ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

STORY OF VARALAKSHMI VARATHAM AND ITS MEANING - WHAT ARE THE GOOD TO LEARN FROM VARALAKSHMI VRATHA KATHA


వరలక్ష్మీవ్రత కధ ద్వారా మన గ్రహించవలసింది ఏమిటి?

ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అఖిల జగత్తులకు తండ్రి అయిన శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉంటారు కనుక, ఈ నాలుగు నెలలు మన అమ్మ లక్ష్మీదేవి లోకపరిపాలన చేస్తుంది. పిల్లలు నాన్నను ఏదైనా ఒక వస్తువు అడగాలంటే భయపడతారు. కానీ అమ్మ దగ్గరకు వచ్చేసరికి భయం ఉండదు. స్వేచ్చగా అడుగుతారు. నాన్న వస్తువు కొన్నివ్వడంలో కాస్త ఆలస్యం చేసినా, అమ్మ అడగగానే కొనిస్తుంది. అదే విధంగా ఒక అధికారి ఇంట్లో లేనప్పుడు, ఆయన భార్య, తన భర్తకు చెడ్డపేరు రాకుండా ఉండేలా జాగ్రత్తగా ఆలోచిస్తూ, పనులన్నీ చక్కబెడుతుంది. తిరిగి భర్త రాగానే, తానూ చేసినవన్నీ చెప్తుంది. అలాగే లక్ష్మిదేవి కూడా తను పరిపాలకురాలిగా అన్నీ పనులు చక్కబెడుతుంది. పిల్లలు అడిగినవన్నీ వెంటవెంటనే ఇచ్చేస్తుంది, వరాలు కురిపిస్తుంది. అందుకే ఇప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారికి వరలక్ష్మీ అని పేరు.

వరలక్ష్మీ వ్రతం కేవలం స్త్రీలకు సంబంధించిన వ్రతం మాత్రమే కాదు. స్త్రీ ఉంటేనే కుటుంబ వ్యవస్థ అంటారు. స్త్రీ లేకుంటే అసలది కుటుంబమే కాదు. కుటుంబ వ్యవస్థకు స్త్రీ మూలస్థభం. అటువంటి స్త్రీ ఒక పూజకు ఉపక్రమించింది, వ్రతం చేపట్టిందంటే మొత్తం కుటుంబం అందులో పాల్గొనాలి. వరలక్ష్మీపూజ భార్యాభర్తలు కలిసి కూర్చుని చేయాలి. ఇంట్లో ఉన్న పిల్లలు, పెద్దలు పూజలో పాల్గోనాలి. కధలో స్త్రీ పేరు చారుమతి. చారుమతి అంటే మంచి మనసు కలది అర్ధం. ముందు దైవానుగ్రహానికి కావలసింది మంచి మనసు.

చారుమతి నిత్యం భర్తను దైవంగా భావించి సేవలు చేసేది. ఏ రోజు భర్తను కించపరిచేది కాదు. రోజు ఉదయమే నిద్రలేచి స్నానం పూర్తిచేసుకునేది. అత్తమామలను ప్రేమతో ఆదరించి, సపర్యలు చేసేది. ఇంటి పనుల విషయంలో ఓర్పుతో, నేర్పుతో మెలుగుతూ, ఎవరితోనూ గొడవ పడకుండా, అందరితోనూ సఖ్యతగా మెలిగేది. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కనుకనే చారుమతిని అనుగ్రహించాలాని శ్రీ మహాలక్ష్మీ భావించి, కలలో కనిపించింది. ఇవేమి చేయకుండా, కేవలం లక్ష్మీపూజ మాత్రమే చేస్తాము, అత్తమామలను, తల్లిదండ్రులను చూసుకోము అనుకునేవాళ్ళ పట్ల లక్ష్మీదేవి దయ చూపదని ఈ కధ ద్వారా గ్రహించాలి.

అమ్మవారి కలలో కనిపించి చెప్పిన వ్రతవిధానం తాను మాత్రమే ఆచరించి సంపద పొందాలని చారుమతి భావించలేదు. ఇరుగుపొరుగు వారందరికి తన స్వప్న వృత్తాంతం చెప్పింది. అందరితో కలిసి వరలక్ష్మీ వ్రతం ఆచరించింది. కేవలం తన స్వార్ధం మాత్రమే చూసుకోలేదు. అందరూ బాగుండాలని తలచింది. అందుకే పూజ ఫలిచింది. అటాగే ఈ వ్రతం నోచుకునే ఆచారం లేనివారిని వ్రతం ఆచరించేవారు తమ తమ ఇళ్ళకు ఆహ్వానించి, వారొతో కలిసి వ్రతం ఆచరిస్తే, లక్ష్మీదేవి ఇంకా సంతృప్తి చెందుతుంది. కనుక మీ బంధుమిత్రులు, ఇరిగుపొరుగు వారిలో ఎవరికైనా ఈ వ్రతాచరణ లేకపోతే, వారు ఏ కులం వారైనా సరే, వారిని మీ ఇంటికి పిలిచి, వారితో కూడా పూజ చేయించండి. అమ్మవారు చాలా సంతోషిస్తుంది. అదే వ్రతకధలో చారుమతి కూడా చేసింది.

లక్ష్మీకటాక్షం కలగాలంటే ముందు స్వార్ధం త్యజించాలన్నది వరలక్ష్మీ కధ సారాంశం. పంచుకుంటే పెరుగుతుంది, దాచుకుంటే తగ్గుతుంది సంపద, సంతోషం. అందుకే ప్రసాదం ఒక్కరే తినకూడదు. పదిమందితో పంచుకోవాలి. అప్పుడే అనుగ్రహం అధికంగా సిద్ధిస్తుంది. మన సంస్కృతి దాచుకోవడం కాదు పంచుకోవడంనేర్పింది.

అందరి కోసం కోరింది కనుకనే అమ్మవారు కరుణించింది. ఎవరు అందరూ బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటారో, వారికి కోరకుండానే వరాలిస్తాడు పరమాత్ముడని గ్రహించాలి. నిత్యం 'లోకాసమస్తాః సుఖినోభవంతుః'(సమస్త లోకాలు బాగుండలి) అని ప్రార్ధించాలి.