ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARTICLE ABOUT LORD SIVA'S MAHA MRUTYUNJAYA MANTRAM - LORD MAHADEV'S SPIRITUAL ARTICLES IN TELUGU


ప్రమాదల నుంచి రక్షించే
మహామృత్యుంజయ మంత్రం

మకార మననం ప్రాహుస్త్ర కారస్త్రాణ ఉచ్యతే
మనన త్రాణ సమ్యుక్తో మంత్ర ఇత్యభిధీయతీ

‘మా కారం అంటే మననం చేయడం. అంటే పదేపదే ఉచ్ఛరించడం. ‘ త్ర ‘ కరం అంటే త్రాణము. అంటే రక్షించేది. కాబటి మంత్రమంటే పదే పదే ఏకాగ్రతతో ఉచ్ఛరించేవారిని రక్షించేదని అర్థం. సాధనకు, కార్యసిద్ధికి ప్రత్యేకమైన ఫలితాలకు సిద్ధిత్వాని కలిగించేదే మంత్రం.
" దైవాధీనం జగత్సర్వం
మంత్రాధీనంతు దైవతం "

జగత్తంతా దైవానికి ఆధీనమై ఉంటుంది. అట్టి దైవం మంత్రానికి ఆధీనమై ఉన్నాడు. ఈ సూక్తిననుసరించి మంత్రోపాసనకు దైవం వశమవుతోందని తెలుస్తోంది. శక్తివంతమైన బీజాక్షరాలతో ఏర్పడినవే మంత్రాలు. శక్తికి శబ్దానికి అవినాభావ సంబంధం ఉంది. శబ్దంలోనిదే స్పందన. సక్రమమైన రీతిలో జరిగే మంత్రోచ్ఛారణ వలన, మంత్రాల లోనున్న బీజాక్షరాలలో స్పందన కలిగి అద్భుతమైన మహాశక్తి ఉత్పన్నమవుతుంది. అది మన ఊహకందనిది.
ఉదాహరణకు, ‘ఓం నమ: శివాయ ‘ అనే మంత్రం సకల శుభాలను కలిగిస్తుందని పెద్దల వాక్కు.
" కితస్య బహుభిర్మం త్రై:
కింతిర్థై: కిం తపోధ్వరై:
యస్య నమశ్శివాయేతి "

మంత్రో హృదయ గోచర: అని అన్నారు. అంటే, ఎవరి హృదయంలో నిరతరం “ఓం నమ: శివాయ” అనే మంత్రం జపించబడుతుంటుంతో, వారికి ఇతర మంత్రాలతో, తీర్థయాత్రలతో, యజ్ఞయాగాదులతో పని లేదని భావం. ఓం నమశ్శివయ (షడక్షరీ) నమశ్శివాయ (పంచాక్షరీ) మంత్రాలలో ఏ ఒక్క మంత్రాన్ని అయినా శ్రద్ధతో జపించే వ్యక్తి సమస్త శుభాలను పొందగలుగుతాడు.
అలాగే మనకు ఆయురారోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, దీర్ఘాయువును, శాంతిని, తృప్తిని ఇచ్చేది మహామృత్యుంజయ మంత్రం. ఇది శుక్లయజుర్వేద మంత్రం. శైవులు దీనిని రుద్రాభిషేకంలో, వైష్ణవులు పాచరాత్రదీక్షలో హోమభస్మధారన మంత్రంగా చెప్పుకుంటారు.
ఇది అందరికీ, అంటే శైవులకు, వైష్ణవులకు, మాధ్వులకు ప్రామాణికమయిన మంత్రం.
" దీనిని త్ర్యంబకం యజామహే
సుగంధిం పుష్టివర్థనం
ఉర్వారుక మివ బంధనాత్
మృత్యోర్ముక్షీయ మామృతాత్ "

ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు,మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది.
ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనే పేరు కూడా ఉంది. మార్కండేయుడు ఈ మంత్రమును పఠించి, మృత్యువు నుంచి బయటపడ్డాడని ప్రతీతి. ఇంకా పరమశివుని రుద్రస్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్రమంత్రమని, ఆ స్వామి మూడు కన్నులను సూచిస్తూ మృతసంజీవనీ మంత్రమని పిలువబడుతోంది.
ఈ మంత్రాన్ని త్ర్యంబక మంత్రమనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది. శివతత్వంలో “మూడు” కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ స్వామి త్రినేత్రుడు, త్రిగుణాకారుడు, త్రి ఆయుధుడు, త్రిదళాలతో కూడిన బిల్వాలను ఇష్టపడేవాడు, మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు, త్రిజన్మ పాప సంహారుడు, త్రిశూలధారుడు, త్రికాలధిపతి, త్రిలోకరక్షకుడు, మరి ఆస్వామి మంత్రాన్ని జపించితే మనకు రక్షణ లభించకుండా ఉంటుందా? అందులో సందేహమేముంది. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాత: కాలన్నే 108 సార్లు, ప్రదోషకాలంలో 108 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు. ఈ మంత్రం యొక్క గూఢార్థాన్ని తెలుసుకున్నప్పుడు మనకు అపరిమితానందం కలుగుతుంది.
ఓం: భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మ జ్యోతిగా వెలుగొంది, అనంతరం చెవులకు వినబడేట్లుగా ఓ నాదం వినబడిందనీ, ఆ నాదమే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని. అ-ఉ-మల సంగమమమే ఓంకారం. ఋగ్వేదం నుండి ‘ అ ‘ కారం. యజుర్వేదం నుండి ‘ ఉ ‘ కారం, సామవేదం నుండి ‘ మ ‘ కారాలు పుట్టి,ఆ మూడింటి సంగమంతో ‘ ఓంకారం ‘ ఉద్భవించింది. ఓంకారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం. ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుటుంది. అందుకే ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తుంటుంది. నామం శబ్ద ప్రతీక. సర్వ శబ్దాలను తనలో నిమగ్నం చేసుకునే శబ్దాక్షరం ఓంకారం. కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి, ఆ మంత్రానికి శుభాన్ని, మంగళాన్ని చేకూర్చుతుంది. అందుకే దేహద్వారాలైన ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి, మనస్సును స్థిరపరచుకుని, యోగధారణ బలంతో ప్రాణశక్తిని సహస్రారంలో నిలిపి, పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవాన్ని ఉచ్ఛరిస్తూ పరమాత్మను స్మరించాలి.
* త్ర్యంబకం: భూత, భవిష్యత్, వర్తమానాలకు శివుని మూడవ నేత్రం ప్రతిరూపం. ఇంద్ర, అగ్ని, సామతత్వాలను కలిగి ఉన్నందున శివుడు త్రినేత్రుడనబడుతున్నాడు. త్ర్యంబక మంటే మూడు నేత్రాలని అర్థం. శివుని భ్రూమధ్యంలో నున్న సూక్ష్మరూప నేత్రం మూడవ నేత్రం. ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం. దీనినే జ్యోతిర్మఠం అని అంటారు. శివుని మూడవ నేత్రానికి దాహకశక్తి, సంజీవన శక్తి రెండూ ఉన్నాయి. ఆ స్వామి తన ప్రసన్నవదనంతో, చల్లని చూపులతో మనలను సదా రక్షిస్తున్నాడు. అందుకే ఆ స్వామిని త్యంబకం అని కీర్తిస్తున్నాం.
