతి - ''పరస్త్రీలను నిద్రాస్థితిలో మైమరచి ఉండగా చూడడం తగునా?''- అని ప్రశ్నించుకున్నాడు. తిరిగి, తనను తాను విశ్లేషించుకొని ''స్త్రీని స్త్రీలలోనే వెతకాలిగనుక, అంతఃపురంలో అన్వేషిస్తున్నాను. పైగా నా దృష్టి అన్వేషణాత్మకమే కానీ, వికారంతో కూడినది కాదు'' అని తన హృదయాన్ని తాను దర్శించుకున్నాడు. కార్యసాధకుడు ఏ వికారాలకు లోనుకాని ధీరత్వాన్ని కలిగి ఉండాలని ఇక్కడి పాఠం. అంతేకాదు- ''ఆత్మ పరిశీలన'' ముఖ్యం అనే అంశం... ఏ విజయంలోనైనా 'సచ్ఛీలత' (క్యారెక్టర్) చాలా ముఖ్యం. మన మనస్సుని మనం విశ్లేషించుకొని నిష్పాక్షికంగా మనల్ని మనం గమనించుకుంటే చాలు.
పై గుణాలతోపాటు, ఉత్సాహం, సాహసం, ధైర్యం, ఉద్యమం (ప్రయత్నం) విజయానికి అవసరం- అని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి.
(అతి) నిద్ర, కునుకుపాటు, బద్ధకం, ఉద్రేకం, వాయిదాలు వేసే మనస్తత్వం (నిద్రా, తంద్రా, భయం, క్రోధం, ఆలస్యం, దీర్ఘసూత్రతా) ఉన్నచోట విజయం లభించదు- అని కూడా ఋషుల మాట.
పవిత్రతతో కూడిన కార్యదక్షత మాత్రమే విజయానికి మూలభూమిక.