* యజామహే: అంటే ద్యానిస్తున్నానని అర్థం. అంతేగా మరి. సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఒకప్పుడు సముద్ర మథనం జరిగింది. అకస్మాత్తుగా సెగలు కక్కుతూ హాలాహలం పైకి వచ్చింది. ఆ విష్పు ప్రచండ జ్వాలలకు సమస్తలోకాలు తల్లడిల్లిపోయాయి. సర్వత్రా ఆర్తనాదాలు…హాహాకారాలు. సమస్తలోకజనం ఆ స్వామిని ధ్యానించగా, ఆ దృశ్యాన్ని చూసి క్రిగిపోయిన స్వాఇ, హాలాహలన్ని తన కంఠంలో నిలుపుకుని నీలకంఠుడై సమస్తలోకాలను కాపాడాడు. ఆ స్వామిని ప్రార్థిద్దాం.
* సుగంధిం: సు-మంచిదైన, గంధ – సువాసన ద్రవ్యం. ఆ స్వామి మనపై మంచి సువాసనలతో కూడుకున్న గంధం నలుదిశలా పరిమళాలను వెదజల్లినట్లు మనలను తన భక్త జన వాత్సల్యమనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు. ఆయనకు తన పిల్లలమైన మన పట్ల అలవికానంత ప్రేమ, వాత్సల్యం, ఆయన ఎంత భక్తజన ప్రియుడంటే, ఆ స్వామిని పూజించడానికి మందిరం కావాలని ఆడగడు. చెట్టుకింద, గట్టుమీద ఎక్కడైనా ఆయన లింగరూపాన్ని పెట్టుకుని పూజించవచ్చు. ఆయనకు నైవేద్యం కూడా అవసరం లేదు. ఒక బిల్వపత్రం, ఒక కొబ్బరికాయ, జలాభిషేకం చేసినా స్వామి సంతోషించి మన కోరికలను నెరవెరుస్తాడు.
* పుష్టివర్థనం : మనం పుష్టిగా ఉండేట్లు సాకుతున ఆ స్వామి సర్వత్రా నెలకొనిఉన్నాడు. సృష్టియావత్తు ఆయన ఆధీనంలో ఉంది. ఆయన మనలను తప్పక కాపాడుతాడు. ఇందుకు గుహుని కథే ఒక ఉదాహరణ. గుహుడనే వేటగాడు ఒకరోజున ఏదైనా జంతువును వేటాడాలని వెదికి వెదికి విసిగి పోయాడు. చీకటి పడుతున్నా అతని కంట ఒక జంతువు కూడ కనబడలేదు. ఈలోపు ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి అతడిని వెంబడించసాగింది. దాని బారి నుంచి తప్పుకోవడానికై వేటగాడు పరుగులు పెడుతూ ఒక చెట్టుపైకి ఎక్కాడు. అయినా ఆ పులి అతడిని వదల్లేదు. చెట్టుకిందే ఉన్న పులి గుహుడు ఎప్పుడు దిగి వస్తాడా అని కాపుకాయసాగింది. గుహుడు ఎక్కిన చెట్టు ఒక మారేడు చెట్టు. ఏమీ తోచక ఒక్కొక్క మారేడు దళాన్ని కిందికి తుంపి విసిరేయసాగాడు. ఆ దళాలు చెట్టు మొదట్లో నున్న శివలింగంపై పడసాగాయి. ఆరోజు శివరాత్రి కూడా. పులిభయంతో వేటగాడు, వేటగానిని తినాలన్న కాంక్షతో పులి, జాగరణ చేయడంతో, శంకరుడు రెండు జీవాలకు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే సర్వ వ్యాపకుడైన ఆ స్వామి మనలను కంటికి రెప్పలా కాపాడుతుంటాడు.
ఉర్వారుకం – ఇవ – బంధనం : దోసకాయ పక్వానికి వచ్చినపుడు, దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనలను అన్ని సమస్యల నుంచి గట్టెక్కించుతాడు.
* మృతోర్ముక్షీయ: అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని, మనలను మృత్యువు నుంచి కూడ రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం. మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమేకాదు. ఆధ్యాత్మికపరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే. భక్తి ప్రవత్తులు లేని జీవనం కూడా నిర్జీవమే.
ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించలేక అంతా వికారంగా ఉందనుకునేవారికి, అంతా వికారంగానే కనబడుతుంది. ప్రతి విషయానికి సందేహపడే సదేహప్రాణికి అంతా అనుమానమయంగానే ఉంటుంది. ఇటువంటి వన్నీ చావువంటివే. ఇలా మనలను అన్నిరకాల మరణాల నుంచి విముక్తులను చేసి, మన జీవితాలను సంతోషమయం చేయమని స్వామిని ప్రార్థిస్తున్నాం మనం.

* అమృతాత్ : స్వామి అల్ప సంతోషి, సులభప్రసన్నుడు. అందుకే శ్రీనాథమహాకవి ఆయనను ఈ క్రింది విధంగా స్తుతించాడు.
" శివుని శిరమున కాసిన్ని నీళ్ళు జల్లి
పత్తిరిసుమంత నెవ్వడు పార వైచు
కామధేను వతడింట గాడి పసర
మల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు "

శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు పత్రిని లింగంపై విసిరేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా మారుతుంది. కల్ప తరువు ఆ భక్తుని ఇంట మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయామయుడు పరమశివుడు.
మనకున్న చిరంజీవులలో ఆంజనేయస్వామి ఒకరని మనకు తెలుసు. అయితే ఆ ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని ప్రసాదించింది శివుడే. ఆ కథ ప్రకారం,
రావణ వథానంతరం అయోధ్యకు చేరుకున్న రామ చంద్రుడు ప్రజారంజకంగా పరిపాలన గావిస్తున్నాడు. ఒకరోజు అగస్త్యమహర్షి తదితరులు శ్రీరామచంద్ర మూర్తిని దర్శించుకుని హనుమంతుని ప్రశంసించ సాగారు. అప్పుడు శ్రీరాముడు, మహావీరుడైన లక్ష్మణుని ప్రశంసింపక, ఎందుకు హనుమంతుని పొగుడుతున్నారని అడిగాడు. అప్పుడు అగస్త్యాది మునులు, హనుమంతుడు రుద్రాంశ సంభూతుడని, హనుమంతునితో సరితూగగల బలపరాక్రమ వంతులు ఎవరూ లేరని, అతని బలం గురించి అతనికి తెలియకపోవడమే శాపమని, అందుచేతనే అతడు వాలిని సంహరించలేకపోయాడని చెప్పారు. అలాగే నూరు యోజనాలు దాటి లంకను చేరడం, అతి చిన్న రూపాన్ని ధరించడం, సీతమ్మవారిని దర్శించడం, లంకాదహనం వంటివన్నీ సామాన్యులు చేయలేరని చెప్పారు. అదేవిధంగా బాల హనుమ, సూర్యుని చూసి ఎగిరి వెళ్ళి, ఇంద్రుని వజ్రాయుధ ఘాతానికి గురై భూమిపై పెడతాడు. అప్పుడు ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు కుమారుని ఉజ్జయినికి తీసుకెళ్ళి శివార్చన చేసి, శివుని కరుణతో బాల ఆంజనేయుడు చిరంజీవిగా ఉండేట్లు వరాన్ని పొందాడు. ఇప్పటికీ మనం ఉజ్జయినిలో ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని అనుగ్రహించిన హనుమత్కేశ్వర లింగాన్ని చూడగలం.
ఈ విధంగా స్వామి తన భక్తులను మృత్యువు నుంచి కాపాడి, ఆయురారోగ్యాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తాడు.
ఈ మృత్యుంజయ మంతాన్ని శ్రద్ధతో పఠిస్తే, అకాలమృత్యువులు, ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది.
ఇంత మహిమాన్వితమైన మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవిక ప్రకంపనలు మన చుట్టూ ఆవరించి, సమస్త దుష్ట శక్తులు మన దరికి చేరకుండా కాపాడబడతాము.
మృత్యుర్యస్వాప సేచనం అని శ్రుతులు చెబుతున్నాయి. అంటే మృత్యువు శివునికి ఊరగాయ వంటిదని అర్థం. మృత్యువును జయించాలనుకునే వ్యక్తులు పరమశివుని రక్షణకోరితే సరిపోతుందని ఋగ్వేదం అంటున్నది. తనను ఆశ్రయించేవారి యొక్క మృత్యువును నివారించేవాడు కాబట్టి శివుడు మృత్యుంజయుడు అని కూడ పిలువబడుతున్నాడు. ఎవరైతే పుణ్యభీతితో శివుని ఉపాసిస్తారో, వారికి ఆ జన్మలోనే కర్మసంచయాన్ని (ఆగామితో సహా) పటాపంచలు చేసే శక్తిని శివుడు ప్రసాదిస్తాడు. అందుకు మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధగా పఠించి ఆయురారోగ్యాలను పొందుదాం.